జ్ఞానం, గుణం గురువు ఇచ్చే ప్రసాదం కాదు!
జెన్ పథం
మనసుని నియంత్రించుకోగలిగితే వేదనల నుంచి తేలికగా విముక్తి పొందవచ్చు. కానీ మనో నియంత్రణ అనేది మనిషికి ఎంతో కఠినమైనది. జెన్ అన్నింటినీ తనలో ఇముడ్చుకున్న మార్గం. లేదా మార్గమే లేని ప్రయాణం. ఈ ప్రయాణంలో అనేకులు జ్ఞానం పొందారు. వాళ్లు తమకు తోచిన మార్గంలో తాము పొందిన జ్ఞానాన్ని వెల్లడించారు.
గురువు రిన్‌సాయి ఉన్నట్లుండి నవ్వేవారు. మరేదీ చేసేవారు కాదు. ఆయన వద్దకు సలహాల కోసం, సూచనలకోసం వచ్చిన వారందరి వద్దా ఆయన పెద్దగా నవ్వుతూ వెళ్లిపోయేవారు. చివరివరకూ ఆయన నవ్వుకు కారణం బోధపడలేదు. అయితే ఆయన నవ్వు హేళనగానో లేదా నిర్లక్ష్యంగానో ఉండేది కాదు. అదొక ఆకర్షణీయమైన నవ్వు. ఆయనను ‘నవ్వే బుద్ధుడు’ అని సంబోధించేవారు.
మరొక గురువు పుణ్యస్థలాలు దర్శిస్తూ వచ్చారు.
జ్ఞానం పొందిన తర్వాత ఆయన ఇలా చెప్పారు - ‘‘నేను మొదటిసారి వెళ్లినప్పుడు ఆలయాన్ని చూశాను. మరోసారి వెళ్లినప్పుడు భగవంతుడిని చూశాను. మూడోసారి వెళ్లినప్పుడు భగవంతుడినీ చూడలేదు. ఆలయాన్నీ చూడలేదు...’’ అని. బుద్ధుడి తర్వాత ఎందరో గురువులు ప్రపంచవ్యాప్తంగా వచ్చారు. వారిలో ఓ భారీ బండరాయిని తన మనోబలంతో దొర్లించిన గురువూ ఉన్నారు. ఆయన వద్దకు అనేకులు వచ్చి వెళ్తుండేవారు. వారికెవరికీ ఆయన తన ఈ శక్తిని ఎన్నడూ ప్రదర్శించలేదు. ఆయన వల్ల ఎందరో సత్ఫలితాలు పొందారు. ‘‘నువ్వు ప్రయత్నం, కృషి వల్లే జ్ఞానం పొందావు. నీ సత్ఫలితంతో నువ్వు గుణవంతుడవయ్యావు’’ అని చెప్తుండేవారు.
ఓమారు కొందరు శిష్యులు అడిగినప్పుడు ఆయన ఇలా చెప్పారు -
‘‘వీటన్నింటికీ నేనే కారణం అని అనుకుంటే స్వయంకృషితో ఫలితం పొందాలనుకునే ఆలోచన తగ్గుతుంది. నాలాంటి వారి వద్దకు వచ్చి వరప్రసాదంగా జ్ఞానాన్ని పొందవచ్చనే ఆలోచనవల్ల సోమరుల సంఖ్య పెరిగిపోతుంది. అంతేకాదు, ఇటువంటి ఫలితాలపై ఆసక్తి చూపడం మొదలుపెడితే అది వారిని సత్యానికి దూరం చేస్తుంది...’’ అని.
ఒక పెయింటింగ్ ద్వారా, ఒక వృక్షం ద్వారా కూడా జ్ఞానం పొందిన వారున్నారు.
మౌనం అనే దాన్ని మనం తెలుసుకున్న క్షణమే ఆ మౌనం చెదిరిపోతుంది. మౌనంగా ఉన్నాను అని చెప్పగలవారెవ్వరు? అలా అనేటప్పుడే మౌనం ఆ చోటు విడిచిపెట్టి పోతుంది. అందుకే హృదయం శూన్యమైపోయిందని చెప్పినప్పుడు ఆ శూన్యాన్ని విసిరేసెయ్ అంటాడు ఓ జెన్ గురువు.కేవలం ఒకే ఒక్క మాట చెప్పిన జెన్ గురువూ ఉన్నారు. అది కూడా చెప్పని వారూ ఉన్నారు.
- యామిజాల