Kalatapasvi K Viswanath Sankarabharanam Movie Story Details In Telugu - Sakshi
Sakshi News home page

Sankarabharanam: ఓ మగాడు కాటేసిన మహిళ.. గానమే ప్రాణంగా శంకరశాస్త్రి.. ఆ ఇద్దరి కథ, వ్యథ..

Published Fri, Feb 3 2023 1:02 PM | Last Updated on Fri, Feb 3 2023 2:20 PM

K Viswanath Sankarabharanam Movie Story Details In Telugu - Sakshi

మెరిసే మెరుపులు మురిసే పెదవులు చిరుచిరు నవ్వులు కాబోలు.. ఉరిమే ఉరుపులు సరిసరి నటనలు సిరిసిరి మువ్వలు కాబోలు.. అంటూ శంకరుడిని ప్రార్థించిన తీరుకు ప్రేక్షకులు పరవంశించిపోయారు. శంకరాభరణంలో ప్రతి ఫ్రేమూ, ప్రతి మాటా, ప్రతి పాటా ప్రేక్షకులను కొత్త లోకంలోకి తీసుకెళ్లాయి. ఒకసారి చూస్తే తనివి తీరదన్నట్లుగా ప్రేక్షకులు థియేటర్లలోనే ఐదారుసార్లు చూశారు. పైగా చాలాచోట్ల థియేటర్‌ బయటే చెప్పులు విడిచిపెట్టి శంకరాభరణం చూడటం విశేషం. సరిగ్గా 43 ఏళ్ల కిందట ఇదే రోజు(1980, ఫిబ్రవరి 3న) శంకరాభరణం రిలీజైంది. తన సినిమా రిలీజైన రోజే తనువు చాలించారు కె.విశ్వనాథ్‌. ఈ సందర్భంగా శంకరాభరణం కథ, ప్రత్యేకతలేంటో చూద్దాం..

గంజాయివనంలో తులసి పుట్టింది. ఆ తులసికి డబ్బంటే మోజు లేదు. నగలంటే మోహం లేదు. తన తల్లిలా ఐశ్వర్యం అంటే పిచ్చి లేదు. మగవాళ్ల విలాసవస్తువుగా మారి విలువలు లేని జీవితం గడపాలన్న తాపత్రయం లేదు. తులసి నిజంగా తులసి మొక్క అంత పవిత్రమైనది. స్త్రీ దేహానికి విలువ కట్టి వలువ ఊడదీసే ఇంట్లో పుట్టిన తులసికి సంగీతం అంటే ఇష్టం. గానం అంటే ప్రాణం. నృత్యం అంటే అభిమానం. ముఖ్యంగా ‘శంకరాభరణం’ శంకరశాస్త్రి అంటే ఆర్తి.

ఎలాంటి ఆర్తి అది?
ఆయన శివుడు అయితే తను నందిలా ప్రణమిల్లాలని, ఆయన విష్ణువైతే తను పారిజాతంలా పాదం వద్ద పడి ఉండాలని, ఆయన బ్రహ్మ అయితే విశ్వసృజనలో తానొక సింధువులా మారాలని.. అంత భక్తి. ఈ భక్తిలో ఆత్మకు తప్ప శరీరానికి విలువ లేదు. ఉనికి లేదు. కన్న తల్లే తనను అమ్మేయాలనుకున్న సమయంలో తులసిని ఆదుకుంటాడు శంకరశాస్త్రి. కానీ ఊరు వేరేలా అర్థం చేసుకుంది. తనను అభిమానించి చేరదీసిన శంకరశాస్త్రిని తప్పు బట్టింది. ఊరు వెలేసే ‘కులట’ను చేరదీసినందుకు శంకరశాస్త్రిని బహిష్కరించింది. ఆయనను బహిష్కరిస్తే తప్పు లేదు. ఆయన సంగీతాన్ని కూడా బహిష్కరించింది. ఇది తట్టుకోలేని తులసి ఆయన కోసం ఆయనను దూరంగా వదిలిపోతుంది.

శంకర శాస్త్రి– తులసి..
ఒక పాము వీధిన కనబడితే కేవలం అది పాము, విషపురుగు. అదే శివుని మెడలో కనబడితే ఆభరణం. శివుని ఆభరణం.. శంకరాభరణం. పూజలు అందుకుంటుంది. శంకరశాస్త్రి తానొక శంకరాభరణం అని లోకానికి తెలియచేయాలి. తులసి తానొక శంకరాభరణం అని నిరూపించుకోవాలి. సంగీతం కోసం జీవించి, సంగీతాన్ని శోధించి, సంగీతాన్ని ఆరాధించి, సంగీతంలో ఐక్యమై శంకరాభరణంలా గౌరవం పొందిన ఆ ఇద్దరి కథే శంకరాభరణం.

మాసిపోయిన వైభవం..
ఒకప్పుడు గజారోహణం, గండపెండేరం బహూకరణ, సన్మానం, సత్కారం, కచేరి అంటే విరగబడే జనాలు... ఆ వైభవం కాలం గడిచే కొద్దీ మాసిపోయింది. శాస్త్రీయ సంగీతం అరుపులు కేకల సినీ సంగీతంలో మూల్గుల నిట్టూర్పుల పాశ్చాత్య సంగీతంలో పడి కొట్టుకుపోయింది. ఎవరూ శంకరశాస్త్రిని పిలిచేవారు లేరు. పలుకరించేవారు కూడా లేరు. ఆయన కూతురు పెళ్లికి ఎదిగి వచ్చింది. కాని పెళ్లి చేసే డబ్బు లేదు. శరీరాన ఉన్న వస్త్రాలు జీర్ణమయ్యాయి. కొత్త వస్త్రాలు కొనుక్కునే స్థోమత లేదు. మిగిలిందల్లా కంఠాన కొలువున్న సంగీతం. దివారాత్రాలు తోడుండే స్వరాలు.

తిరిగొచ్చిన తులసి..
ఇలాంటి స్థితిలో ఆనాడు వదిలి వెళ్లిన తులసి తిరిగి వస్తుంది. తల్లి చనిపోగా బోలెడంత ఆస్తి కలిసి రాగా ఆ ఆస్తితో ఏదైనా సత్కార్యం చేయాలని శంకరశాస్త్రిని వెతుక్కుంటూ వస్తుంది. అందుకు మాత్రమే కాదు. తనను ఒక మగవాడు కాటేశాడు. అందువల్ల తాను గర్భవతి అయ్యింది. తన కడుపున కూడా కొడుకు రూపంలో ఒక పాము పుట్టింది. ఆ పామును శంకరశాస్త్రి పాదాల చెంత చేర్చి, సంగీతం నేర్చుకునేలా చేసి, ఆ పామును శంకరాభరణం చేయాలన్న లక్ష్యంతో వచ్చింది.

దొరకునా ఇటువంటి సేవా...
తులసి కొడుకు శంకరశాస్త్రి శిష్యుడవుతాడు.ప్రభ కోల్పోయిన శంకరశాస్త్రి పూర్వపు వెలుగును సంతరించుకుంటూ తన చివరి కచ్చేరి ఇస్తాడు. సభికులు కిక్కిరిసిన ఆ సభలో ‘దొరకునా ఇటువంటి సేవా’ అంటూ సంగీతాన్ని అర్చించడానికి మించిన సేవ లేదంటూ పాడుతూ పాట సగంలో వుండగా ప్రాణం విడుస్తాడు. కాని సంగీతం అంతమాత్రాన ఆగిపోతుందా? అది జీవనది. శంకరశాస్త్రి శిష్యుడు, తులసి కొడుకు అయిన పిల్లవాడు మిగిలిన పాటను అందుకుంటాడు. గొప్ప సంగీతం, మరెంతో గొప్ప సంస్కారం, సంస్కృతి ఎక్కడికీ పోవు. మనం చేయవలసిందల్లా పూనిక చేయడమే. ఆదరించడమే. కొత్తతరాలకు అందించడమే. ఇవన్నీ సమర్థంగా సక్రమంగా చెప్పడం వల్ల శంకరాభరణం క్లాసిక్‌ అయ్యింది. కలెక్షన్ల శివ తాండవం ఆడింది. సినిమాలలో కైలాస కొండలా అంత ఎత్తున బంగారువర్ణంలో నిలిచింది.

శంకరాభరణంకు ఊహించని రెస్పాన్స్‌
1980లో విడుదలైన ‘శంకరాభరణం’ తెలుగువారి కీర్తి కారణాలలో ఒకటిగా నిలుస్తుందని ఎవరూ ఊహించలేదు. కాని బీడువారిన నేల ఎదురు చూస్తున్న కుంభవృష్టి అదేనని సినిమా విడుదలయ్యాక తెలిసివచ్చింది. ఈ నేలలో, ఈ ప్రజల రక్తంలో నిబిడీకృతమైన పురా సంస్కృతిని తట్టి లేపడం వల్ల ఆ సినిమా ప్రజల ఆనందభాష్పాలతో తడిసి ముద్దయింది. అవుతూనే ఉంది. దర్శకుడు కె.విశ్వనాథ్‌ మలినం లేని ఉద్దేశ్యంతో తెరకెక్కించడం వల్ల ఆ స్వచ్ఛత సినిమా అంతా కనిపిస్తుంది. ఈ సినిమా సంగీతాన్ని సంస్కరించడం మాత్రమే కాదు మన సంస్కారాన్ని సంస్కరించే పని చేయడం వల్ల కూడా ఆకట్టుకుంది.

నాటు సారా తాగినా అవే పాటలు..
శంకరశాస్త్రిగా జె.వి.సోమయాజులు, తులసిగా మంజుభార్గవి జన్మలు ధన్యమయ్యాయి. సంగీతం అందించిన కె.వి.మహదేవన్, పాటలు రాసిన వేటూరి సుందరరామమూర్తి, పాడిన ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం చరితార్థులయ్యారు. ‘అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమే సోపానమూ’ అంటూ ఈ సినిమా రిలీజైన రోజుల్లో రిక్షావాళ్లు కూడా గొంతు కలిపారు. నాటుసారా తాగి ‘శంకరా’ అని పాట ఎత్తుకున్నారు. చంద్రమోహన్, రాజ్యలక్ష్మి, నిర్మలమ్మ వీళ్లంతా ఒకెత్తయితే శంకరశాస్త్రి స్నేహితుడిగా నటించిన అల్లు రామలింగయ్య ఒక్కడే ఒకెత్తు. కథను సూత్రధారిలా నడిపిస్తాడు. పొంగే శంకరశాస్త్రిపై చిలకరింపులా పడి అతడిని పాలుగా మిగులుస్తుంటాడు. అతడే శంకరశాస్త్రికి స్నేహితుడు, కొడుకు, కన్నతండ్రి.

చదవండి: సిరివెన్నెల సినిమా కోసం చిత్రవధ పడ్డ విశ్వనాథ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement