బేగం అఖ్తర్‌ / 1914–1974 : నిజమైన సూఫీ | Azadi Ka Amrit Mahotsav Indian singer Begum Akhtar | Sakshi
Sakshi News home page

బేగం అఖ్తర్‌ / 1914–1974 : నిజమైన సూఫీ

Published Fri, Jul 22 2022 10:22 AM | Last Updated on Fri, Jul 22 2022 1:55 PM

Azadi Ka Amrit Mahotsav Indian singer Begum Akhtar - Sakshi

భావ ప్రసారానికి సంగీతం ఒక శక్తిమంతమైన మార్గం అయితే, నా అభిప్రాయంలో అత్యంత సమర్థులైన భావ ప్రసారకులలో బేగం అఖ్తర్‌ ఒకరు. ఆమె స్వరాలను అంటిపెట్టుకుని ఒక అరుదైన ఆర్తి ప్రవహిస్తూ ఉంటుంది. ఆమె దాన్ని అపురూపంగా కాపాడుకుంటూ, సంగీతంపై తనదైన ముద్ర వేశారు. కవులు పాడే గజల్స్‌ను ఆమె శాస్త్రీయ సంగీత వేదిక మీదకు తెచ్చారు. శాస్త్రీయ సంగీతాన్ని సామాన్యుని చేరువలోకి తీసుకెళ్లిన ఖ్యాతి ఆమెదే. ఆమె గాన శైలిలోని కళాత్మకత ఒక్కటి చాలు ఆమెను అజరామరం చేయడానికి. పాట పరాకాష్టకు చేరే దాకా ఆ పరిపూర్ణత్వం కోసమే ఆమె ప్రాణం పెడతారు.

ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్‌లో 1914లో జన్మించిన అఖ్తర్‌ తన సంగీత శిక్షణను పాటియాలాకు చెందిన అత్తా అహ్మద్‌ ఖాన్‌ వద్ద ప్రారంభించారు. శాస్త్రీయ సంగీతమే కాక.. గజల్స్‌ భజనలు, టుమ్రీలు, దాద్రాలు మొదలైన రూపాలలో కూడా సంగీత సాధన చేశారు. నేను టుమ్రీ రాణి సిద్ధేశ్వరీ దేవి దగ్గర సంగీత శిక్షణ పొందేదాన్ని. ఒక రోజున అమ్మి, (అఖ్తర్‌ బేగంను నేను ఆప్యాయంగా పిలుచుకునే పేరు) దేవి వద్దకు వచ్చి ‘నాకు శిష్యురాలిగా తనను అప్పగించగలవా?’ అని నావైపు చూపిస్తూ అడిగారు. దేవి అందుకు అంగీకరించారు. అప్పుడు అమ్మి నన్ను తన శిష్యురాలిగా చేసుకున్నారు. అప్పటికప్పుడే ఆమె నాకు గండా బంద్‌ (దారం కట్టే) ఉత్సవాన్ని జరిపించారు. అప్పటి వరకు గండా బంద్‌ అంటే మగ విద్యార్థులకే పరిమితమైన లాంఛనం. కానీ, ఆ రోజున ఆ సంప్రదాయాన్ని అమ్మి ఛేదించారు.

ఆమె తన కాలానికి చాలా ముందున్న సంస్కర్త. తన శిష్యులను పైకి తీసుకురావడం అఖ్తర్‌కు చాలా ఇష్టం. ఆమె లౌకికవాది. జాతీయవాది కూడా. ఆమెకు పద్మశ్రీ లభించడంతో ప్రభుత్వం వద్ద ఆమెకు కొంత పలుకుబడి ఉంటుందని భావించిన కొందరు మౌల్వీలు ఆమె వద్దకు వచ్చారు. బారాబంకీలో తమ మసీదును హిందువులు ఆక్రమించుకున్నారని, దానిలో పూజలు చేస్తున్నారని, దానిని విడిపించడంలో తమకు ఆమె సహాయం చేయాలని విన్నవించుకున్నారు.

అమ్మి వారి మీద కేకలు వేయడం, వారు ఆమెను క్షమాపణ కోరడం నాకు ఆశ్చర్యం కలిగించింది. ‘‘వాళ్లు అక్కడ చేస్తున్నవి కూడా ప్రార్థనలే కదా, ఇంక తగాదా ఏమిటి?’’ అని మందలించారు. ఆమె రేడియోలో జాతీయ గీతం వినబడేటప్పుడు విధిగా లేచి నిలబడే దేశభక్తురాలు కూడా. కచ్చేరీ వేదిక మీద మీరు మరింత అందంగా కనబడతారు. ఇది ఎలా జరుగుతోంది.. అని ఒకసారి ఆమెను అడిగాను. ‘పాడేటప్పుడు నేను భగవంతుణ్ణి చూస్తూ ఉంటాను’’ అని ఆమె నాకు జవాబిచ్చారు. ఆమె నిజమైన సూఫీ.
– రీటా గంగూలీ, రంగస్థల నటి, గాయని, బేగం అఖ్తర్‌ శిష్యురాలు 

(చదవండి:  1997/2022 మల్టీప్లెక్స్‌ మయసభలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement