![director k viswanath to get nannapaneni venkat rao vista award - Sakshi](/styles/webp/s3/article_images/2017/12/19/kk.jpg.webp?itok=TdVILMGn)
సాక్షి, తెనాలి : సినిమా దర్శకుడిగా భగవంతుడు నిర్దేశించిన సేవను భక్తిప్రవత్తులతో ఆచరించానని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, కళాతపస్వి కె.విశ్వనాథ్ పేర్కొన్నారు. భగవంతుడు తననొక దర్శకుడిని చేసి, సినిమా మీడియా అనే బస్సులోని భక్తులను జాగ్రత్తగా సినిమా అనే పుణ్యక్షేత్రానికి తీసుకెళ్లమని చెప్పగా దానిని పాటించానన్నారు. ఎన్వీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి తెనాలిలోని నాజరుపేట ఎన్వీఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో ఆయన నన్నపనేని వెంకట్రావు విశిష్ట అవార్డు స్వీకరించి మాట్లాడారు.
తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ విశ్వనాథ్‌కు అవార్డు అందజేశారు. తల్లి బిడ్డకు అన్నం పెట్టేటప్పుడు విషం పెట్టదని, పాల బువ్వ పెడుతుందన్నారు. తానూ కూడా అదే పని చేస్తున్నానన్నారు. ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ.. కులమత కుడ్యాలను ఛేదించాలని విశ్వనాథ్ తన చిత్రాల్లో చూపించారన్నారు. అనంతరం రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి, రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనందబాబు, ఎమ్మెల్యే ఆలపాటి రాజా మాట్లాడారు.
ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఎల్‌ఆర్‌ఎం క్లబ్ సభ్యులు ఆర్థికసాయం అందజేశారు. ఎన్వీఆర్ ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి, ట్రస్ట్ కార్యదర్శి మారౌతు సీతారామయ్య, నన్నపనేని భాగ్యలక్ష్మి, సూర్యకుమారి, సుగుణ తదితరులు పర్యవేక్షించారు.
ఇచ్చిన మాట కోసమే తెలుగు మహాసభలకు వెళ్లలేదు..
‘ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం తెలుగువారి ధర్మం.. అందుకే హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలకు వెళ్లలేకపోయా..’నని ప్రముఖ సినీ దర్శకుడు, కె.విశ్వనాథ్ తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలో సోమవారం రాత్రి సోషలిస్టు ఉద్యమనేత నన్నపనేని వెంకట్రావు విశిష్ట అవార్డును రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ చేతుల మీదుగా స్వీకరించి మాట్లాడారు. హైదరాబాద్ రావాలంటూ ఆదివారం సాయంత్రం తనకు ఆహ్వానం అందిందని, కొన్ని నెలలముందే తెనాలి ఎన్వీఆర్ ట్రస్ట్‌కు మాట ఇచ్చినందున రాలేకపోతున్నట్లు నిర్వాహకులకు చెప్పానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment