సాహితీ గోదావరి | Sahiti Godavari | Sakshi
Sakshi News home page

సాహితీ గోదావరి

Published Sun, Jul 12 2015 1:33 AM | Last Updated on Wed, Aug 1 2018 5:04 PM

సాహితీ గోదావరి - Sakshi

సాహితీ గోదావరి

వాడ్రేవు చినవీరభద్రుడు
తుపాను నవల్లో అనుకుంటాను, అడవి బాపిరాజుగారు, గంగానది రుషుల నది, యమున ప్రేమికుల నది, కృష్ణ శిల్పుల నది, కావేరి సంగీతకారుల నది అని చెప్తూ, గోదావరి కవుల నది అంటారు. గోదావరి నీళ్లల్లో, ఆ ఒడ్డున మనలో కవిత్వాన్ని మేల్కొల్పే లక్షణమేదో ఉందని నాక్కూడా అనుభవమైంది.
 
82-87 మధ్యకాలంలో నేను మా కుటుంబ ఆర్థిక పరిస్థితి అనుకూలించక డిగ్రీ చదువు మధ్యలో ఆపేసి రాజమండ్రిలో టెలిఫోన్స్‌లో అకౌంటెంటుగా పనిచేశాను. ఆ అయిదేళ్ల కాలంలోనే నేను నిజంగా సాహిత్యమంటే ఏమిటో తెలుసుకున్నాను. గోదావరి గట్టు నా తక్షశిల. అక్కడ నాకు గొప్ప గురువులు దొరికారు. గొప్ప సహాధ్యాయులు దొరికారు. గోదావరి అనగానే నాకు వాళ్లంతా గుర్తొస్తారు.
 
‘మా గోదావరియే, తదీయతటియే అమ్నాయంత సంవేద్యుడౌ మా గౌరీశుడె, మా వేణుగోపాలుడే...’ అంటూ మంత్రం జపం చేస్తున్నట్టుగా పద్యపాదాలు నెమరేసుకునే మల్లంపల్లి శరభయ్య గుర్తొస్తారు. ఆయనది కృష్ణాజిల్లా ఎలకుర్రు. కాని జీవితమంతా గోదావరి సన్నిధిలోనే గడిపారు. కవిత్వం పండితులు బోధించకూడదు, భావుకులు బోధించాలి అనేవారాయన. ఒక కవిత్వ వాక్యం ముందు ఎట్లా సాష్టాంగపడాలో ఆయన్ని చూసే నేర్చుకున్నాను.

ఎన్నో సాయంకాలాలు, రాత్రులు సమాచారం మేడ మీద వాళ్లింట్లో, గోదావరి గట్టున ఆయన సంస్కృత, తెలుగు కావ్యానందమనే మృష్టాన్నభోజనం చేస్తూ మధ్యలో ఒక్కొక్క ముద్ద నా చేతుల్లో కూడా పెట్టేవారు. ఆ రుచి ఎట్లాంటిదంటే, ఆ తర్వాత నాకు సాహిత్యంలో మరెవ్వరినీ గురువులనుకోవడానికి మనసొప్పలేదు.
 
మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి యానాం దగ్గర పల్లిపాలెంలో పుట్టారు. వాళ్ల నాన్నగారు మధునాపంతుల సత్యనారాయణమూర్తి అక్కడ నుంచి ‘ఆంధ్రి’ అనే పత్రిక నడిపారు. ఇరవయ్యవ శతాబ్ది ప్రారంభంలో తెలుగులో నవ్యకవిత్వం, నవ్య సాహిత్య చైతన్యం అంకురించిన వేళలకి పల్లిపాలెం సాక్షి అని సాక్షాత్తూ తిరుపతి వెంకట కవులే గొంతెత్తి మరీ చెప్పారు. అటువంటి నేపథ్యం నుంచి వచ్చిన మధునాపంతుల ఆంధ్ర పురాణాన్ని రచించడంలో ఆశ్చర్యమేముంది? ఆంధ్రుల చరిత్రని పురాణంగా చెప్పవచ్చనే ఆ ఒక్క ఆలోచనతో ఆయన విశ్వనాథ సత్యనారాయణని కూడా దాటిపోయారనిపిస్తుంది.
 
ఆర్.ఎస్.సుదర్శనంగారు పుట్టింది మదనపల్లిలో. ఉద్యోగరీత్యా అయిదారేళ్లపాటు రాజమండ్రిలో ఉన్నారు. కాని ఆ ఊరితో ఆజన్మబంధం పెనవేసుకున్నారు. ఆయన వల్లనే రాజమండ్రి సాహిత్య చర్చల్లో అస్తిత్వ వాదం, ఫ్రాయిడ్, యూంగ్, సార్త్రే, కిర్క్ గార్డ్, పాల్ టిల్లిచ్ ప్రవేశించారు. ఆయన వల్లనే రమణమహర్షి, కృష్ణమూర్తి, ‘ద డాన్స్ ఆఫ్ ఊలీమాష్టర్’ల గురించి మేం తెలుసుకోగలిగాం. ఆయన్నొక సారి షేక్‌స్పియర్ నాటకాలు చెప్పమని అడిగాం. మాకోసం ఆయన నాలుగైదు రోజులపాటు గౌతమీ గ్రంథాలయంలో హేమ్లెట్ నాటకం పాఠం చెప్పారు. ఆ చెప్పిన విధానం ఎటువంటిదంటే, ఆ తర్వాత షేక్‌స్పియర్ నాటకాలు చదువుకోవడానికి నాకు మరెవ్వరి సహాయమూ అవసరం లేకపోయింది.
 
గురజాడ కళాసమితి దర్శకుడు, రూపక ప్రయోక్త టి.జె.రామనాథంతో నా సాహచర్యం ఎంత విలువైందో నేను రాజమండ్రి వదిలిపెట్టిన తర్వాతనే నాకు మరింత స్పష్టంగా తెలిసొచ్చింది. ఆయన్ను రాజమండ్రి పత్రికలు ‘జనరంజక రూపకర్త’ అని పిలిచేవి. ప్రజల అభిరుచి స్థాయికి తాను దిగకుండా కళాఖండాల్ని సృష్టించిన బి.ఎన్.రెడ్డిలాగా కాకుండా పండిత పామర రంజకంగా కళాసృష్టి చేసిన కె.వి.రెడ్డి లాంటి దర్శకుడు రామనాథమని మా మహేష్ ఎప్పుడూ అంటూండేవాడు.

ఇరవయ్యేళ్ల వయసులో ఆయన నాతో ‘స్వాతంత్రోద్యమ శంఖారావం’ అనే డాక్యుమెంటరీ రూపకం రాయించాడు. ఆ రూపకం రిహార్సల్స్ కోసం ప్రతి రాత్రీ ధవళేశ్వరంలో గడిపి తెల్లవారాక రాజమండ్రి రావడం ఒక అనుభవం. నాకే కాదు, అందులో గాంధీగా నటించిన ప్రసిద్ధ కవి వసీరాకీ, నెహ్రూగా నటించిన ప్రసిద్ధ రాజకీయ నాయకుడు ఉండవల్లి అరుణకుమార్‌కీ మరెందరికో కూడా.
 
సావిత్రిగారిది కూడా రాజమండ్రి కాదు, ఆమె పుట్టింది పశ్చిమగోదావరి జిల్లాలో. కాని ఆమె రాజమండ్రి సావిత్రిగా తెలుగులో మొదటి మిలిటెంటు ఫెమినిస్టుగా గుర్తింపు పొందింది. ఆమె హేతువాది, కమ్యూనిస్టు, ఫెమినిస్టు నిజమే కాని, అన్నిటికన్నా ముందు ఆమె నిజమైన మనిషి. ఒకసారి ఆమెను అకారణంగా అరెస్టుచేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు. వారం రోజులో, రెండు వారాలో ఉన్నదనుకుంటాను. ఆ కొద్దిరోజుల్లోనే ఆమె అక్కడి డిటెన్యూలకి చింగిజ్ అయిత్ మాతొవ్ ‘తల్లిభూదేవి’ నవల మొత్తం చదివి వినిపించింది.

అందరూ సమాచారం సుబ్రహ్మణ్యంగా ఎంతో ఆత్మీయంగా పిలుచుకునే సుబ్రహ్మణ్యం గోదావరి సంస్కృతికి నిజమైన ప్రతినిధి. రాజమండ్రి ఆత్మ అతడికి తెలుసు. చిన్నపత్రికల సంపాదకుల్లో అత్యుత్తమ సంపాదకుడిగా చాలా చిన్నవయసులోనే ప్రధానమంత్రి నుంచి సత్కారం పొందినవాడు. కాని అతణ్ని నేను కేవలం పాత్రికేయుడిగా చూడలేను. అతడు నాలాంటివాళ్లందరికీ తండ్రి, సోదరుడు, మిత్రుడు.
 
కవులూరి గోపీచంద్‌ది ఏలూరు. వాళ్ల నాన్నగారు కవులూరి వెంకటేశ్వరరావు గారు చాలాకాలం విశాలాంధ్రలో పనిచేశారు. ఆయన వల్ల గోపీచంద్ చిన్నవయసులోనే మార్క్స్‌ని, ఎంగెల్స్‌ని, లెనిన్‌ని చదువుకున్నాడు. తండ్రి రాయిస్టు కావడం వల్ల ఎం.ఎన్.రాయ్‌ని కూడా చదివాడు. చాలాకాలం పాటు రాజమండ్రి పేపర్ మిల్లులో, ఆ తర్వాత ఒరిస్సాలో జె.కె.పేపర్ మిల్లులోనూ కెమిస్టుగా పనిచేశాడు. ముప్ఫై ఏళ్ల వయసులో భార్యని, పిల్లవాణ్ని వదిలిపెట్టి జీవిత సత్యం వెతుక్కుంటూ ఇల్లు విడిచి వెళ్లిపోయాడు. ఇప్పటికీ అతడి ఆచూకీ తెలియదు. కాని అతడితో ఒక్కసారి మాట్లాడినవాళ్లు కూడా ఇప్పటికీ అతణ్ని గుర్తుచేసుకుంటూనే ఉంటారు. తన సాహచర్యంతో అతడు నన్ను తీర్చిదిద్దాడని చెప్పవచ్చు. అతడి వల్లనే నేను తత్త్వశాస్త్ర విద్యార్థిగా మారేను.
 
మేమందరం మహేష్‌గా పిలుచుకునే చక్రాల వెంకట సుబ్బమహేశ్వర్ గోదావరి జిల్లావాడు కాడు. కాని పేపర్ మిల్లులో సేఫ్టీ ఆఫీసరుగా పనిచేసేవాడు. మా బృందంలోనే మా మిత్రురాలు శకుంతలని పెళ్లి చేసుకుని తర్వాత రోజుల్లో శ్రీహరికోట వెళ్లిపోయినదాకా మహేష్, రాజమండ్రితో విడదీయలేనంత అనుబంధం పెంచుకున్నాడు. గర్భగుళ్లో దేవుడికి హారతిస్తూ అర్చామూర్తిని పరిచయం చేస్తారే, అట్లా మహేష్ రాజమండ్రికి పట్టిన హారతి లాంటివాడు. ఆ వెలుగులోనే నేను రాజమండ్రినీ, గోదావరినీ పోల్చుకున్నాను.అతడి వల్లనే నాకు వీరేశలింగం, చిలకమర్తి, టంగుటూరి ప్రకాశం, గరిమెళ్ల వంటివారు అర్థమయ్యారు. ఎన్ని సాయంకాలాలు, ఎన్ని రాత్రులు, ఎన్ని ఎడతెగని చర్చలు!
 
కవిత్వం, తత్త్వశాస్త్రం, కళాసృజనకి పరిమితమైన మా బృందంలో సంగీతాన్ని పట్టుకొచ్చినవాడు వంక బాలసుబ్రహ్మణ్యం. అతడి సాహిత్య పరిచయం, పరిజ్ఞానం తక్కువేమీ కాదు. ఆయన ప్రేరణ వల్లనే నేనూ, గోపీచంద్ కలిసి రాజమండ్రి రీడర్స్ క్లబ్ ఏర్పాటు చేశాం కూడా. ఒక వేసవిలో రెండువారాల పాటు సాహిత్య, సామాజిక శాస్త్ర తరగతులు కూడా నడిపాం. కాని సంగీతాన్ని ఎట్లా వినాలో, ఎట్లా ప్రశంసించాలో బాలసుబ్రహ్మణ్యమే మాకు నేర్పాడు.

ఆ గోదావరి గట్టుమీద పాత టేప్‌రికార్డరొకటి పట్టుకొచ్చి, ఈ రోజు మీకు హేమంత కుమార్‌ని పరిచయం చేస్తాననేవాడు. పాట గురించి, ట్యూన్ గురించి, రాగం గురించి, అందులోని భావం గురించి, ఔచిత్యం గురించి సుదీర్ఘంగా చెప్పేక, అప్పుడు ఆన్ బటన్ నొక్కగానే ‘ఏ నయన్ డరే డరే...’ అని వినబడగానే మాకళ్లముందొక అతిలోక స్వాప్నిక ప్రపంచం తలుపులు తెరుచుకునేది.
 
రాళ్లబండి కవితాప్రసాద్ నా రాజమండ్రి మిత్రుడు కాడు. కాని నాకు గోదావరి మిత్రుడు. నేను రాజమండ్రిలో గోదావరిని ఉపాసిస్తున్నప్పుడు అతడు భద్రాచలంలో గోదావరిని ఉపాసిస్తున్నాడు. తర్వాత రోజుల్లో గోదావరికీ, సాహిత్య స్నేహాలకీ ఎంతో దూరంగా, ప్రభుత్వోద్యోగులుగా మేం జీవించవలసివచ్చినప్పుడు గోదావరి సాక్షిగ మేం మళ్లా ఆ స్వప్న ప్రపంచంలోకి ప్రయాణించాలని కలలుగనేవాళ్లం. ఈ ఏడాదో, వచ్చే ఏడాదో వాలంటరీ రిటైర్మెంటు తీసుకుందామని, అప్పుడు మళ్లా ఆంధ్ర దేశమంతా తిరుగుతూ సాహిత్యం గురించి మాట్లాడుతూ దేశాన్ని జాగృతం చేద్దామని ఎన్నెన్నో ఊసులాడుకునేవాళ్లం, ఊహలు పంచుకునేవాళ్లం.
 
నా జీవితంలో నేను కొండల్లో పుట్టాను, అడవుల్లో తిరిగాను, నగరంలో గడుపుతున్నాను. కాని నది ఒడ్డున జీవించిన అనుభవం అద్వితీయం. ఆ నది గోదావరి కావడం నా అదృష్టం.
 ఏరీ ఆ సన్మిత్రులు? నన్నిక్కడ వదిలేసి ఎక్కడకు వెళ్లిపోయారు? మా మాష్టారు శరభయ్యగారు ఒక పద్యంలో రాసుకున్నట్టుగా ‘తలప ధరణి బ్రదుకె దాగిలిమూతయో! వారలెందొ! కానరారు మరల’. ఇప్పుడు మిగిలిందల్లా అక్కడ గోదావరి నీళ్లు, ఇక్కడ నా కన్నీళ్లు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement