నాటి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా దాదాసాహెబ్‌ఫాల్కే అవార్డు అందుకుంటున్న కె.విశ్వనాథ్
‘మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు.. ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు..’ అంటూ శంకరుడిని ప్రార్థించిన తీరు ప్రేక్షకుల ఆనంద వృష్టిని తడిపింది. ‘పంచ భూతములు ముఖ పంచకమై.. ఆరు రుతువులు ఆహార్యములై.. నీ దృక్కులే అటు అష్ట దిక్కులై.. నీ వాక్కులే నవరసమ్ములై..’ అంటూ ఉర్రూతలూగించిన తీరు అజరామరం. ‘కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం..’ చూపడంలో మీ శైలికి సెల్యూట్. తెలుగు సినిమా ఉత్తుంగ తరంగంలా ఎగిసి పడేలా చేయడంలో మీ తర్వాతే ఎవరైనా. మీ గురించి మేమెంత చెప్పినా, అవి మీకు కొత్తగా కిరీటాలేమీ పెట్టవు. ఆకాశమంత మీ నిబద్ధతకు అరచెయ్యంత అద్దం ఈ మాటలు. మీరు నింగికెగిసినా మా కళ్లముందుంచిన ఆ అపురూప దృశ్య కావ్యాల్లో అనునిత్యం మీరు కనిపిస్తూనే ఉంటారన్నది అక్షర సత్యం.
ఎంతటి గంగా ప్రవాహమైనా గంగోత్రి లాంటి ఓ పవిత్ర స్థానంలో చిన్నగా, ఓ పాయలా మొదలవుతుంది. వెండితెరపై శంకరాభరణం, సాగర సంగమం వంటి ఎన్నో కళాఖండాలను సృజించిన కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వ ప్రయాణం కూడా అలాగే ఓ చిన్న పాయలా మొదలైంది. సౌండ్ రికార్డిస్టుగా మొదలై.. దర్శకత్వ శాఖకు విస్తరించిన విశ్వనాథ్ 1965లో తొలిసారిగా ‘ఆత్మగౌరవం’ సినిమాతో మెగాఫోన్ పట్టుకున్నారు. నాటి నుంచి ఐదున్నర దశాబ్దాలకుపైగా వెండితెర అద్భుతాలను అందించారు. తొలితరంలో గూడవల్లి రామబ్రహ్మం, బీఎన్ రెడ్డి, కేవీ రెడ్డి, మలితరంలో ఆదుర్తి సుబ్బారావు తదితరుల తర్వాత మూడో తరంలో తెలుగు సినిమాకు ‘ఆత్మగౌరవం’ తెచ్చిన దర్శక కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్.
వాహినీ స్టూడియోలో సౌండ్ రికార్డింగ్ విభాగంలో కెరీర్‌ను ప్రారంభించి బీఎన్ రెడ్డి, కేవీ రెడ్డి, ఆదుర్తి సుబ్బారావు వంటి వారి పనితీరును దగ్గరగా పరిశీలిస్తూ వచ్చిన కె.విశ్వనాథ్ స్క్రిప్టులో తోచిన సలహాలు, సూచనలు ఇస్తుండేవారు. ఈ క్రమంలో ఆదుర్తి తన సినిమాలకు స్క్రిప్ట్ అసిస్టెంట్‌గా, అసోసియేట్‌గా పనిచేసే అవకాశం ఇచ్చారు. అలా కథా విస్తరణ, స్క్రీన్ ప్లే రచనలో విశ్వనాథ్‌కు ఉన్న ప్రతిభను గుర్తించి తమ అన్నపూర్ణా పిక్చర్స్ సంస్థలో దర్శకత్వ శాఖలోకి రమ్మని హీరో అక్కినేని నాగేశ్వరరావు ప్రోత్సహించారు. మొదట తటపటాయించినా, తర్వాత అన్నపూర్ణా పిక్చర్స్‌లో చేరారు. ఇలా కె.విశ్వనాథ్ సినీ జీవితం ఊహించని మలుపు తిరిగింది.
అవకాశం కోసం వేచి చూస్తూ..
స్వతహాగా సృజనశీలి అయిన విశ్వనాథ్.. ఆదుర్తి శిష్యరికంలో మరిన్ని మెరుగులు దిద్దుకున్నారు. కథ, స్క్రీన్‌ప్లే రచన, సెకండ్ యూనిట్ డైరెక్షన్.. ఇలా విశ్వనాథ్ చేయనిది లేదు. నిజానికి ‘‘అన్నపూర్ణాలో రెండు సినిమాలకు ఆదుర్తి గారి దగ్గర దర్శకత్వ శాఖలో వర్క్ చేసిన తర్వాత నాకు రెండు సినిమాలకు డైరెక్షన్ చాన్స్ ఇస్తామని మాటిచ్చారు. కానీ నాలుగు చిత్రాలకు (వెలుగు నీడలు, ఇద్దరు మిత్రులు –1961; ‘చదువుకున్న అమ్మాయిలు – 63; ‘డాక్టర్ చక్రవర్తి’–64) వర్క్ చేశాకే ఐదో సినిమా దుక్కిపాటి మధుసూదనరావు నిర్మించిన ‘ఆత్మగౌరవం’తో మెగాఫోన్ నా చేతికిచ్చారు.
‘పూలరంగడు’ సినిమాకూ నేనే దర్శకత్వం వహించాల్సింది. మొదట నాతో స్క్రిప్టు వర్క్ వగైరా చేయించారు. అనుకోని కారణాల వల్ల మా గురువు ఆదుర్తి గారే డైరెక్ట్ చేస్తున్నారన్నారు. ఏమైతేనేం ‘ఆత్మగౌరవం’తో దర్శకుడినయ్యా’’ అని కె.విశ్వనాథ్ ఒక సందర్భంలో గుర్తుచేసుకున్నారు. ‘ఆత్మగౌరవం’కి డైరెక్షన్ చాన్స్ ఇచ్చే ముందు.. దుక్కిపాటి గట్టిగా పట్టుబట్టడంతో కె.విశ్వనాథ్ కాపురాన్ని హైదరాబాద్‌కు మార్చాల్సి వచ్చింది. ట్యాంక్ బండ్ దగ్గర గగన్ మహల్ కాలనీలో రెండేళ్లు చిన్న అద్దె ఇంట్లో గడిపారు.
1. తేనెమనసులు సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా కె. విశ్వనాథ్, 2. ‘స్వాతిముత్యం’ సినిమా షూటింగ్‌లో కమల్‌హాసన్‌కు సూచనలిస్తూ.., 3. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన శంకరాభరణంలోని ఓ సన్నివేశం
పబ్లిక్ గార్డెన్స్ చెట్ల నీడలో.. ఖాళీ అద్దం షాట్‌లో..
అన్నపూర్ణా వారి అన్ని సినిమాలలానే ‘ఆత్మగౌరవం’ సినిమా కథ కోసం పలువురు రచయితలతో కలసి దర్శక, నిర్మాతలు మేధోమథనం జరిపారు. నాటక రచయిత గొల్లపూడి మారుతీరావు, నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి, మరికొందరు కలసి హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్ చెట్ల నీడల్లో పచ్చిక బయళ్లలో కూర్చొని కథా చర్చలు, ఆలోచనలు చేశారు. సంగీతాభిరుచి ఉన్న విశ్వనాథ్ మద్రాసు వర్క్ బిజీకి దూరంగా రచయితలు, సంగీత దర్శకుడిని హైదరాబాద్ రప్పించి, ఇక్కడ మ్యూజిక్ సిట్టింగ్స్ జరిపారు. హైదరాబాద్ సారథీ స్టూడియోలో షూటింగ్ ముహూర్తం. తొలి షాట్ చిత్రీకరణ తమాషాగా సాగింది.
సంప్రదాయ శైవ కుటుంబంలో పుట్టిన విశ్వనాథ్ ఇంట్లో అంతా పరమ దైవభక్తులు. నిర్మాత దుక్కిపాటి నాస్తికుడు. తొలి షాట్ దేవుడి పటాల మీద తీసే అవకాశం లేదు. చివరకు అద్దం సాక్షాత్తూ లక్ష్మీదేవి స్వరూపమని విశ్వనాథ్ తెలివిగా ఫస్ట్ షాట్ ఖాళీగా ఉన్న అద్దం మీద పెట్టారు. క్షణమాగి అద్దంలో ప్రతిబింబంగా అక్కినేని ఫ్రేములోకి వచ్చి డ్రెస్ సర్దుకుంటారు. ఇలా అద్దం మీద నుంచి హీరో అక్కినేని మీదకు వచ్చేలా కెమెరామ్యాన్ సెల్వరాజ్‌తో కలసి విశ్వనాథ్ వేసిన ప్లాన్ అద్భుతంగా ఫలించింది. విశ్వనాథ్ సెంటిమెంట్ నిలిచింది. నిర్మాతకూ ఇబ్బంది లేకుండా పోయింది. అద్దం మీద మొదలైన విశ్వనాథ్ దర్శకత్వ ప్రస్థానం అపూర్వంగా ముందుకు సాగింది.
తొలి చిత్రంతోనే అవార్డుల వేట
కె.విశ్వనాథ్ నిర్మించిన తొలి చిత్రం ‘ఆత్మ గౌరవం’ 1965లో ఉత్తమ తృతీయ చిత్రంగా కాంస్య నంది అవార్డును గెల్చుకుంది. ఇదే చిత్రానికి ఉత్తమ నటుడిగా అక్కినేది నాగేశ్వరరావు, ఉత్తమ కథా రచయితలుగా గొల్లపూడి, యద్ధనపూడి నంది అవార్డులు అందుకున్నారు. ఇలా తొలి చిత్రంతోనే విశ్వనాథ్ అవార్డు చిత్రాల దర్శకుడిగా తన అప్రతిహత ప్రయాణానికి నాంది పలికారు. అప్పటి అగ్ర హీరోలు ఎన్టీఆర్‌తో నాలుగు, ఏఎన్నార్‌తో రెండు సినిమాలు తీశారు. ‘శంకరాభరణం’ సినిమాతో శిఖరాగ్రానికి చేరుకున్నారు. తెలుగులో తొలి మహిళా కొరియోగ్రాఫర్‌గా సుమతీ కౌశల్‌కు కె.విశ్వనాథ్ అవకాశం ఇచ్చారు.
ఆ పాటల పల్లవులు విశ్వనాథ్‌వే
విశ్వనాథ్‌లో బాహ్య ప్రపంచానికి తెలియని ఓ అద్భుత సినీ గీత రచయిత ఉన్నారు. ఆదుర్తి దగ్గర సహాయకుడిగా ఉన్న రోజుల్లో గీత రచయితలతో పాటలు రాయించుకుంటున్నప్పుడు సైతం వారికి తన ఇన్‌పుట్స్‌గా పాటల పల్లవులు అందించేవారు. ‘డమ్మీ లిరిక్స్.. అబద్ధపు సాహిత్యం’ అంటూ ఆయన ఇచ్చిన పల్లవులే.. తలమానికమైన ఎన్నో సినీ గీతాలకు కిరీటాలయ్యాయి. ‘ఆత్మగౌరవం’లో ‘మా రాజులొచ్చారు..’, ‘అందెను నేడే..’ పాటల పల్లవులు విశ్వనాథ్ రాసినవే. ఆ పదాలకు మరింత సొబగులద్ది రచయితలు మిగతా పాటంతా అద్భుతంగా అల్లడం విశేషం.
సాగర సంగమం షూటింగ్‌లో..., స్వయంకృషి చిత్రీకరణ సమయంలో నిర్మాత ఏడిద నాగేశ్వరరావు, చిరంజీవితో..
అవార్డులకు కేరాఫ్ అడ్రస్
మునుపెన్నడూ రామప్ప గుడికి వెళ్ళకపోయినా, ఆ పరిసరాలు బాగుంటాయని దుక్కిపాటి, గొల్లపూడి, సెవన్ స్టార్స్ సిండికేట్ సాంస్కృతిక సంస్థ శాండిల్య బృందం చూసొచ్చి చెప్పడంతో, అక్కడకు వెళ్ళి మరీ షూటింగ్ చేసినట్టు విశ్వనాథ్ చెప్పారు. రామప్ప గుడిలోనే దాశరథి రాసిన ‘ఒక పూలబాణం..’ చిత్రీకరించారు. 1965 చివరలో సెన్సార్ జరుపుకొన్న ‘ఆత్మగౌరవం’ ఆ మరుసటేడు రిలీజైంది. ప్రజాదరణ పొంది, విజయవాడ లాంటి చోట్ల శతదినోత్సవం చేసుకుంది.
దర్శకుడిగా విశ్వనాథ్ ప్రతిభా సామర్థ్యాలు ధ్రువపడిపోయాయి. తొలి చిత్రం నుంచి ఇప్పటి దాకా ఓ నాలుగైదు మినహా విశ్వనాథ్ రూపొందించిన చిత్రాలన్నీ నందులో, జాతీయ అవార్డులో ఏవో ఒకటి అందుకున్నవే! స్వయంగా కె. విశ్వనాథ్ సైతం కళాప్రపూర్ణ, రఘుపతి వెంకయ్య అవార్డు, పద్మశ్రీ పురస్కారం, సినీరంగంలో ఇచ్చే అత్యున్నత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు – ఇలా ఎన్నో శిఖరాలు అధిరోహించారు. ఈ 55 ఏళ్ళ దర్శకత్వ ప్రస్థానంలో తెలుగుతెరకు జాతీయ, అంతర్జాతీయస్థాయిలో అమితమైన ఆత్మగౌరవం తెచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment