Sufi philosophy
-
బేగం అఖ్తర్ / 1914–1974 : నిజమైన సూఫీ
భావ ప్రసారానికి సంగీతం ఒక శక్తిమంతమైన మార్గం అయితే, నా అభిప్రాయంలో అత్యంత సమర్థులైన భావ ప్రసారకులలో బేగం అఖ్తర్ ఒకరు. ఆమె స్వరాలను అంటిపెట్టుకుని ఒక అరుదైన ఆర్తి ప్రవహిస్తూ ఉంటుంది. ఆమె దాన్ని అపురూపంగా కాపాడుకుంటూ, సంగీతంపై తనదైన ముద్ర వేశారు. కవులు పాడే గజల్స్‌ను ఆమె శాస్త్రీయ సంగీత వేదిక మీదకు తెచ్చారు. శాస్త్రీయ సంగీతాన్ని సామాన్యుని చేరువలోకి తీసుకెళ్లిన ఖ్యాతి ఆమెదే. ఆమె గాన శైలిలోని కళాత్మకత ఒక్కటి చాలు ఆమెను అజరామరం చేయడానికి. పాట పరాకాష్టకు చేరే దాకా ఆ పరిపూర్ణత్వం కోసమే ఆమె ప్రాణం పెడతారు. ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్‌లో 1914లో జన్మించిన అఖ్తర్ తన సంగీత శిక్షణను పాటియాలాకు చెందిన అత్తా అహ్మద్ ఖాన్ వద్ద ప్రారంభించారు. శాస్త్రీయ సంగీతమే కాక.. గజల్స్ భజనలు, టుమ్రీలు, దాద్రాలు మొదలైన రూపాలలో కూడా సంగీత సాధన చేశారు. నేను టుమ్రీ రాణి సిద్ధేశ్వరీ దేవి దగ్గర సంగీత శిక్షణ పొందేదాన్ని. ఒక రోజున అమ్మి, (అఖ్తర్ బేగంను నేను ఆప్యాయంగా పిలుచుకునే పేరు) దేవి వద్దకు వచ్చి ‘నాకు శిష్యురాలిగా తనను అప్పగించగలవా?’ అని నావైపు చూపిస్తూ అడిగారు. దేవి అందుకు అంగీకరించారు. అప్పుడు అమ్మి నన్ను తన శిష్యురాలిగా చేసుకున్నారు. అప్పటికప్పుడే ఆమె నాకు గండా బంద్ (దారం కట్టే) ఉత్సవాన్ని జరిపించారు. అప్పటి వరకు గండా బంద్ అంటే మగ విద్యార్థులకే పరిమితమైన లాంఛనం. కానీ, ఆ రోజున ఆ సంప్రదాయాన్ని అమ్మి ఛేదించారు. ఆమె తన కాలానికి చాలా ముందున్న సంస్కర్త. తన శిష్యులను పైకి తీసుకురావడం అఖ్తర్‌కు చాలా ఇష్టం. ఆమె లౌకికవాది. జాతీయవాది కూడా. ఆమెకు పద్మశ్రీ లభించడంతో ప్రభుత్వం వద్ద ఆమెకు కొంత పలుకుబడి ఉంటుందని భావించిన కొందరు మౌల్వీలు ఆమె వద్దకు వచ్చారు. బారాబంకీలో తమ మసీదును హిందువులు ఆక్రమించుకున్నారని, దానిలో పూజలు చేస్తున్నారని, దానిని విడిపించడంలో తమకు ఆమె సహాయం చేయాలని విన్నవించుకున్నారు. అమ్మి వారి మీద కేకలు వేయడం, వారు ఆమెను క్షమాపణ కోరడం నాకు ఆశ్చర్యం కలిగించింది. ‘‘వాళ్లు అక్కడ చేస్తున్నవి కూడా ప్రార్థనలే కదా, ఇంక తగాదా ఏమిటి?’’ అని మందలించారు. ఆమె రేడియోలో జాతీయ గీతం వినబడేటప్పుడు విధిగా లేచి నిలబడే దేశభక్తురాలు కూడా. కచ్చేరీ వేదిక మీద మీరు మరింత అందంగా కనబడతారు. ఇది ఎలా జరుగుతోంది.. అని ఒకసారి ఆమెను అడిగాను. ‘పాడేటప్పుడు నేను భగవంతుణ్ణి చూస్తూ ఉంటాను’’ అని ఆమె నాకు జవాబిచ్చారు. ఆమె నిజమైన సూఫీ. – రీటా గంగూలీ, రంగస్థల నటి, గాయని, బేగం అఖ్తర్ శిష్యురాలు (చదవండి: 1997/2022 మల్టీప్లెక్స్ మయసభలు) -
మౌనమే మహాయానం
సూఫీ తత్వం ఒక సరోవరం పక్కన ఒక జ్ఞాని మౌనంగా కూర్చొని ఉన్నారు. సరోవర ం చుట్టూ ప్రశాంతత నెలకొని ఉంది. అప్పుడు అక్కడకు వచ్చిన ఒక వ్యక్తి జ్ఞానిని చూసి ‘‘మిమ్మల్ని అందరూ సూఫీ అంటుంటారు కదా? అంటే ఏమిటి? మీ లక్ష్యం ఏమిటి? మీ నియమ నిబంధనలు ఏమిటి?’’ అని ప్రశ్నించాడు. జ్ఞాని అతడి ప్రశ్నకు జవాబివ్వక మౌనంగా ఉండిపోయారు. ఆ వచ్చిన వ్యక్తి... జ్ఞాని సరిగ్గా వినలేదేమోనని మళ్లీ అడిగాడు. జ్ఞాని అప్పుడు కూడా మౌనంగానే అతడి వంక చూశారు. అప్పుడా వ్యక్తి ‘‘మీకు చెవులు సరిగ్గా పని చెయ్యవా?’’ అని అడిగాడు. ఈ ప్రశ్న తర్వాత జ్ఞాని పెదవి విప్పారు. ‘‘మీరడిగిన ప్రశ్నలన్నీ విన్నాను. వాటికి జవాబులు కూడా నేను చెప్పాను. మౌనంగా సాగిన ఆ క్షణాలు నా జవాబును మీకు తెలియజేసుండాలి కదా?’’ అన్నారు. ‘‘మీరు చెప్పిన మాటలన్నీ మరో చిక్కు ప్రశ్నలా ఉన్నాయి తప్ప జవాబులా అనిపించడం లేదు. మీరు స్పష్టంగా జవాబు చెప్పండి’’ అన్నాడా వ్యక్తి. జ్ఞాని అక్కడి ఇసుకలో తన వేళ్లతో ‘ధ్యానం’ అని రాశారు. ‘‘ఓహో, ఈ మాట కాస్తంత పరవాలేదు. అయినా మరింత విడమరచి చెప్పవచ్చు కదా?’’ అన్నాడతడు. జ్ఞాని ఇసుకపై మళ్లీ ‘ధ్యానం’ అనే రాశారు. ‘‘ఏమిటీ విచిత్రం? ధ్యానమని అంతకు ముందే రాశారుగా... మళ్లీ అదే మాటలు రాశారు’’ అని కోపంగా అన్నాడు. జ్ఞాని ఇసుకపై పెద్ద పెద్ద అక్షరాలతో ‘ధ్యానం’ అని ఒక్కో అక్షరం ఎడం ఎడంగా రాశారు. ఆ వ్యక్తికి కోపం పొంగుకొచ్చింది. ‘‘మీరు జ్ఞాని కాదు. మేధావి కాదు. మీరొక పిచ్చివారనిపిస్తోంది’’ ఆవేశంగా అన్నాడు. అప్పుడు జ్ఞాని ఇలా అన్నాడు. ‘‘ఇప్పటికే మీ కోసం నేను ఎన్నో మెట్లు దిగొచ్చాను. నా మొదటి జవాబే మీ ప్రశ్నకు సరైన జవాబు. రెండో జవాబు అంతగా సరైంది కాదు. మూడో జవాబు తప్పు. ఎందుకంటే ధ్యానం అనే మాటను పెద్ద పెద్ద అక్షరాలలో చూసేటప్పుడు మీ మనసు దానినే దేవుడిగా ఊహించుకుని దానిని పూజించడం మొదలు పెడుతుంది’’ అని చెబుతూ, ‘‘మౌనమే మనసు తెలుసుకోవడానికి మూలం. అలలై కదిలే మనసుకు మాటలూ, చర్యలూ ప్రశాంతంగా నిద్రపోయే పరుపు లాంటివి. మనసెప్పుడూ నిద్రించకూడదు. అంటే మాటలు, చర్యలు... మౌనాన్ని భగ్నం చేసి, మనసులో ఉన్నదాన్ని తెలియనియ్యవని అర్థం’’ అన్నారు. సూఫీ జ్ఞానులు కానీ, జెన్ గురువులు కానీ మౌనమే ఉత్తమం అని చెప్పారు. ఈ రణగొణ ధ్వనుల లోకంలో ఒక్క నిముషమైనా మౌన స్థితిలో ఉండటం ప్రధానం. - యామిజాల జగదీశ్