'ఉచితం తాయిలం'తో దేశంపై దాడి! | opinion on new year agenda by shekhar gupta | Sakshi
Sakshi News home page

'ఉచితం తాయిలం'తో దేశంపై దాడి!

Published Sat, Jan 2 2016 8:45 AM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM

'ఉచితం తాయిలం'తో దేశంపై దాడి! - Sakshi

'ఉచితం తాయిలం'తో దేశంపై దాడి!

దేశం సమస్యల రాజకీయాల నుంచి ఆకాంక్షల రాజకీయాల దిశగా పయనిస్తోంది. వాతావరణ మార్పులు, పర్యావరణం వంటివి కీలక ఎజెండాలో చేరుతున్నాయి. డేటా చార్జీలతో పాటు కాల్-డ్రాప్స్ పెరిగిపోవడమనే సమస్య కూడా ద్రవ్యోల్బణం లాగే  జీవన నాణ్యతకు సంబంధించిన సమస్యగా మారింది. కాబట్టే జుకెర్‌బర్గ్ ‘‘ఉచితం తాయిలం’’తో మన దేశంపై దాడికి దిగాడు. ఇంటర్నెట్ ప్రజాస్వామ్యం గురించి ఆందోళనచెందే దేశం, ప్రభుత్వ ప్రైవేటు రంగాల వైద్య సేవల నాణ్యతను ప్రశ్నించే రోజు ఎంతో దూరంలో లేదు.
 
డిసెంబర్ 31కి జనవరి 1కి మధ్య రాజకీయ చర్చ దిశను మార్చేటంతటి గొప్ప మార్పేమీ జరిగిపోదు. కాకపోతే కొత్త సంవత్సరం ప్రారంభం కావడం కాస్త విశ్రాంతిగా భవిత వేపు దృష్టిని సారించడానికి తగ్గ సాకును అంది స్తుంది. 2016లోకి అడుగు పెడుతుండగా వార్తా పత్రికల పేజీల్లో, వార్తా చానళ్ల ప్రైమ్‌టైమ్ చర్చల్లో ప్రముఖంగా కనిపించిన అంశాలతో ప్రారంభిద్దాం. ఢిల్లీ కార్లకు సరి-బేసి సంఖ్యల పరిమితి విధింపు పథకం వాటన్నిటిలోకీ అతి పెద్ద కథనం. కార్లకు, జనాభాకు మధ్య నిష్పత్తి అధ్వానంగా ఉన్న మన దేశ సామాజిక-వ్యవసాయక పద్ధతులకూ, మన నగరాల కాలుష్య మేఘాల సంక్షోభానికి మూల కారణమైన ఇంధన విధానాల వక్రీకరణలకూ ఈ బ్యాండ్ ఎయిడ్   శాశ్వత పరిష్కారం ఎలా అవుతుందని శంకించేవారిలో నేనూ ఒకడిని. అయితే ఈ పథకానికి విస్తృతమైన ప్రజా మద్దతు లభించింది. మనం పీల్చే గాలి నాణ్యత ఇప్పుడు మనల్ని వేధిస్తున్న ప్రధాన సమస్యలలో  మొదటిగా మారింది.

ఇక ఆ తదుపరిది, ‘నెట్-న్యూట్రాలిటీ’ (అందరికీ సమాన అవకాశాలు లభించేలా ఇంటర్నెట్‌ను తటస్థంగా ఉంచడం). ఆకాశం గురించిన ఒకప్పటి మన అవగాహనను బట్టి మనం ఈ చర్చను ఏదో కొందరు మేధావులకు సంబంధించినదిగా భావించేవాళ్లం. వారం రోజుల పాటూ ఫేస్‌బుక్ ‘ఫ్రీ బేసిక్స్ ఆఫర్’ పత్రికల మొదటి  పేజీల్లో కనబడ్డాక అదీ చర్చనీయాంశమైంది. పార్టీ రాజకీయాలను, అస్తిత్వ సమస్యలను, మౌలిక అవసరాలనే అతిగా పట్టుకువేలాడే సమాజంలో... విచ్ఛిన్నకరమైన కొత్త ఉచిత ఇంటర్నెట్ సేవ  ‘‘అమ్మకం’’ కోసం వంద  కోట్లు
ఖర్చు పెడతారని ఎన్నడైనా ఊహించారా?

 కొత్త ఏడాదైతే మాత్రం ఇదేం పిచ్చి?
 భారతదేశానికేమైనా వెర్రి పట్టిందా? మరో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నంత మాత్రాన గాలి నాణ్యత, ఇంటర్నెట్ ప్రజాస్వామ్యం మన అతి ప్రధాన సమస్యలలో చేరిపోతాయా? తిండి, బట్ట, గూడూ, కులం, మతం, భాషా, విద్యుత్తు, రోడ్లు, విద్యా, అవినీతి, చెడ్డ పరిపాలనా ఇక వెనక్కు పోయినట్టేనా, ఏమిటీ? అవేమీ వెనక్కుపోలేదు. కాకపోతే గతంలో మనం, అవకాశాలతో కూడిన భవిత కోసం మనుగడకు సంబంధించిన సమస్యల బరువు కింద నలిగిపోతూ ఉండేవాళ్లం. ఆ బరువును తప్పించుకుని బయట పడేసరికి మన రాజకీయ సమస్యలు కూడా విలువ నిచ్చెనపైకి ఎగబాకాయి.

ఇలాంటి విషయాలను గట్టిగా ప్రస్తావించనప్పుడల్లా,  క్షామం తాండ వమాడుతున్న బుందేల్‌ఖండ్‌లో రైతులు గడ్డి తిని బతకాల్సివస్తోందనే నివేది కలతో లేదా రైతు ఆత్మహత్యలతో ప్రతిఘటించేవారు. మన దేశం సమస్యల రాజకీయాల నుంచి ఆకాంక్షల రాజకీయాల దిశగా పయనిస్తోందనే నా విశ్వా సాన్ని 2009లో వెలిబుచ్చినప్పుడు కూడా నేను అలాంటి వాదనలనే ఎదుర్కో వాల్సి వచ్చింది. మంచి నాణ్యతగల గాలి, ఇంటర్నెట్ ప్రజాస్వామ్యం ఆ కొత్త  కోరిక దిశగా వేసిన తార్కికమైన ముందడుగు మాత్రమే. బహుశా ఆ తర్వాత ఆహార నాణ్యతే కావచ్చు.

వాతావరణ మార్పుల సమస్య కూడా రెండేళ్ల క్రితం వరకు కొందరు మేధావుల చర్చే. కానీ, ఆ సమస్య గురించిన అవగాహన పెరగడంతో, మీడియా, ఇంటర్నెట్ కనెక్షన్ల విస్తరణతో నేడా పరిస్థితి మారింది. మన నగర వాసులకు లాగే రైతులకు, జాలర్లకు కూడా వాతావరణ మార్పుల దుష్ర్ప భావం అనుభవంలోకి వస్తోంది. చె న్నై మన తాజా అనుభవం. పంజాబ్‌లో పత్తి పంట ఈ ఏడాది తెల్ల దోమ కాటుకు గురైంది. వానలు ఆలస్యం కావ డం, అరకొరగా మాత్రమే కురవడం వల్ల పంటకు పంటకు మధ్య వారాల తరబడి నిలిచిన నీటిలో తెల్లదోమ లార్వాలు నానిపోయి చనిపోయే అవ కాశం రైతులకు లేకుండా పోయింది.

గత 110 ఏళ్లలో మొదటిసారిగా మనం వరుసగా రెండేళ్లు రుతుపవనాల వైఫల్యాన్ని ఎదుర్కొన్నామని మన వ్యవసాయ శాస్త్రవేత్తలందరిలోకీ అగ్రగణ్యుడైన అశోక్ గులాతి తెలిపారు. మూడో ఏడాది అలా జరగకపోవచ్చని అంటూనే ఆయన సందిగ్ధంతో ‘‘చెన్నై లో ఏం జరిగిందో చూశాక, ఏం జరుగుతుందో ఎవరికి మాత్రం ఏం తెలుసు?’’ అన్నారు. చేపలు దొరికే ప్రాంతాలు కదలిపోవడాన్ని జాలర్లు గమనించారు. గుజరాత్ తీరంలోని మన జాలర్లు తరచూ పాకిస్తాన్ జలాల్లో పట్టుబడుతుం డటానికి ఇది కూడా ఒక కారణం. కొరమీను చేపలు పెద్ద తుట్టెల్లా గుంపుగా ఈదులాడే ప్రాంతాలు మారిపోవడంతో మన జాలర్లు మరింత సుదూరాలకు పోక తప్పడం లేదు. గాలి నాణ్యత గురించి నగరవాసులం ఇప్పుడిప్పుడే జాగృతమవుతున్నట్టే జాలర్లు కూడా ఈ ప్రకృతి శాపానికి కొంతవరకు మనిషే కారణమని అర్థం చేసుకుంటున్నారు.

 నేటి రాజకీయాలకు కొత్త చేర్పులు
 మనది విశిష్టమైన పెద్ద ప్రజాస్వామ్య దేశం. అతి తీవ్రవాద, లుడ్డైట్ (యంత్ర విధ్వంసక) వామపక్షవాదుల నుంచి కాషాయ మితవాదుల వరకు అంతా ఇక్కడ ఉన్నారు. కానీ వాతావరణ మార్పుల ఉపద్రవాన్ని కాదనేవారు మాత్రం వారిలో ఎవరూ లే రు. అందువలన వాతావరణ మార్పులు, పర్యావ రణం, గాలి నాణ్యత మన రాజకీయాల కీలక ఎజెండాలోకి వచ్చి చేరుతు న్నాయి. మన ప్రభుత్వాలు తమ విధానాలను మార్చుకునే స్థితికి అవి నెడ తాయి. ఉదాహరణకు, కేంద్రం మన వాయు, జల వనరుల పరిరక్షణకు పూనుకోవడం అనివార్యం. కాబట్టి విద్యుత్తు, ఇంధన ధరలకు సంబంధిం చిన సంస్కరణలను అది ఇకనెంత మాత్రమూ వాయిదా వేయలేదు. రైతు లకు ఉచిత విద్యుత్తు లభించినట్టయితే, కరెంటు రోజుకు ఆరు గంటలే, అదీ ఎవరికీ తెలీని ఏ అర్ధరాత్రో లభిస్తుంది. దీంతో పలువురు రైతులు తమ బోరు బావుల మోటర్ల స్విచ్‌లను ఆన్ చేసి ఉంచేస్తున్నారు. నరేంద్ర మోదీ తన ప్రభుత్వంలోని వ్యవసాయ మంత్రిత్వ శాఖను ఆర్‌ఎస్‌ఎస్ చెప్పినవారికే ఇవ్వక తప్పలేదు.

ఆవు పేడ, మూత్రాలతో చేసే ‘‘జీవక్ ఖేతీ’’(సేంద్రియ వ్యవసాయం) అంటే ఆయనకు పిచ్చి వ్యామోహం. అయితే ఆయన సైతం ఆధునీకరణ చెందక తప్పదు. లేకపోతే రైతులు శిక్షిస్తారు. అందువలన, నేల లోని పోషక పదార్థాల అసంతులనాన్ని తిరిగి వెనక్కు మరల్చడం కోసం ఎరు వుల ధరల సంస్కరణలను చేపట్టాల్సిన, విత్తన పరిశోధన శృంఖలాలను తెంచాల్సిన తక్షణ అగత్యం వచ్చిపడింది. ఆ దిశగా చర్యలు చేపట్టే ప్రయ త్నాలను యూపీఏ హయాంలో వామపక్షాలు ఎంతగా అడ్డగించాయో అంత గానూ నేడు నాగపూర్ మితవాద పక్షం అడ్డగిస్తోంది.  మరింత సమర్థవంతం గా, వివేచనాయుతంగా భూమి, నీరు, గాలిని ఉపయోగించుకోవడం ఎలాగ నేది కూడా నేడు రాజకీయాలను ప్రభావితం చేసే ముఖ్యఅంశంగా మారింది.


 డిజిటల్ భారతాన్ని వాగ్దానం చేసేవారిలో నరేంద్ర మోదీ  ఒకరు. కానీ సాగుకు నీటి సదుపాయం ఎలాగో, డిజిటలైజేషన్‌కు కనెక్టివిటీ (ఇంటర్‌నెట్ లేదా సెల్‌ఫోన్ సిగ్నల్ అందడం లేదా అనుసంధానం కావడం) కూడా అలాం టిదే. బిహార్ ఎన్నికల్లో నితీష్ కుమార్ బీజేపీకి వ్యతిరేకంగా ప్రయోగించిన అతి శక్తివంతమైన అస్త్రం ‘కాల్-డ్రాప్స్’ (ఫోన్‌లో మాట్లాడుతుండగా సాంకేతిక కారణాలతో కనెక్షన్ తెగిపోవడం). దేశంలోనే అతి పేద రాష్ట్రంలో ఆ సమస్య గురించి మాట్లాడటం అంటే కేక్ గురించి మాట్లాడటమేనని పలువురు బీజేపీ నేతలు నవ్వేశారు. కానీ బిహార్‌లో కూడా చౌకగా దొరికే స్మార్ట్ ఫోన్లు, వాటితో పాటూ కనెక్టివిటీ తక్కువగా ఉండటమనే సమస్యా విస్తృతంగా వ్యాపించాయి. డేటా చార్జీలు పైపైకి ఎగబాకుతుండగా కాల్- డ్రాప్స్ పెరిగిపోతుండటం అనే సమస్య కూడా ద్రవ్యోల్బణంతోపాటూ నేడు జీవన నాణ్యతకు సంబంధించిన సమస్యగా మారింది. కాబట్టే జుకెర్‌బర్గ్ ‘‘ఉచితం తాయిలం’’తో మన దేశంపై దాడికి దిగాడు.
 మునుముందుకు సాగుతున్న ప్రజా చర్చ  

 గాలి, నీటి నాణ్యత గురించి ఇంటర్నెట్ ప్రజాస్వామ్యం గురించి ఆందోళన చెందే దేశం, ప్రభుత్వ ప్రైవేటు రంగాలు తమ నుంచి ధర వసూలుచేసి మరీ అందిస్తున్న వైద్య సేవల నాణ్యతను గురించి అడగడానికి ఎంతో కాలం పట్టదు. అలాగే క్షీణదశలో ఉన్న మన ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, ప్రమా ణాలు తక్కువగా ఉన్న ప్రైవేటు ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ కళాశాలలు మొత్తంగా ఒక తరం భారతీయులకు అందిస్తూ వస్తున్న విద్య నాణ్యతపై అసంతృప్తి కూడా త్వరలోనే పేరుకుపోతుంది. ఇంకా ముందుకు పోతే, మీ తల్లిదండ్రుల కష్టార్జితంతో మీరు సంపాదించుకున్న డిగ్రీ మిమ్మల్ని ఉద్యోగార్హత గల వారిగా చేయగలుగుతుందా, లేదా? అనేదే ఇకపై రాజకీయాలను, ఓటరు ఎంపిక అవకాశాలను శాసిస్తుంది. అంతేగానీ మెకాలే విద్యావిధానానికి అనుకూలమా? లేక వ్యతిరేకమా? లేదా ఔరంగజేబు క్రూరనియంతా లేక బాగా అపార్థానికి గురైన మొఘల్ చక్రవర్తా? అనేవి కావు. ఆహారానికి సంబంధించి కూడా గుణాత్మకమైన పెను మార్పులు హఠాత్తుగా చోటుచేసు కుంటున్నాయి. తిండిగింజల వినియోగం నిలకడగా ఉండగా, పప్పులు, మాంసం, పాలు, గుడ్లు, కూరగాయలు, పళ్లు వ గైరాల వినియోగం పెరుగు తోంది. ఎక్కువ మంది ప్రజలు మాంస కృత్తులూ, విటమిన్లు, ఖనిజాలతో కూడిన సూక్ష్మ పోషకపదార్థాలూ ఉన్న ఆహారాన్ని ఎంచుకుంటున్నారు. సురక్షితమైన, నాణ్యమైన ఆహారం ప్రజల ముఖ్య సమస్యగా మారుతోంది.

ఒక ఏడాది అంతా మన పార్లమెంటు స్తంభించిపోవడం విచారకరం. ఫలితంగా ప్రభుత్వం పనీ కొంత వరకు అలాగే అయింది. కానీ ప్రజా చర్చ మాత్రం ముందుకు సాగుతోంది, మార్పు చెందుతోంది. అవును, నేను మరోసారి చెబుతున్నాను ప్రజా చర్చ విలువ నిచ్చెనపైపైకి ఎగ బాకుతోంది. అందుకే బీజేపీ ఆవుపై శ్రద్ధ చూపిస్తుండటం ఓటర్లను మెప్పించలేక పోయింది.  ఇది కొంత  వరకు, మీరు ఎక్స్‌ప్రెస్ హైవేపై ఆగి ఉన్నప్పుడు రేర్ వ్యూ మిర్రర్‌లో నుంచి  వాహనాలు మీ మీదకు దూసు కొచ్చేస్తున్నట్టు కనిపించటం లాంటిదే. అందువలన ఇది మనం  కదిలి ముందుకు సాగాల్సిన సమయం. సమంజసమైన  ఈ కోరికే నా నూతన వర్ష కామన.

(వ్యాసకర్త: శేఖర్ గుప్తా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement