Vadrevu China Veerabhadrudu
-
దుర్గమ్మ పాఠ్యాంశాలను తొలగించలేదు
సాక్షి, అమరావతి: పాఠ్య ప్రణాళిక సంస్కరణల్లో భాగంగా కొత్త పాఠ్యపుస్తకాలను అన్ని మతాల పండుగలు, సంప్రదాయాలు, ధర్మ మార్గం విశిష్టతను తెలియచేసేలా వీలైనంత సమగ్రంగా రూపొందించాలని భావించినట్లు పాఠశాల విద్యా శాఖ సంచాలకుడు వాడ్రేవు చినవీరభద్రుడు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘బెజవాడ దుర్గమ్మ తెలుగు పాఠాల నుంచి వెళ్లిపోయింది.. గుణదల కొత్తమాత వచ్చి చేరింది’ అంటూ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆయన ఖండించారు. దుర్గమ్మ పాఠ్యాంశాలను తొలగించలేదని, 6వ తరగతి తెలుగు పుస్తకంలో ఉన్నాయని స్పష్టం చేశారు. కొత్త పాఠ్యాంశాలను చేర్చడంలో భాగంగా ఇతర అంశాలను పొందుపరచినట్లు చెప్పారు. రెండో తరగతి నుంచి ఏడో తరగతి వరకు విద్యార్థులకు తెలుగు సంస్కృతిని పరిచయం చేసే క్రమంలో వివిధ మతాల ముఖ్యమైన పండగలను పాఠ్యపుస్తకాల్లో చేర్చినట్లు తెలిపారు. ఇందులో మొత్తం 12 పండుగల్లో హిందూ మతానికి సంబంధించిన 8 ముఖ్యమైన పండుగలు ఉన్నట్లు వివరించారు. మొదటిసారిగా గిరిజనుల పండుగను కూడా పరిచయం చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల పండుగలను కూడా పరిచయం చేశామన్నారు. శ్రీకాకుళం సవరల పండుగ, విజయనగరం సిరిమానోత్సవం, నెల్లూరు రొట్టెల పండగ, అహోబిలం పార్వేటలతోపాటు విజయవాడ గుణదల మేరీమాత ఉత్సవాలను కూడా పరిచయం చేశామని తెలిపారు. ఇలా వివిధ మతాలు, వివిధ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించేలా పాఠ్యపుస్తకాలను ఇంక్లూజివ్‌గా రూపొందించడం ఇదే తొలిసారి అని తెలిపారు. అయితే ఇందులో నుంచి ఒక్కటి మాత్రమే ఎంపిక చేసి హిందూ మతానికి అన్యాయం జరుగుతున్నట్లుగా ట్రోలింగ్ చేయడం దురుద్దేశంతో కూడుకున్నదని స్పష్టం చేశారు. -
హేమంతం నుంచి హేమంతం దాకా
∙ఒక చదువరి అంతరంగం అనేక వైరుధ్యాల మధ్య, అనేక కర్తవ్యాల మధ్య, స్పష్టంగా బోధపడని మంచిచెడుల మధ్య ఆత్మికంగానూ, నైతికంగానూ తోడు నిలబడేది సాహిత్యమొక్కటే. 1 ఒక సంవత్సరం గడిచిపోయింది. కొత్త సంవత్సరం ప్రవేశించింది. హేమంతం నుంచి హేమంతం దాకా గడిచిన కాలమంతా ఎన్నో అనుభవాలు, ఎన్నో ప్రయాణాలు, ఎన్నో కలయికలు, వియోగాలు. కాని నిజంగా నాకు సన్నిహితంగా ఉన్నది సాహిత్యమొక్కటే. ఇన్నేళ్ళు గడిచినా, బహుశా, జీవించడమెట్లానో నాకిప్పటికీ తెలియలేదనే అనుకుంటాను. అనేక వైరుధ్యాల మధ్య, అనేక కర్తవ్యాల మధ్య, స్పష్టంగా బోధపడని మంచిచెడుల మధ్య ఆత్మికంగానూ, నైతికంగానూ తోడు నిలబడేది సాహిత్యమొక్కటే. అందుకనే, ‘ద బెస్ట్ అమెరికన్ పొయెట్రీ 2016’ సంకలనకర్త ఎడ్వర్డ్ హిర్ equipment for living అన్నాడు. జీవించడానికి ఊతమిచ్చే సాధనసంపత్తి, నా వరకూ, నిస్సందేహంగా, సాహిత్యమే. 2 ఈ ఏడాది పొడుగునా నన్ను అంటిపెట్టుకున్న కవి కబీరు. ఆయన రాసిన కవిత్వమూ, ఆయన మీద వచ్చిన పరిశీలనలూ, పరిశోధనలూ విస్తారంగా చదివాను. కబీరు నన్ను గాఢంగా ఆకట్టుకోవడానికి కారణం, ఆయన కూడా ఆత్మలో స్వాతంత్య్రం పొందడానికి కావలసిన సాధనసంపత్తి కోసం సాహిత్యం వైపే చూశాడు. ఆయన జీవించిన 15వ శతాబ్దపు భారతదేశానికీ, మనం జీవిస్తున్న ఇప్పటి భారతదేశానికీ ప్రాయికంగా ఏమీ తేడా లేదు. అదే డంబాచారం, అదే ఆత్మవంచన, అదే పరపీడన. ముఖ్యంగా సమాన హృదయధర్మం కలిగిన మనుషుల కోసం అన్వేషణ. వాళ్ళు దొరకడం లేదనే తపన. ‘నన్ను నేనర్పించుకుందామంటే ఒక్కడూ కనబడలేదు/ లోకమంతా ఎవరి చితుల్లో వాళ్ళు దగ్ధమవుతున్నారు’ అంటాడు. 3 అనంతపురం వెళ్ళినప్పుడు, కదిరి ప్రాంతంలో ఒక గిరిజన తండాను వెతుక్కుంటూ వెళ్తుండగా, ఎవరో ‘ఇక్కడే కటారుపల్లె, వేమన సమాధి చూసారా?’ అనడిగారు. మాఘమాసపు వేపచెట్ల నడుమ, అప్పుడే నీళ్ళు పోసుకుంటున్నట్టున్న రావిచెట్ల మధ్య నేను మొదటిసారి ప్రయాణిస్తున్న బాటలో కటారుపల్లెలో అడుగుపెట్టాను. ఆ ఊరు మొదటిసారి చూసినప్పుడు కాంప్‌బెల్ ఎట్లా వర్ణించాడో ఇప్పటికీ అలానే ఉంది. అక్కడొక పెద్ద మెమోరియల్ హాల్, ఎన్ని శతాబ్దాలుగానో వేమన సమాధిగా పిలవబడుతున్న చిన్న సమాధి మందిరమొకటి ఉంది. ఆ సమాధి మందిరం చుట్టూ నాలుగువైపులా ఒక స్మృతిప్రాంగణం, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ వారు నిర్మించింది ఉంది. ఆ ప్రాంగణంలో నాలుగువైపులా గోడల మీద సుమారు 120 వేమన పద్యాలు చెక్కి వున్నాయి. ఆ ప్రాంగణం, పద్యాలు తాపడం చేసిన ఆ గోడలు, ఆ పద్యాల్లోని సారళ్యాన్నీ, విరాళాన్నీ స్ఫురింప చేస్తున్నట్టుగా ఆ గచ్చుమీద ధారాళంగా పరుచుకున్న ఉదయ సూర్యకాంతీ నన్ను విభ్రాంతికి గురిచేసాయి. ఇట్లాంటి ఒక మందిరమిక్కడ నిర్మించారని తెలుగువారికి ఎంతమందికి తెలుసు? జర్మనీకి ఒక గొథే, ఇంగ్లీషుకి ఒక షేక్స్పియర్, మరాఠీలకి ఒక జ్ఞానేశ్వరుడు, తమిళులకి ఒక తిరువళ్ళువర్, బెంగాలీలకి ఒక టాగోర్ ఎట్లానో తెలుగువాళ్ళకి ఒక వేమన అట్లా కదా! కాని ఫ్రాంక్ఫర్ట్, స్ట్రాట్ఫర్డ్ అట్ ఏవన్, అలండి, తిరునాయనార్ కురిచ్చి, జొరసంకొల్లాగా తెలుగువాళ్ళ సాహిత్య తీర్థక్షేత్రమేది? ఆ ప్రాంగణం నిజానికి ఒక ప్రపంచ స్థాయి సాహిత్య సభ, తాత్త్విక చింతనా శిబిరాలు జరగవలసిన ప్రాంగణం. సమాజం మరింత శుభ్రపడాలని కోరుకునేవాళ్ళు ఇక్కణ్ణుంచి ఊరేగింపుగా తమ సామాజిక ఉద్యమాలు మొదలుపెట్టవలసిన ప్రాంగణం. తెలుగునేల మీద కవిత్వం చెప్తున్న ప్రతి ఒక్క కవీ జీవితకాలంలో ఒక్కసారైనా సందర్శించవలసిన దీక్షాభూమి. 4 గడచిన ఏడాది షేక్స్పియర్ 400వ వర్ధంతి సంవత్సరం. సాహిత్యాన్ని లిరిక్, ఎపిక్, డ్రామాలుగా విభజించాడు అరిస్టాటిల్. కవి గొంతు మాత్రమే వినిపించేది లిరిక్ అనీ, పాత్రలు మాత్రమే మాట్లాడుకునేది డ్రామా అనీ, కవీ,పాత్రలూ కూడా మాట్లాడేది ఎపిక్ అనీ ఆయన నిర్వచించాడు. ఈ వర్గీకరణ ఎంత అర్థవంతమో అంత అర్థరహితమని కూడా పోర్చుగీసు కవి పెసావో విమర్శించాడు. ఎందుకంటే, గొప్ప కవిత్వంలో ఏకకాలంలో, కవి గొంతు, పాత్రల గొంతూ, కవీ పాత్రలూ కలగలిసి కూడా వినిపిస్తారని ఎడ్వర్డ్ హిర్‡్ష ఒకచోట రాసాడు. బహుశా షేక్స్పియర్ విశిష్టత ఇదే అనుకుంటాను. ఆయన ఒక పాత్ర చెప్పుకున్న స్వగతంలో కూడా ఒక యుగం సంక్షోభమంతా చూపించగలడు. ఆయన కవిత్వ శైలిలో లిరిక్, ఎపిక్, డ్రామా మూడూ విడదీయలేనంతగా పెనవైచుకుపోయి ఉంటాయి. షేక్స్పియర్ను చదవగలడం ఈ జీవితంలో నాకు లభించిన గొప్ప వరాల్లో ఒకటనుకుంటాను. మన చుట్టూ ఉన్న దైనందిన ప్రాపంచిక జీవితాన్ని గొప్ప సాహిత్యంగా ఎట్లా మార్చుకోవచ్చో, ఆయన రాసిన ఒక్క వాక్యం కూడా అమేయమైన స్ఫురణని అందించ గలుగుతుంది. 5 రాత్రి వానకి తడిసిన అడివి, ఏదో చెప్పాలని కంపిస్తున్నది: కోకిల కూత. వేసవి ఋతుపవన మేఘంగా కరిగిపోయే కాలమంతా మా ఊళ్ళో, అడవిమధ్య, కొండలెక్కుతూ, కాలిబాటల్లో పూల గుసగుసలు వింటూ, బొమ్మలు వేసుకుంటూ గడిపేను. మా ఊళ్ళో జెండాకొండ ఎక్కినప్పుడు, ఆ సుకుమార క్షణాల్ని హైకూలుగా పిండి వడగట్టేను. కొండకింద లోయలో అదే పల్లె: లేనివల్లా మా అమ్మ, మా ఇల్లు. 6 గొథే తొలిరోజుల్లో రాసిన నవల ‘ద సారోస్ ఆఫ్ యంగ్ వెర్థర్ ’(1774) చదివాను. ఆయన జీవితకాలంపాటు రాస్తూ వచ్చిన ఫౌస్ట్ నాటకాన్ని నా తొలిరోజుల్లో చదివాను. ఆయన తొలిరోజుల్లో రాసిన ఈ మహామోహమయ రచన ఇప్పుడు చదివాను. జర్మన్ రొమాంటిసిజం ఉ«ధృతంగా ఉన్న రోజుల్లో రాసిన ఈ నవల యూరోప్ నంతటినీ ఒక జ్వరంలాగా చుట్టబెట్టింది. నవల పూర్తి చేసాక కూడా నన్నొకటే ఆలోచన వెంటాడుతూ ఉంది. ఏదో ఒక అంశాన్ని, ప్రేమనో, మోహమో, ఇన్ ఫాచ్యుయేషనో ఏదో ఒకదాన్ని ఇంత గాఢంగా, ఇంత తీవ్రంగా, ఇంత జీవన్మరణతుల్యంగా కోరుకునే మన:స్థితి ఇప్పుడెక్కడైనా కనిపిస్తుందా? బహుశా, చలంగారి తర్వాత, ఇంత తదేకంగా, ఇంత మమేకంగా జీవితం వెంటపడ్డ మనుషులు గాని, రచయితలు గాని మనకెక్కడైనా కనిపిస్తున్నారా? 7 బాబ్ డిలాన్కి నోబెల్ పురస్కారం ప్రకటించినప్పుడు మరోమారు ఈ సంగతే స్పష్టమైంది. సాహిత్యం జీవన సాధనసంపత్తిగా మారిపోయిన కవులింకా మనమధ్య ఉన్నారని. అసీరియన్, ఈజిప్టియన్ మహాసంస్కృతుల్లో ఏ ఒక్కదానికీ చెందక తమ సర్వేశ్వరుణ్ణే తాము నమ్ముకుంటూ తమ నమ్మకం కోసం తమ జీవితాల్ని తృణప్రాయంగా త్యాగం చెయ్యగలిగిన యూదు ప్రవక్తల్లాగా జీవిస్తున్న కవులింకా ఈ ప్రపంచంలో లేకపోలేదు. తమ విధేయతను శాసించే, కొనుగోలు చెయ్యాలనుకునే విరుద్ధ శక్తులమధ్య, ఏ ఒక్కదానికీ చెందక, తమ ఒంటరి కాలిబాటన తాము సాగిపోయే కవులకి డిలాన్ మనకాలం ప్రతినిధి, మనకాలం వీరుడు. 8 కొత్త సంవత్సరంలో చదవలవసినవీ, పారాయణం చెయ్యవలసినవీ మరెన్నో పుస్తకాలున్నాయి. పంచుకోవలసినవీ, పాడుకోవలసినవీ మరెన్నో పాటలున్నాయి. ఒక మనిషి తన అత్యంత బలహీన క్షణాల్ని గుర్తుపట్టడం ద్వారానే బలోపేతుడవుతాడు. తన మానవత్వాన్ని నిలుపుకోవడం కోసమే కవిగా, కథకుడిగా మారతాడు. అరేబియన్ రాత్రుల కథల్లో షహ్రాజాద్ లాగా మృత్యువును మరొక్కరోజు వాయిదా వేయడం కోసమే ప్రతి రాత్రీ ఒక కొత్త కథ అల్లుకుంటాడు. గడపలో అడుగుపెట్టిన ప్రతి కొత్త రోజునూ అజరామరం చెయ్యడంకోసం ఒక పూర్వకవిని తలుచుకుంటాడు, ఒక కొత్త రూపకానికి తెరతీస్తాడు. నేనూ ఇంతే. (రచయిత : వాడ్రేవు చినవీరభద్రుడు 9490957129 ) -
బైరాగి సాహిత్యం నా జీవితంలో అంతర్భాగం
91వ జయంతి సభలో వాడ్రేవు చినవీరభద్రుడు సమకాలీన హిందీ సాహిత్య విశిష్ట సంచిక ఆవిష్కరణ రాజమహేంద్రవరం కల్చరల్ : బైరాగి నా యవ్వనకాలపు నేస్తం, నేటికీ బైరాగి సాహిత్యం నా జీవితంలో అంతర్భాగమని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ అదనపు సంచాలకుడు, సాహితీవేత్త వాడ్రేవు చినవీరభద్రుడు అన్నారు. మంగళవారం అక్షర సాహితీ, సాంస్కృతిక సేవాపీఠంఆధ్వర్యంలో జరిగిన బైరాగి 91వ జయంతి ఉత్సవంలో ఆయన కీలకోపన్యాసం చేశారు.‘ మల్లంపల్లి శరభయ్య ఒకసారి నాతో మాట్లాడుతూ ఈ సృష్టిలో కాళిదాసు కవిత్వం కన్నా గొప్పప్రేయసి దొరకదని’ అన్నారు. నేను బైరాగి సాహిత్యం కూడా అంతటిదని భావిస్తున్నానని చినవీరభద్రుడు అన్నారు. తెలుగు వారు నన్నయ, తిక్కన, ఎర్రనలను కవిత్రయంగా భావిస్తారు, శ్రీశ్రీ అయితే తిక్కన, వేమన, గురజాడలు కవిత్రయమని అంటాడు– నేను గురజాడ, శ్రీశ్రీ, బైరాగి కవిత్రయమంటాను అని పేర్కొన్నారు. అమరఅక్షర ప్రచురించిన ‘సమకాలీన హిందీసాహిత్య’ విశిష్ట సంచికను ఆయన ఆవిష్కరించారు. హిందీభాషావ్యాప్తికి అక్షర చేస్తున్న కృషిని అభినందించారు. తొలి ప్రతిని రొటేరియన్ పట్టపగలు వెంకటరావుకు అందజేశారు. అక్షర సంస్థ అధ్యక్షుడు ఫణి నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. ౖహైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం హిందీ విభాగ్ అధ్యక్షుడు ఆర్.యస్.సర్రాజు, సంస్థ గౌరవాధ్యక్షుడు డాక్టర్ కర్రి రామారెడ్డి ప్రసంగించారు. అక్షర వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ పేరిశెట్టి శ్రీనివాసరావు స్వాగతవచనాలు పలికారు. సాహిత్యాభిమానులు హాజరయ్యారు. యువతకు సాహిత్యంపై ఆసక్తి తగ్గిపోలేదు నేటి తరానికి సాహిత్యంపై ఆసక్తి తగ్గిపోతున్నదని అనడం సరి కాదు, నేటి యువతకు కూడా సాహిత్యం పట్ల ఆసక్తి ఉందని వాడ్రేవు చినవీరభద్రుడు అన్నారు. ‘అక్షర’సంస్ధ ఆధ్వర్యంలో జరిగిన ఒక సాహితీ సమావేశంలో మాట్లాడటానికి వచ్చిన సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకం మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే....సంప్రదాయ , ఆధునిక సాహిత్యాల మధ్యౖ వెరుద్ధ్యం ఏమీలేదు, నాటి తరం రెంటినీ సమానంగా ఆస్వాదించేవారు, నేడు ఆ పరిస్థితి అంతగా లేకపోవచ్చును. పద్యం ఒక చక్కటి సాహితీప్రక్రియ అనడంలో అతిశయోక్తి లేదు.1982–87మధ్యకాలంలో ఈ నగరంలోఉన్నాను. రాజమహేంద్రి హృదయం విశాలమయింది. ఇక్కడ గాలివల్లనే సాహిత్యం అధ్యయనం, అభ్యాసం బలపడ్డాయి. -
సాహితీ గోదావరి
వాడ్రేవు చినవీరభద్రుడు తుపాను నవల్లో అనుకుంటాను, అడవి బాపిరాజుగారు, గంగానది రుషుల నది, యమున ప్రేమికుల నది, కృష్ణ శిల్పుల నది, కావేరి సంగీతకారుల నది అని చెప్తూ, గోదావరి కవుల నది అంటారు. గోదావరి నీళ్లల్లో, ఆ ఒడ్డున మనలో కవిత్వాన్ని మేల్కొల్పే లక్షణమేదో ఉందని నాక్కూడా అనుభవమైంది. 82-87 మధ్యకాలంలో నేను మా కుటుంబ ఆర్థిక పరిస్థితి అనుకూలించక డిగ్రీ చదువు మధ్యలో ఆపేసి రాజమండ్రిలో టెలిఫోన్స్‌లో అకౌంటెంటుగా పనిచేశాను. ఆ అయిదేళ్ల కాలంలోనే నేను నిజంగా సాహిత్యమంటే ఏమిటో తెలుసుకున్నాను. గోదావరి గట్టు నా తక్షశిల. అక్కడ నాకు గొప్ప గురువులు దొరికారు. గొప్ప సహాధ్యాయులు దొరికారు. గోదావరి అనగానే నాకు వాళ్లంతా గుర్తొస్తారు. ‘మా గోదావరియే, తదీయతటియే అమ్నాయంత సంవేద్యుడౌ మా గౌరీశుడె, మా వేణుగోపాలుడే...’ అంటూ మంత్రం జపం చేస్తున్నట్టుగా పద్యపాదాలు నెమరేసుకునే మల్లంపల్లి శరభయ్య గుర్తొస్తారు. ఆయనది కృష్ణాజిల్లా ఎలకుర్రు. కాని జీవితమంతా గోదావరి సన్నిధిలోనే గడిపారు. కవిత్వం పండితులు బోధించకూడదు, భావుకులు బోధించాలి అనేవారాయన. ఒక కవిత్వ వాక్యం ముందు ఎట్లా సాష్టాంగపడాలో ఆయన్ని చూసే నేర్చుకున్నాను. ఎన్నో సాయంకాలాలు, రాత్రులు సమాచారం మేడ మీద వాళ్లింట్లో, గోదావరి గట్టున ఆయన సంస్కృత, తెలుగు కావ్యానందమనే మృష్టాన్నభోజనం చేస్తూ మధ్యలో ఒక్కొక్క ముద్ద నా చేతుల్లో కూడా పెట్టేవారు. ఆ రుచి ఎట్లాంటిదంటే, ఆ తర్వాత నాకు సాహిత్యంలో మరెవ్వరినీ గురువులనుకోవడానికి మనసొప్పలేదు. మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి యానాం దగ్గర పల్లిపాలెంలో పుట్టారు. వాళ్ల నాన్నగారు మధునాపంతుల సత్యనారాయణమూర్తి అక్కడ నుంచి ‘ఆంధ్రి’ అనే పత్రిక నడిపారు. ఇరవయ్యవ శతాబ్ది ప్రారంభంలో తెలుగులో నవ్యకవిత్వం, నవ్య సాహిత్య చైతన్యం అంకురించిన వేళలకి పల్లిపాలెం సాక్షి అని సాక్షాత్తూ తిరుపతి వెంకట కవులే గొంతెత్తి మరీ చెప్పారు. అటువంటి నేపథ్యం నుంచి వచ్చిన మధునాపంతుల ఆంధ్ర పురాణాన్ని రచించడంలో ఆశ్చర్యమేముంది? ఆంధ్రుల చరిత్రని పురాణంగా చెప్పవచ్చనే ఆ ఒక్క ఆలోచనతో ఆయన విశ్వనాథ సత్యనారాయణని కూడా దాటిపోయారనిపిస్తుంది. ఆర్.ఎస్.సుదర్శనంగారు పుట్టింది మదనపల్లిలో. ఉద్యోగరీత్యా అయిదారేళ్లపాటు రాజమండ్రిలో ఉన్నారు. కాని ఆ ఊరితో ఆజన్మబంధం పెనవేసుకున్నారు. ఆయన వల్లనే రాజమండ్రి సాహిత్య చర్చల్లో అస్తిత్వ వాదం, ఫ్రాయిడ్, యూంగ్, సార్త్రే, కిర్క్ గార్డ్, పాల్ టిల్లిచ్ ప్రవేశించారు. ఆయన వల్లనే రమణమహర్షి, కృష్ణమూర్తి, ‘ద డాన్స్ ఆఫ్ ఊలీమాష్టర్’ల గురించి మేం తెలుసుకోగలిగాం. ఆయన్నొక సారి షేక్స్పియర్ నాటకాలు చెప్పమని అడిగాం. మాకోసం ఆయన నాలుగైదు రోజులపాటు గౌతమీ గ్రంథాలయంలో హేమ్లెట్ నాటకం పాఠం చెప్పారు. ఆ చెప్పిన విధానం ఎటువంటిదంటే, ఆ తర్వాత షేక్స్పియర్ నాటకాలు చదువుకోవడానికి నాకు మరెవ్వరి సహాయమూ అవసరం లేకపోయింది. గురజాడ కళాసమితి దర్శకుడు, రూపక ప్రయోక్త టి.జె.రామనాథంతో నా సాహచర్యం ఎంత విలువైందో నేను రాజమండ్రి వదిలిపెట్టిన తర్వాతనే నాకు మరింత స్పష్టంగా తెలిసొచ్చింది. ఆయన్ను రాజమండ్రి పత్రికలు ‘జనరంజక రూపకర్త’ అని పిలిచేవి. ప్రజల అభిరుచి స్థాయికి తాను దిగకుండా కళాఖండాల్ని సృష్టించిన బి.ఎన్.రెడ్డిలాగా కాకుండా పండిత పామర రంజకంగా కళాసృష్టి చేసిన కె.వి.రెడ్డి లాంటి దర్శకుడు రామనాథమని మా మహేష్ ఎప్పుడూ అంటూండేవాడు. ఇరవయ్యేళ్ల వయసులో ఆయన నాతో ‘స్వాతంత్రోద్యమ శంఖారావం’ అనే డాక్యుమెంటరీ రూపకం రాయించాడు. ఆ రూపకం రిహార్సల్స్ కోసం ప్రతి రాత్రీ ధవళేశ్వరంలో గడిపి తెల్లవారాక రాజమండ్రి రావడం ఒక అనుభవం. నాకే కాదు, అందులో గాంధీగా నటించిన ప్రసిద్ధ కవి వసీరాకీ, నెహ్రూగా నటించిన ప్రసిద్ధ రాజకీయ నాయకుడు ఉండవల్లి అరుణకుమార్కీ మరెందరికో కూడా. సావిత్రిగారిది కూడా రాజమండ్రి కాదు, ఆమె పుట్టింది పశ్చిమగోదావరి జిల్లాలో. కాని ఆమె రాజమండ్రి సావిత్రిగా తెలుగులో మొదటి మిలిటెంటు ఫెమినిస్టుగా గుర్తింపు పొందింది. ఆమె హేతువాది, కమ్యూనిస్టు, ఫెమినిస్టు నిజమే కాని, అన్నిటికన్నా ముందు ఆమె నిజమైన మనిషి. ఒకసారి ఆమెను అకారణంగా అరెస్టుచేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు. వారం రోజులో, రెండు వారాలో ఉన్నదనుకుంటాను. ఆ కొద్దిరోజుల్లోనే ఆమె అక్కడి డిటెన్యూలకి చింగిజ్ అయిత్ మాతొవ్ ‘తల్లిభూదేవి’ నవల మొత్తం చదివి వినిపించింది. అందరూ సమాచారం సుబ్రహ్మణ్యంగా ఎంతో ఆత్మీయంగా పిలుచుకునే సుబ్రహ్మణ్యం గోదావరి సంస్కృతికి నిజమైన ప్రతినిధి. రాజమండ్రి ఆత్మ అతడికి తెలుసు. చిన్నపత్రికల సంపాదకుల్లో అత్యుత్తమ సంపాదకుడిగా చాలా చిన్నవయసులోనే ప్రధానమంత్రి నుంచి సత్కారం పొందినవాడు. కాని అతణ్ని నేను కేవలం పాత్రికేయుడిగా చూడలేను. అతడు నాలాంటివాళ్లందరికీ తండ్రి, సోదరుడు, మిత్రుడు. కవులూరి గోపీచంద్‌ది ఏలూరు. వాళ్ల నాన్నగారు కవులూరి వెంకటేశ్వరరావు గారు చాలాకాలం విశాలాంధ్రలో పనిచేశారు. ఆయన వల్ల గోపీచంద్ చిన్నవయసులోనే మార్క్స్‌ని, ఎంగెల్స్‌ని, లెనిన్ని చదువుకున్నాడు. తండ్రి రాయిస్టు కావడం వల్ల ఎం.ఎన్.రాయ్‌ని కూడా చదివాడు. చాలాకాలం పాటు రాజమండ్రి పేపర్ మిల్లులో, ఆ తర్వాత ఒరిస్సాలో జె.కె.పేపర్ మిల్లులోనూ కెమిస్టుగా పనిచేశాడు. ముప్ఫై ఏళ్ల వయసులో భార్యని, పిల్లవాణ్ని వదిలిపెట్టి జీవిత సత్యం వెతుక్కుంటూ ఇల్లు విడిచి వెళ్లిపోయాడు. ఇప్పటికీ అతడి ఆచూకీ తెలియదు. కాని అతడితో ఒక్కసారి మాట్లాడినవాళ్లు కూడా ఇప్పటికీ అతణ్ని గుర్తుచేసుకుంటూనే ఉంటారు. తన సాహచర్యంతో అతడు నన్ను తీర్చిదిద్దాడని చెప్పవచ్చు. అతడి వల్లనే నేను తత్త్వశాస్త్ర విద్యార్థిగా మారేను. మేమందరం మహేష్‌గా పిలుచుకునే చక్రాల వెంకట సుబ్బమహేశ్వర్ గోదావరి జిల్లావాడు కాడు. కాని పేపర్ మిల్లులో సేఫ్టీ ఆఫీసరుగా పనిచేసేవాడు. మా బృందంలోనే మా మిత్రురాలు శకుంతలని పెళ్లి చేసుకుని తర్వాత రోజుల్లో శ్రీహరికోట వెళ్లిపోయినదాకా మహేష్, రాజమండ్రితో విడదీయలేనంత అనుబంధం పెంచుకున్నాడు. గర్భగుళ్లో దేవుడికి హారతిస్తూ అర్చామూర్తిని పరిచయం చేస్తారే, అట్లా మహేష్ రాజమండ్రికి పట్టిన హారతి లాంటివాడు. ఆ వెలుగులోనే నేను రాజమండ్రినీ, గోదావరినీ పోల్చుకున్నాను.అతడి వల్లనే నాకు వీరేశలింగం, చిలకమర్తి, టంగుటూరి ప్రకాశం, గరిమెళ్ల వంటివారు అర్థమయ్యారు. ఎన్ని సాయంకాలాలు, ఎన్ని రాత్రులు, ఎన్ని ఎడతెగని చర్చలు! కవిత్వం, తత్త్వశాస్త్రం, కళాసృజనకి పరిమితమైన మా బృందంలో సంగీతాన్ని పట్టుకొచ్చినవాడు వంక బాలసుబ్రహ్మణ్యం. అతడి సాహిత్య పరిచయం, పరిజ్ఞానం తక్కువేమీ కాదు. ఆయన ప్రేరణ వల్లనే నేనూ, గోపీచంద్ కలిసి రాజమండ్రి రీడర్స్ క్లబ్ ఏర్పాటు చేశాం కూడా. ఒక వేసవిలో రెండువారాల పాటు సాహిత్య, సామాజిక శాస్త్ర తరగతులు కూడా నడిపాం. కాని సంగీతాన్ని ఎట్లా వినాలో, ఎట్లా ప్రశంసించాలో బాలసుబ్రహ్మణ్యమే మాకు నేర్పాడు. ఆ గోదావరి గట్టుమీద పాత టేప్రికార్డరొకటి పట్టుకొచ్చి, ఈ రోజు మీకు హేమంత కుమార్‌ని పరిచయం చేస్తాననేవాడు. పాట గురించి, ట్యూన్ గురించి, రాగం గురించి, అందులోని భావం గురించి, ఔచిత్యం గురించి సుదీర్ఘంగా చెప్పేక, అప్పుడు ఆన్ బటన్ నొక్కగానే ‘ఏ నయన్ డరే డరే...’ అని వినబడగానే మాకళ్లముందొక అతిలోక స్వాప్నిక ప్రపంచం తలుపులు తెరుచుకునేది. రాళ్లబండి కవితాప్రసాద్ నా రాజమండ్రి మిత్రుడు కాడు. కాని నాకు గోదావరి మిత్రుడు. నేను రాజమండ్రిలో గోదావరిని ఉపాసిస్తున్నప్పుడు అతడు భద్రాచలంలో గోదావరిని ఉపాసిస్తున్నాడు. తర్వాత రోజుల్లో గోదావరికీ, సాహిత్య స్నేహాలకీ ఎంతో దూరంగా, ప్రభుత్వోద్యోగులుగా మేం జీవించవలసివచ్చినప్పుడు గోదావరి సాక్షిగ మేం మళ్లా ఆ స్వప్న ప్రపంచంలోకి ప్రయాణించాలని కలలుగనేవాళ్లం. ఈ ఏడాదో, వచ్చే ఏడాదో వాలంటరీ రిటైర్మెంటు తీసుకుందామని, అప్పుడు మళ్లా ఆంధ్ర దేశమంతా తిరుగుతూ సాహిత్యం గురించి మాట్లాడుతూ దేశాన్ని జాగృతం చేద్దామని ఎన్నెన్నో ఊసులాడుకునేవాళ్లం, ఊహలు పంచుకునేవాళ్లం. నా జీవితంలో నేను కొండల్లో పుట్టాను, అడవుల్లో తిరిగాను, నగరంలో గడుపుతున్నాను. కాని నది ఒడ్డున జీవించిన అనుభవం అద్వితీయం. ఆ నది గోదావరి కావడం నా అదృష్టం. ఏరీ ఆ సన్మిత్రులు? నన్నిక్కడ వదిలేసి ఎక్కడకు వెళ్లిపోయారు? మా మాష్టారు శరభయ్యగారు ఒక పద్యంలో రాసుకున్నట్టుగా ‘తలప ధరణి బ్రదుకె దాగిలిమూతయో! వారలెందొ! కానరారు మరల’. ఇప్పుడు మిగిలిందల్లా అక్కడ గోదావరి నీళ్లు, ఇక్కడ నా కన్నీళ్లు.