భూలే బిస్‌రే మన్నా డే | Star Star Melodies to pay tribute to Manna Dey | Sakshi
Sakshi News home page

భూలే బిస్‌రే మన్నా డే

Published Wed, May 1 2019 1:05 AM | Last Updated on Wed, May 1 2019 1:05 AM

 Star Star Melodies to pay tribute to Manna Dey - Sakshi

ఆవో ట్విస్ట్‌ కరే... గా ఉఠా మౌసమ్‌ ఆవో ట్విస్ట్‌ కరే... జిందగీ హై యహీ...
వొంకలు తిరగాలి. గిరికీలు కొట్టాలి. వానపాములా కదులుతున్న జీవితాన్ని కిక్‌కొట్టి దౌడు తీయించాలి. జర్రున జారి పడేలా చేయాలి. అంతెందుకు. ఒక మన్నా డే పాట అందుకోవాలి.దిల్‌ కా హల్‌ సునే దిల్‌వాలాసీధిసీ బాత్‌ నా మిర్చి మసాలాకెహెకె రహేగా కెహెనే వాలా

దిల్‌ కా హల్‌ సునే దిల్‌వాలా సీధిసీ బాత్‌ నా మిర్చి మసాలా కెహెకె రహేగా కెహెనే వాలాదిల్‌ కా హల్‌ సునే దిల్‌వాలా... 
చుట్టూ నలుగురు ఉండాలి. మంది పోగై ఉండాలి. మన పేరు నారాయణ అయ్యి నలుగురిలో సదా ఉండటాన్ని ఉత్సవం చేసుకోగలగాలి. ఒక్కడినే ఒక్కడిలా ఉంచే ఫోన్‌ని పక్కన పెట్టు. ఫేస్‌బుక్‌ను బుట్టలో పెట్టు. వాట్సప్‌ను పొయ్యిన పెట్టు. పాట ఒకటి పెట్టుకో తోడు. మన్నా డే పాట ఒకటి పెట్టుకోవోయ్‌ తోడు. ఎంత రుచిగా ఉంటుందో చూడు.ఆజా సనమ్‌ మధుర్‌ చాంద్‌నీ హమ్‌ తుమ్‌ మిలేతో విరానే మే భి ఆజాయే గీ బహార్‌

ఆజా సనమ్‌ మధుర్‌ చాంద్‌నీ హమ్‌ తుమ్‌ మిలేతో విరానే మే భి ఆజాయే గీ బహార్‌ఝూమ్‌ నే లగేగా ఆస్‌మాన్‌... 
మన్నా డే ఎంతకాలం జీవించాడో తెలుసా? 94 ఏళ్లు. నూరేళ్లలో ఆరు మైనస్‌ కొట్టినందుకు కచ్చితంగా బాధపడి ఉంటాడు. ఎందుకు? జీవితం అంటే ఎంతో విలువైనది కదా. మధురమైనది కదా. దానిని సౌందర్యవంతం చేసుకోవడానికి నీకు ప్రకృతి అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నది కదా. రక్తమూ కండలు ఇచ్చింది... నమిలి మింగడానికి దవడలు ఇచ్చింది... గట్టిగా నిలబడ్డానికి గుండెనిచ్చింది... తాకి మీదుగా వీచడానికి తెమ్మెరనిచ్చింది... పాడుకోవడానికి పాటనిచ్చింది... మనకు రాకపోతే వినమని మన్నా డేని ఇచ్చింది.

కౌన్‌ ఆయా మేరే మన్‌ కే ద్వారే పాయల్‌ కి ఝన్‌కార్‌ లియే...
మందపాటి కళ్లద్దాలు పెట్టుకొని, దాపరికం లేని బట్టతల పెట్టుకుని పాతతరం మనిషిలా కనిపించే ఈ మన్నా డే చిన్నప్పుడు కుస్తీ పోటీలు ఆడాడు. జీవించినంత కాలం రుచికరమైన ఆహారాన్ని వండి, వండించుకొని తిన్నాడు. ఏ మాత్రం సమయం దొరికినా వ్యాయామం చేశాడు. తంబూరా ముందు కూచుంటే డాక్టర్‌ ముందు కూచోవాల్సిన అవసరం లేదని గ్రహించాడు. పాట ఆయువు. ఎదుట కూచున్నవారికి? పాట సంజీవని. జుర్రుకున్న వారికి జుర్రుకున్నంత.

తూ ప్యార్‌ కా సాగర్‌ హై తేరె హర్‌ బూంద్‌ కే ప్యాసే హమ్‌ తూ ప్యార్‌ కా సాగర్‌ హై...
కోలకతా గంగ నీరు తాగి, అక్కడి రవీంద్ర సంగీతంలో మునకలేసి, ముసల్మాను గురువుగారి బీబీ వంటగదిలో పులావు వండుతుంటే ముందు గదిలో అంతకంటే ఆస్వాదన కలిగిన శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకుంటూ సొంత బాబాయ్, అప్పటి సంగీతకారుడు కె.సి.డేతో కలిసి ముంబైకి వచ్చాడు– గాయకుడు అవుదామని కాదు– సంగీత దర్శకుడు అవుదామని. కాని తాను ఒకటి తలిస్తే పాట ఒకటి తలిచింది. ఆటుపోట్ల అరేబియా సముద్రం ఈ కొత్త గాయకుడి పాట విని ఒక లిప్త నెమ్మదించింది. మరో లిప్త తెరిపిన పడింది. ఈ ఒడ్డునే ఇది స్థిరపడాలని కెరటాలెత్తి దీవించింది. నీ కోసమేనోయ్‌ ఇంతవరకు తపించింది అని అది అనే ఉంటుంది.

తూ ఛుపీ హై కహా మై తడప్‌ తా యహా తెరె బిన్‌ ఫీకా ఫీకా హై దిల్‌ కా జహాన్‌ తూ ఛుపీ హై కహా...
గురూ...నువ్వు వజ్రంలా మారాలంటే ముందు బొగ్గులా మారాలి. కష్టం చుర్రుమని బొబ్బలెక్కించాక సుఖమనే పచ్చని తాటాకు నెత్తి మీదకు వచ్చి చేతిలో చల్లటి కల్లుముంత పెడుతుంది. మన్నా డేను ఇరవై ఇరవై రెండేళ్ల వయసులోనే ‘ముసలి’ గాయకుణ్ణి చేసింది ముంబై. సినిమాలో ముసలివాడు ఉంటే, వాడు పాడాలంటే మన్నా డేని పిలిచేవాళ్లు. అరె.. యంగ్‌ హీరోలకు రఫీ, తలత్, ముకేశ్‌ వంటి వాళ్లు పాడుతుంటే తాను మాత్రం ముసలివాళ్లకు పాడాలా? బ్యాక్‌ గ్రౌండ్‌ సాంగ్స్‌ పాడాలా? పాడాడు.

‘ఊపర్‌ గగన్‌ విశాల్‌’... ‘మషాల్‌’ సినిమాలో పెద్ద హిట్‌. ‘ధర్తీ కహే పుకార్‌ కే బీంజ్‌ బిఛాలే ప్యార్‌ కే’... ‘దొ భిగా జమీన్‌’లో ఇంకా పెద్ద హిట్‌. ‘కాబూలి వాలా’ ‘అయ్‌ మేరే ప్యారే వతన్‌’ ఎవరు మర్చిపోగలరు. ‘బసంత్‌ బహార్‌’ సినిమాలో ‘సుర్‌ నా సజే క్యా గావూ మై’ పాట ఇంకా పెద్ద హిట్‌. కాని ఇంకా పైకి రావాల్సి ఉంది. రాజ్‌కపూర్, శంకర్‌–ౖజెకిషన్‌లలోని శంకర్‌ ‘ఆవారా’లో డ్రీమ్‌ సీక్వెన్స్‌లో పాడే ఛాన్స్‌ ఇచ్చారు. కాని అసలైన బ్రేక్‌ ‘శ్రీ 420’లో వచ్చింది. ఆ సినిమాలో ఒక రాత్రి వచ్చింది. ఆ రాత్రిలో ఒక వాన వచ్చింది. ఆ వానలో రాజ్‌కపూర్‌–నర్గీస్‌ అనే జంట వచ్చింది. ఆ జంటతో పాటు మన్నా డే–లతాల పాట ఒకటి వచ్చింది.

ప్యార్‌ హువా ఇక్‌రార్‌ హువా హై ప్యార్‌ సే ఫిర్‌ క్యూ డర్‌ తా హై దిల్‌...
ఆ సినిమాలోనే మన్నా డే ‘ముడ్‌ ముడ్‌ కే నా దేఖ్‌ ముడ్‌ ముడ్‌ కే’ పాడి జనం మన్నా డే వైపు తిరిగి తిరిగి చూసేలా చేసుకున్నాడు. అయితే రాజ్‌ కపూర్‌కు ముకేష్‌ కాకుండా మన్నా డే కూడా సరిపోతాడా? సరిపోతాడు అని ఆ తర్వాత వచ్చిన ‘చోరి చోరి’లోని మధురమైన ఈ పాట నిరూపించింది.

ఏ రాత్‌ భీగీ భీగీ ఏ మస్త్‌ ఫిజాయే ఉఠా ధీరే ధీరే ఓ చాంద్‌ ప్యారా ప్యారా...
ఇప్పుడు మన్నా డే స్టార్‌ అయ్యాడు. దిలీప్‌కు రఫీ ఉండొచ్చు. రాజ్‌కపూర్‌కు ముకేష్‌ ఉండొచ్చు. దేవ్‌ఆనంద్‌కు హేమంత్‌ ఉండొచ్చు. కాని తాను అందరికీ ఉంటాడు. తను అందరి గాయకుడు. ఏం... దేవ్‌ ఆనంద్‌కు తాను అద్దిరే డ్యూయెట్‌ ఇవ్వలేడా? ఆశా భోంస్లే కొంచెం తోడు రా.

సాంర్‌ ఢలీ దిల్‌ కి లగీ థక్‌ చలీ పుకార్‌ కేఆజా ఆజా ఆభీ జా...
ఎన్టీఆర్‌ పెద్ద యాక్టర్‌ అని తెలియాలంటే పదేళ్ల వయసు చాలు. కాని బల్‌రాజ్‌ సహానీ చాలా పెద్ద యాక్టర్‌ అని తెలియాలంటే నలభై ఏళ్లు రావాలి. ఈ బల్‌రాజ్‌ సహానీకి మన్నా డే సూపర్‌ హిట్స్‌ చాలా ఇచ్చాడు. వాటిలో ఈ రెండు మీరు కారులో వెళుతూ వివి«ద్‌భారతి పెట్టిన అనేకసార్లు వినపడుతూనే ఉంటాయి.
 

తుజే సూరజ్‌ కహూ యా చందా తుజే దీప్‌ కహూ యా తారా మేరా నామ్‌ కరేగా రోషన్‌ జగ్‌ మే మేరా రాజ్‌ దులారా...అయ్‌ మేరే జొహర్‌ జబీ తుజే మాలూమ్‌ నహీ తూ అభీతక్‌ హై హసీ ఔర్‌ మై జవాన్‌...
మన్నా డే ఎన్నో హిట్లు పాడాడు. మన్నా డే పాడటం వల్ల అంతవరకూ విలన్‌గా ఉన్న ప్రాణ్‌ ‘ఉప్‌కార్‌’లోని ‘కస్‌మే వాదే ప్యార్‌ వఫా’ పాటతో తన చెడునంతా జనంలో పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత అతడికే మన్నా డే ‘జంజీర్‌’లో ‘యారీ హై ఈమాన్‌ మేరీ’ పాడి ఉత్తమ స్నేహితుడిగా మార్చాడు. గొంతులో సత్తా ఉంటే సక్సెస్‌ కూడా కొంచెం తటపటాయిస్తుంది. అందుకే కంటి చూపుతో శాసించే స్థితిలో ఉన్నప్పటికీ రాజేష్‌ ఖన్నా ‘ఆనంద్‌’ లో తనకు మన్నా డేతో పాడిస్తానని సంగీత దర్శకుడు సలీల్‌ చౌధురి అంటే ఊహూ కిశోర్‌ చేతే పాడించండి అనకుండా తల ఊపాడు. ఆ పాట వింటే ఇప్పటికీ పరవశంతో శ్రోత తల ఊపుతూనే ఉంటాడు.

జిందగీ కైసి హై పహేలీ హాయేకభితో హసాయే... కభితొ రులాయే...
బెంగాల్‌లో పుట్టి మహారాష్ట్రలో జీవితాన్ని పొందిన మన్నా డే మన దక్షణాది సాంగత్యంతో పరిపూర్ణుడు అయ్యాడంటే నమ్ముతారా? ఆయన వివాహం చేసుకున్నది కేరళ వనితని. సినిమాలో బ్రేక్‌ సాధించింది మన హైదరాబాదీ అయిన ‘శంకర్‌ (జైకిషన్‌)’ వల్ల. చివరి దశాబ్దాలు స్థిరపడింది బెంగళూరులో. క్లాసికల్‌ మ్యూజిక్‌ను సినిమాకు అప్లై చేయడం తెలిసిన ఈ లెజెండ్‌ పాడిన ‘లాగా చునరీ మే దాగ్‌’, ‘ఏక్‌ చతురనార్‌ కర్‌ కే సింగార్‌’, ‘ఝనక్‌ ఝనక్‌ తొలి బాజె పాయలియా’ వంటి పాటలు లేకుండా నేటికీ ఏ సంగీత పోటీ పరిసమాప్తి కాని విధంగా స్థిరపడి ఉన్నాడు.

వేయి మంది గాయకులు రావచ్చు. మరో వేయి రకాలుగా పాటలు పరివ్యాప్తి కావచ్చు. ఈ ఊపులో మనం కొన్ని ఘడియల సేపు మన్నా డేను భూలే బిస్‌రేగా మర్చిపోనూ వచ్చు. కాని ఏ సాయం సమయాలలోనో, ఏ భోజనానంతర వ్యాహ్యాళిలోనో, ప్రియురాలి అలుకలో ఏ దిక్కు తోచని సందర్భాలోనో, చినుకు రాలినప్పుడో, వెన్నెల అసంభాషణగా కురుస్తున్నప్పుడో టక్కున గుర్తుకు వస్తాడు. గొంతు తట్టి లేపుతాడు. తను ఆవహించి మన చేత మరి నాలుగు అడుగులు ముందుకు వేయిస్తాడు. పాట అలాంటిది అతడిది. మన్నాడే.. ఉంటాం నీ తోడే.

ఏ దోస్‌తీ హమ నహీ తోడెంగె తోడెంగె దమ్‌ మగర్‌ తేర సాథ్‌నా ఛోడెంగె...
ఖదీర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement