Manna Dey
-
భూలే బిస్రే మన్నా డే
ఆవో ట్విస్ట్ కరే... గా ఉఠా మౌసమ్ ఆవో ట్విస్ట్ కరే... జిందగీ హై యహీ... వొంకలు తిరగాలి. గిరికీలు కొట్టాలి. వానపాములా కదులుతున్న జీవితాన్ని కిక్కొట్టి దౌడు తీయించాలి. జర్రున జారి పడేలా చేయాలి. అంతెందుకు. ఒక మన్నా డే పాట అందుకోవాలి.దిల్ కా హల్ సునే దిల్వాలాసీధిసీ బాత్ నా మిర్చి మసాలాకెహెకె రహేగా కెహెనే వాలా దిల్ కా హల్ సునే దిల్వాలా సీధిసీ బాత్ నా మిర్చి మసాలా కెహెకె రహేగా కెహెనే వాలాదిల్ కా హల్ సునే దిల్వాలా... చుట్టూ నలుగురు ఉండాలి. మంది పోగై ఉండాలి. మన పేరు నారాయణ అయ్యి నలుగురిలో సదా ఉండటాన్ని ఉత్సవం చేసుకోగలగాలి. ఒక్కడినే ఒక్కడిలా ఉంచే ఫోన్‌ని పక్కన పెట్టు. ఫేస్‌బుక్‌ను బుట్టలో పెట్టు. వాట్సప్‌ను పొయ్యిన పెట్టు. పాట ఒకటి పెట్టుకో తోడు. మన్నా డే పాట ఒకటి పెట్టుకోవోయ్ తోడు. ఎంత రుచిగా ఉంటుందో చూడు.ఆజా సనమ్ మధుర్ చాంద్నీ హమ్ తుమ్ మిలేతో విరానే మే భి ఆజాయే గీ బహార్ ఆజా సనమ్ మధుర్ చాంద్నీ హమ్ తుమ్ మిలేతో విరానే మే భి ఆజాయే గీ బహార్ఝూమ్ నే లగేగా ఆస్మాన్... మన్నా డే ఎంతకాలం జీవించాడో తెలుసా? 94 ఏళ్లు. నూరేళ్లలో ఆరు మైనస్ కొట్టినందుకు కచ్చితంగా బాధపడి ఉంటాడు. ఎందుకు? జీవితం అంటే ఎంతో విలువైనది కదా. మధురమైనది కదా. దానిని సౌందర్యవంతం చేసుకోవడానికి నీకు ప్రకృతి అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నది కదా. రక్తమూ కండలు ఇచ్చింది... నమిలి మింగడానికి దవడలు ఇచ్చింది... గట్టిగా నిలబడ్డానికి గుండెనిచ్చింది... తాకి మీదుగా వీచడానికి తెమ్మెరనిచ్చింది... పాడుకోవడానికి పాటనిచ్చింది... మనకు రాకపోతే వినమని మన్నా డేని ఇచ్చింది. కౌన్ ఆయా మేరే మన్ కే ద్వారే పాయల్ కి ఝన్కార్ లియే... మందపాటి కళ్లద్దాలు పెట్టుకొని, దాపరికం లేని బట్టతల పెట్టుకుని పాతతరం మనిషిలా కనిపించే ఈ మన్నా డే చిన్నప్పుడు కుస్తీ పోటీలు ఆడాడు. జీవించినంత కాలం రుచికరమైన ఆహారాన్ని వండి, వండించుకొని తిన్నాడు. ఏ మాత్రం సమయం దొరికినా వ్యాయామం చేశాడు. తంబూరా ముందు కూచుంటే డాక్టర్ ముందు కూచోవాల్సిన అవసరం లేదని గ్రహించాడు. పాట ఆయువు. ఎదుట కూచున్నవారికి? పాట సంజీవని. జుర్రుకున్న వారికి జుర్రుకున్నంత. తూ ప్యార్ కా సాగర్ హై తేరె హర్ బూంద్ కే ప్యాసే హమ్ తూ ప్యార్ కా సాగర్ హై... కోలకతా గంగ నీరు తాగి, అక్కడి రవీంద్ర సంగీతంలో మునకలేసి, ముసల్మాను గురువుగారి బీబీ వంటగదిలో పులావు వండుతుంటే ముందు గదిలో అంతకంటే ఆస్వాదన కలిగిన శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకుంటూ సొంత బాబాయ్, అప్పటి సంగీతకారుడు కె.సి.డేతో కలిసి ముంబైకి వచ్చాడు– గాయకుడు అవుదామని కాదు– సంగీత దర్శకుడు అవుదామని. కాని తాను ఒకటి తలిస్తే పాట ఒకటి తలిచింది. ఆటుపోట్ల అరేబియా సముద్రం ఈ కొత్త గాయకుడి పాట విని ఒక లిప్త నెమ్మదించింది. మరో లిప్త తెరిపిన పడింది. ఈ ఒడ్డునే ఇది స్థిరపడాలని కెరటాలెత్తి దీవించింది. నీ కోసమేనోయ్ ఇంతవరకు తపించింది అని అది అనే ఉంటుంది. తూ ఛుపీ హై కహా మై తడప్ తా యహా తెరె బిన్ ఫీకా ఫీకా హై దిల్ కా జహాన్ తూ ఛుపీ హై కహా... గురూ...నువ్వు వజ్రంలా మారాలంటే ముందు బొగ్గులా మారాలి. కష్టం చుర్రుమని బొబ్బలెక్కించాక సుఖమనే పచ్చని తాటాకు నెత్తి మీదకు వచ్చి చేతిలో చల్లటి కల్లుముంత పెడుతుంది. మన్నా డేను ఇరవై ఇరవై రెండేళ్ల వయసులోనే ‘ముసలి’ గాయకుణ్ణి చేసింది ముంబై. సినిమాలో ముసలివాడు ఉంటే, వాడు పాడాలంటే మన్నా డేని పిలిచేవాళ్లు. అరె.. యంగ్ హీరోలకు రఫీ, తలత్, ముకేశ్ వంటి వాళ్లు పాడుతుంటే తాను మాత్రం ముసలివాళ్లకు పాడాలా? బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్ పాడాలా? పాడాడు. ‘ఊపర్ గగన్ విశాల్’... ‘మషాల్’ సినిమాలో పెద్ద హిట్. ‘ధర్తీ కహే పుకార్ కే బీంజ్ బిఛాలే ప్యార్ కే’... ‘దొ భిగా జమీన్’లో ఇంకా పెద్ద హిట్. ‘కాబూలి వాలా’ ‘అయ్ మేరే ప్యారే వతన్’ ఎవరు మర్చిపోగలరు. ‘బసంత్ బహార్’ సినిమాలో ‘సుర్ నా సజే క్యా గావూ మై’ పాట ఇంకా పెద్ద హిట్. కాని ఇంకా పైకి రావాల్సి ఉంది. రాజ్‌కపూర్, శంకర్–ౖజెకిషన్లలోని శంకర్ ‘ఆవారా’లో డ్రీమ్ సీక్వెన్స్‌లో పాడే ఛాన్స్ ఇచ్చారు. కాని అసలైన బ్రేక్ ‘శ్రీ 420’లో వచ్చింది. ఆ సినిమాలో ఒక రాత్రి వచ్చింది. ఆ రాత్రిలో ఒక వాన వచ్చింది. ఆ వానలో రాజ్‌కపూర్–నర్గీస్ అనే జంట వచ్చింది. ఆ జంటతో పాటు మన్నా డే–లతాల పాట ఒకటి వచ్చింది. ప్యార్ హువా ఇక్రార్ హువా హై ప్యార్ సే ఫిర్ క్యూ డర్ తా హై దిల్... ఆ సినిమాలోనే మన్నా డే ‘ముడ్ ముడ్ కే నా దేఖ్ ముడ్ ముడ్ కే’ పాడి జనం మన్నా డే వైపు తిరిగి తిరిగి చూసేలా చేసుకున్నాడు. అయితే రాజ్ కపూర్‌కు ముకేష్ కాకుండా మన్నా డే కూడా సరిపోతాడా? సరిపోతాడు అని ఆ తర్వాత వచ్చిన ‘చోరి చోరి’లోని మధురమైన ఈ పాట నిరూపించింది. ఏ రాత్ భీగీ భీగీ ఏ మస్త్ ఫిజాయే ఉఠా ధీరే ధీరే ఓ చాంద్ ప్యారా ప్యారా... ఇప్పుడు మన్నా డే స్టార్ అయ్యాడు. దిలీప్‌కు రఫీ ఉండొచ్చు. రాజ్‌కపూర్‌కు ముకేష్ ఉండొచ్చు. దేవ్ఆనంద్కు హేమంత్ ఉండొచ్చు. కాని తాను అందరికీ ఉంటాడు. తను అందరి గాయకుడు. ఏం... దేవ్ ఆనంద్‌కు తాను అద్దిరే డ్యూయెట్ ఇవ్వలేడా? ఆశా భోంస్లే కొంచెం తోడు రా. సాంర్ ఢలీ దిల్ కి లగీ థక్ చలీ పుకార్ కేఆజా ఆజా ఆభీ జా... ఎన్టీఆర్ పెద్ద యాక్టర్ అని తెలియాలంటే పదేళ్ల వయసు చాలు. కాని బల్రాజ్ సహానీ చాలా పెద్ద యాక్టర్ అని తెలియాలంటే నలభై ఏళ్లు రావాలి. ఈ బల్రాజ్ సహానీకి మన్నా డే సూపర్ హిట్స్ చాలా ఇచ్చాడు. వాటిలో ఈ రెండు మీరు కారులో వెళుతూ వివి«ద్భారతి పెట్టిన అనేకసార్లు వినపడుతూనే ఉంటాయి. తుజే సూరజ్ కహూ యా చందా తుజే దీప్ కహూ యా తారా మేరా నామ్ కరేగా రోషన్ జగ్ మే మేరా రాజ్ దులారా...అయ్ మేరే జొహర్ జబీ తుజే మాలూమ్ నహీ తూ అభీతక్ హై హసీ ఔర్ మై జవాన్... మన్నా డే ఎన్నో హిట్లు పాడాడు. మన్నా డే పాడటం వల్ల అంతవరకూ విలన్‌గా ఉన్న ప్రాణ్ ‘ఉప్కార్’లోని ‘కస్మే వాదే ప్యార్ వఫా’ పాటతో తన చెడునంతా జనంలో పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత అతడికే మన్నా డే ‘జంజీర్’లో ‘యారీ హై ఈమాన్ మేరీ’ పాడి ఉత్తమ స్నేహితుడిగా మార్చాడు. గొంతులో సత్తా ఉంటే సక్సెస్ కూడా కొంచెం తటపటాయిస్తుంది. అందుకే కంటి చూపుతో శాసించే స్థితిలో ఉన్నప్పటికీ రాజేష్ ఖన్నా ‘ఆనంద్’ లో తనకు మన్నా డేతో పాడిస్తానని సంగీత దర్శకుడు సలీల్ చౌధురి అంటే ఊహూ కిశోర్ చేతే పాడించండి అనకుండా తల ఊపాడు. ఆ పాట వింటే ఇప్పటికీ పరవశంతో శ్రోత తల ఊపుతూనే ఉంటాడు. జిందగీ కైసి హై పహేలీ హాయేకభితో హసాయే... కభితొ రులాయే... బెంగాల్లో పుట్టి మహారాష్ట్రలో జీవితాన్ని పొందిన మన్నా డే మన దక్షణాది సాంగత్యంతో పరిపూర్ణుడు అయ్యాడంటే నమ్ముతారా? ఆయన వివాహం చేసుకున్నది కేరళ వనితని. సినిమాలో బ్రేక్ సాధించింది మన హైదరాబాదీ అయిన ‘శంకర్ (జైకిషన్)’ వల్ల. చివరి దశాబ్దాలు స్థిరపడింది బెంగళూరులో. క్లాసికల్ మ్యూజిక్‌ను సినిమాకు అప్లై చేయడం తెలిసిన ఈ లెజెండ్ పాడిన ‘లాగా చునరీ మే దాగ్’, ‘ఏక్ చతురనార్ కర్ కే సింగార్’, ‘ఝనక్ ఝనక్ తొలి బాజె పాయలియా’ వంటి పాటలు లేకుండా నేటికీ ఏ సంగీత పోటీ పరిసమాప్తి కాని విధంగా స్థిరపడి ఉన్నాడు. వేయి మంది గాయకులు రావచ్చు. మరో వేయి రకాలుగా పాటలు పరివ్యాప్తి కావచ్చు. ఈ ఊపులో మనం కొన్ని ఘడియల సేపు మన్నా డేను భూలే బిస్రేగా మర్చిపోనూ వచ్చు. కాని ఏ సాయం సమయాలలోనో, ఏ భోజనానంతర వ్యాహ్యాళిలోనో, ప్రియురాలి అలుకలో ఏ దిక్కు తోచని సందర్భాలోనో, చినుకు రాలినప్పుడో, వెన్నెల అసంభాషణగా కురుస్తున్నప్పుడో టక్కున గుర్తుకు వస్తాడు. గొంతు తట్టి లేపుతాడు. తను ఆవహించి మన చేత మరి నాలుగు అడుగులు ముందుకు వేయిస్తాడు. పాట అలాంటిది అతడిది. మన్నాడే.. ఉంటాం నీ తోడే. ఏ దోస్తీ హమ నహీ తోడెంగె తోడెంగె దమ్ మగర్ తేర సాథ్నా ఛోడెంగె... ఖదీర్ -
మధురఙ్ఞాపకం మన్నాడే
-
మన్నాడే మరిలేరు
సాక్షి, బెంగళూరు: మధుర గాయకుడు మన్నా డే (94) మరి లేరు. దాదాపు ఐదు దశాబ్దాల పాటు సినీ పరిశ్రమలో కొనసాగిన ఆయన, ఏడు భాషల్లో సుమారు నాలుగు వేల పాటలు పాడారు. ఏ భాషలో పాడినా, ఆ భాషవారికి మన్నా డే ‘మనోడే’ అనిపించేంతగా ముద్రవేశారు. హిందీ, బెంగాలీ, అస్సామీ, గుజరాతీ, మరాఠీ, కన్నడ, మలయాళీ భాషల్లో పాటలు పాడి అభిమానులను అలరించిన మన్నాడే, కొద్ది నెలలుగా గుండె, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతూ బెంగళూరులోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో గురువారం వేకువ జామున 3.50 గంటలకు కన్నుమూశారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు సురోమా, సుమిత ఉన్నారు. సురోమా అమెరికాలో స్థిరపడగా, సుమిత బెంగళూరులోనే ఉంటున్నారు. మన్నాడే భార్య సులోచనా కుమరన్ కేన్సర్‌తో బాధపడుతూ ఏడాది కిందట మరణించారు. కేరళకు చెందిన సులోచనాను మన్నాడే 1953లో వివాహం చేసుకున్నారు. సినీ పరిశ్రమలో కొనసాగినంత కాలం దాదాపు యాభయ్యేళ్లు ముంబైలోనే ఉన్న మన్నా డే, చివరకు బెంగళూరును స్థిరనివాసం చేసుకున్నారు. కాగా, బెంగళూరులోని రవీంద్ర కళాక్షేత్రలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మన్నా డే పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు హెబ్బాళలోని విద్యుత్ శ్మశాన వాటికలో నిరాడంబరంగా ఆయన అంత్యక్రియలను నిర్వహించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, గవర్నర్ హెచ్.ఆర్.భరద్వాజ్ బీజేపీ ఎంపీ అనంతకుమార్ తదితరులు మన్నా డేకు నివాళులర్పించారు. మన్నా డే అసలు పేరు ప్రబోధ్చంద్ర డే. కోల్‌కతాలో 1919 మే 1న జన్మించిన ఆయన, 1943లో ‘తమన్నా’ చిత్రంలో సురయ్యాతో కలసి ‘సుర్ నా సజే కియా గావో మే’ పాటతో నేపథ్య గాయకునిగా పరిచయమయ్యారు. ఈ చిత్రానికి మన్నా డే చిన్నాన్న కృష్ణచంద్ర డే సంగీత దర్శకత్వం వహించారు. చిన్నాన్న ప్రోత్సాహంతోనే మన్నా డే రవీంద్ర సంగీతంలో సాధన చేశారు. 1991లో ‘ప్రహార్’ చిత్రంలో తన చివరి సినీగీతం ‘హమారీ హీ ముఠ్ఠీ మే’ పాడారు. ఆయన సమకాలికులైన మిగిలిన గాయకులతో పోలిస్తే, ఆయన పాడిన పాటలు రాశిలో తక్కువైనా, వాసిలో మిన్నవిగా అభిమానుల మన్ననలతో పాటు సినీరంగంలోనే శిఖరాయమానమైన ‘దాదా సాహెబ్ ఫాల్కే’ సహా పలు అవార్డులను తెచ్చిపెట్టాయి. కాలేజీ రోజుల్లో బెంగాల్లో పేరుపొందిన మల్ల యోధుడైన మన్నా డే, తర్వాతి కాలంలో సంగీతం వైపు మళ్లి మధుర గాయకుడిగా మారారు. రాజ్ కపూర్, దిలీప్ కుమార్, షమ్మీ కపూర్, రాజేశ్ ఖన్నా వంటి కథానాయకులతో పాటు ప్రాణ్ వంటి ప్రతినాయకునికి, మహమూద్ వంటి హాస్య నటులకు తన గాత్రాన్ని అందించి, అపురూపమైన గీతాలతో ప్రేక్షకులను అలరించారు. అమితాబ్ బచ్చన్ తండ్రి హరివంశ్రాయ్ బచ్చన్ రచించిన ‘మధుశాల’ను గానం చేసి, సంగీతాభిమానుల మన్ననలు పొందారు. ప్రముఖుల సంతాపం మన్నా డే మృతికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మో హన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి మనీష్ తివారీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గవర్నర్ ఎం.కె.నారాయణన్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, బంగ్లా అధ్యక్షుడు అబ్దుల్ హమీద్ తదితరులు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. సంగీత ప్రపంచం ‘మెలొడీ రారాజు’ను కోల్పోయిందని ప్రధాని మన్మోహన్ తన సంతాప ప్రకటనలో పేర్కొన్నారు. మన్నా డే గీతాలను ఉపఖండంలోని ప్రజలు ఎన్నటికీ మరువలేరని బంగ్లా ప్రధాని షేక్ హసీనా తన సందేశంలో పేర్కొన్నారు. దేశం ఒక గొప్ప గాయకుడిని, విలక్షణమైన కళాకారుడిని కోల్పోయిందని సోనియా, ప్రణబ్ తమ సందేశాల్లో పేర్కొన్నారు. మన్నా డే బెంగాలీలకు గర్వకారణమని మమతా బెనర్జీ కొనియాడారు. మన్నాడే మరణ వార్తతో పశ్చిమ బెంగాల్లో, పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి. మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చవాన్, గవర్నర్ కె.సత్యనారాయణన్, బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఎంపీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్, గవర్నర్ రామ్‌నరేశ్ యాదవ్ తదితరులు కూడా సంతాపం ప్రకటించారు. బాలీవుడ్లో విషాద ఛాయలు మన్నా డే మృతితో బాలీవుడ్లో విషాద ఛాయలు అలముకున్నాయి. బాలీవుడ్ ప్రముఖులు ఆయనతో తమకు గల అనుబంధాన్ని నెమరు వేసుకుంటూ, ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. మన్నా డేతో కలసి పలు గీతాలను ఆలపించిన లతా మంగేష్కర్, ఆయన అంకిత భావం గల కళాకారుడని కొనియాడుతూ నివాళులర్పించారు. ‘మా కోహినూర్‌ను కోల్పోయాం’ అంటూ ‘సరిగమ’ (ఇదివరకు హెచ్ఎంవీ) సంగీత సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది. మన్నా డే సాటిలేని గాయకుడని గాయని ఉషా ఉతుప్ కొనియాడారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, గీత రచయిత జావేద్ అక్తర్, తబలా విద్వాంసుడు జాకిర్ హుస్సేన్ తదితరులు మన్నా డేకు నివాళులర్పించారు. జాతి గర్వించదగ్గ వ్యక్తి మన్నా డే: ఎస్పీ బాలు నెల్లూరు, న్యూస్‌లైన్: జాతి గర్వించదగ్గ గొప్ప వ్యక్తి బెంగాలీ గాయకుడు మన్నాడే అని ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అన్నారు. మన్నాడే మృతికి బాలు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ఆయన నెల్లూరులో విలేకరులతో మాట్లాడుతూ, తనకు మహ్మద్ రఫీ ఇష్టమైనప్పటకీ, మన్నాడేను, ఆయన పాటలను అమితంగా గౌరవిస్తానని తెలిపారు. రెండు నెలల కిందట మన్నాడే జీవిత చరిత్రను ఆవిష్కరించే మహద్భాగ్యం తనకు దక్కిందన్నారు. మన్నాడే భౌతికంగా మృతి చెందినా, ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతారన్నారు. అయితే, మన్నాడేకు దక్కాల్సిన స్థాయిలో గుర్తింపు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ముఖ్య కార్యక్రమం ఉండడంతో అంతిమయాత్రలో పాల్గొనలేకపోయినట్టు వివరించారు. మమత విజ్ఞప్తిని నిరాకరించిన మన్నా డే కుమార్తె అంత్యక్రియల కోసం మన్నా డే భౌతిక కాయాన్ని కోల్‌కతా తీసుకురావాలంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన విజ్ఞప్తిని మన్నా డే కుమార్తె సుమితా నిరాకరించారు. మన్నా డే ఖాతా నుంచి మోసపూరితంగా సొమ్ము విత్ డ్రా చేసిన కేసుకు సంబంధించి మమత సర్కారు తమ కుటుంబానికి ఎలాంటి సహకారం అందించలేదని ఆమె ఆరోపించారు. అంత్యక్రియలకు తాను అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసిన తర్వాత, భౌతిక కాయాన్ని కోల్‌కతా తేవాలని మమత విజ్ఞప్తి చేశారని, ఈ పరిస్థితిలో అక్కడకు ఎలా వెళ్లగలమని ఆమె ప్రశ్నించారు. అయితే, మన్నా డే కుటుంబానికి తమ ప్రభుత్వం సహకరించలేదనే ఆరోపణను మమత తోసిపుచ్చారు. గత ఏడాది బెంగళూరు వెళ్లినప్పుడు తాను మన్నా డేను వ్యక్తిగతంగా కలుసుకున్నానని, కోల్‌కతా వచ్చి ఉండదలిస్తే, తన ఇంటి గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉండవచ్చని కూడా చెప్పానని అన్నారు. నెరవేరని తుది కోరిక గత ఏడాది మరణించిన తన భార్య సులోచన జ్ఞాపకంగా ఒక భావోద్వేగభరితమైన ప్రేమగీతాన్ని పాడి రికార్డు చేయాలని మన్నా డేకు చివరి కోరికగా ఉండేది. ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆయన చివరి కోరిక నెరవేరలేదని, మన్నా డే సహచరుడు, సంగీత దర్శకుడు సుపర్ణకాంతి ఘోష్ చెప్పారు. -
ఒక పాట నిదురించడానికి వెళ్లింది...
వీడ్కోలు: పాటకు న్యాయం చేసేవాడు అని మన్నా డేకు పేరు. అతడు పాటను తలత్లా మరీ సున్నితం చేయడు. రఫీలా మరీ అచ్చు తప్పు లేనట్టు పాడడు. ముఖేశ్లా మరీ శోకసంద్రంలో ముంచడు. కిశోర్‌లా మరీ హద్దులు మీరి గెంతడు. దానిని ఎంత అవసరమో అంత, మరికొంత ఉంటే బాగుండనిపించేలా... మరికాస్త తీపికి ముఖం వాచేలా. తూ ఛుపీ హై కహా మై తడప్తా యహా.... ఒక పాట నిదురించడానికి వెళ్లింది. మన బుగ్గల మీద మెల్లగా తట్టి, చిన్నగా పరిహాసమాడి, మరెళ్లొస్తాను సుమా అని, బాధ పడకుండా ఉండేందుకు, విరహంతో వేగకుండా ఉండేందుకు, ఎడబాటులో రగిలిపోకుండా ఉండేందుకు కొన్ని పాటల్ని- ఉత్త రంగురాళ్లుగా కాకుండా రతనాలుగా, మణిమాణిక్యాలుగా, ఏం చెప్తాం మన ఇంటి అరుగు నుంచి తుంచిన కొన్ని మట్టిబెడ్డలుగా మూటగట్టి, పదిలంగా అప్పజెప్పి, మళ్లీ రానని, ఏడు ఆకాశాల ఆవల మువ్వల పరుపు మీద శయనించడానికి, పల్లవులను చరణాలుగా చేసుకొని కరుగుతూ కరుగుతూ అదృశ్యమైపోయింది. దేవుని దప్పిక తీర్చడానికి చేసిన పయనమది. నరకలోక జనుల గాయాలను ముద్దాడి సేద తీర్చేందుకు పయనం. తూ ప్యార్ కా సాగర్ హై తేరి ఏక్ బూంద్ కే ప్యాసే హమ్... సారా తాగి తాగి నలభై ఏళ్ల వయసులో సైగల్ పోయాడు. తన్తో పాటు ఆ గరగరలాడే స్వరాన్ని, పొగలు పొగలుగా ఒరుసుకునే గాత్రాన్ని దయా కనికరం లేకుండా పట్టుకొని పోయాడు. కాని- బీడుపడ్డ మైదానాలను ప్రకృతి అలాగే వదల్దు. పాడుబడ్డ హృదయాలను తడపకుండా మేఘం ఘనీభవించి మిగలదు. పాత పంజాబు నుంచి రఫీ వచ్చాడు. లక్నో నుంచి తలత్ వచ్చాడు. ‘దిల్లీ’ నుంచి మధురమైన ‘మాధుర్’ను ఇంటి పేరుగా కలిగిన ముఖేశ్ వచ్చాడు. దిల్ జల్తా హై తో జల్నే దే - ఇది నేను అన్నాడు ముఖేశ్. సుహానీ రాత్ ఢల్ చుకీ - ఇది నేనే అన్నాడు రఫీ. ఏయ్ దిల్ ముఝే ఐసీ జగా లే చల్ - ఇది నేనూ అని ఎవరూ లేని చోటుకు తీసుకెళతానన్నాడు తలత్. 1950ల నాటికి ముగ్గురూ దోగాడటం మాని మైక్రోఫోన్ ముందు తడబడకుండా నిలబడి పాడే ఎత్తుకు ఎదిగారు. మన్నా డేకి ఆ అదృష్టం పట్టలేదు. ఆ ఫేమ్ తలుపు తట్టలేదు. బారిష్టర్ చదువు చదవమని కోరే తండ్రిని సుతారంగా కాదని కలకత్తా నుంచి బాబాయ్ కె.సి.డేతో కలిసి హార్మోనియం మెట్లే ఆస్తిగా బొంబాయి వస్తే, పాటందుకోవడానికి వస్తే, పాటనేలడానికి వస్తే ఆ గెలుపు అంత సులువుగా దొరకలేదు. అన్నీ బి గ్రేడ్, సి గ్రేడ్ సినిమాలు... ముక్కూ మొహం ఎరగని పాటలు. ఈలోపు రఫీ నౌషాద్‌ను గెలుచుకున్నాడు. తలత్ దిలీప్‌ను. ముఖేశ్- నర్గిస్ సహిత రాజ్‌కపూర్‌ను. మన్నా డే ఎక్కడకు వెళ్లాలని? అవకాశం ఎప్పటికి అతడి తలుపు తట్టాలని? కౌన్ ఆయా మేరె మన్ కే ద్వారె పాయల్కీ ఝన్కార్ లియే... ‘మున్నా’ అంటే ‘బుజ్జీ’ అని అర్థం. కె.సి.డే అలా పిలిచేవాడు. అదే ‘మన్నా’గా మారి మన్నా డే అయ్యింది. ఏ ముహూర్తాన ఆ పేరు వచ్చిందోగాని కెరీర్ మొదలు పెట్టింది మొదలు అన్నీ చిట్టి పొట్టి బుజ్జి అవకాశాలే. ఇంత మంచి గొంతు ఉండీ, ఇంత మంచి ప్రతిభ ఉండీ, ఇంతగా క్లాసికల్లో కంఠ నరాలు తెగే సాధన ఉండీ... బాధ... ఏడుపు... కోత. పగవాడికి కూడా వద్దు. ఆఖరుకు ఎస్డి బర్మన్ తనూరోడే కనుక అశోక్ కుమార్ తీసిన ‘మషాల్’ (’50)లో మంచి పాట ఇచ్చి- ఒరే... దీన్తో నువ్వు పేలాల్రా బాబూ అని వెన్ను తడితే- అంత వరకూ ఉక్కిరిబిక్కిరిగా ఉన్నవాడు కళ్లు రెండూ తుడుచుకుని- ఊపిరి పీల్చుకొని- ఊపర్ గగన్ విశాల్- అని ఎలుగెత్తి అందుకుంటే అందరూ అదిరిపోయారు. ఒక చెయ్యి గూబకు ఆన్చి ఒక చెయ్యి ఆకాశానికి చూపుతూ పాడుతూ ఉంటే ఆ ఆకాశమే అతడి ప్రతిభకు హద్దు అని గ్రహించారు. ఆ తర్వాత ‘దో బీఘా జమీన్’ ఇంకో పెద్ద హిట్. అందులో ధర్తీ కహే పుకార్కే- అని ఆరుబయలు నారు పోసే పొలాల మధ్య, వరుస తీరిన రైతు కూలీల కోరస్ల మధ్య మన్నా డే పాట కూడా కొత్తకొత్తగా మొలకెత్తుతూ ఉంటే అదోరకం పులకరం. అయితే దురదృష్టం ఏమిటంటే ఆ పాటగానీ ఈ పాటగానీ తీసింది హీరోల మీద కాదు. బల్రాజ్ సహానీ వంటి బీదాబిక్కీ రైతుల మీద. ముక్కూముఖం ఎరగని జూనియర్ ఆర్టిస్టుల మీద. దాంతో స్టాంప్ పడిపోయింది. ఇతడు హీరోల సింగర్ కాడు. క్యారెక్టర్ ఆర్టిస్టుల సింగర్. మన్నా డేకు ఏం అర్థం కాలేదు. వెన్నాజున్నులు మాత్రం పాలు కావా? తన గొంతులో మాత్రం మీగడ తరగలు లేవా? ఏ మేరి జొహర్జబీ తుఝే మాలూమ్ నహీ తూ అభీ తక్ హై హసీ ఔర్ మై జవాన్.... అయితే ఎంతకాలమని వెన్నెలను కానలలోనే అణుస్తారు. ధారలను భూపొరలలోనే దాస్తారు. వెలికి వస్తాయవి. ఉబికి చిమ్ముతాయి పైకి. అదను మీద ఉన్న మన్నా డేను పదునైన పాటలతో కలిశారు శంకర్-జై కిషన్‌లు. ఇద్దరూ అణాకానీ బతుకు నుంచి పైకొచ్చినవారే. టాలెంట్‌కు విలువిచ్చేవారే. అదిఉండాలేగాని నీవాడైతే ఏంటి నావాడైతే ఏంటి. పాట పేలాలి. రాజ్‌కపూర్‌కు చెప్పి, ముఖేశ్‌ను కాసేపు పక్కన పెట్టమని ఒప్పించి మన్నా డేకు పాటలిచ్చారు. వేరేవి అనవసరం. రెండు మాత్రం గుర్తు చేసుకోవాలి. ఒకటి- గాలిగాలిగా ఉన్న ఆ వెలుతురు రాత్రి, అక్కడే వేళ్లాడుతున్న చందమామ, పక్కన పిల్లంగోవిలాంటి అబ్బాయి రాజ్‌కపూర్, వెంట కోరిక కలిగిన తురంగంలా చూసే నర్గిస్ (చోరీ చోరీ). రెండోది- దేవుడా... ఎవరు మాత్రం మర్చిపోగలరు ఆ పాటని... ఆ వాననీ... ఆ గొడుగు... ఆ కొయ్య వంతెన... పొగలు గక్కే చాయ్... తడిసిన రాజ్‌కపూర్ జోళ్లు... ఒణికే నర్గిస్ పెదాలు... రేగే మన్నా డే గమకాలు (శ్రీ 420).... ఏ రాత్ భీగీ భీగీ ఏ మస్త్ ఫిజాయే ఉఠా ధీరే ధీరే ఓ చాంద్ ప్యారా ప్యారా... ప్యార్ హువా ఇక్రార్ హువాహై ప్యార్‌సే ఫిర్ క్యూ డర్తాహై దిల్... పాటకు న్యాయం చేసేవాడు అని మన్నా డేకు పేరు. అతడు పాటను తలత్లా మరీ సున్నితం చేయడు. రఫీలా మరీ అచ్చు తప్పు ల్లేనట్టు పాడడు. ముఖేశ్లా మరీ శోకసంద్రంలో ముంచడు. కిశోర్‌లా మరీ హద్దులు మీరి గెంతడు. దానికి ఎంత అవసరమో అంత. మరికొంత ఉంటే బాగుండనిపించేంత... మరికాస్త తీపికి ముఖం వాచేంత. కావాలంటే ‘బహారోంకే సప్నే’లోని పాటను గుర్తు చేసుకోండి. ఆశా పరేఖ్, రాజేష్ఖన్నాలు మనకెందుకు. లతా, మన్నా డేలతో పదండి వెనుకకు. చునరీ సంభాల్ గోరీ ఉఢీ చలీ జాయెరే మార్ నా దే డంక్ కహీ నజర్ కోయి హాయ్.... కిశోర్ మీద ముందు నుంచి కన్నుంది ఎస్డి బర్మన్కు. దేవ్ ఆనంద్‌కు రకరకాల పాటలు పాడించాడు ఎప్పుడో. రఫీ అంటే ఎంత ఇష్టం ఉన్నా కిశోర్‌కు ఇవ్వాల్సింది కిశోర్కే. కాని ఆయన కడుపున పుట్టిన ఆర్డి బర్మన్ వచ్చి కిశోర్ మీద ఇంకా ప్రేమను చాటుకొని ‘ఆరాధన’తో కిశోర్‌ను సూపర్‌స్టార్‌ని చేశాడు. సంగీతం గురించి ఏమాత్రం తెలియని కిశోర్ సూపర్‌స్టార్ కావడమా? సంగీతం గురించి క్షుణ్ణంగా తెలిసిన మన్నా డే మౌనంగా చూడటమా? అవకాశం కోసం చూస్తూ ఉన్నాడు. వచ్చింది. ‘పడోసన్’ సినిమా. కిశోర్, మన్నా డేల మధ్య పోటీ పాట. ఈ పాటతో వాణ్ణి ఫినిష్ చేస్తా అనుకున్నాడు మన్నా డే. ‘ఏక్ చతురనార్... బడీ హోషియార్’. సంగీతం ఆర్.డి.బర్మన్. కాని ఏ సంగతీ చెప్పలేదు మన్నా డేకి. అతడి గొంతును మెహమూద్‌కు వాడతారట. సునీల్ దత్‌కు కిశోర్ గొంతు అట. మన్నా డే పాడాడు. కిశోర్ ఇంప్రవైజేషన్ పేరుతో అరిచి గోల చేసి అదే పాటగా రికార్డు చేశాడు. తీరా స్క్రీన్ మీద చూస్తే కిశోర్ చేతిలో ఓటమి. మన్నా డేకి బాధ. ఎంత అన్యాయం ఇది. కాని ఎరిగినవాళ్లకు తెలియదా ఎవరిది గెలుపో. కిశోర్ మన్నా డేను అందుకోగలడా? అయితే ఈ పాట పాడమనండి. లాగా చున్రీ మే దాగ్ ఛుపావూ కైసే ఘర్ జావూ కైసే? పోనీ ఈ పాటను. సుర్ నా సజే క్యా గావూ మై సుర్ కే బినా జీవన్ సూనా... భారతీయ సినీగీతానికి మన్నా డే కాంట్రిబ్యూషన్ ఏదైనా ఉందంటే అది ఆయన ఇన్నాళ్లు తనలా ఉంటూనే ఎవరికైనా సరే ఒక పర్ఫెక్ట్ సబ్‌స్టిట్యూట్‌గా ఉండటమే. ఆయన కిశోర్‌లాంటి పాట పాడగలడు. రఫీలాంటిది పాడగలడు. హేమంత కుమార్లాంటిది కూడా. బెంగాలీలో ఒక పాటను సలీల్ చౌధురి హేమంత కుమార్ చేత పాడించాడు. అదే పాటను ఒక మెట్టు ఎక్కించడానికి ‘ఆనంద్’లో మన్నా డే చేత. హేమంతకు ఒక పూలహారం ఎలాగూ వేస్తాము. కాని మన్నా డేకు రెండు. గుర్తుందా ఆ పాట. బరువైన ఆనందంలాంటి పాట. జిందగీ కైసి హై పహేలీ హాయే కభితో హసాయే కభితో రులాయే.... కొన్ని పాటలు చెప్పుకోకపోతే ఇంటికొచ్చి తంతారు. ఆవో ట్విస్ట్ కరే; బాబూ... సంఝో ఇషారే; ఏ మెరే ప్యారే వతన్; యారీ హై ఈమాన్ మేరి; ఏ భాయ్ జరా దేఖ్ కే చలో... మన్నా డే ఈ పాటలన్నింటితో నాలుగు దశకాల పాటు మనందరినీ తాకాడు. మన అనేక సందర్భాల్లో మరువలేని అతిథిలా కదలాడాడు. ఆయన పాట ఎప్పటికీ భూలే బిస్రే గీత్ కాలేదు. అది కాలం గడిచే కొద్దీ రుచులు ఊరే పాత మధువు. పోనీ మర్నాటికీ మరువలేని ఒక లేత జ్ఞాపకం. - ఖదీర్ -
ప్రముఖ గాయకుడు మన్నాడే కన్నుమూత
బెంగళూరు : ప్రముఖ గాయకుడు, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ప్రబోధ్ చంద్ర డే అలియాస్ మన్నాడే (94) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఊపిరి తిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున 3.50 చనిపోయారు. దిల్ కా హాల్ సునో, ముడ్ ముడ్ కే న దేఖో, లాగా చునరీ మే దాగ్, సుర్ నా సజనా, ఏ భాయ్ జరా దేఖ కే చలో, యే రాత్ భీగీ భీగీ, ప్యార్ హువా ఇకరార్ హువా, ఝనక్ ఝనక్ తేరీ బాజే పాయెలియా, కౌన్ ఆయా మేరే మన్ కే ద్వారే,, పూఛో న కైసే రైన్ బితాయే, ధర్తీ కహే పుకార్ కే..... వంటి ఎన్నో అజరామరమైన పాటలు పాడిన స్వరధుని గొంతుక భౌతికంగా మూగబోయింది. 1919 మే 1 న కోల్‌కతాలో పుట్టిన మన్నాడే ప్రఖ్యాత బెంగాలీ సంగీత సామ్రాట్ కృష్ణచంద్ర డేకి సోదరుని కుమారుడు. కె సి డే ఆయనకి తొలి సంగీత పాఠాలు నేర్పిన గురువు కూడా. 1942లో ముంబయి వచ్చిన మన్నాడే ఎస్ డి బర్మన్ (సచిన్‌దేవ్ బర్మన్) దగ్గర అసిస్టెంట్‌గా చేరి, తమన్నా సినిమాతో నేపథ్యగాయకుడిగా మారారు. అమర్ భూపాలి గాయకుడిగా ఆయన జీవతంలో ఓ మైలురాయి. తర్వాత, షోలే, పడోసన్, మేరానామ్ జోకర్, బర్సాత్కీ ఏక్ రాత్, సఫర్, సాఖీ, జ్యోతి, అనిత, పతి పత్ని ఔర్ ఓ, వక్త్, ఉపకార్, బాబీ, ఆనంద్ తదితర అసంఖ్యాకమైన చిత్రాల్లో ఆయన హిట్ పాటలెన్నో పాడారు. 1950 నుంచి 1970 వరకు హిందీ చలనచిత్ర రంగంతో పాటు బెంగాలీలో దాదాపు 3,500 పాటలకు పైగా పాడారు. మెలోడీకి మారు పేరు మన్నాడే అనిపించుకున్నారు. ప్రత్యేకించి రాజ్ కపూర్ సినిమాల్లో ఆయన పాటలు లేకుండా ఉండేవి కాదు. బెంగాలీలోను పలు చిత్రాల్లో పాటలు పాడారు. ఆయనకు ఫాల్కే అవార్డు అవసాన దశలో వచ్చినా, పద్మశ్రీ, పద్మభూషణ్‌లు ముందే వరించాయి. భారత చలనచిత్ర రంగంలోనే అత్యంత ప్రతిభావంతుడైన గాయకుడిగా పేరు పొందిన మన్నాడే బెంగళూరులో స్థిరపడ్డారు. ఆయన మృతి పట్ల హిందీ చిత్రసీమ సంతాపం ప్రకటించింది.