న్యూఢిల్లీ: జీ20 శిఖరాగ్ర సదస్సు కోసం విచ్చేసిన ప్రపంచ నేతలకు వీనుల విందైన సంగీతం వినిపించేందుకు వాయిద్యకారులు సిద్ధమయ్యారు. భారతీయ సంగీత వారసత్వ సంపద ఎంతటి గొప్పదో ప్రత్యక్షంగా చూపేందుకు సమాయత్తమయ్యారు. శాస్త్రీయ సంగీతంతోపాటు సమకాలీన సంగీతంలో వినియోగించే భిన్న వాద్య పరికరాలతో సంగీత విభావరి అతిథులను ఆకట్టుకోనుంది. గాంధర్వ ఆతిథ్యం బృందం ‘భారత వాద్య దర్శనం’ పేరిట గొప్ప ప్రదర్శన ఇవ్వనుంది.
జీ20 దేశాధినేతలకు సెప్టెంబర్ తొమ్మిదో తేదీన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇచ్చే విందులో ఈ సంగీత కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. సంతూర్, సారంగీ, జల్ తరంగ్, షెహనాయ్ ఇలా దేశవ్యాప్తంగా విభిన్న ప్రాంతాల్లో ప్రఖ్యాతిగాంచిన మొత్తం 78 రకాల వాద్య పరికరాల నుంచి ఉద్భవించే అద్భుతమైన సంగీతం ఆహుతులను అలరించనుంది. ‘సంగీత మార్గంలో భారత్ సాగించిన సామరస్య ప్రయాణం తాలూకు అపురూప జ్ఞాపకాలను ఇప్పుడు మరోసారి గుర్తుచేస్తాం’ అని ఆహా్వన ప్రతి సంబంధ బ్రోచర్ కాన్సెప్ట్ నోట్‌లో పేర్కొన్నారు. ఈ ప్రదర్శన విలాంబిత్ లయతో మొదలై మధ్య లయలో కొనసాగి ధృత లయతో ముగుస్తుంది.
ఈ వాయిద్య పరికరాల సమ్మేళనంలో 34 హిందుస్తానీ సంగీతం తాలూకు వాద్య పరికరాలు, 18 కర్ణాటక సంగీత సంబంధ పరికరాలు, 26 జానపద సంబంధ పరికరాలు వినియోగిస్తున్నారు. 11 మంది చిన్నారులు, 13 మంది మహిళలు, ఆరుగురు దివ్యాంగులు, 26 మంది యువకులు, 22 మంది నిష్ణాతులుసహా 78 మంది కళాకారులు ఈ వాద్య పరికరాలను వాయిస్తారు. తమ ప్రాంత విశిష్ట వారసత్వ సంగీత సంపదను ఘనంగా చాటుతూ భిన్న ప్రాంతాలకు చెందిన కళాకారులు తమ సంప్రదాయక వేషధారణలో వేదకాలంనాటి పరికరాలు, గిరిజనుల, జానపదుల పరికరాలతోపాటు లలిత సంగీతం తాలూకు పరికరాలు వాయిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment