సాగర సంగమం... నృత్యంలోనే సుఖాన్ని, దుఃఖాన్ని, ప్రేమను, విరహాన్ని చవి చూసిన ఓ నిస్వార్థ కళాకారుని కథ ఇది. 1983 జూన్ 3న తెలుగులో ‘సాగర సంగమం’గా రూపొందించి, తమిళంలో ‘సలంగై ఒలి’గా, మలయాళంలో ‘సాగర సంగమం’గా అనువదించి, విడుదల చేశారు. మూడు భాషల్లోనూ ఒకే రోజు విడుదలైన ఈ చిత్రం అఖండ విజయం సాధించింది. ‘శంకరాభరణం’ అంతటి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన చిత్రం తరువాత అదే కాంబినేషన్ అయిన కె. విశ్వనాథ్–నిర్మాత ఏడిద నాగేశ్వరరావు కలయికలో వచ్చిన మరో కళా ఖండం ‘సాగర సంగమం’.
‘సప్తపది’ తర్వాత నృత్య కళాకారుడి జీవితం నేపథ్యంలో కమల్‌హాసన్ తో ఓ సినిమా చేయాలనుకున్నారు దర్శకులు కె. విశ్వనాథ్. ఈ చిత్రానికి చేగొండి హరిరామజోగయ్య, అల్లు అరవింద్, వీవీ శాస్త్రి నిర్మాతలు. సంగీత దర్శకుడిగా ఎమ్మెస్ విశ్వనాథన్ ని ఎంపిక చేసుకొని మ్యూజిక్ సిట్టింగ్స్ ఆరంభించారు. ఆ సినిమా ఆగిపోయింది. ‘సీతాకోక చిలుక’ తర్వాత తనతో సినిమా చేయడానికి వచ్చిన నిర్మాత ఏడిద నాగేశ్వరరావుకి ఈ ఆగిపోయిన సినిమా కథను వినిపించారు విశ్వనాథ్. అది నచ్చడంతో నిర్మాణ పనులు మొదలు పెట్టారు ఏడిద నాగేశ్వరరావు.
ముందుగా ఈ సినిమాకు వేరే పేరు అనుకున్నారు. నిజానికి ఏడిద నాగేశ్వరరావు ‘సీతాకోక చిలుక’ సినిమాకు ముందుగా ‘సాగర సంగమం’ టైటిల్ పెడదామనుకున్నారు. కానీ చివరగా ‘సీతాకోక చిలుక’ను ఖరారు చేశారు. అప్పట్లో ఈ సినిమా టైటిల్ ఏడిద నాగేశ్వరరావు దగ్గరే ఉంది. ‘సాగర ‡సంగమం’కి ముందుగా ‘మహా మనిషి’తో పాటు పలు టైటిల్స్ పరిశీలనకు వచ్చాయి. కానీ ‘సీతాకోక చిలుక’ సినిమా కోసం అనుకున్న ‘సాగర సంగమం’ను ఈ సినిమాకు పెట్టారు. కె. విశ్వనాథ్, కమల్‌హాసన్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి చిత్రం కూడా ఇదే.
నిరాకరించిన కమల్‌హాసన్
హీరో పాత్రకు కమల్‌హాసన్ ని సంప్రదించగా ఆయన నిరాకరించారు. సినిమా అంతా ముసలివాడిగా కనిపిస్తే ఆ తర్వాత అలాంటి పాత్రలే వస్తాయన్నది కమల్ భయం. పైగా అంతకుముందు ముసలివాడిగా నటించిన ‘కడల్ మీన్‌గళ్’ అనే తమిళ మూవీ ఫ్లాప్ కావడంతో ఆయన ఆ సెంటిమెంట్‌ను బలంగా పట్టుకున్నారు. అయితే.. ఆ పాత్రను కమల్‌తోనే చేయించాలని ఏడిద నాగేశ్వరరావు ఐదారు నెలలు ఆయన వెంటపడి బతిమాలి మరీ ఒప్పించారట. ఇక హీరోయిన్ గా ముందు జయసుధను అనుకున్నారు.
ఆమెకు వేరే సినిమాలతో ఖాళీ లేకపోవడంతో జయప్రదను ఎంచుకున్నారు. శైలజ పాత్రకు క్లాసికల్ డ్యాన్స్ తెలిసిన ఓ కొత్త అమ్మాయిని ఎంపిక చేసుకోవాలనుకున్నారు విశ్వనాథ్. ఆ సమయంలో డ్యాన్స్ నేర్చుకుంటున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు ఎస్పీ శైలజను ఆ పాత్రకు నిర్మాత నాగేశ్వరరావే సిఫార్సు చేశారట. ‘శంకరాభరణం’తో మంచి పేరు తెచ్చుకున్న మంజు భార్గవి ఈ సినిమాలో ఓ పెళ్లి సన్నివేశంలో నృత్య ప్రదర్శన ఇస్తూ కనిపించారు.
ఆ పాట కోసం 30 అడుగుల బావి సెట్
ఈ సినిమాను మద్రాసు, విశాఖ, హైదరాబాద్, ఊటీలో చిత్రీకరించారు. ‘వేవేల గోపెమ్మలా...’ పాటను విశాఖ భీమిలి బీచ్‌లో ఉన్న పార్క్ హోటల్లో, అందులో వచ్చే ఊహా దృశ్యాలను మద్రాసులోని విజయా గార్డెన్స్లో తీశారు. జయప్రద ఇంట్లో జరిగే సన్నివేశాలు, ‘మౌనమేలనోయి...’ పాట, సముద్రపు ఒడ్డులోని సన్నివేశాల్నీ విశాఖలోనే షూట్ చేశారు. ‘ఓం నమఃశివాయ’ పాటను హైదరాబాదులో చిత్రీకరించారు. పత్రికా కార్యాలయంలోని సన్నివేశాలను ఖైరతాబాద్‌లోని ఈనాడు కార్యాలయంలో తీశారు.
మద్యం మత్తులో బావి మీదున్న పైపుపై కమల్‌హాసన్ డ్యాన్స్ చేసే ‘తకిట తథిమి...’ సాంగ్‌ను మద్రాసులోని అరుణాచలం స్టూడియోలో 30 అడుగుల బావి సెట్ వేసి తీశారు. ‘నాద వినోదము...’ పాటను ఊటీలో తీశారు. శాంతారాం తీసిన ‘ఝనక్ ఝనక్ పాయల్ బాజే, నవరంగ్’ సినిమాలకు నృత్య దర్శకత్వం వహించిన గోపీకృష్ణ ఈ పాటకు డ్యాన్స్ డైరక్షన్ చేశారు. ఆయన ఈ పాట కోసమే ప్రత్యేకంగా బొంబాయి నుండి వచ్చారు.
క్లైమాక్స్‌లో వచ్చే ‘వేదం అణువణువున నాదం...’ పాట చిత్రీకరణకు ముందు కమల్ కాలికి ఓ హిందీ సినిమా షూటింగులో తీవ్రమైన గాయమైంది. దాంతో నెల రోజులపాటు షూటింగ్ ఆగింది. అప్పటికీ ఆయన కోలుకోలేదు. అడుగు తీసి అడుగేసే పరిస్థితి లేదు. అయినా సినిమా రిలీజ్‌కు లేటవుతుందని కమల్ ఆ పాటకు డ్యాన్స్ చేయడానికి ముందుకొచ్చారు. షాట్ అనగానే డ్యాన్స్ చేయడం కట్ చెప్పగానే కింద పడిపోవడం. అలా ఆ పాట పూర్తి చేశారు.
ఆ పాత్రకు డబ్బింగ్ చెప్పిన రాజేంద్రప్రసాద్
శరత్‌బాబుతో కలిసి సరదాగా డబ్బింగ్ థియేటరుకి వచ్చిన నటుడు రాజేంద్రప్రసాద్‌ను నిర్మాత ఏడిద నాగేశ్వరరావు అడగడంతో ఈ సినిమాలో శైలజ ప్రియుడిగా నటించిన అరుణ్ కుమార్‌కు డబ్బింగ్ చెప్పారు. జయప్రద భర్తగా చేసిన మోహన్ శర్మకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం డబ్బింగ్ చెప్పారు. ‘వేవేల గోపెమ్మలా...’ పాటలో దర్శకుడిగా నటించిన వ్యక్తికి నిర్మాత నాగేశ్వరరావు డబ్బింగ్ చెప్పారు.
రెండు జాతీయ అవార్డులతో సహా...
‘సాగర సంగమం’ విడుదలై నాలుగు దశాబ్దాలవుతోంది. అయితే ఇప్పటికీ ఈ సినిమా గురించి అక్కడక్కడా ప్రస్తావన వస్తుంటుంది. నాటి ఈ క్లాసిక్‌ది సినీ చరిత్రలో ప్రత్యేకమైన పేజీ. ఈ ‘ఆల్ టైమ్ క్లాసిక్’ చిత్రం ఉత్తమ సంగీతదర్శకత్వం (ఇళయరాజా), ఉత్తమ నేపథ్య గాయకుడు (ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం)... విభాగాల్లో రెండు జాతీయ అవార్డులు సొంతం చేసుకుంది. ఇంకా నంది అవార్డులతో పాటు పలు అవార్డులను కూడా దక్కించుకుంది. – అలిపిరి సురేష్
Comments
Please login to add a commentAdd a comment