మన్నాడే మరిలేరు
సాక్షి, బెంగళూరు: మధుర గాయకుడు మన్నా డే (94) మరి లేరు. దాదాపు ఐదు దశాబ్దాల పాటు సినీ పరిశ్రమలో కొనసాగిన ఆయన, ఏడు భాషల్లో సుమారు నాలుగు వేల పాటలు పాడారు. ఏ భాషలో పాడినా, ఆ భాషవారికి మన్నా డే ‘మనోడే’ అనిపించేంతగా ముద్రవేశారు. హిందీ, బెంగాలీ, అస్సామీ, గుజరాతీ, మరాఠీ, కన్నడ, మలయాళీ భాషల్లో పాటలు పాడి అభిమానులను అలరించిన మన్నాడే, కొద్ది నెలలుగా గుండె, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతూ బెంగళూరులోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో గురువారం వేకువ జామున 3.50 గంటలకు కన్నుమూశారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు సురోమా, సుమిత ఉన్నారు. సురోమా అమెరికాలో స్థిరపడగా, సుమిత బెంగళూరులోనే ఉంటున్నారు. మన్నాడే భార్య సులోచనా కుమరన్ కేన్సర్‌తో బాధపడుతూ ఏడాది కిందట మరణించారు. కేరళకు చెందిన సులోచనాను మన్నాడే 1953లో వివాహం చేసుకున్నారు.
సినీ పరిశ్రమలో కొనసాగినంత కాలం దాదాపు యాభయ్యేళ్లు ముంబైలోనే ఉన్న మన్నా డే, చివరకు బెంగళూరును స్థిరనివాసం చేసుకున్నారు. కాగా, బెంగళూరులోని రవీంద్ర కళాక్షేత్రలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మన్నా డే పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు హెబ్బాళలోని విద్యుత్ శ్మశాన వాటికలో నిరాడంబరంగా ఆయన అంత్యక్రియలను నిర్వహించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, గవర్నర్ హెచ్.ఆర్.భరద్వాజ్ బీజేపీ ఎంపీ అనంతకుమార్ తదితరులు మన్నా డేకు నివాళులర్పించారు. మన్నా డే అసలు పేరు ప్రబోధ్‌చంద్ర డే. కోల్‌కతాలో 1919 మే 1న జన్మించిన ఆయన, 1943లో ‘తమన్నా’ చిత్రంలో సురయ్యాతో కలసి ‘సుర్ నా సజే కియా గావో మే’ పాటతో నేపథ్య గాయకునిగా పరిచయమయ్యారు. ఈ చిత్రానికి మన్నా డే చిన్నాన్న కృష్ణచంద్ర డే సంగీత దర్శకత్వం వహించారు. చిన్నాన్న ప్రోత్సాహంతోనే మన్నా డే రవీంద్ర సంగీతంలో సాధన చేశారు. 1991లో ‘ప్రహార్’ చిత్రంలో తన చివరి సినీగీతం ‘హమారీ హీ ముఠ్ఠీ మే’ పాడారు. ఆయన సమకాలికులైన మిగిలిన గాయకులతో పోలిస్తే, ఆయన పాడిన పాటలు రాశిలో తక్కువైనా, వాసిలో మిన్నవిగా అభిమానుల మన్ననలతో పాటు సినీరంగంలోనే శిఖరాయమానమైన ‘దాదా సాహెబ్ ఫాల్కే’ సహా పలు అవార్డులను తెచ్చిపెట్టాయి.
కాలేజీ రోజుల్లో బెంగాల్‌లో పేరుపొందిన మల్ల యోధుడైన మన్నా డే, తర్వాతి కాలంలో సంగీతం వైపు మళ్లి మధుర గాయకుడిగా మారారు. రాజ్ కపూర్, దిలీప్ కుమార్, షమ్మీ కపూర్, రాజేశ్ ఖన్నా వంటి కథానాయకులతో పాటు ప్రాణ్ వంటి ప్రతినాయకునికి, మహమూద్ వంటి హాస్య నటులకు తన గాత్రాన్ని అందించి, అపురూపమైన గీతాలతో ప్రేక్షకులను అలరించారు. అమితాబ్ బచ్చన్ తండ్రి హరివంశ్‌రాయ్ బచ్చన్ రచించిన ‘మధుశాల’ను గానం చేసి, సంగీతాభిమానుల మన్ననలు పొందారు.
ప్రముఖుల సంతాపం
మన్నా డే మృతికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మో హన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి మనీష్ తివారీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గవర్నర్ ఎం.కె.నారాయణన్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, బంగ్లా అధ్యక్షుడు అబ్దుల్ హమీద్ తదితరులు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. సంగీత ప్రపంచం ‘మెలొడీ రారాజు’ను కోల్పోయిందని ప్రధాని మన్మోహన్ తన సంతాప ప్రకటనలో పేర్కొన్నారు. మన్నా డే గీతాలను ఉపఖండంలోని ప్రజలు ఎన్నటికీ మరువలేరని బంగ్లా ప్రధాని షేక్ హసీనా తన సందేశంలో పేర్కొన్నారు.
దేశం ఒక గొప్ప గాయకుడిని, విలక్షణమైన కళాకారుడిని కోల్పోయిందని సోనియా, ప్రణబ్ తమ సందేశాల్లో పేర్కొన్నారు. మన్నా డే బెంగాలీలకు గర్వకారణమని మమతా బెనర్జీ కొనియాడారు. మన్నాడే మరణ వార్తతో పశ్చిమ బెంగాల్‌లో, పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి. మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చవాన్, గవర్నర్ కె.సత్యనారాయణన్, బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఎంపీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్, గవర్నర్ రామ్‌నరేశ్ యాదవ్ తదితరులు కూడా సంతాపం ప్రకటించారు.
బాలీవుడ్‌లో విషాద ఛాయలు
మన్నా డే మృతితో బాలీవుడ్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి. బాలీవుడ్ ప్రముఖులు ఆయనతో తమకు గల అనుబంధాన్ని నెమరు వేసుకుంటూ, ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. మన్నా డేతో కలసి పలు గీతాలను ఆలపించిన లతా మంగేష్కర్, ఆయన అంకిత భావం గల కళాకారుడని కొనియాడుతూ నివాళులర్పించారు. ‘మా కోహినూర్‌ను కోల్పోయాం’ అంటూ ‘సరిగమ’ (ఇదివరకు హెచ్‌ఎంవీ) సంగీత సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది. మన్నా డే సాటిలేని గాయకుడని గాయని ఉషా ఉతుప్ కొనియాడారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, గీత రచయిత జావేద్ అక్తర్, తబలా విద్వాంసుడు జాకిర్ హుస్సేన్ తదితరులు మన్నా డేకు నివాళులర్పించారు.
జాతి గర్వించదగ్గ వ్యక్తి మన్నా డే: ఎస్పీ బాలు
నెల్లూరు, న్యూస్‌లైన్: జాతి గర్వించదగ్గ గొప్ప వ్యక్తి బెంగాలీ గాయకుడు మన్నాడే అని ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అన్నారు. మన్నాడే మృతికి బాలు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ఆయన నెల్లూరులో విలేకరులతో మాట్లాడుతూ, తనకు మహ్మద్ రఫీ ఇష్టమైనప్పటకీ, మన్నాడేను, ఆయన పాటలను అమితంగా గౌరవిస్తానని తెలిపారు. రెండు నెలల కిందట మన్నాడే జీవిత చరిత్రను ఆవిష్కరించే మహద్భాగ్యం తనకు దక్కిందన్నారు. మన్నాడే భౌతికంగా మృతి చెందినా, ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతారన్నారు. అయితే, మన్నాడేకు దక్కాల్సిన స్థాయిలో గుర్తింపు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ముఖ్య కార్యక్రమం ఉండడంతో అంతిమయాత్రలో పాల్గొనలేకపోయినట్టు వివరించారు.
మమత విజ్ఞప్తిని నిరాకరించిన మన్నా డే కుమార్తె
అంత్యక్రియల కోసం మన్నా డే భౌతిక కాయాన్ని కోల్‌కతా తీసుకురావాలంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన విజ్ఞప్తిని మన్నా డే కుమార్తె సుమితా నిరాకరించారు. మన్నా డే ఖాతా నుంచి మోసపూరితంగా సొమ్ము విత్ డ్రా చేసిన కేసుకు సంబంధించి మమత సర్కారు తమ కుటుంబానికి ఎలాంటి సహకారం అందించలేదని ఆమె ఆరోపించారు. అంత్యక్రియలకు తాను అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసిన తర్వాత, భౌతిక కాయాన్ని కోల్‌కతా తేవాలని మమత విజ్ఞప్తి చేశారని, ఈ పరిస్థితిలో అక్కడకు ఎలా వెళ్లగలమని ఆమె ప్రశ్నించారు. అయితే, మన్నా డే కుటుంబానికి తమ ప్రభుత్వం సహకరించలేదనే ఆరోపణను మమత తోసిపుచ్చారు. గత ఏడాది బెంగళూరు వెళ్లినప్పుడు తాను మన్నా డేను వ్యక్తిగతంగా కలుసుకున్నానని, కోల్‌కతా వచ్చి ఉండదలిస్తే, తన ఇంటి గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉండవచ్చని కూడా చెప్పానని అన్నారు.
నెరవేరని తుది కోరిక
గత ఏడాది మరణించిన తన భార్య సులోచన జ్ఞాపకంగా ఒక భావోద్వేగభరితమైన ప్రేమగీతాన్ని పాడి రికార్డు చేయాలని మన్నా డేకు చివరి కోరికగా ఉండేది. ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆయన చివరి కోరిక నెరవేరలేదని, మన్నా డే సహచరుడు, సంగీత దర్శకుడు సుపర్ణకాంతి ఘోష్ చెప్పారు.