yamijala
-
మౌనమే మహాయానం
సూఫీ తత్వం ఒక సరోవరం పక్కన ఒక జ్ఞాని మౌనంగా కూర్చొని ఉన్నారు. సరోవర ం చుట్టూ ప్రశాంతత నెలకొని ఉంది. అప్పుడు అక్కడకు వచ్చిన ఒక వ్యక్తి జ్ఞానిని చూసి ‘‘మిమ్మల్ని అందరూ సూఫీ అంటుంటారు కదా? అంటే ఏమిటి? మీ లక్ష్యం ఏమిటి? మీ నియమ నిబంధనలు ఏమిటి?’’ అని ప్రశ్నించాడు. జ్ఞాని అతడి ప్రశ్నకు జవాబివ్వక మౌనంగా ఉండిపోయారు. ఆ వచ్చిన వ్యక్తి... జ్ఞాని సరిగ్గా వినలేదేమోనని మళ్లీ అడిగాడు. జ్ఞాని అప్పుడు కూడా మౌనంగానే అతడి వంక చూశారు. అప్పుడా వ్యక్తి ‘‘మీకు చెవులు సరిగ్గా పని చెయ్యవా?’’ అని అడిగాడు. ఈ ప్రశ్న తర్వాత జ్ఞాని పెదవి విప్పారు. ‘‘మీరడిగిన ప్రశ్నలన్నీ విన్నాను. వాటికి జవాబులు కూడా నేను చెప్పాను. మౌనంగా సాగిన ఆ క్షణాలు నా జవాబును మీకు తెలియజేసుండాలి కదా?’’ అన్నారు. ‘‘మీరు చెప్పిన మాటలన్నీ మరో చిక్కు ప్రశ్నలా ఉన్నాయి తప్ప జవాబులా అనిపించడం లేదు. మీరు స్పష్టంగా జవాబు చెప్పండి’’ అన్నాడా వ్యక్తి. జ్ఞాని అక్కడి ఇసుకలో తన వేళ్లతో ‘ధ్యానం’ అని రాశారు. ‘‘ఓహో, ఈ మాట కాస్తంత పరవాలేదు. అయినా మరింత విడమరచి చెప్పవచ్చు కదా?’’ అన్నాడతడు. జ్ఞాని ఇసుకపై మళ్లీ ‘ధ్యానం’ అనే రాశారు. ‘‘ఏమిటీ విచిత్రం? ధ్యానమని అంతకు ముందే రాశారుగా... మళ్లీ అదే మాటలు రాశారు’’ అని కోపంగా అన్నాడు. జ్ఞాని ఇసుకపై పెద్ద పెద్ద అక్షరాలతో ‘ధ్యానం’ అని ఒక్కో అక్షరం ఎడం ఎడంగా రాశారు. ఆ వ్యక్తికి కోపం పొంగుకొచ్చింది. ‘‘మీరు జ్ఞాని కాదు. మేధావి కాదు. మీరొక పిచ్చివారనిపిస్తోంది’’ ఆవేశంగా అన్నాడు. అప్పుడు జ్ఞాని ఇలా అన్నాడు. ‘‘ఇప్పటికే మీ కోసం నేను ఎన్నో మెట్లు దిగొచ్చాను. నా మొదటి జవాబే మీ ప్రశ్నకు సరైన జవాబు. రెండో జవాబు అంతగా సరైంది కాదు. మూడో జవాబు తప్పు. ఎందుకంటే ధ్యానం అనే మాటను పెద్ద పెద్ద అక్షరాలలో చూసేటప్పుడు మీ మనసు దానినే దేవుడిగా ఊహించుకుని దానిని పూజించడం మొదలు పెడుతుంది’’ అని చెబుతూ, ‘‘మౌనమే మనసు తెలుసుకోవడానికి మూలం. అలలై కదిలే మనసుకు మాటలూ, చర్యలూ ప్రశాంతంగా నిద్రపోయే పరుపు లాంటివి. మనసెప్పుడూ నిద్రించకూడదు. అంటే మాటలు, చర్యలు... మౌనాన్ని భగ్నం చేసి, మనసులో ఉన్నదాన్ని తెలియనియ్యవని అర్థం’’ అన్నారు. సూఫీ జ్ఞానులు కానీ, జెన్ గురువులు కానీ మౌనమే ఉత్తమం అని చెప్పారు. ఈ రణగొణ ధ్వనుల లోకంలో ఒక్క నిముషమైనా మౌన స్థితిలో ఉండటం ప్రధానం. - యామిజాల జగదీశ్ -
జ్ఞానం, గుణం గురువు ఇచ్చే ప్రసాదం కాదు!
జెన్ పథం మనసుని నియంత్రించుకోగలిగితే వేదనల నుంచి తేలికగా విముక్తి పొందవచ్చు. కానీ మనో నియంత్రణ అనేది మనిషికి ఎంతో కఠినమైనది. జెన్ అన్నింటినీ తనలో ఇముడ్చుకున్న మార్గం. లేదా మార్గమే లేని ప్రయాణం. ఈ ప్రయాణంలో అనేకులు జ్ఞానం పొందారు. వాళ్లు తమకు తోచిన మార్గంలో తాము పొందిన జ్ఞానాన్ని వెల్లడించారు. గురువు రిన్సాయి ఉన్నట్లుండి నవ్వేవారు. మరేదీ చేసేవారు కాదు. ఆయన వద్దకు సలహాల కోసం, సూచనలకోసం వచ్చిన వారందరి వద్దా ఆయన పెద్దగా నవ్వుతూ వెళ్లిపోయేవారు. చివరివరకూ ఆయన నవ్వుకు కారణం బోధపడలేదు. అయితే ఆయన నవ్వు హేళనగానో లేదా నిర్లక్ష్యంగానో ఉండేది కాదు. అదొక ఆకర్షణీయమైన నవ్వు. ఆయనను ‘నవ్వే బుద్ధుడు’ అని సంబోధించేవారు. మరొక గురువు పుణ్యస్థలాలు దర్శిస్తూ వచ్చారు. జ్ఞానం పొందిన తర్వాత ఆయన ఇలా చెప్పారు - ‘‘నేను మొదటిసారి వెళ్లినప్పుడు ఆలయాన్ని చూశాను. మరోసారి వెళ్లినప్పుడు భగవంతుడిని చూశాను. మూడోసారి వెళ్లినప్పుడు భగవంతుడినీ చూడలేదు. ఆలయాన్నీ చూడలేదు...’’ అని. బుద్ధుడి తర్వాత ఎందరో గురువులు ప్రపంచవ్యాప్తంగా వచ్చారు. వారిలో ఓ భారీ బండరాయిని తన మనోబలంతో దొర్లించిన గురువూ ఉన్నారు. ఆయన వద్దకు అనేకులు వచ్చి వెళ్తుండేవారు. వారికెవరికీ ఆయన తన ఈ శక్తిని ఎన్నడూ ప్రదర్శించలేదు. ఆయన వల్ల ఎందరో సత్ఫలితాలు పొందారు. ‘‘నువ్వు ప్రయత్నం, కృషి వల్లే జ్ఞానం పొందావు. నీ సత్ఫలితంతో నువ్వు గుణవంతుడవయ్యావు’’ అని చెప్తుండేవారు. ఓమారు కొందరు శిష్యులు అడిగినప్పుడు ఆయన ఇలా చెప్పారు - ‘‘వీటన్నింటికీ నేనే కారణం అని అనుకుంటే స్వయంకృషితో ఫలితం పొందాలనుకునే ఆలోచన తగ్గుతుంది. నాలాంటి వారి వద్దకు వచ్చి వరప్రసాదంగా జ్ఞానాన్ని పొందవచ్చనే ఆలోచనవల్ల సోమరుల సంఖ్య పెరిగిపోతుంది. అంతేకాదు, ఇటువంటి ఫలితాలపై ఆసక్తి చూపడం మొదలుపెడితే అది వారిని సత్యానికి దూరం చేస్తుంది...’’ అని. ఒక పెయింటింగ్ ద్వారా, ఒక వృక్షం ద్వారా కూడా జ్ఞానం పొందిన వారున్నారు. మౌనం అనే దాన్ని మనం తెలుసుకున్న క్షణమే ఆ మౌనం చెదిరిపోతుంది. మౌనంగా ఉన్నాను అని చెప్పగలవారెవ్వరు? అలా అనేటప్పుడే మౌనం ఆ చోటు విడిచిపెట్టి పోతుంది. అందుకే హృదయం శూన్యమైపోయిందని చెప్పినప్పుడు ఆ శూన్యాన్ని విసిరేసెయ్ అంటాడు ఓ జెన్ గురువు.కేవలం ఒకే ఒక్క మాట చెప్పిన జెన్ గురువూ ఉన్నారు. అది కూడా చెప్పని వారూ ఉన్నారు. - యామిజాల