సప్త గోదావరీ ప్రస్థానం | Godavari Pushkaralu 2015 | Sakshi
Sakshi News home page

సప్త గోదావరీ ప్రస్థానం

Published Sun, Jul 12 2015 2:00 AM | Last Updated on Wed, Aug 1 2018 5:04 PM

సప్త గోదావరీ ప్రస్థానం - Sakshi

సప్త గోదావరీ ప్రస్థానం

భారతదేశంలో దివ్య నదుల పుట్టుక వెనుక మహర్షుల పూనిక కనిపిస్తుంది. తపస్సు ద్వారా, మహర్షుల కృషి ఫలితంగా మన జీవధాత్రిని సస్యశ్యామలం చేసే నదులు పుట్టినట్లు అనేక తార్కాణాలు ఉన్నాయి. సరస్వతీ నది పుట్టుకకు అంబరీషుడు చేసిన యజ్ఞం కారణం. త్రేతాయుగంలో దివిజ గంగ భువిపై పాదం మోపడానికి భగీరథ రాజర్షి కారణం. కావేరి వంటి దక్షిణాది పవిత్ర నదులు అగస్త్యుని వల్ల ఉద్భవించాయి.
 
యుగాల తరబడి తపస్సు చేసి చేసి అలసిపోయిన మార్కండేయ మహర్షి జలప్రళయ వేళ వటపత్రశాయి కడుపులో విశ్రాంతి పొందాడు. ఆ సమయంలో ఆ లీలామోహనుని ఉదరంలో లోకాలన్నీ భద్రంగా ఉండటం గమనించాడు. ఎన్నో విషయాలతో పాటు మార్కండేయుడు ప్రత్యేకించి గమనించింది దివ్య గోదావరిని. వ్యాసభారతంలో ధర్మరాజుకు మార్కండేయుడు చెప్పిన ఉపదేశంలో గోదావరి ప్రస్తావన మనకు కనిపిస్తుంది.
 
అందుకే మన అనంతామాత్యుడు అంటాడు కదా... ‘‘కృతయుగపు వాడైన గౌతమ మహర్షి వల్ల ఈ గోదావరి నది గంగ కంటే ముందు పుట్టింది. ఫలితం ఇవ్వదలచుకుంటే గంగ కంటే ఎక్కువ పవిత్రమైనది గోదావరియే.’’
 మహా మహా మహర్షులకే గోదావరి అంటే అంత ప్రేమ. నిత్యం సిద్ధసేవిత అయిన గోదావరిని ఎందరో మహాపురుషులు సేవించి తరించారు. ఆ వృత్తాంతాలన్నీ బ్రహ్మాండ పురాణంలోని గౌతమీ మహత్యం చెబుతుంది.
 
అసలు గోదావరి పుట్టినప్పటి మాట చెప్పుకుందాం. మాయాగోవు చనిపోయిన ప్రదేశం నుంచి గోదావరి ప్రవహించగానే తాను గోహత్యా పాతకం నుంచి విముక్తుడైనట్లు భావించాడు గౌతమ మహర్షి. అక్కడి నుంచి గోదావరి ఆనుపానులను గురించి ఆయనకు బెంగలేకపోయింది.
 ఉరకలై గోదావరి ముంచుకు వస్తోంది. సాగరగామినియై పరుగులు తీస్తోంది. నేటి కాలంలో ఆనకట్టలు కట్టి నీరు నిల్వచేసినట్లు సప్తరుషులు చేరి అఖండ గోదావరిని ఏడుపాయలుగా చీల్చి దారి మళ్లించారు.

గోదావరీ తీరం వెంట ఎన్నో క్షేత్రాలను సుక్షేత్రాలుగా జలసమృద్ధిని పెంచారు.
 ప్రతి నదికీ ఎన్నో పాయలు ఉంటాయి. వాగులు బయలుదేరి ప్రధాన స్రవంతిలో కలుస్తాయి. సప్తగోదావరి మాత్రం అలాంటిది కాదు. సప్తర్షులుగా మనం చెప్పుకునే రుషులు, గోదావరిని ఏడు శాఖలుగా మార్చిన సప్తర్షులు ఒకరు కాదు. ప్రస్తుతం నడుస్తున్న మన్వంతరంలో సప్తర్షుల పేర్లు ఇవి... కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, వశిష్ఠ, జమదగ్ని మహర్షులు. అయితే సప్త గోదావరికి ఆ పేరు స్థిరపడిపోవడానికి కారణమైన ఏడు శాఖలను గురించి...
 
తుల్యాత్రేయీ భరద్వాజ గౌతమీ వృద్ధగౌతమీ
 కౌశికీచ వశిష్ఠాచ తథా సాగరం గతాః
 - అని చెప్పారు. ఇందులో...
 తుల్యభాగ నదిగా చెప్పుకునే నదీ శాఖ మొదట జమదగ్ని మహర్షిదే అని కొందరి వాదన. తుల్యభాగుడనే మహర్షి గౌతమీ ప్రవాహాన్ని మళ్లించడానికి ఎన్నో అవస్థలు పడ్డాడు. ఇసుక మేటలు వేసి ఇంకిపోయి నదిలో గోతులు తవ్వించి, వాటి నిండా పసుపు నింపుతాడు.

నీరు పచ్చగా మారుతుంటే ప్రవాహ సరళిని లెక్కవేసి, అనువైన దారి కల్పించి తుల్యభాగను ఉద్ధరిస్తాడు. ధవళేశ్వరం దగ్గర ప్రారంభమయ్యే తుల్యభాగా నది వేమగిరి, కడియం, జేగురుపాడు, అనపర్తి, పొలమూరు, రామచంద్రాపురం మీదుగా ప్రవహించి కాకినాడ సమీపంలోని చొల్లంగి వద్ద సోమేశ్వరుని సన్నిధిలో సముద్ర సంగమం చేయించాడు. సంతాన ప్రాప్తికి తుల్యభాగ స్నానం ఉత్తమమంటారు.
 
అలాగే దంగేరు వద్ద ప్రారంభమై కోలంక, దుగదుర్రు, కాజులూరు గ్రామాలను దాటి కోరంగి దగ్గర కురుంగేశ్వరుని పాదాల వద్ద సముద్రంలో కలిసే గోదావరికి ఆత్రేయి అని పేరు. అత్రి మహర్షి కుమారుడైన ఆత్రేయుడు గౌతమీ తీరంలో చిరకాలం తపస్సు చేశాడు. తన తపశ్శక్తిని ధారపోసి, ఇంద్రుని స్వర్గం లాంటి మరో స్వర్గాన్ని నిర్మించుకున్నాడు. రాక్షసులు ఆ స్వర్గాన్ని కైవసం చేసుకోబోగా, దాన్ని ధ్వంసం చేసి తిరిగి నేలకు వస్తాడు. స్వర్గ నిర్మాణంలో కోల్పోయిన తపశ్శక్తిని ఆత్రేయుడు గౌతమీస్నానం వల్ల పొందుతాడు.

కనుక జీవితంలో నష్టపోయినవారు తిరిగి తమ శక్తియుక్తులను కూడదీసుకోవడానికి ఆత్రేయిలో స్నానం చేయాలంటారు. అలాగే రూప సౌందర్యాన్ని, తేజస్సును పొందాలంటే భారద్వాజి శాఖలో స్నానం చేయాలి. కురూపులు అయిన తన సోదరిని, బావను గోదావరిలో స్నానం చేయమని సూచిస్తాడు భరద్వాజ మహర్షి. వారి విరూపాలు పోయి వారికి సుందర రూపాలు వస్తాయి. కోటిపల్లి దగ్గర చీలిక వచ్చే భారద్వాజి అయిన గోదావరి మసకపల్లి వద్ద త్రివేణీ సంగమంగా ఏర్పడి, యానాం సమీపంలోని సంవేద్యం అనే చోట సముద్రంలో సంగమిస్తుంది.

భారద్వాజి శాఖ సముద్ర సంగమ ప్రదేశంలో ఐదు దివ్య తీర్థాలు తప్పక స్నానం చేయవలసినవి. బ్రహ్మగిరి నుంచి గోష్పద క్షేత్రం వరకు వచ్చిన గౌతమి శాఖ మసకపల్లి సోమేశ్వర క్షేత్రం మీదుగా పయనించి, తీర్థాల మొండి వద్ద సముద్ర సంగమం చేస్తోంది.
 వృద్ధ గౌతమీ శాఖ నవయవ్వనాన్ని ప్రసాదిస్తుందని గౌతమీ మహత్యం చెబుతుంది. దర్శించిన క్షణంలో ముక్తినిచ్చే దివ్యక్షేత్రం క్షణముక్తేశ్వరం వద్ద ప్రారంభమై కొత్తలంక, కుండలేశ్వరం మీదుగా ప్రవహిస్తుంది వృద్ధగౌతమీ శాఖ. వామదేవుడనే మహర్షి వల్ల ఏర్పడిన వృద్ధగౌతమి కాట్రేనికోన మండలంలోని బ్రహ్మసమేధ్యం దగ్గర సముద్ర సంగమం చేస్తుంది. బ్రహ్మేశ్వరుడు, వృద్ధేశ్వరుడు సంగమ స్థలంలో కొలువైన దేవతలు.
 
అగస్త్య ప్రతిష్ఠితమైన మందేశ్వరుడు కొలువైన కపిలేశ్వర పురానికి ఆవలి ఒడ్డున ప్రవహించే గోదావరికి కౌశికిగా పేరు. విశ్వామిత్ర మహర్షి చెల్లెలు పేరుమీద ఈ నది ఏర్పడింది. అమలాపురం తాలూకాలోని అనేక గ్రామాలను కలుపుతూ అల్లవరం మండలం బెండమూరు లంక దగ్గర సముద్రస్నానం చేసి రామలింగేశ్వర, లక్ష్మణేశ్వరస్వాములను దర్శించుకోవచ్చు.
 వశిష్ఠ మహర్షి భాగమైన వాశిష్ఠ నది విజ్జేశ్వరం, బొబ్బర్లంక, ముక్కామల, ఖండవల్లి మీదుగా ప్రవహిస్తుంది. కశ్యపపుత్రుడు గరుత్మంతుని వల్ల ఏర్పడిన వైనతేయి వాశిష్ఠకు ఉపనది. పిట్ల గన్నవరం, చెముడులంకల వద్ద కనిపించేది వైనతేయి. కాగా రాజోలు వద్ద వాశిష్ఠ, వైనతేయిల విభాగాలను దర్శించవచ్చు. వాశిష్ఠ నది అంతర్వేది వద్ద సముద్రంలో కలుస్తుంది. ఈ క్షేత్రానికి అధిదేవత నీలకంఠేశ్వరుడు.
 
... ఇదీ స్థూలంగా ఏడుగా చీలిన గోదావరి దర్శనం. పుష్కర వేళ సప్త గోదావరుల్లోని అన్ని దివ్యతీర్థాలలోనూ స్నానం చేసి పుష్కర స్నాన పుణ్యాన్ని పొందవచ్చు. పుష్కర విధులను నిర్వహించవచ్చు. సముద్ర సంగమ ప్రదేశాలు కూడా స్నానానికి ఉత్తమమైనవి. పుష్యబహుళ అమావాస్యనాడు చొల్లంగి దగ్గర తుల్యాసాగర సంగమంతో మొదలుపెట్టి మాఘశుద్ధ అష్టమినాడు అంతర్వేది నృసింహుని కల్యాణోత్సవ సమయానికి పూర్తయ్యేలా సప్తసాగర యాత్ర చేయడం తెలుగువారి సంప్రదాయం.
 
సప్తశాఖలుగా గోదావరిని మార్చిన సప్తర్షులు మామూలుగా మనం చెప్పుకునే సప్తర్షులు ఒకరు కాదు అని చెప్పుకున్నాం. అయితే సప్తగోదావరి అనే పేరు ప్రసిద్ధిలోకి రావడానికి కారణం ఏంటంటే...
 విమలమతి సప్తగోదావరమున గ్రుంకి
 సప్తసప్తి ప్రతిష్ఠ ప్రసన్నుడైన
 భీమనాథేశ్వరేశ్వర స్వామిజూచు
 మనుజులకు బాయు సప్తజన్మముల యఘము
 - అంటాడు శ్రీనాథుడు.

సప్తసప్తి అయిన సూర్యుడు ప్రతిష్ఠించిన భీమేశ్వరుని ప్రతిష్ఠావేళ సప్తర్షులు గోదావరీ దివ్యజలాలను ద్రాక్షారామానికి మళ్లించారట. సప్తజన్మల పాపాలను హరించే భీమేశ్వరుని పుష్కరిణికి సప్తగోదావరి అని పేరు. సప్తర్షులు ఏర్పరిచిన ఈ పుష్కరిణి స్వయంగా నదీ సమానమైనది. ఈ భీమేశ్వర తటాకంలో సప్తగోదావరీ స్నానఫలం, పుష్కర స్నానఫలం, క్షేత్ర దర్శన పుణ్యం జమిలిగా కలుగుతాయి.
 - యడవల్లి సంతోశ్ సునీల్
 
సప్తరుషులు అఖండ గోదావరిని ఏడుపాయలుగా చీల్చి దారి మళ్లించారు. జలసమృద్ధితో ఎన్నో క్షేత్రాలను సుక్షేత్రాలుగా మార్చారు. సప్తర్షులుగా మనం చెప్పుకునే రుషులు, గోదావరిని ఏడు శాఖలుగా మార్చిన సప్తర్షులు ఒకరు కాదు. ప్రస్తుత మన్వంతరంలో సప్తర్షులు కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, వశిష్ఠ, జమదగ్ని మహర్షులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement