Indian Heritage and Culture
-
G20 Summit: 78 భిన్న వాయిద్యాలతో సంగీత సౌరభం!
న్యూఢిల్లీ: జీ20 శిఖరాగ్ర సదస్సు కోసం విచ్చేసిన ప్రపంచ నేతలకు వీనుల విందైన సంగీతం వినిపించేందుకు వాయిద్యకారులు సిద్ధమయ్యారు. భారతీయ సంగీత వారసత్వ సంపద ఎంతటి గొప్పదో ప్రత్యక్షంగా చూపేందుకు సమాయత్తమయ్యారు. శాస్త్రీయ సంగీతంతోపాటు సమకాలీన సంగీతంలో వినియోగించే భిన్న వాద్య పరికరాలతో సంగీత విభావరి అతిథులను ఆకట్టుకోనుంది. గాంధర్వ ఆతిథ్యం బృందం ‘భారత వాద్య దర్శనం’ పేరిట గొప్ప ప్రదర్శన ఇవ్వనుంది. జీ20 దేశాధినేతలకు సెప్టెంబర్ తొమ్మిదో తేదీన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇచ్చే విందులో ఈ సంగీత కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. సంతూర్, సారంగీ, జల్ తరంగ్, షెహనాయ్ ఇలా దేశవ్యాప్తంగా విభిన్న ప్రాంతాల్లో ప్రఖ్యాతిగాంచిన మొత్తం 78 రకాల వాద్య పరికరాల నుంచి ఉద్భవించే అద్భుతమైన సంగీతం ఆహుతులను అలరించనుంది. ‘సంగీత మార్గంలో భారత్ సాగించిన సామరస్య ప్రయాణం తాలూకు అపురూప జ్ఞాపకాలను ఇప్పుడు మరోసారి గుర్తుచేస్తాం’ అని ఆహా్వన ప్రతి సంబంధ బ్రోచర్ కాన్సెప్ట్ నోట్లో పేర్కొన్నారు. ఈ ప్రదర్శన విలాంబిత్ లయతో మొదలై మధ్య లయలో కొనసాగి ధృత లయతో ముగుస్తుంది. ఈ వాయిద్య పరికరాల సమ్మేళనంలో 34 హిందుస్తానీ సంగీతం తాలూకు వాద్య పరికరాలు, 18 కర్ణాటక సంగీత సంబంధ పరికరాలు, 26 జానపద సంబంధ పరికరాలు వినియోగిస్తున్నారు. 11 మంది చిన్నారులు, 13 మంది మహిళలు, ఆరుగురు దివ్యాంగులు, 26 మంది యువకులు, 22 మంది నిష్ణాతులుసహా 78 మంది కళాకారులు ఈ వాద్య పరికరాలను వాయిస్తారు. తమ ప్రాంత విశిష్ట వారసత్వ సంగీత సంపదను ఘనంగా చాటుతూ భిన్న ప్రాంతాలకు చెందిన కళాకారులు తమ సంప్రదాయక వేషధారణలో వేదకాలంనాటి పరికరాలు, గిరిజనుల, జానపదుల పరికరాలతోపాటు లలిత సంగీతం తాలూకు పరికరాలు వాయిస్తారు. -
900 ఏళ్ల క్రితమే అవి ఉన్నాయి..!
న్యూఢిల్లీ : సోషల్ మీడియా విస్తృతి పెరడంతో సమాచార మార్పిడి వేగంగా జరుగుతోంది. ఏదైనా వింత, విశేషం, స్ఫూర్తిమంతమైన కథలకు ట్విటర్లో మంచి రెస్పాన్స్ వస్తుంది. తాజాగా తమిళనాడుకు చెందిన వి.గోపాలన్ అనే వ్యక్తి చేసిన ఓ పోస్టు ఆసక్తిగొలిపేదిగా ఉంది. దాదాపు 900 ఏళ్ల క్రితమే ప్రాచీన పురుషులు నేటి బాటా చెప్పులని పోలిన పాదరక్షలు వాడారని ఆయన ట్విటర్ ఓ శిల్పం ఫొటో షేర్ చేశాడు. అది తమిళనాడులోని అవుదయార్‌కోయిల్ ఆలయంలోనిదని ఆయన పేర్కొన్నాడు. ‘మన ప్రాచీనులు చాలా ఫ్యాషనబుల్. ఎన్నో వందల ఏళ్ల క్రితమే వారు శాండల్స్ ధరించారు. అవి ఎలా ఉన్నాయంటే.. బాటా పాదరక్షలను పోలి ఉన్నాయి. కావాలంటే ఫొటోను జూమ్ చేసి చూడండి’ అని క్యాప్షన్ పెట్టాడు. కాగా, గోపాలన్ ట్వీట్‌పై స్పందించిన ఓ యూజర్.. ‘ప్రాచీన కాలంలో.. దాదాపు 1400 ఏళ్ల క్రితం స్త్రీలు కూడా హీల్స్ వేసుకునేవారు. కంచిలోని కైలాసనాథర్ ఆలయంలోని ఈ శిల్పం ఫొటో చూడండి’ అని పేర్కొన్నాడు. వందల ఏళ్ల క్రితమే మహిళలు హై హీల్స్ వేసుకునేవారని మరో యూజర్ శాండల్స్ ధరించి ఉన్న శిల్పం ఫొటో షేర్ చేశాడు. ఇక అవుదయార్‌కోయిల్ ఆలయం 900 ఏళ్ల చరిత్ర కలిగి ఉందని ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు గోపాలన్ సమాధనమిచ్చాడు. రోమ్‌నగరం, ఏథెన్స్ నగరాలు ఉనికిలోకి రాకమునుపే మన కాశీ నగరం బాగా అభివృద్ధి చెందిందని మరొక యూజర్ రాసుకొచ్చారు. Ancient Indian men were very fashionable centuries back! They were wearing sandals thousand years back - the same model which BATA INDIA sells today! Zoom in to the pictures to see the similarity! Avudayar Koil, TN #IndianHeritage pic.twitter.com/gPeDoXOor7 — V Gopalan (@TheGopalan) January 4, 2020 -
ఇలాంటి ప్రజలు ఇప్పటికీ ఉన్నారా!?
సాక్షి, న్యూఢిల్లీ : అక్కడి ప్రజలు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా అంతగా పట్టించుకోరు. ఎల్లప్పుడూ నవ్వుతూనే ఉంటారు. ముఖ్యంగా పరాయి మనిషి కనిపిస్తే పలకరింపుగా వారి బుగ్గలు సొట్టలవుతాయి. చిద్విలాసంగా పెదవులు విచ్చుకుంటాయి. కళ్లలో ఆత్మీయత కనిపిస్తుంది. ఏదో తెలియని అనుభూతి వారి హృదయాలను తాకుతుంది. ముఖ్యంగా ఎవరైనా ఆపదలో ఉన్నట్లు కనిపిస్తే ఏ సహాయం చేయడానికైనా వారు ముందుకొస్తారు. అలాంటి మనుషులు ఇంకా ఈ భూమండలం మీద, ఈ ప్రపంచంలో ఉన్నారా? అని ఆశ్చర్యం వేస్తోంది. వారు మరెక్కడో కాదు, మన దేశంలోనే, మన కేరళ రాష్ట్రంలోనే ఉన్నారు. అక్కడ అందరూ కలసి మెలసి జీవించడమే వారి జీవన వైవిధ్యం. అక్కడ జాతి, మత, భాష, ప్రాంత భావాలు లేవా? అంటే ఉన్నాయి. జాతి, మత, భాష, ప్రాంతాలవారీగా వారు 38 సామాజిక వర్గాల వారు. చారిత్రకంగా వారిలో జనాభా ప్రాతిపదికన ముస్లింలు, క్రైస్తవులు, యూదులు, హిందువులు ఉండగా, వలసపాలన వల్ల ఇంగ్లీషు, డచ్, ప్రోర్చుగీసు వారు వచ్చి స్థిర నివాసం ఏర్పరుచున్నారు. అలాగే అక్కడికి వివిధ దేశాల నుంచి నావికులు, వ్యాపారులు, కాందిశీకులు, రాజకీయ శరణార్థులు వచ్చి చేరారు. మొదట చేపలు, మాంసాహార వ్యాపారంపై ప్రధానంగా జీవించిన అక్కడి ప్రజలు ఆ తర్వాత మసాలా దినుసులు, తేయాకు ప్రధాన వ్యాపారంగా జీవిస్తున్నారు. వారి వ్యాపారానికి పర్యాటకులే ప్రధాన వినియోగదారులయ్యారు. ఇలా 38 సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఒక్కచోట కలసి మెలసి జీవించడం మామూలు విషయం కాదు. ఎప్పుడైనా వారి మధ్యలో జాతి, మత, భాషా భేదాలు రావా? అన్న అనుమానం కలుగుతోంది. వారిలో ఎవరి మతం వారదని, ఎవరి జాతి వారిదనే భావం మాత్రమే కాదు. తమ జాతే, తమ మతమే, తమ కట్టుబాట్లే గొప్పవన్న ఆలోచన కూడా ఉంది. అది కేవలం వారి ఇంటికే పరిమితం. బయటకొస్తే వారిలో అందరూ సమానులే. వారిలో సమభావం కొనసాగడానికి వివిధ దేశాల నుంచి అక్కడికి తరలివచ్చే పర్యాటకులే కారణం కావచ్చు. వారు ఒకేసారి కలిసి మసీదుకు, చర్చికి, దేవాలయానికి, యూదులు, జైనుల ప్రార్థనా మందిరాలకు బయల్దేరి వెళతారు. వివిధ ఆలయాల ముందు విడిపోయే వాళ్లు తమ ప్రార్థనల అనంతరం మళ్లీ కలుసుకొని ఎవరి గమ్యాలకు వారు చేరుకుంటారు. కొన్ని సార్లు కలిసే మసీదులు, చర్చిలు, మందిరాలకు వెళతారు. ఇంతటి భిన్నత్వంలో ఏకత్వం కలిగిన ‘మటన్చెర్రీ’ ప్రాంతాన్ని అనుకోకుండా సందర్శించిన ఫొటోగ్రాఫర్ బిజూ ఇబ్రహీం వారి సంస్కృతిని చూసి ముగ్ధులయ్యారు. 38 సామాజిక వర్గాలకు చెందిన కుటుంబాలను ఎంపిక చేసుకొని వారిని ఫొటోలు తీశారు. ఆయన అన్ని ఫొటోలను బ్లాక్ అండ్ వైట్‌లోనే తీశారు. నిజమైన మనుషులపైనే చూపరుల దష్టి పడాలనే ఉద్దేశంతోనే తాను బ్యాక్ అండ్ వైట్‌లో వారి ఫొటోలను చిత్రీకరించానని ఆయన చెప్పారు. కలర్ ఫొటోల్లో మనుషులకంటే వారి చుట్టూ ఉంటే వాతావరణం, వాటి రంగులే ప్రధానాకర్షణగా ఉంటాయని చెప్పారు. కొచ్చిలో ప్రస్తుతం నడుస్తున్న ఫొటో ఎగ్జిబిషన్లో బిజూ ఇబ్రహీం మటన్చెర్రీ ప్రజల ఫొటోలను ప్రదర్శిస్తున్నారు. మటన్చెర్రీ మరెక్కడో లేదు. కొచ్చి ప్రధాన కేంద్రానికి సరిగ్గా తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఆరేబియా సముద్రానికి ఆనుకొని ఉన్న ఓ ప్రాంతం. ఆ ప్రాంతం ఐదు చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. అక్కడ చరిత్రాత్మక మసీదు, చర్చి, దేవాలయాలతోపాటు యూదు, జైన మందిరాలు ఉన్నాయి. నేడు దేశాన్ని పీడిస్తున్న విద్వేష రాజకీయాలు తమ దరి చేరకుండా అక్కడి ప్రజలు అడ్డుకుంటారని భావిద్దాం. అక్కడి ప్రజలు మలయాళం, ఇంగ్లీషు ఎక్కువగా మాట్లాడతారు. ఆ ప్రాంతానికి ఒకప్పుడు మటన్ వ్యాపారులు ఎక్కువగా ఉండడం వల్ల మటన్చెర్రీ అనే పేరు వచ్చిందని, అంచెర్రీ మఠం ఉండడం వల్ల మటన్చెర్రీ పేరు వచ్చిందనే భిన్న కథనాలు ఉన్నాయి. భిన్నత్వంలో ఏకత్వం అంటే అదే మరి! చిత్రాలు : బీజూ ఇబ్రహీం -
కాంపిటీటివ్ కౌన్సెలింగ్
సివిల్స్ మెయిన్స్ పేపర్-2 (జనరల్ స్టడీస్-1) మొత్తం 250 మార్కులకు ఉంటుంది. ఇందులో ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, హిస్టరీ అండ్ జాగ్రఫీ ఆఫ్ ది వరల్డ్ అండ్ సొసైటీ నుంచి ప్రశ్నలు వస్తాయి. సివిల్స్ మెయిన్స్ రెండో పేపర్ (జీఎస్-1)కు సంబంధించిన సిలబస్‌ను విశ్లేషిస్తే ‘చరిత్ర’కు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంతో పోలిస్తే ఈ సబ్జెక్టు పరిధి విస్తృతమైందని చెప్పొచ్చు. జనరల్ స్టడీస్ హిస్టరీ సిలబస్‌లో పేర్కొన్న కొత్త అంశాల్లో చాలావరకు ఆప్షనల్ సిలబస్ నుంచి తీసుకున్నవే. ఈ నేపథ్యంలో.. హిస్టరీ ఆప్షనల్తో పరీక్షకు సిద్ధమవుతున్నవారికి ఈ పేపర్లో మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశముంది. సిలబస్‌లో పేర్కొన్న అంశాలను వరుసగా పరిశీలిస్తే.. భారతదేశ సంస్కృతి సంగీతం, సాహిత్యం, నాట్యం, వాస్తు-శిల్పకళ, పెయింటింగ్స్, మత ఉద్యమాలు, తత్వాలు తదితర అంశాలపై క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ఈ అంశాలను ప్రాచీన, మధ్య, ఆధునిక భారతదేశ చరిత్రలకు అన్వయించుకుంటూ పరీక్షకు సిద్ధమవాలి. అభ్యర్థులు ప్రామాణిక హిస్టరీ పుస్తకాల ఆధారంగా క్రమ పద్ధతిలో ఒక్కో అంశంపై పట్టు సాధిస్తూ ముందుకెళ్లాలి. ఎన్సీఈఆర్టీ 11, 12వ తరగతి పుస్తకాలు అభ్యర్థులకు ఉపయుక్తంగా ఉంటాయి. మధ్య భారతదేశ చరిత్రకు సంబంధించినంతవరకు సతీశ్‌చంద్ర పుస్తకాలు చదవాలి. భారత సంస్కృతికి చెందిన అంశాలను ప్రాచీ న, మధ్య, ఆధునిక కాలాలకు అన్వయిస్తూ చదవాలి. ప్రాచీన, మధ్య, ఆధునిక భారతదేశ చరిత్రకు సంగీతం, సాహిత్యం, నాట్యం, కట్టడాలు, మత ఉద్యమాలు, తత్వాలపై దృష్టిసారించాలి. ఆధునిక భారతదేశం 18వ శతాబ్దం మధ్య భాగం నుంచి ఇప్పటివరకు జరిగిన ముఖ్యమైన సంఘటనలను క్షుణ్నంగా పరిశీలించాలి. → భారత దేశానికి ఐరోపా కంపెనీల రాక. → దేశంలో ఆంగ్లేయుల కార్యకలాపాలు విస్తరించిన తీరు. → ఆంగ్లేయుల ఆర్థిక, పరిపాలనా విధానాలు. → 19, 20వ శతాబ్దాల్లో చోటుచేసుకున్న సామాజిక, మత సంస్కరణ ఉద్యమాలు. → {బిటిష్ వ్యతిరేక తిరుగుబాట్లు, ఉద్యమాలు. → చరిత్రలో కీలకమైన భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమాన్ని ప్రత్యేకంగా చదవాల్సి ఉంటుంది. దీనికోసం ఆధునిక భారతదేశంపై బిపిన్‌చంద్ర రాసిన పుస్తకాలు చదవాలి. స్వాతంత్య్రం తర్వాత జరిగిన పరిణామాలను సిలబస్‌లో కొత్తగా చేర్చారు. ఇందులో చరిత్రతో పాలిటీ, ఎకనామిక్స్‌కు సంబంధించిన అంశాలు కూడా కలిసి ఉంటాయి. వీటిని సమన్వయం చేసుకుంటూ విషయంపై పట్టుసాధించాలి. → రాజ్యాంగ సంబంధిత అంశాలు → పంచవర్ష ప్రణాళికలు, ళీ భూ సంస్కరణలు → నెహ్రూ విదేశాంగ విధానం, ళీ అలీనోద్యమం తీరుతెన్నులు → హరిత విప్లవం రూపురేఖలు తదితరాలు.. → వీటికోసం బిపిన్‌చంద్ర రాసిన ‘ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్’ పుస్తకం చదవాలి. ప్రపంచ చరిత్ర.. ఆకాశమే హద్దు ప్రపంచ చరిత్ర నుంచి ఏ అంశాలపై ప్రశ్నలు వస్తాయో కచ్చితంగా చెప్పడం కష్టం. 18వ శతాబ్దం నుంచి జరిగిన సంఘటనలను సిలబస్‌లో పేర్కొన్నారు కాబట్టి ఐరోపా, అమెరికా, ఆఫ్రికా, ఆసియా దేశాలకు సంబంధించి దేనిపైనైనా అడగడానికి అవకాశముంది. → {పపంచ ఆర్థికరంగ స్థితిగతుల్నే మార్చేసిన పారిశ్రామిక విప్లవం. → మొదటి ప్రపంచ యుద్ధం (1914-18), రెండో ప్రపంచ యుద్ధం (1939-45) → ఐరోపాలో నూతన రాజ్యాల ఆవిర్భావం → ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాల్లో వలసవాదం స్వాతంత్య్ర ఉద్యమాలు. → వీటికోసం ఎన్సీఈఆర్టీ 11, 12 తరగతి పుస్తకాలు చదవాలి. - ఇన్పుట్స్: కరీం, సివిల్స్ సీనియర్ ఫ్యాకల్టీ, హైదరాబాద్ ఎస్బీఐ పీవో పరీక్షలో జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ అంశాలకు ఎలా సన్నద్ధమవ్వాలో వివరించండి? - జి.నవీన్‌కుమార్, ఉప్పల్ జనరల్ అవేర్నెస్.. అభ్యర్థులకు సామాజిక అంశాలపై ఉన్న అవగాహన స్థాయిని తెలుసుకునే ఉద్దేశంతో రూపొందించిన విభాగమిది. అంతేకాకుండా మార్కెటింగ్ అండ్ కంప్యూటర్స్ విభాగాన్ని కూడా జనరల్ అవేర్నెస్లోనే చేర్చారు. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ రంగంలోని మార్పులకు ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలి. ఆర్బీఐ పాలసీలు, తాజా పరపతి విధానాలు; బ్యాంకుల వినూత్న పాలసీలు; బ్యాంకుల, కంపెనీల క్యాప్షన్లు వంటి వాటిపై అవగాహన తప్పనిసరి. వీటితోపాటు జీకేకు సంబంధించి క్రీడలు-విజేతలు, సదస్సులు-ప్రదేశాలు, అవార్డులు-వ్యక్తులు, వార్తల్లో వ్యక్తులకు సంబంధించి పరీక్ష సమయానికి ఆరేడు నెలల ముందు వరకు ప్రిపేర్ కావాలి. అదేవిధంగా కంప్యూటర్ నాలెడ్జ్‌కు సంబంధించి ముఖ్యంగా జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్, కంప్యూటర్స్ హిస్టరీ, ఫండమెంటల్స్ ఆఫ్ ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన తప్పనిసరి. సి, సి++, ఎంఎస్-ఆఫీస్, ఒరాకిల్ తదితర సాఫ్ట్వేర్లు, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్‌పై అవగాహన ఉండాలి. ఇన్పుట్స్: కె.వి.జ్ఞానకుమార్, సీనియర్ ఫ్యాకల్టీ, హైదరాబాద్