విశ్వనాథ్‌కు బొల్లిముంత అవార్డు ప్రదానం (ఫైల్)
తెనాలి: కల్మషం లేని పల్లె జీవితాలు.. పాడి పంటలతో భాసిల్లుతుండే పల్లెటూళ్లకు కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్ తన సినిమాల్లో పెద్దపీట వేశారు. మనవైన సంస్కృతీ సంప్రదాయాల ప్రస్తావన తప్పనిసరి. వీటన్నిటి మేళవింపుతో వినోదాత్మకమైన సినిమాతో చక్కని సందేశాన్ని ఇచ్చారు. అదికూడా కళాత్మకంగా, షడ్రుచుల సమ్మేళన విందు భోజనం అనిపించిన సంతృప్తితో ప్రేక్షకులు తెరబాట నుంచి ఇంటిబాట పట్టేలా ఉంటుంది.
జనం మెచ్చిన ఈ సినీపరి‘శ్రమ’ను గుర్తించి ఎన్నో అవార్డులు అందుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వైఎస్సార్ జీవితకాల పురస్కారంతో ఇటీవలే సత్కరించింది. అంతలోనే ఆయన ఇకలేరన్న వార్త వినాల్సి రావటం దురదృష్టకరం. ఉమ్మడి గుంటూరు జిల్లా రేపల్లె సమీపంలో భట్టిప్రోలు మండలంలోని పెదపులివర్రు కె.విశ్వనాథ్ స్వస్థలం. కృష్ణాతీరంలో ఒకప్పుడు వాఘ్రపురంగా చారిత్రక ప్రసిద్ధి చెందిన ఈ గ్రామం చోళరాజులు, విజయనగర రాజులు, జమీందారుల పాలనలో విలసిల్లింది.
19వ శతాబ్ది మొదటిపాదం వరకు లలిత కళాకారులు, వేద, ఆగమశాస్త్ర పండితులు, సాహిత్య కోవిదులు, సంగీత విద్వాంసులు, ఆయుర్వేద వైద్యులు, భరతనాట్య కోవిదులు, చిత్రకారులు, శిల్పులు, మంత్రద్రష్టలు, స్వాతంత్య్ర యోధులకు నిలయం ఈ గ్రామం. సినీ సంభాషణలు, పాటల రచనలో వెండితెరను ఏలిన సముద్రాల రాఘవాచారి (సీనియర్ సముద్రాల), సముద్రాల రామానుజాచారి (జూనియర్ సముద్రాల), సినీతార హలం ఈ ఊరి బిడ్దలు. సుప్రసిద్ధ సంగీత దర్శకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు బాల్యం ఇక్కడే గడచింది. ఇదే ఊరి బిడ్డ, సినీదర్శకుడు కె.విశ్వనాథ్ తన సృజనతో ప్రతిష్టాత్మక గౌరవాలను పొందటం ద్వారా మాతృభూమి పెదపులివర్రును పులకరింపజేశారు.
‘సూపర్ స్టార్’కు శిక్షణ
అప్పట్లో అంటే 53 ఏళ్ల క్రితం బాబూ మూవీస్ కొత్త తారలతో ప్రయోగాత్మకంగా తీసిన తొలి సాంఘిక ఈస్ట్‌మన్ కలర్ చిత్రం ‘తేనె మనసులు’. ఆదుర్తి సుబ్బారావు దర్శకుడు. కె.విశ్వనాథ్ సహ దర్శకుడు. తెనాలి సమీపంలోని బుర్రిపాలెం యువకుడు ఘట్టమనేని కృష్ణ తొలి సినిమా అది. సినిమా కోసమని కృష్ణకు నడకలో, వాచకంలో శిక్షణ ఇచ్చింది విశ్వనాథ్ కావటం విశేషం.
ఆ అనుబంధం తర్వాత కూడా కొనసాగింది. కృష్ణతో ‘కన్నె మనసులు’ తీశారు. మళ్లీ ‘ప్రైవేట్ మాస్టర్’లో కృష్ణను నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రకు ఉపయోగించారు. ‘ఉండమ్మా బొట్టుపెడతా’, ‘నేరము–శిక్ష’ సినిమాలను కృష్ణతో చేశారాయన. ఆ తర్వాత దర్శకత్వ రంగంలో విశ్వనాథ్ తనదైన ‘కళాతపస్వి’గా చరిత్రను సృష్టించుకొంటే, కృష్ణ సూపర్‌స్టార్‌గా ఎదగడం తెలిసిందే.
తెనాలితో అనుబంధం
హీరో కృష్ణతోనే కాదు. ఊర్వశి శారద హీరోయిన్‌గా తీసిన అవార్డు సినిమా ‘శారద’కు దర్శకుడు విశ్వనాథే. ఇదే సినిమాకు తెనాలికి చెందిన అభ్యుదయ రచయిత బొల్లిముంత శివరామకృష్ణ సంభాషణలు సమకూర్చారు. బొల్లిముంత కన్నుమూశాక, ఏటా ఆయన పేరుతో ఇస్తున్న పురస్కారాన్ని 2012లో కె.విశ్వనాథ్ తెనాలిలో అందుకున్నారు.
ఈ సందర్భంగా సమీపంలోని అంగలకుదురులో కళాకారుడు, రచయిత రావినూతల శ్రీరామమూర్తి, విశ్వనాథ్‌కు స్వర్ణ కంకణ ధారణ చేశారు. అంతకు ముందు 1974లో తెనాలిలో కల్చరల్ ఫిలిం సొసైటి తరపున విశ్వనాథ్‌ను సత్కరించారు. సినిమాల మంచి చెడ్డలను బేరీజు వేస్తూ, ఉత్తమ చిత్రాలను ప్రోత్సహిస్తున్న ఫిలిం సొసైటి నిర్వాహకుడు డాక్టర్ పి.దక్షిణామూర్తి అంటే ఆపేక్షగా ఉండేవారు.
సొంతూరుపై తరగని మమకారం
ఎంతగా ఎదిగినా, నగరంతో జీవితం ముడిపడినా.. విశ్వనాథ్‌కు సొంతూరు అంటే అమితమైన మమకారం. ఇక్కడి ప్రజలన్నా ప్రేమ. గ్రామంలోని శివాలయం అంటే ఎంతో ఇష్టం. తాను తీసిన ప్రతి సినిమాలో భట్టిప్రోలు మండలం పెదపులివర్రు పేరు వినిపిస్తుంది.
సొంత గ్రామంలో నిర్వహించే దసరా, మహాశివరాత్రి ఉత్పవాలకు ఆలయాల్లో పూజలు నిర్వహించేవారు. పండగ వస్తే చిన్ననాటి స్నేహితుడు కొడమంచిలి వెంకట సుబ్బారావుకు పట్టువస్త్రాలు పంపేవారు. ఇప్పుడు విశ్వనాథ్ కన్ను మూశారని తెలిసి ఆయనతో పరిచయం ఉన్న వారంతా శోకసంద్రంలో మునిగిపోయారు.
స్వాతంత్య్రయోధుని కుటుంబం
విశ్వనాథ్ తాత కాళహస్తిలింగం స్వాతంత్య్రయోధుడు, పండితుడు. 1930లో కాంగ్రెస్ కార్యకర్తకు ఆతిథ్యం ఇచ్చినందుకు ఆరునెలలు జైలుశిక్ష అనుభవించారు. జైలు భోజనం నిరాకరించినందుకు ఆలీపురం క్యాంపు జైలుకు పంపారు. అక్కడ కూడా భోజనం లేకుండా నిత్యసంధ్యానుష్టానాలు జరుపుకున్నారు. జైలు డాక్టర్ వీరి గురించి తెలుసుకుని గోధుమపిండి, పాలు, నూనె వంటివి ఏర్పాటు చేశారు.
విశ్వనాథ్ తండ్రి కాశీనాథుని సుబ్రహ్మణ్యం పెదపులివర్రు శివాలయంలో ప్రధాన అర్చకులుగా 1956 వరకు పని చేశారు. తల్లి సరస్వతి. సినీ నిర్మాణ సంస్థ వాహినిలో ఉద్యోగం రావటంతో సుబ్రహ్మణ్యం మకాం చెన్నైకి మారింది. విశ్వనాథ్ నాలుగో తరగతి వరకు గ్రామంలోని పాఠశాలలో చదువుకున్నారు. తర్వాత గుంటూరులో హిందూ, ఏసీ కాలేజీల్లో చదివారు. బీఎస్సీ పూర్తి చేశారు. చెన్నైలోని వాహిని స్టూడియోలో సౌండ్ ఇంజినీరుగా కెరీర్ ఆరంభించారు.
Comments
Please login to add a commentAdd a comment