మౌనమే మహాయానం
సూఫీ తత్వం
ఒక సరోవరం పక్కన ఒక జ్ఞాని మౌనంగా కూర్చొని ఉన్నారు. సరోవర ం చుట్టూ ప్రశాంతత నెలకొని ఉంది.
అప్పుడు అక్కడకు వచ్చిన ఒక వ్యక్తి జ్ఞానిని చూసి ‘‘మిమ్మల్ని అందరూ సూఫీ అంటుంటారు కదా? అంటే ఏమిటి? మీ లక్ష్యం ఏమిటి? మీ నియమ నిబంధనలు ఏమిటి?’’ అని ప్రశ్నించాడు. జ్ఞాని అతడి ప్రశ్నకు జవాబివ్వక మౌనంగా ఉండిపోయారు. ఆ వచ్చిన వ్యక్తి... జ్ఞాని సరిగ్గా వినలేదేమోనని మళ్లీ అడిగాడు.
జ్ఞాని అప్పుడు కూడా మౌనంగానే అతడి వంక చూశారు. అప్పుడా వ్యక్తి ‘‘మీకు చెవులు సరిగ్గా పని చెయ్యవా?’’ అని అడిగాడు.
ఈ ప్రశ్న తర్వాత జ్ఞాని పెదవి విప్పారు. ‘‘మీరడిగిన ప్రశ్నలన్నీ విన్నాను. వాటికి జవాబులు కూడా నేను చెప్పాను. మౌనంగా సాగిన ఆ క్షణాలు నా జవాబును మీకు తెలియజేసుండాలి కదా?’’ అన్నారు.
‘‘మీరు చెప్పిన మాటలన్నీ మరో చిక్కు ప్రశ్నలా ఉన్నాయి తప్ప జవాబులా అనిపించడం లేదు. మీరు స్పష్టంగా జవాబు చెప్పండి’’ అన్నాడా వ్యక్తి.
జ్ఞాని అక్కడి ఇసుకలో తన వేళ్లతో ‘ధ్యానం’ అని రాశారు.
‘‘ఓహో, ఈ మాట కాస్తంత పరవాలేదు. అయినా మరింత విడమరచి చెప్పవచ్చు కదా?’’ అన్నాడతడు.
జ్ఞాని ఇసుకపై మళ్లీ ‘ధ్యానం’ అనే రాశారు.
‘‘ఏమిటీ విచిత్రం? ధ్యానమని అంతకు ముందే రాశారుగా... మళ్లీ అదే మాటలు రాశారు’’ అని కోపంగా అన్నాడు.
జ్ఞాని ఇసుకపై పెద్ద పెద్ద అక్షరాలతో ‘ధ్యానం’ అని ఒక్కో అక్షరం ఎడం ఎడంగా రాశారు. ఆ వ్యక్తికి కోపం పొంగుకొచ్చింది.
‘‘మీరు జ్ఞాని కాదు. మేధావి కాదు. మీరొక పిచ్చివారనిపిస్తోంది’’ ఆవేశంగా అన్నాడు.
అప్పుడు జ్ఞాని ఇలా అన్నాడు.
‘‘ఇప్పటికే మీ కోసం నేను ఎన్నో మెట్లు దిగొచ్చాను. నా మొదటి జవాబే మీ ప్రశ్నకు సరైన జవాబు. రెండో జవాబు అంతగా సరైంది కాదు. మూడో జవాబు తప్పు. ఎందుకంటే ధ్యానం అనే మాటను పెద్ద పెద్ద అక్షరాలలో చూసేటప్పుడు మీ మనసు దానినే దేవుడిగా ఊహించుకుని దానిని పూజించడం మొదలు పెడుతుంది’’ అని చెబుతూ, ‘‘మౌనమే మనసు తెలుసుకోవడానికి మూలం. అలలై కదిలే మనసుకు మాటలూ, చర్యలూ ప్రశాంతంగా నిద్రపోయే పరుపు లాంటివి. మనసెప్పుడూ నిద్రించకూడదు. అంటే మాటలు, చర్యలు... మౌనాన్ని భగ్నం చేసి, మనసులో ఉన్నదాన్ని తెలియనియ్యవని అర్థం’’ అన్నారు.
సూఫీ జ్ఞానులు కానీ, జెన్ గురువులు కానీ మౌనమే ఉత్తమం అని చెప్పారు. ఈ రణగొణ ధ్వనుల లోకంలో ఒక్క నిముషమైనా మౌన స్థితిలో ఉండటం ప్రధానం.
- యామిజాల జగదీశ్