సాక్షి, న్యూఢిల్లీ : అక్కడి ప్రజలు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా అంతగా పట్టించుకోరు. ఎల్లప్పుడూ నవ్వుతూనే ఉంటారు. ముఖ్యంగా పరాయి మనిషి కనిపిస్తే పలకరింపుగా వారి బుగ్గలు సొట్టలవుతాయి. చిద్విలాసంగా పెదవులు విచ్చుకుంటాయి. కళ్లలో ఆత్మీయత కనిపిస్తుంది. ఏదో తెలియని అనుభూతి వారి హృదయాలను తాకుతుంది. ముఖ్యంగా ఎవరైనా ఆపదలో ఉన్నట్లు కనిపిస్తే ఏ సహాయం చేయడానికైనా వారు ముందుకొస్తారు. అలాంటి మనుషులు ఇంకా ఈ భూమండలం మీద, ఈ ప్రపంచంలో ఉన్నారా? అని ఆశ్చర్యం వేస్తోంది. వారు మరెక్కడో కాదు, మన దేశంలోనే, మన కేరళ రాష్ట్రంలోనే ఉన్నారు.
అక్కడ అందరూ కలసి మెలసి జీవించడమే వారి జీవన వైవిధ్యం. అక్కడ జాతి, మత, భాష, ప్రాంత భావాలు లేవా? అంటే ఉన్నాయి. జాతి, మత, భాష, ప్రాంతాలవారీగా వారు 38 సామాజిక వర్గాల వారు. చారిత్రకంగా వారిలో జనాభా ప్రాతిపదికన ముస్లింలు, క్రైస్తవులు, యూదులు, హిందువులు ఉండగా, వలసపాలన వల్ల ఇంగ్లీషు, డచ్, ప్రోర్చుగీసు వారు వచ్చి స్థిర నివాసం ఏర్పరుచున్నారు. అలాగే అక్కడికి వివిధ దేశాల నుంచి నావికులు, వ్యాపారులు, కాందిశీకులు, రాజకీయ శరణార్థులు వచ్చి చేరారు. మొదట చేపలు, మాంసాహార వ్యాపారంపై ప్రధానంగా జీవించిన అక్కడి ప్రజలు ఆ తర్వాత మసాలా దినుసులు, తేయాకు ప్రధాన వ్యాపారంగా జీవిస్తున్నారు. వారి వ్యాపారానికి పర్యాటకులే ప్రధాన వినియోగదారులయ్యారు.
ఇలా 38 సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఒక్కచోట కలసి మెలసి జీవించడం మామూలు విషయం కాదు. ఎప్పుడైనా వారి మధ్యలో జాతి, మత, భాషా భేదాలు రావా? అన్న అనుమానం కలుగుతోంది. వారిలో ఎవరి మతం వారదని, ఎవరి జాతి వారిదనే భావం మాత్రమే కాదు. తమ జాతే, తమ మతమే, తమ కట్టుబాట్లే గొప్పవన్న ఆలోచన కూడా ఉంది. అది కేవలం వారి ఇంటికే పరిమితం. బయటకొస్తే వారిలో అందరూ సమానులే. వారిలో సమభావం కొనసాగడానికి వివిధ దేశాల నుంచి అక్కడికి తరలివచ్చే పర్యాటకులే కారణం కావచ్చు. వారు ఒకేసారి కలిసి మసీదుకు, చర్చికి, దేవాలయానికి, యూదులు, జైనుల ప్రార్థనా మందిరాలకు బయల్దేరి వెళతారు. వివిధ ఆలయాల ముందు విడిపోయే వాళ్లు తమ ప్రార్థనల అనంతరం మళ్లీ కలుసుకొని ఎవరి గమ్యాలకు వారు చేరుకుంటారు. కొన్ని సార్లు కలిసే మసీదులు, చర్చిలు, మందిరాలకు వెళతారు.
ఇంతటి భిన్నత్వంలో ఏకత్వం కలిగిన ‘మటన్‌చెర్రీ’ ప్రాంతాన్ని అనుకోకుండా సందర్శించిన ఫొటోగ్రాఫర్ బిజూ ఇబ్రహీం వారి సంస్కృతిని చూసి ముగ్ధులయ్యారు. 38 సామాజిక వర్గాలకు చెందిన కుటుంబాలను ఎంపిక చేసుకొని వారిని ఫొటోలు తీశారు. ఆయన అన్ని ఫొటోలను బ్లాక్ అండ్ వైట్‌లోనే తీశారు. నిజమైన మనుషులపైనే చూపరుల దష్టి పడాలనే ఉద్దేశంతోనే తాను బ్యాక్ అండ్ వైట్‌లో వారి ఫొటోలను చిత్రీకరించానని ఆయన చెప్పారు. కలర్ ఫొటోల్లో మనుషులకంటే వారి చుట్టూ ఉంటే వాతావరణం, వాటి రంగులే ప్రధానాకర్షణగా ఉంటాయని చెప్పారు. కొచ్చిలో ప్రస్తుతం నడుస్తున్న ఫొటో ఎగ్జిబిషన్‌లో బిజూ ఇబ్రహీం మటన్‌చెర్రీ ప్రజల ఫొటోలను ప్రదర్శిస్తున్నారు.
మటన్‌చెర్రీ మరెక్కడో లేదు. కొచ్చి ప్రధాన కేంద్రానికి సరిగ్గా తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఆరేబియా సముద్రానికి ఆనుకొని ఉన్న ఓ ప్రాంతం. ఆ ప్రాంతం ఐదు చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. అక్కడ చరిత్రాత్మక మసీదు, చర్చి, దేవాలయాలతోపాటు యూదు, జైన మందిరాలు ఉన్నాయి. నేడు దేశాన్ని పీడిస్తున్న విద్వేష రాజకీయాలు తమ దరి చేరకుండా అక్కడి ప్రజలు అడ్డుకుంటారని భావిద్దాం. అక్కడి ప్రజలు మలయాళం, ఇంగ్లీషు ఎక్కువగా మాట్లాడతారు. ఆ ప్రాంతానికి ఒకప్పుడు మటన్ వ్యాపారులు ఎక్కువగా ఉండడం వల్ల మటన్‌చెర్రీ అనే పేరు వచ్చిందని, అంచెర్రీ మఠం ఉండడం వల్ల మటన్‌చెర్రీ పేరు వచ్చిందనే భిన్న కథనాలు ఉన్నాయి. భిన్నత్వంలో ఏకత్వం అంటే అదే మరి!
చిత్రాలు : బీజూ ఇబ్రహీం
Comments
Please login to add a commentAdd a comment