హేమంతం నుంచి హేమంతం దాకా | opinion on new year by Poet Vadrevu China Veerabhadrudu | Sakshi
Sakshi News home page

హేమంతం నుంచి హేమంతం దాకా

Published Mon, Jan 2 2017 12:19 AM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM

హేమంతం నుంచి హేమంతం దాకా - Sakshi

హేమంతం నుంచి హేమంతం దాకా

∙ఒక చదువరి అంతరంగం

అనేక వైరుధ్యాల మధ్య, అనేక కర్తవ్యాల మధ్య, స్పష్టంగా బోధపడని మంచిచెడుల మధ్య ఆత్మికంగానూ, నైతికంగానూ తోడు నిలబడేది సాహిత్యమొక్కటే.

1 ఒక సంవత్సరం గడిచిపోయింది. కొత్త సంవత్సరం ప్రవేశించింది. హేమంతం నుంచి హేమంతం దాకా గడిచిన కాలమంతా ఎన్నో అనుభవాలు, ఎన్నో ప్రయాణాలు, ఎన్నో కలయికలు, వియోగాలు. కాని నిజంగా నాకు సన్నిహితంగా ఉన్నది సాహిత్యమొక్కటే. ఇన్నేళ్ళు గడిచినా, బహుశా, జీవించడమెట్లానో నాకిప్పటికీ తెలియలేదనే అనుకుంటాను. అనేక వైరుధ్యాల మధ్య, అనేక కర్తవ్యాల మధ్య, స్పష్టంగా బోధపడని మంచిచెడుల మధ్య ఆత్మికంగానూ, నైతికంగానూ తోడు నిలబడేది సాహిత్యమొక్కటే. అందుకనే, ‘ద బెస్ట్‌ అమెరికన్‌ పొయెట్రీ 2016’ సంకలనకర్త ఎడ్వర్డ్‌ హిర్‌ equipment for living అన్నాడు. జీవించడానికి ఊతమిచ్చే సాధనసంపత్తి, నా వరకూ, నిస్సందేహంగా, సాహిత్యమే.

2 ఈ ఏడాది పొడుగునా నన్ను అంటిపెట్టుకున్న కవి కబీరు. ఆయన రాసిన కవిత్వమూ, ఆయన మీద వచ్చిన పరిశీలనలూ, పరిశోధనలూ విస్తారంగా చదివాను. కబీరు నన్ను గాఢంగా ఆకట్టుకోవడానికి కారణం, ఆయన కూడా ఆత్మలో స్వాతంత్య్రం పొందడానికి కావలసిన సాధనసంపత్తి కోసం సాహిత్యం వైపే చూశాడు. ఆయన జీవించిన 15వ శతాబ్దపు భారతదేశానికీ, మనం జీవిస్తున్న ఇప్పటి భారతదేశానికీ ప్రాయికంగా ఏమీ తేడా లేదు. అదే డంబాచారం, అదే ఆత్మవంచన, అదే పరపీడన. ముఖ్యంగా సమాన హృదయధర్మం కలిగిన మనుషుల కోసం అన్వేషణ. వాళ్ళు దొరకడం లేదనే తపన. ‘నన్ను నేనర్పించుకుందామంటే ఒక్కడూ కనబడలేదు/ లోకమంతా ఎవరి చితుల్లో వాళ్ళు దగ్ధమవుతున్నారు’ అంటాడు.

3 అనంతపురం వెళ్ళినప్పుడు, కదిరి ప్రాంతంలో ఒక గిరిజన తండాను వెతుక్కుంటూ వెళ్తుండగా, ఎవరో ‘ఇక్కడే కటారుపల్లె, వేమన సమాధి చూసారా?’ అనడిగారు. మాఘమాసపు వేపచెట్ల నడుమ, అప్పుడే నీళ్ళు పోసుకుంటున్నట్టున్న రావిచెట్ల మధ్య నేను మొదటిసారి ప్రయాణిస్తున్న బాటలో కటారుపల్లెలో అడుగుపెట్టాను. ఆ ఊరు మొదటిసారి చూసినప్పుడు కాంప్‌బెల్‌ ఎట్లా వర్ణించాడో ఇప్పటికీ అలానే ఉంది. అక్కడొక పెద్ద మెమోరియల్‌ హాల్, ఎన్ని శతాబ్దాలుగానో వేమన సమాధిగా పిలవబడుతున్న చిన్న సమాధి మందిరమొకటి ఉంది. ఆ సమాధి మందిరం చుట్టూ నాలుగువైపులా ఒక స్మృతిప్రాంగణం, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్‌ వారు నిర్మించింది ఉంది. ఆ ప్రాంగణంలో నాలుగువైపులా గోడల మీద సుమారు 120 వేమన పద్యాలు చెక్కి వున్నాయి.

ఆ ప్రాంగణం, పద్యాలు తాపడం చేసిన ఆ గోడలు, ఆ పద్యాల్లోని సారళ్యాన్నీ, విరాళాన్నీ స్ఫురింప చేస్తున్నట్టుగా ఆ గచ్చుమీద ధారాళంగా పరుచుకున్న ఉదయ సూర్యకాంతీ నన్ను విభ్రాంతికి గురిచేసాయి. ఇట్లాంటి ఒక మందిరమిక్కడ నిర్మించారని తెలుగువారికి ఎంతమందికి తెలుసు? జర్మనీకి ఒక గొథే, ఇంగ్లీషుకి ఒక షేక్‌స్పియర్, మరాఠీలకి ఒక జ్ఞానేశ్వరుడు, తమిళులకి ఒక తిరువళ్ళువర్, బెంగాలీలకి ఒక టాగోర్‌  ఎట్లానో తెలుగువాళ్ళకి ఒక వేమన అట్లా కదా! కాని ఫ్రాంక్‌ఫర్ట్, స్ట్రాట్‌ఫర్డ్‌ అట్‌ ఏవన్, అలండి, తిరునాయనార్‌ కురిచ్చి, జొరసంకొల్లాగా తెలుగువాళ్ళ సాహిత్య తీర్థక్షేత్రమేది? ఆ ప్రాంగణం నిజానికి ఒక ప్రపంచ స్థాయి సాహిత్య సభ, తాత్త్విక చింతనా శిబిరాలు జరగవలసిన ప్రాంగణం. సమాజం మరింత శుభ్రపడాలని కోరుకునేవాళ్ళు ఇక్కణ్ణుంచి ఊరేగింపుగా తమ సామాజిక ఉద్యమాలు మొదలుపెట్టవలసిన ప్రాంగణం. తెలుగునేల మీద కవిత్వం చెప్తున్న ప్రతి ఒక్క కవీ జీవితకాలంలో ఒక్కసారైనా సందర్శించవలసిన దీక్షాభూమి.

4 గడచిన ఏడాది షేక్‌స్పియర్‌ 400వ వర్ధంతి సంవత్సరం. సాహిత్యాన్ని లిరిక్, ఎపిక్, డ్రామాలుగా విభజించాడు అరిస్టాటిల్‌. కవి గొంతు మాత్రమే వినిపించేది లిరిక్‌ అనీ, పాత్రలు మాత్రమే మాట్లాడుకునేది డ్రామా అనీ, కవీ,పాత్రలూ కూడా మాట్లాడేది ఎపిక్‌ అనీ ఆయన నిర్వచించాడు. ఈ వర్గీకరణ ఎంత అర్థవంతమో అంత  అర్థరహితమని కూడా పోర్చుగీసు కవి పెసావో విమర్శించాడు. ఎందుకంటే, గొప్ప కవిత్వంలో ఏకకాలంలో, కవి గొంతు, పాత్రల గొంతూ, కవీ పాత్రలూ కలగలిసి కూడా వినిపిస్తారని ఎడ్వర్డ్‌ హిర్‌‡్ష ఒకచోట రాసాడు. బహుశా షేక్‌స్పియర్‌ విశిష్టత ఇదే అనుకుంటాను. ఆయన ఒక పాత్ర చెప్పుకున్న స్వగతంలో కూడా ఒక యుగం సంక్షోభమంతా చూపించగలడు. ఆయన కవిత్వ శైలిలో లిరిక్, ఎపిక్, డ్రామా మూడూ విడదీయలేనంతగా పెనవైచుకుపోయి ఉంటాయి. షేక్‌స్పియర్‌ను చదవగలడం ఈ జీవితంలో నాకు లభించిన గొప్ప వరాల్లో ఒకటనుకుంటాను. మన చుట్టూ ఉన్న దైనందిన ప్రాపంచిక జీవితాన్ని గొప్ప సాహిత్యంగా ఎట్లా మార్చుకోవచ్చో, ఆయన రాసిన ఒక్క వాక్యం కూడా అమేయమైన స్ఫురణని అందించ గలుగుతుంది.

5 రాత్రి వానకి తడిసిన అడివి,
ఏదో చెప్పాలని కంపిస్తున్నది:
కోకిల కూత.
వేసవి ఋతుపవన మేఘంగా కరిగిపోయే కాలమంతా మా ఊళ్ళో, అడవిమధ్య, కొండలెక్కుతూ, కాలిబాటల్లో పూల గుసగుసలు వింటూ, బొమ్మలు వేసుకుంటూ గడిపేను. మా ఊళ్ళో జెండాకొండ ఎక్కినప్పుడు, ఆ సుకుమార క్షణాల్ని హైకూలుగా పిండి వడగట్టేను.
కొండకింద లోయలో అదే పల్లె:
లేనివల్లా
మా అమ్మ, మా ఇల్లు.

6 గొథే తొలిరోజుల్లో రాసిన నవల ‘ద సారోస్‌ ఆఫ్‌ యంగ్‌ వెర్థర్‌ ’(1774) చదివాను. ఆయన జీవితకాలంపాటు రాస్తూ వచ్చిన ఫౌస్ట్‌ నాటకాన్ని నా తొలిరోజుల్లో చదివాను. ఆయన తొలిరోజుల్లో రాసిన ఈ మహామోహమయ రచన ఇప్పుడు చదివాను. జర్మన్‌ రొమాంటిసిజం ఉ«ధృతంగా ఉన్న రోజుల్లో రాసిన ఈ నవల యూరోప్‌ నంతటినీ ఒక జ్వరంలాగా చుట్టబెట్టింది. నవల పూర్తి చేసాక కూడా నన్నొకటే ఆలోచన వెంటాడుతూ ఉంది. ఏదో ఒక అంశాన్ని, ప్రేమనో, మోహమో, ఇన్‌ ఫాచ్యుయేషనో ఏదో ఒకదాన్ని ఇంత గాఢంగా, ఇంత తీవ్రంగా, ఇంత జీవన్మరణతుల్యంగా కోరుకునే మన:స్థితి ఇప్పుడెక్కడైనా కనిపిస్తుందా? బహుశా, చలంగారి తర్వాత, ఇంత తదేకంగా, ఇంత మమేకంగా జీవితం వెంటపడ్డ మనుషులు గాని, రచయితలు గాని మనకెక్కడైనా కనిపిస్తున్నారా?

7 బాబ్‌ డిలాన్‌కి నోబెల్‌ పురస్కారం ప్రకటించినప్పుడు మరోమారు ఈ సంగతే స్పష్టమైంది. సాహిత్యం జీవన సాధనసంపత్తిగా మారిపోయిన కవులింకా మనమధ్య ఉన్నారని. అసీరియన్, ఈజిప్టియన్‌ మహాసంస్కృతుల్లో ఏ ఒక్కదానికీ  చెందక తమ సర్వేశ్వరుణ్ణే తాము నమ్ముకుంటూ తమ నమ్మకం కోసం తమ జీవితాల్ని తృణప్రాయంగా త్యాగం చెయ్యగలిగిన యూదు ప్రవక్తల్లాగా జీవిస్తున్న కవులింకా ఈ ప్రపంచంలో లేకపోలేదు. తమ విధేయతను శాసించే, కొనుగోలు చెయ్యాలనుకునే విరుద్ధ శక్తులమధ్య, ఏ ఒక్కదానికీ చెందక, తమ ఒంటరి కాలిబాటన తాము సాగిపోయే కవులకి డిలాన్‌ మనకాలం ప్రతినిధి, మనకాలం వీరుడు.

8 కొత్త సంవత్సరంలో చదవలవసినవీ, పారాయణం చెయ్యవలసినవీ మరెన్నో పుస్తకాలున్నాయి. పంచుకోవలసినవీ, పాడుకోవలసినవీ మరెన్నో పాటలున్నాయి. ఒక మనిషి తన అత్యంత బలహీన క్షణాల్ని గుర్తుపట్టడం ద్వారానే బలోపేతుడవుతాడు. తన మానవత్వాన్ని నిలుపుకోవడం కోసమే కవిగా, కథకుడిగా మారతాడు. అరేబియన్‌ రాత్రుల కథల్లో షహ్రాజాద్‌ లాగా మృత్యువును మరొక్కరోజు వాయిదా వేయడం కోసమే ప్రతి రాత్రీ ఒక కొత్త కథ అల్లుకుంటాడు. గడపలో అడుగుపెట్టిన ప్రతి కొత్త రోజునూ అజరామరం చెయ్యడంకోసం ఒక పూర్వకవిని తలుచుకుంటాడు, ఒక కొత్త రూపకానికి తెరతీస్తాడు. నేనూ ఇంతే.




(రచయిత : వాడ్రేవు చినవీరభద్రుడు 9490957129 )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement