ప్రముఖ గాయకుడు మన్నాడే కన్నుమూత
బెంగళూరు : ప్రముఖ గాయకుడు, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ప్రబోధ్ చంద్ర డే అలియాస్ మన్నాడే (94) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఊపిరి తిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున 3.50 చనిపోయారు.
దిల్ కా హాల్ సునో, ముడ్ ముడ్ కే న దేఖో, లాగా చునరీ మే దాగ్, సుర్ నా సజనా, ఏ భాయ్ జరా దేఖ కే చలో, యే రాత్ భీగీ భీగీ, ప్యార్ హువా ఇకరార్ హువా, ఝనక్ ఝనక్ తేరీ బాజే పాయెలియా, కౌన్ ఆయా మేరే మన్ కే ద్వారే,, పూఛో న కైసే రైన్ బితాయే, ధర్తీ కహే పుకార్ కే..... వంటి ఎన్నో అజరామరమైన పాటలు పాడిన స్వరధుని గొంతుక భౌతికంగా మూగబోయింది.
1919 మే 1 న కోల్‌కతాలో పుట్టిన మన్నాడే ప్రఖ్యాత బెంగాలీ సంగీత సామ్రాట్ కృష్ణచంద్ర డేకి సోదరుని కుమారుడు. కె సి డే ఆయనకి తొలి సంగీత పాఠాలు నేర్పిన గురువు కూడా. 1942లో ముంబయి వచ్చిన మన్నాడే ఎస్ డి బర్మన్ (సచిన్‌దేవ్ బర్మన్) దగ్గర అసిస్టెంట్‌గా చేరి, తమన్నా సినిమాతో నేపథ్యగాయకుడిగా మారారు. అమర్ భూపాలి గాయకుడిగా ఆయన జీవతంలో ఓ మైలురాయి.
తర్వాత, షోలే, పడోసన్, మేరానామ్ జోకర్, బర్సాత్‌కీ ఏక్ రాత్, సఫర్, సాఖీ, జ్యోతి, అనిత, పతి పత్ని ఔర్ ఓ, వక్త్, ఉపకార్, బాబీ, ఆనంద్ తదితర అసంఖ్యాకమైన చిత్రాల్లో ఆయన హిట్ పాటలెన్నో పాడారు. 1950 నుంచి 1970 వరకు హిందీ చలనచిత్ర రంగంతో పాటు బెంగాలీలో దాదాపు 3,500 పాటలకు పైగా పాడారు. మెలోడీకి మారు పేరు మన్నాడే అనిపించుకున్నారు. ప్రత్యేకించి రాజ్ కపూర్ సినిమాల్లో ఆయన పాటలు లేకుండా ఉండేవి కాదు. బెంగాలీలోను పలు చిత్రాల్లో పాటలు పాడారు. ఆయనకు ఫాల్కే అవార్డు అవసాన దశలో వచ్చినా, పద్మశ్రీ, పద్మభూషణ్‌లు ముందే వరించాయి.
భారత చలనచిత్ర రంగంలోనే అత్యంత ప్రతిభావంతుడైన గాయకుడిగా పేరు పొందిన మన్నాడే బెంగళూరులో స్థిరపడ్డారు. ఆయన మృతి పట్ల హిందీ చిత్రసీమ సంతాపం ప్రకటించింది.