Manna Dey passes away
-
ఒక పాట నిదురించడానికి వెళ్లింది...
వీడ్కోలు: పాటకు న్యాయం చేసేవాడు అని మన్నా డేకు పేరు. అతడు పాటను తలత్లా మరీ సున్నితం చేయడు. రఫీలా మరీ అచ్చు తప్పు లేనట్టు పాడడు. ముఖేశ్లా మరీ శోకసంద్రంలో ముంచడు. కిశోర్‌లా మరీ హద్దులు మీరి గెంతడు. దానిని ఎంత అవసరమో అంత, మరికొంత ఉంటే బాగుండనిపించేలా... మరికాస్త తీపికి ముఖం వాచేలా. తూ ఛుపీ హై కహా మై తడప్తా యహా.... ఒక పాట నిదురించడానికి వెళ్లింది. మన బుగ్గల మీద మెల్లగా తట్టి, చిన్నగా పరిహాసమాడి, మరెళ్లొస్తాను సుమా అని, బాధ పడకుండా ఉండేందుకు, విరహంతో వేగకుండా ఉండేందుకు, ఎడబాటులో రగిలిపోకుండా ఉండేందుకు కొన్ని పాటల్ని- ఉత్త రంగురాళ్లుగా కాకుండా రతనాలుగా, మణిమాణిక్యాలుగా, ఏం చెప్తాం మన ఇంటి అరుగు నుంచి తుంచిన కొన్ని మట్టిబెడ్డలుగా మూటగట్టి, పదిలంగా అప్పజెప్పి, మళ్లీ రానని, ఏడు ఆకాశాల ఆవల మువ్వల పరుపు మీద శయనించడానికి, పల్లవులను చరణాలుగా చేసుకొని కరుగుతూ కరుగుతూ అదృశ్యమైపోయింది. దేవుని దప్పిక తీర్చడానికి చేసిన పయనమది. నరకలోక జనుల గాయాలను ముద్దాడి సేద తీర్చేందుకు పయనం. తూ ప్యార్ కా సాగర్ హై తేరి ఏక్ బూంద్ కే ప్యాసే హమ్... సారా తాగి తాగి నలభై ఏళ్ల వయసులో సైగల్ పోయాడు. తన్తో పాటు ఆ గరగరలాడే స్వరాన్ని, పొగలు పొగలుగా ఒరుసుకునే గాత్రాన్ని దయా కనికరం లేకుండా పట్టుకొని పోయాడు. కాని- బీడుపడ్డ మైదానాలను ప్రకృతి అలాగే వదల్దు. పాడుబడ్డ హృదయాలను తడపకుండా మేఘం ఘనీభవించి మిగలదు. పాత పంజాబు నుంచి రఫీ వచ్చాడు. లక్నో నుంచి తలత్ వచ్చాడు. ‘దిల్లీ’ నుంచి మధురమైన ‘మాధుర్’ను ఇంటి పేరుగా కలిగిన ముఖేశ్ వచ్చాడు. దిల్ జల్తా హై తో జల్నే దే - ఇది నేను అన్నాడు ముఖేశ్. సుహానీ రాత్ ఢల్ చుకీ - ఇది నేనే అన్నాడు రఫీ. ఏయ్ దిల్ ముఝే ఐసీ జగా లే చల్ - ఇది నేనూ అని ఎవరూ లేని చోటుకు తీసుకెళతానన్నాడు తలత్. 1950ల నాటికి ముగ్గురూ దోగాడటం మాని మైక్రోఫోన్ ముందు తడబడకుండా నిలబడి పాడే ఎత్తుకు ఎదిగారు. మన్నా డేకి ఆ అదృష్టం పట్టలేదు. ఆ ఫేమ్ తలుపు తట్టలేదు. బారిష్టర్ చదువు చదవమని కోరే తండ్రిని సుతారంగా కాదని కలకత్తా నుంచి బాబాయ్ కె.సి.డేతో కలిసి హార్మోనియం మెట్లే ఆస్తిగా బొంబాయి వస్తే, పాటందుకోవడానికి వస్తే, పాటనేలడానికి వస్తే ఆ గెలుపు అంత సులువుగా దొరకలేదు. అన్నీ బి గ్రేడ్, సి గ్రేడ్ సినిమాలు... ముక్కూ మొహం ఎరగని పాటలు. ఈలోపు రఫీ నౌషాద్‌ను గెలుచుకున్నాడు. తలత్ దిలీప్‌ను. ముఖేశ్- నర్గిస్ సహిత రాజ్‌కపూర్‌ను. మన్నా డే ఎక్కడకు వెళ్లాలని? అవకాశం ఎప్పటికి అతడి తలుపు తట్టాలని? కౌన్ ఆయా మేరె మన్ కే ద్వారె పాయల్కీ ఝన్కార్ లియే... ‘మున్నా’ అంటే ‘బుజ్జీ’ అని అర్థం. కె.సి.డే అలా పిలిచేవాడు. అదే ‘మన్నా’గా మారి మన్నా డే అయ్యింది. ఏ ముహూర్తాన ఆ పేరు వచ్చిందోగాని కెరీర్ మొదలు పెట్టింది మొదలు అన్నీ చిట్టి పొట్టి బుజ్జి అవకాశాలే. ఇంత మంచి గొంతు ఉండీ, ఇంత మంచి ప్రతిభ ఉండీ, ఇంతగా క్లాసికల్లో కంఠ నరాలు తెగే సాధన ఉండీ... బాధ... ఏడుపు... కోత. పగవాడికి కూడా వద్దు. ఆఖరుకు ఎస్డి బర్మన్ తనూరోడే కనుక అశోక్ కుమార్ తీసిన ‘మషాల్’ (’50)లో మంచి పాట ఇచ్చి- ఒరే... దీన్తో నువ్వు పేలాల్రా బాబూ అని వెన్ను తడితే- అంత వరకూ ఉక్కిరిబిక్కిరిగా ఉన్నవాడు కళ్లు రెండూ తుడుచుకుని- ఊపిరి పీల్చుకొని- ఊపర్ గగన్ విశాల్- అని ఎలుగెత్తి అందుకుంటే అందరూ అదిరిపోయారు. ఒక చెయ్యి గూబకు ఆన్చి ఒక చెయ్యి ఆకాశానికి చూపుతూ పాడుతూ ఉంటే ఆ ఆకాశమే అతడి ప్రతిభకు హద్దు అని గ్రహించారు. ఆ తర్వాత ‘దో బీఘా జమీన్’ ఇంకో పెద్ద హిట్. అందులో ధర్తీ కహే పుకార్కే- అని ఆరుబయలు నారు పోసే పొలాల మధ్య, వరుస తీరిన రైతు కూలీల కోరస్ల మధ్య మన్నా డే పాట కూడా కొత్తకొత్తగా మొలకెత్తుతూ ఉంటే అదోరకం పులకరం. అయితే దురదృష్టం ఏమిటంటే ఆ పాటగానీ ఈ పాటగానీ తీసింది హీరోల మీద కాదు. బల్రాజ్ సహానీ వంటి బీదాబిక్కీ రైతుల మీద. ముక్కూముఖం ఎరగని జూనియర్ ఆర్టిస్టుల మీద. దాంతో స్టాంప్ పడిపోయింది. ఇతడు హీరోల సింగర్ కాడు. క్యారెక్టర్ ఆర్టిస్టుల సింగర్. మన్నా డేకు ఏం అర్థం కాలేదు. వెన్నాజున్నులు మాత్రం పాలు కావా? తన గొంతులో మాత్రం మీగడ తరగలు లేవా? ఏ మేరి జొహర్జబీ తుఝే మాలూమ్ నహీ తూ అభీ తక్ హై హసీ ఔర్ మై జవాన్.... అయితే ఎంతకాలమని వెన్నెలను కానలలోనే అణుస్తారు. ధారలను భూపొరలలోనే దాస్తారు. వెలికి వస్తాయవి. ఉబికి చిమ్ముతాయి పైకి. అదను మీద ఉన్న మన్నా డేను పదునైన పాటలతో కలిశారు శంకర్-జై కిషన్‌లు. ఇద్దరూ అణాకానీ బతుకు నుంచి పైకొచ్చినవారే. టాలెంట్‌కు విలువిచ్చేవారే. అదిఉండాలేగాని నీవాడైతే ఏంటి నావాడైతే ఏంటి. పాట పేలాలి. రాజ్‌కపూర్‌కు చెప్పి, ముఖేశ్‌ను కాసేపు పక్కన పెట్టమని ఒప్పించి మన్నా డేకు పాటలిచ్చారు. వేరేవి అనవసరం. రెండు మాత్రం గుర్తు చేసుకోవాలి. ఒకటి- గాలిగాలిగా ఉన్న ఆ వెలుతురు రాత్రి, అక్కడే వేళ్లాడుతున్న చందమామ, పక్కన పిల్లంగోవిలాంటి అబ్బాయి రాజ్‌కపూర్, వెంట కోరిక కలిగిన తురంగంలా చూసే నర్గిస్ (చోరీ చోరీ). రెండోది- దేవుడా... ఎవరు మాత్రం మర్చిపోగలరు ఆ పాటని... ఆ వాననీ... ఆ గొడుగు... ఆ కొయ్య వంతెన... పొగలు గక్కే చాయ్... తడిసిన రాజ్‌కపూర్ జోళ్లు... ఒణికే నర్గిస్ పెదాలు... రేగే మన్నా డే గమకాలు (శ్రీ 420).... ఏ రాత్ భీగీ భీగీ ఏ మస్త్ ఫిజాయే ఉఠా ధీరే ధీరే ఓ చాంద్ ప్యారా ప్యారా... ప్యార్ హువా ఇక్రార్ హువాహై ప్యార్‌సే ఫిర్ క్యూ డర్తాహై దిల్... పాటకు న్యాయం చేసేవాడు అని మన్నా డేకు పేరు. అతడు పాటను తలత్లా మరీ సున్నితం చేయడు. రఫీలా మరీ అచ్చు తప్పు ల్లేనట్టు పాడడు. ముఖేశ్లా మరీ శోకసంద్రంలో ముంచడు. కిశోర్‌లా మరీ హద్దులు మీరి గెంతడు. దానికి ఎంత అవసరమో అంత. మరికొంత ఉంటే బాగుండనిపించేంత... మరికాస్త తీపికి ముఖం వాచేంత. కావాలంటే ‘బహారోంకే సప్నే’లోని పాటను గుర్తు చేసుకోండి. ఆశా పరేఖ్, రాజేష్ఖన్నాలు మనకెందుకు. లతా, మన్నా డేలతో పదండి వెనుకకు. చునరీ సంభాల్ గోరీ ఉఢీ చలీ జాయెరే మార్ నా దే డంక్ కహీ నజర్ కోయి హాయ్.... కిశోర్ మీద ముందు నుంచి కన్నుంది ఎస్డి బర్మన్కు. దేవ్ ఆనంద్‌కు రకరకాల పాటలు పాడించాడు ఎప్పుడో. రఫీ అంటే ఎంత ఇష్టం ఉన్నా కిశోర్‌కు ఇవ్వాల్సింది కిశోర్కే. కాని ఆయన కడుపున పుట్టిన ఆర్డి బర్మన్ వచ్చి కిశోర్ మీద ఇంకా ప్రేమను చాటుకొని ‘ఆరాధన’తో కిశోర్‌ను సూపర్‌స్టార్‌ని చేశాడు. సంగీతం గురించి ఏమాత్రం తెలియని కిశోర్ సూపర్‌స్టార్ కావడమా? సంగీతం గురించి క్షుణ్ణంగా తెలిసిన మన్నా డే మౌనంగా చూడటమా? అవకాశం కోసం చూస్తూ ఉన్నాడు. వచ్చింది. ‘పడోసన్’ సినిమా. కిశోర్, మన్నా డేల మధ్య పోటీ పాట. ఈ పాటతో వాణ్ణి ఫినిష్ చేస్తా అనుకున్నాడు మన్నా డే. ‘ఏక్ చతురనార్... బడీ హోషియార్’. సంగీతం ఆర్.డి.బర్మన్. కాని ఏ సంగతీ చెప్పలేదు మన్నా డేకి. అతడి గొంతును మెహమూద్‌కు వాడతారట. సునీల్ దత్‌కు కిశోర్ గొంతు అట. మన్నా డే పాడాడు. కిశోర్ ఇంప్రవైజేషన్ పేరుతో అరిచి గోల చేసి అదే పాటగా రికార్డు చేశాడు. తీరా స్క్రీన్ మీద చూస్తే కిశోర్ చేతిలో ఓటమి. మన్నా డేకి బాధ. ఎంత అన్యాయం ఇది. కాని ఎరిగినవాళ్లకు తెలియదా ఎవరిది గెలుపో. కిశోర్ మన్నా డేను అందుకోగలడా? అయితే ఈ పాట పాడమనండి. లాగా చున్రీ మే దాగ్ ఛుపావూ కైసే ఘర్ జావూ కైసే? పోనీ ఈ పాటను. సుర్ నా సజే క్యా గావూ మై సుర్ కే బినా జీవన్ సూనా... భారతీయ సినీగీతానికి మన్నా డే కాంట్రిబ్యూషన్ ఏదైనా ఉందంటే అది ఆయన ఇన్నాళ్లు తనలా ఉంటూనే ఎవరికైనా సరే ఒక పర్ఫెక్ట్ సబ్‌స్టిట్యూట్‌గా ఉండటమే. ఆయన కిశోర్‌లాంటి పాట పాడగలడు. రఫీలాంటిది పాడగలడు. హేమంత కుమార్లాంటిది కూడా. బెంగాలీలో ఒక పాటను సలీల్ చౌధురి హేమంత కుమార్ చేత పాడించాడు. అదే పాటను ఒక మెట్టు ఎక్కించడానికి ‘ఆనంద్’లో మన్నా డే చేత. హేమంతకు ఒక పూలహారం ఎలాగూ వేస్తాము. కాని మన్నా డేకు రెండు. గుర్తుందా ఆ పాట. బరువైన ఆనందంలాంటి పాట. జిందగీ కైసి హై పహేలీ హాయే కభితో హసాయే కభితో రులాయే.... కొన్ని పాటలు చెప్పుకోకపోతే ఇంటికొచ్చి తంతారు. ఆవో ట్విస్ట్ కరే; బాబూ... సంఝో ఇషారే; ఏ మెరే ప్యారే వతన్; యారీ హై ఈమాన్ మేరి; ఏ భాయ్ జరా దేఖ్ కే చలో... మన్నా డే ఈ పాటలన్నింటితో నాలుగు దశకాల పాటు మనందరినీ తాకాడు. మన అనేక సందర్భాల్లో మరువలేని అతిథిలా కదలాడాడు. ఆయన పాట ఎప్పటికీ భూలే బిస్రే గీత్ కాలేదు. అది కాలం గడిచే కొద్దీ రుచులు ఊరే పాత మధువు. పోనీ మర్నాటికీ మరువలేని ఒక లేత జ్ఞాపకం. - ఖదీర్ -
ప్రముఖ గాయకుడు మన్నాడే కన్నుమూత
బెంగళూరు : ప్రముఖ గాయకుడు, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ప్రబోధ్ చంద్ర డే అలియాస్ మన్నాడే (94) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఊపిరి తిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున 3.50 చనిపోయారు. దిల్ కా హాల్ సునో, ముడ్ ముడ్ కే న దేఖో, లాగా చునరీ మే దాగ్, సుర్ నా సజనా, ఏ భాయ్ జరా దేఖ కే చలో, యే రాత్ భీగీ భీగీ, ప్యార్ హువా ఇకరార్ హువా, ఝనక్ ఝనక్ తేరీ బాజే పాయెలియా, కౌన్ ఆయా మేరే మన్ కే ద్వారే,, పూఛో న కైసే రైన్ బితాయే, ధర్తీ కహే పుకార్ కే..... వంటి ఎన్నో అజరామరమైన పాటలు పాడిన స్వరధుని గొంతుక భౌతికంగా మూగబోయింది. 1919 మే 1 న కోల్‌కతాలో పుట్టిన మన్నాడే ప్రఖ్యాత బెంగాలీ సంగీత సామ్రాట్ కృష్ణచంద్ర డేకి సోదరుని కుమారుడు. కె సి డే ఆయనకి తొలి సంగీత పాఠాలు నేర్పిన గురువు కూడా. 1942లో ముంబయి వచ్చిన మన్నాడే ఎస్ డి బర్మన్ (సచిన్‌దేవ్ బర్మన్) దగ్గర అసిస్టెంట్‌గా చేరి, తమన్నా సినిమాతో నేపథ్యగాయకుడిగా మారారు. అమర్ భూపాలి గాయకుడిగా ఆయన జీవతంలో ఓ మైలురాయి. తర్వాత, షోలే, పడోసన్, మేరానామ్ జోకర్, బర్సాత్కీ ఏక్ రాత్, సఫర్, సాఖీ, జ్యోతి, అనిత, పతి పత్ని ఔర్ ఓ, వక్త్, ఉపకార్, బాబీ, ఆనంద్ తదితర అసంఖ్యాకమైన చిత్రాల్లో ఆయన హిట్ పాటలెన్నో పాడారు. 1950 నుంచి 1970 వరకు హిందీ చలనచిత్ర రంగంతో పాటు బెంగాలీలో దాదాపు 3,500 పాటలకు పైగా పాడారు. మెలోడీకి మారు పేరు మన్నాడే అనిపించుకున్నారు. ప్రత్యేకించి రాజ్ కపూర్ సినిమాల్లో ఆయన పాటలు లేకుండా ఉండేవి కాదు. బెంగాలీలోను పలు చిత్రాల్లో పాటలు పాడారు. ఆయనకు ఫాల్కే అవార్డు అవసాన దశలో వచ్చినా, పద్మశ్రీ, పద్మభూషణ్‌లు ముందే వరించాయి. భారత చలనచిత్ర రంగంలోనే అత్యంత ప్రతిభావంతుడైన గాయకుడిగా పేరు పొందిన మన్నాడే బెంగళూరులో స్థిరపడ్డారు. ఆయన మృతి పట్ల హిందీ చిత్రసీమ సంతాపం ప్రకటించింది.