sagara sangamam
-
డాల్ఫిన్ల దీవి
సాక్షి, అమరావతి: సాగర సంగమ తీరంలో డాల్ఫిన్లు కనువిందు చేస్తున్నాయి. కృష్ణాజిల్లా హంసలదీవిలో ఇవి తరచూ కనిపిస్తున్నాయి. ఇది కృష్ణా నది సముద్రంలో కలిసేచోటు కావడంతో అవి ఎక్కువగా ఈ ప్రాంతంలో కనిపిస్తాయని స్థానికులు చెబుతున్నారు. ఇవి గుంపులు గుంపులుగా తిరుగుతూ అప్పుడప్పుడు సముద్ర తీరానికి దగ్గరగా వస్తున్నాయని.. ఒక్కో గుంపులో 15 నుంచి 30 వరకూ ఉంటూ కనిపిస్తాయని వారంటున్నారు. విశాఖపట్నం, బాపట్లలోని సూర్యలంక, కాకినాడ బీచ్‌ల్లోనూ ఈ డాల్ఫిన్లు ఎక్కువగా కనిపిస్తాయి. తాజాగా.. ఆదివారం విజయవాడ నేచర్ క్లబ్‌కు చెందిన డాక్టర్ కిషోర్ హంసలదీవి వద్ద సముద్రంలో రెండు డాల్ఫిన్లను తన కెమెరాలో బంధించారు.తూర్పు తీరంలో సర్వ సాధారణంహిందూ మహా సముద్రంలో కనిపించే వీటిని హంప్ బ్యాక్ డాల్ఫిన్లుగా పిలుస్తారు. మన దేశ తూర్పు, పశ్చిమ తీరాల్లో ఇవి కనిపించడం చాలా సాధారణం. అయితే, తూర్పు, పశ్చిమ తీరాల్లో కనిపించే డాల్ఫిన్ల మధ్య జన్యుపరంగా స్వల్ప తేడాలుంటాయి. హంప్ బ్యాక్ డాల్ఫిన్లు ముదురు బూడిద రంగులో ఉంటాయి. వాటి ఉపరితల భాగం చాలా చిన్నదిగా కనిపిస్తుంది. వాటికి ఎత్తయిన మూపురం ఉంటుంది. సముద్రంలో డాల్ఫిన్ల మూపురం బయటకు కనిపిస్తుంది. వాటి ఆధారంగానే డాల్ఫిన్లను గుర్తిస్తారు. ఒక పెద్ద హంప్ బ్యాక్ డాల్ఫిన్ పొడవు సుమారు 3.5 మీటర్లు ఉంటుంది. కొత్తగా పుట్టిన డాల్ఫిన్లు కూడా ఒక మీటర్ పొడవు ఉంటాయి. వాటిలో ఆడ, మగ గురించి మాత్రం సరైన అధ్యయనాల్లేవు.తీరానికి దగ్గరగా వచ్చే డాల్ఫిన్లు ఇవే..డాల్ఫిన్లు మన తీరంలో కనిపించడం సాధారణం. అయితే, వాటిల్లో తీరానికి దగ్గరగా కనిపించేవి హంప్‌బ్యాక్ డాల్ఫిన్లు మాత్రమే. మిగిలిన డాల్ఫిన్ జాతులు సముద్రంలోనే ఇంకా లోతులో ఉంటాయి. డాల్ఫిన్ల గురించి అధ్యయనం చేసేవాళ్లు, చూసేవాళ్లు లేకపోవడంవల్ల వాటి గురించి పెద్దగా బయటకు తెలీడంలేదు. చూసేవాళ్లకు మాత్రం అవి రెగ్యులర్‌గా కనిపిస్తూనే ఉంటాయి. సూర్యుడు ఉదయించే సమయాల్లో అవి తీరానికి దగ్గరగా వస్తాయి. శీతాకాలంలో స్పిన్నర్ డాల్ఫిన్లు (పైకి ఎగిరి నీటిలో పడేవి) విశాఖలో తీరంలో కనిపిస్తాయి. డాల్ఫిన్లు, తిమింగలాలు చనిపోయి లేదా దెబ్బతగిలి ఒడ్డుకు కొట్టుకువస్తే వాటి వివరాలు సేకరించి అటవీ శాఖకు సమాచారం ఇస్తున్నాం. – ప్రణవ్, ఈస్ట్ కోస్ట్ కన్జర్వేషన్ టీమ్ -
ఖైరతాబాద్ గణేశ్ దగ్గర కమల్ హాసన్ డ్యాన్స్.. ఏ సినిమానో తెలుసా?
హైదరాబాద్‌లో వినాయక చవితి అంటే అందరూ ఖైరతాబాద్ గణేశుడి గురించే మాట్లాడుకుంటారు. అంతలా పాపులార్ అయిపోయింది. ఈసారి కూడా లక్షలాది మంది భక్తులు ఈ మహా గణపతిని దర్శించుకున్నారు. తాజాగా హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం కూడా చేశారు. ఇంతలా పాపులర్ అయిన ఖైరతాబాద్ వినాయకుడని గతంలో ఓ తెలుగు సినిమాలో కూడా చూపించారని మీలో ఎంతమందికి తెలుసు?హైదరాబాద్‌లో వినాయకుడు అంటే ఖైరతాబాద్ మాత్రమే అనేంతలా గుర్తింపు వచ్చింది. ఇందుకు తగ్గట్లే ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ వేడుకని నిర్వహిస్తున్నారు. గతంలో అంటే దాదాపు 40 ఏళ్ల క్రితం ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర విలక్షణ నటుడు కమల్ హాసన్ డ్యాన్స్ వేశాడు. మీరు సరిగానే విన్నారు.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ 'దేవర'.. ఫ్యాన్స్‌కి ఒక బ్యాడ్ న్యూస్?)1983లో రిలీజైన 'సాగరసంగమం' సినిమా కమల్ హాసన్‌కి తెలుగు నాట ఎంత పేరు తెచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ఓ చోట ఖైరతాబాద్ వినాయకుడిని చూపిస్తారు. అక్కడ కమల్ క్లాసికల్ డ్యాన్స్ చేస్తాడు.అయితే 1983లో జూన్‌లో 'సాగరసంగమం' సినిమా రిలీజైంది. ఆ ఏడాది సెప్టెంబరులో వినాయక చవితి వచ్చింది. రెండు చోట్ల ఉన్నది ఒకే వినాయకుడు. అంటే ఆ ఏడాది సినిమా కోసం చాలాముందుగానే గణేశుడి ప్రతిమ తయారు చేయించారనమాట. ఏదేమైనా అప్పట్లో ఖైరతాబాద్ వినాయకుడు సినిమాల్లో ఉన్నాడనమాట.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 మూవీస్.. ఆ మూడు కాస్త స్పెషల్) -
అలా ఆ స్టార్ హీరోని నా కాలితో తన్నాల్సి వచ్చింది: ఎస్పీ శైలజ
ఎస్పీ శైలజ.. టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు ఇది. దాదాపు నాలున్నర దశాబ్దాలుగా ఆమె తన గాత్రంతో సంగీత ప్రియులను అలరిస్తోంది. ఆమె పాట ఎంత మధురంగా ఉంటుందో.. మనసు కూడా అంతే సున్నితంగా ఉంటుంది. కేవలం పాటల్లోనే కాకుండా.. డబ్బింగ్ ఆరిస్ట్‌గా, నటిగా కూడా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న శైలజ.. తన సినీ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ‘నేను ఇంత పెద్ద సింగర్ అవుతానని అనుకోలేదు. బహుషా ఒక్క పాట పాడతానేమో అనుకున్నా. మా ఇంట్లో నేను, అన్నయ్య(ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం) తప్ప అందరూ సంగీత వాయిద్యాలు నేర్చుకున్నారు. మా అమ్మకు ఒక్క ఆడపిల్ల అయినా స్జేజ్మీద పాడాలని కోరిక ఉండేది. కానీ మా నాన్నకు అది నచ్చేది కాదు. మొదట్లో నన్ను బయటకు పంపడానికి అంగీకరించలేదు. కానీ ఆ తర్వాత ఆయన ఓకే చెప్పారు. వారి ప్రోత్సాహంతో మొదటి సారి ‘మార్పు’ సినిమాలో పాడే అవకాశం వచ్చింది. ఆ పాట విన్నాక అన్నయ్యకు నాపై నమ్మకం కలిగింది. దీంతో ప్రతి ప్రోగ్రామ్స్‌కు నన్ను తీసుకెళ్లాడు. ఆ తర్వాత చక్రవర్తి గారు వరుసగా అవకాశాలు ఇచ్చాడు. నేను పాడిన పాటలు విజయవంతం కావడంతో అన్ని భాషల్లో అవకాశాలు వచ్చాయి. ఇక సినిమాలో నటించే అవకాశం కూడా అనుకోకుండా వచ్చింది. నేను భరత నాట్యంలోకి అరంగేట్రం చేసినప్పుడు తీసిన ఫోటోలు విశ్వనాథ్‌గారు చూశారు. అలా ‘సాగరసంగమం’లో చాన్స్ వచ్చింది. మొదట నటించడానికి నేను అంగీకరించలేదు. ఇంట్లో అందరూ చేయమని చెప్పిన.. నేను నో చెప్పాను. కానీ విశ్వనాథ్ గారు మా నాన్న దగ్గరకు వెళ్లి ఆయనతో మాట్లాడి బలవంతంగా ఒప్పించారు. షూటింగ్ సమయంలో విశ్వనాథ్‌గారితో చాలా విషయాలు పంచుకున్నాను. ఒక అన్నయ్యలా నాకు క్లోజ్ అయ్యాడు. ‘సాగరసంగమం’ సినిమాలో కమల్ హాసన్ గారిని కాలితో తన్నే సన్నివేశం ఉంది. దానికి నేను ఎంత ప్రయత్నించినా.. నా కాలు వెనక్కి వచ్చేసిది. అప్పుడు విశ్వనాథ్‌గారు పిలిచి ఇవి పాత్రలు మాత్రమే.. నిజంగా కమల్ హాసన్‌ని తన్నడం లేదు.. ఆయన పోషించిన పాత్రను మాత్రమే నువ్వు కాలితో తన్నుతున్నావు అని చెప్పి చేయించాడు. అలా ఇష్టం లేకున్నా.. ఆ హీరోని తన్నాల్సి వచ్చింది అని శైలజ చెప్పుకొచ్చారు. -
తెలుగు సినిమా ‘ఆత్మగౌరవం’!
‘మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు.. ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు..’ అంటూ శంకరుడిని ప్రార్థించిన తీరు ప్రేక్షకుల ఆనంద వృష్టిని తడిపింది. ‘పంచ భూతములు ముఖ పంచకమై.. ఆరు రుతువులు ఆహార్యములై.. నీ దృక్కులే అటు అష్ట దిక్కులై.. నీ వాక్కులే నవరసమ్ములై..’ అంటూ ఉర్రూతలూగించిన తీరు అజరామరం. ‘కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం..’ చూపడంలో మీ శైలికి సెల్యూట్. తెలుగు సినిమా ఉత్తుంగ తరంగంలా ఎగిసి పడేలా చేయడంలో మీ తర్వాతే ఎవరైనా. మీ గురించి మేమెంత చెప్పినా, అవి మీకు కొత్తగా కిరీటాలేమీ పెట్టవు. ఆకాశమంత మీ నిబద్ధతకు అరచెయ్యంత అద్దం ఈ మాటలు. మీరు నింగికెగిసినా మా కళ్లముందుంచిన ఆ అపురూప దృశ్య కావ్యాల్లో అనునిత్యం మీరు కనిపిస్తూనే ఉంటారన్నది అక్షర సత్యం. ఎంతటి గంగా ప్రవాహమైనా గంగోత్రి లాంటి ఓ పవిత్ర స్థానంలో చిన్నగా, ఓ పాయలా మొదలవుతుంది. వెండితెరపై శంకరాభరణం, సాగర సంగమం వంటి ఎన్నో కళాఖండాలను సృజించిన కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వ ప్రయాణం కూడా అలాగే ఓ చిన్న పాయలా మొదలైంది. సౌండ్ రికార్డిస్టుగా మొదలై.. దర్శకత్వ శాఖకు విస్తరించిన విశ్వనాథ్ 1965లో తొలిసారిగా ‘ఆత్మగౌరవం’ సినిమాతో మెగాఫోన్ పట్టుకున్నారు. నాటి నుంచి ఐదున్నర దశాబ్దాలకుపైగా వెండితెర అద్భుతాలను అందించారు. తొలితరంలో గూడవల్లి రామబ్రహ్మం, బీఎన్ రెడ్డి, కేవీ రెడ్డి, మలితరంలో ఆదుర్తి సుబ్బారావు తదితరుల తర్వాత మూడో తరంలో తెలుగు సినిమాకు ‘ఆత్మగౌరవం’ తెచ్చిన దర్శక కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్. వాహినీ స్టూడియోలో సౌండ్ రికార్డింగ్ విభాగంలో కెరీర్‌ను ప్రారంభించి బీఎన్ రెడ్డి, కేవీ రెడ్డి, ఆదుర్తి సుబ్బారావు వంటి వారి పనితీరును దగ్గరగా పరిశీలిస్తూ వచ్చిన కె.విశ్వనాథ్ స్క్రిప్టులో తోచిన సలహాలు, సూచనలు ఇస్తుండేవారు. ఈ క్రమంలో ఆదుర్తి తన సినిమాలకు స్క్రిప్ట్ అసిస్టెంట్‌గా, అసోసియేట్‌గా పనిచేసే అవకాశం ఇచ్చారు. అలా కథా విస్తరణ, స్క్రీన్ ప్లే రచనలో విశ్వనాథ్‌కు ఉన్న ప్రతిభను గుర్తించి తమ అన్నపూర్ణా పిక్చర్స్ సంస్థలో దర్శకత్వ శాఖలోకి రమ్మని హీరో అక్కినేని నాగేశ్వరరావు ప్రోత్సహించారు. మొదట తటపటాయించినా, తర్వాత అన్నపూర్ణా పిక్చర్స్‌లో చేరారు. ఇలా కె.విశ్వనాథ్ సినీ జీవితం ఊహించని మలుపు తిరిగింది. అవకాశం కోసం వేచి చూస్తూ.. స్వతహాగా సృజనశీలి అయిన విశ్వనాథ్.. ఆదుర్తి శిష్యరికంలో మరిన్ని మెరుగులు దిద్దుకున్నారు. కథ, స్క్రీన్‌ప్లే రచన, సెకండ్ యూనిట్ డైరెక్షన్.. ఇలా విశ్వనాథ్ చేయనిది లేదు. నిజానికి ‘‘అన్నపూర్ణాలో రెండు సినిమాలకు ఆదుర్తి గారి దగ్గర దర్శకత్వ శాఖలో వర్క్ చేసిన తర్వాత నాకు రెండు సినిమాలకు డైరెక్షన్ చాన్స్ ఇస్తామని మాటిచ్చారు. కానీ నాలుగు చిత్రాలకు (వెలుగు నీడలు, ఇద్దరు మిత్రులు –1961; ‘చదువుకున్న అమ్మాయిలు – 63; ‘డాక్టర్ చక్రవర్తి’–64) వర్క్ చేశాకే ఐదో సినిమా దుక్కిపాటి మధుసూదనరావు నిర్మించిన ‘ఆత్మగౌరవం’తో మెగాఫోన్ నా చేతికిచ్చారు. ‘పూలరంగడు’ సినిమాకూ నేనే దర్శకత్వం వహించాల్సింది. మొదట నాతో స్క్రిప్టు వర్క్ వగైరా చేయించారు. అనుకోని కారణాల వల్ల మా గురువు ఆదుర్తి గారే డైరెక్ట్ చేస్తున్నారన్నారు. ఏమైతేనేం ‘ఆత్మగౌరవం’తో దర్శకుడినయ్యా’’ అని కె.విశ్వనాథ్ ఒక సందర్భంలో గుర్తుచేసుకున్నారు. ‘ఆత్మగౌరవం’కి డైరెక్షన్ చాన్స్ ఇచ్చే ముందు.. దుక్కిపాటి గట్టిగా పట్టుబట్టడంతో కె.విశ్వనాథ్ కాపురాన్ని హైదరాబాద్‌కు మార్చాల్సి వచ్చింది. ట్యాంక్ బండ్ దగ్గర గగన్ మహల్ కాలనీలో రెండేళ్లు చిన్న అద్దె ఇంట్లో గడిపారు. 1. తేనెమనసులు సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా కె. విశ్వనాథ్, 2. ‘స్వాతిముత్యం’ సినిమా షూటింగ్లో కమల్‌హాసన్‌కు సూచనలిస్తూ.., 3. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన శంకరాభరణంలోని ఓ సన్నివేశం పబ్లిక్ గార్డెన్స్ చెట్ల నీడలో.. ఖాళీ అద్దం షాట్లో.. అన్నపూర్ణా వారి అన్ని సినిమాలలానే ‘ఆత్మగౌరవం’ సినిమా కథ కోసం పలువురు రచయితలతో కలసి దర్శక, నిర్మాతలు మేధోమథనం జరిపారు. నాటక రచయిత గొల్లపూడి మారుతీరావు, నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి, మరికొందరు కలసి హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్ చెట్ల నీడల్లో పచ్చిక బయళ్లలో కూర్చొని కథా చర్చలు, ఆలోచనలు చేశారు. సంగీతాభిరుచి ఉన్న విశ్వనాథ్ మద్రాసు వర్క్ బిజీకి దూరంగా రచయితలు, సంగీత దర్శకుడిని హైదరాబాద్ రప్పించి, ఇక్కడ మ్యూజిక్ సిట్టింగ్స్ జరిపారు. హైదరాబాద్ సారథీ స్టూడియోలో షూటింగ్ ముహూర్తం. తొలి షాట్ చిత్రీకరణ తమాషాగా సాగింది. సంప్రదాయ శైవ కుటుంబంలో పుట్టిన విశ్వనాథ్ ఇంట్లో అంతా పరమ దైవభక్తులు. నిర్మాత దుక్కిపాటి నాస్తికుడు. తొలి షాట్ దేవుడి పటాల మీద తీసే అవకాశం లేదు. చివరకు అద్దం సాక్షాత్తూ లక్ష్మీదేవి స్వరూపమని విశ్వనాథ్ తెలివిగా ఫస్ట్ షాట్ ఖాళీగా ఉన్న అద్దం మీద పెట్టారు. క్షణమాగి అద్దంలో ప్రతిబింబంగా అక్కినేని ఫ్రేములోకి వచ్చి డ్రెస్ సర్దుకుంటారు. ఇలా అద్దం మీద నుంచి హీరో అక్కినేని మీదకు వచ్చేలా కెమెరామ్యాన్ సెల్వరాజ్‌తో కలసి విశ్వనాథ్ వేసిన ప్లాన్ అద్భుతంగా ఫలించింది. విశ్వనాథ్ సెంటిమెంట్ నిలిచింది. నిర్మాతకూ ఇబ్బంది లేకుండా పోయింది. అద్దం మీద మొదలైన విశ్వనాథ్ దర్శకత్వ ప్రస్థానం అపూర్వంగా ముందుకు సాగింది. తొలి చిత్రంతోనే అవార్డుల వేట కె.విశ్వనాథ్ నిర్మించిన తొలి చిత్రం ‘ఆత్మ గౌరవం’ 1965లో ఉత్తమ తృతీయ చిత్రంగా కాంస్య నంది అవార్డును గెల్చుకుంది. ఇదే చిత్రానికి ఉత్తమ నటుడిగా అక్కినేది నాగేశ్వరరావు, ఉత్తమ కథా రచయితలుగా గొల్లపూడి, యద్ధనపూడి నంది అవార్డులు అందుకున్నారు. ఇలా తొలి చిత్రంతోనే విశ్వనాథ్ అవార్డు చిత్రాల దర్శకుడిగా తన అప్రతిహత ప్రయాణానికి నాంది పలికారు. అప్పటి అగ్ర హీరోలు ఎన్టీఆర్‌తో నాలుగు, ఏఎన్నార్‌తో రెండు సినిమాలు తీశారు. ‘శంకరాభరణం’ సినిమాతో శిఖరాగ్రానికి చేరుకున్నారు. తెలుగులో తొలి మహిళా కొరియోగ్రాఫర్‌గా సుమతీ కౌశల్‌కు కె.విశ్వనాథ్ అవకాశం ఇచ్చారు. ఆ పాటల పల్లవులు విశ్వనాథ్‌వే విశ్వనాథ్‌లో బాహ్య ప్రపంచానికి తెలియని ఓ అద్భుత సినీ గీత రచయిత ఉన్నారు. ఆదుర్తి దగ్గర సహాయకుడిగా ఉన్న రోజుల్లో గీత రచయితలతో పాటలు రాయించుకుంటున్నప్పుడు సైతం వారికి తన ఇన్‌పుట్స్‌గా పాటల పల్లవులు అందించేవారు. ‘డమ్మీ లిరిక్స్.. అబద్ధపు సాహిత్యం’ అంటూ ఆయన ఇచ్చిన పల్లవులే.. తలమానికమైన ఎన్నో సినీ గీతాలకు కిరీటాలయ్యాయి. ‘ఆత్మగౌరవం’లో ‘మా రాజులొచ్చారు..’, ‘అందెను నేడే..’ పాటల పల్లవులు విశ్వనాథ్ రాసినవే. ఆ పదాలకు మరింత సొబగులద్ది రచయితలు మిగతా పాటంతా అద్భుతంగా అల్లడం విశేషం. సాగర సంగమం షూటింగ్లో..., స్వయంకృషి చిత్రీకరణ సమయంలో నిర్మాత ఏడిద నాగేశ్వరరావు, చిరంజీవితో.. అవార్డులకు కేరాఫ్ అడ్రస్ మునుపెన్నడూ రామప్ప గుడికి వెళ్ళకపోయినా, ఆ పరిసరాలు బాగుంటాయని దుక్కిపాటి, గొల్లపూడి, సెవన్ స్టార్స్ సిండికేట్ సాంస్కృతిక సంస్థ శాండిల్య బృందం చూసొచ్చి చెప్పడంతో, అక్కడకు వెళ్ళి మరీ షూటింగ్ చేసినట్టు విశ్వనాథ్ చెప్పారు. రామప్ప గుడిలోనే దాశరథి రాసిన ‘ఒక పూలబాణం..’ చిత్రీకరించారు. 1965 చివరలో సెన్సార్ జరుపుకొన్న ‘ఆత్మగౌరవం’ ఆ మరుసటేడు రిలీజైంది. ప్రజాదరణ పొంది, విజయవాడ లాంటి చోట్ల శతదినోత్సవం చేసుకుంది. దర్శకుడిగా విశ్వనాథ్ ప్రతిభా సామర్థ్యాలు ధ్రువపడిపోయాయి. తొలి చిత్రం నుంచి ఇప్పటి దాకా ఓ నాలుగైదు మినహా విశ్వనాథ్ రూపొందించిన చిత్రాలన్నీ నందులో, జాతీయ అవార్డులో ఏవో ఒకటి అందుకున్నవే! స్వయంగా కె. విశ్వనాథ్ సైతం కళాప్రపూర్ణ, రఘుపతి వెంకయ్య అవార్డు, పద్మశ్రీ పురస్కారం, సినీరంగంలో ఇచ్చే అత్యున్నత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు – ఇలా ఎన్నో శిఖరాలు అధిరోహించారు. ఈ 55 ఏళ్ళ దర్శకత్వ ప్రస్థానంలో తెలుగుతెరకు జాతీయ, అంతర్జాతీయస్థాయిలో అమితమైన ఆత్మగౌరవం తెచ్చారు. -
విరహం అయినా..విషాదం అయినా 'వాన' ఉండాల్సిందే..
‘‘మెరిసే మెరుపులు ఉరిమే ఉరుములు సిరిసిరి మువ్వలు కాబోలు’’... శంకరశాస్త్రికి కూడా వాన సాయం కావాల్సి వచ్చింది. ‘‘ఆ రెండి నట్టనడుమ నీకెందుకింత తపన’’... నాట్య కళాకారుడు బాలు బావి గట్టుమీద వాననే సవాలు చేశాడు. జగపతి వారి చిటపట చినుకులు నుంచి ‘‘ఈ వర్షానికి స్పర్శుంటే..’’ పాట వరకు ఎన్నో సందర్భాల్లో వాన హార్మోనియం మెట్లను తడిపింది.. కలెక్షన్ల బాక్సుల్ని నింపింది. ఒక వాన విహారం... ‘శంకరాభరణం’లో శంకర శాస్త్రిని జనం సందేహించారు. అతడి శీలాన్ని శంకించారు. శంకర శాస్త్రి ఏమిటి... పరాయి స్త్రీని తన పక్కన కచ్చేరీకి కూచోబెట్టుకోవడం ఏమిటి? కాని నిప్పులాంటి శంకర శాస్త్రికి తానేమిటో తెలుసు. ఆ సంగతి శంకరుడికీ తెలుసు. అందుకే ఆ శంకరుడితో తన ఆగ్రహాన్ని చెప్పుకున్నాడు. గానం చేశాడు. ఇంతటి ఆగ్రహ జ్వాల లోకాన్ని ఏం చేయాలని? అతణ్ణి చల్లబరచాలే. అందుకే గంగ దూకింది. మెరుపులు మెరిశాయి. ఉరుములు ఫెటిల్మన్నాయి. ‘శంకరా నాదశరీరాపరా’... గానవాహిని కొనసాగింది. వాన లేకపోతే ఆ పాటకు బలం లేదు. వాన ఆ పాటకూ పాత్రకూ శక్తినిచ్చింది. వాన.. శక్తి. వానను దుబారా చేయకూడదు. సరిౖయెన సమయంలో నేలకు దించాలి. ఝల్లుమనిపించాలి. గుండె తడిపించాలి. ‘సాగర సంగమం’లో విఫల ప్రేమికుడు, పరాజిత కళాకారుడు అయిన బాలుకు మందు తప్ప మరో తోడు లేదు. అతడు తాగి తాగి చనిపోబోతున్నాడు. చనిపోయేవాడికి భయం ఏమిటి? రెండు గుక్కలు తాగి బావి గట్టున ఎక్కితే? మనసు ‘తకిట తధిమి తకిట తధిమి తందానా’ అంటే? కాని అతణ్ణి ఆపాలి. ఆపాలంటే ఆమె రావాలి. రావాలంటే వాన రావాలి. వానలో అతడికి ప్రమాదమేమో అని ఆమె వొణికిపోవాలి. అప్పుడు వితంతువు అయిన ఆమె బొట్టు పెట్టుకుంటుంది. అతడు దానికి అరచేయి అడ్డుపెడతాడు. వాన వారి గత జ్ఞాపకాలను తడుపుతూ కురుస్తుంది. మనోజ్వరం ఆ సన్నివేశానిది.వానలో అందరం తడుస్తాము. కాని వయసులో ఉన్నప్పుడు, జోడు తోడుగా ఉన్నప్పుడు తడవడం అందరికీ కుదరదు. కనుక సినిమాలో అలాంటి జోడి తడిస్తే సంతోషపడతాము. ముచ్చటపడతాము. ఆ అచ్చట్లు ముచ్చట్లు తీసి నాలుగు డబ్బులు రాబట్టుకునే సినిమావారు ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే’ అని వానను తెర మీదకు తెచ్చారు. ‘ముత్యాల జల్లు కురిసే’ అని హీరోయిన్ను మైమరిపించారు. సందర్భాలను సృష్టించి సంగీత దర్శకులకు సవాలు విసిరారు. వారు అందుకు సరేగమా అన్నారు. ‘ప్రేమ్‌నగర్’లో శ్రీమంతుల కుర్రాడు తన దగ్గర సెక్రటరీగా పని చేసే అమ్మాయిని వానలో తడిచి చూసే మోహిస్తాడు. బయట వాన కురుస్తుంటే లోపల పాట. హార్మోనియం పలికింది. ‘తేట తేట తెలుగులా’ అని ఉత్ప్రేక్షల కుంభవృష్టి కురిసింది.లవ్ ఫెయిల్యూర్ కుర్రాళ్లకు ఎలాగూ కన్నీళ్లు వస్తాయి. ఆ బాధా సమయంలో వాన కూడా వస్తే ఇక వరదే. ఆ రేంజ్ కావాలంటే కేరళ నుంచి ఏసుదాస్ రావాల్సిందే. ‘స్వయంవరం’లో ‘గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం’... ఆ పాట హోరు సులువుగా వదిలిపోదు. వాన ఎందుకనో ఆడపిల్లల నేస్తం. వాన వస్తే అమ్మాయిలు పాడతారు. ‘మౌనరాగం’లో ‘అహో మేఘమొచ్చెనే’ అని రేవతి పాడుతుంది. ‘గీతాంజలి’లో ‘వొళ్లంత జల్లంత కావాలిలే’ అని గిరిజ పాడుతుంది. ‘వర్షం’లో ‘ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వానా’ అని త్రిష పాడుతుంది. ‘వచ్చె వచ్చె నల్ల మబ్బుల్లారా’ అని ‘ఆనంద్’లో కమలిని ముఖర్జీ పాడుతుంది. కె.వి.మహదేవన్ నుంచి కె.ఎం. రాధాకృష్ణన్ వరకు వానమీటలు మీటిన వారే. హీరో ఎంతటివాడైనా హీరోయిన్ ఎవ్వరైనా వాన ఉంటే ఆ ఫీల్ వేరు. ఆడియెన్స్‌కు ఆ థ్రిల్ వేరు. ఎన్.టి.ఆర్–శ్రీదేవి ‘ఆకు చాటు పిందె తడిసె’ అనాల్సిందే. అక్కినేని–శ్రీదేవి ‘చిటపట చినుకుల మేళం’ అని పాడాల్సిందే. చిరంజీవి– రాధ ‘వానా వానా వందనం’ అంటే ‘అడవి దొంగ’ పెద్ద హిట్ అయ్యింది. వాణి విశ్వనాథ్‌తో ఆయనే పాడిన ‘అబ్బా.. ఇది ఏమి వాన’ పాట ‘ఘరానా అల్లుడు’కు కిక్ ఇచ్చింది. ‘స్వాతి ముత్యపు జల్లుల’లో (నాగార్జున), ‘స్వాతిలో ముత్యమంత’ (బాలకృష్ణ), ‘చిత్తడి చిత్తడి వాన’ (సుమన్).. ఆ వానలాహిరి అలా సాగిపోతూనే వచ్చింది.ఆకాశం ఆనాటిదే. ప్రేమా ఈనాటిదే. వాన ఏనాటిదే. అందుకే కొత్తతరం వచ్చినా వానచప్పుడు ప్రేమచప్పుడు సినిమాల్లో వినిపిస్తూనే ఉంది. వరుణ్ తేజ్ ‘తొలి ప్రేమ’లో ‘ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా’ పాట అందరినీ అందుకే తడిపింది. వానలో ఒక లయ, సవ్వడి ఉంటుంది. ఆ సంగీతం ఎప్పుడైనా బాగుంటుంది. ముఖ్యంగా సినిమా కోసం అది ట్యూన్లో కురిసినప్పుడు. ఆకాశగంగా... దూకావె పెంకితనంగాఆకాశగంగా జలజలజడిగా తొలిఅలజడిగా... -
విశ్వనాథ వనితలు
పాశ్చాత్య సంగీతపు పెనుతుఫానుకు అరచేతులు అడ్డుపెడుతుంది ఒక స్త్రీ. ఒక గొప్ప నాట్యకారుడి అంతిమ రోజులను అర్థమంతం చేస్తుంది మరో స్త్రీ. తనలోని కళను తాను కనుగొనడానికి గొప్ప సంఘర్షణ చేస్తుంది ఒక స్త్రీ. వ్యసనపరుడైన భర్తను సంస్కరించడానికి ఎడబాటు నిరసనను ఆశ్రయిస్తుంది మరో స్త్రీ. ప్రేమకు కులం లేదు అనే స్త్రీ... వరకట్నం వద్దు అనే స్త్రీ.. మందమతితో జీవితాన్ని పునర్నిర్మించుకునే స్త్రీ. అతడు చూపిన స్త్రీలు ఆత్మాభిమానం కలిగిన స్త్రీలు. ఆత్మవిశ్వాసాన్ని కలిగిన స్త్రీలు. భారతీయ సంస్కృతిని గౌరవించాలనుకునే స్త్రీలు. కె.విశ్వనాథ్ 92వ జన్మదినం సందర్భంగా.... ఆమెకు సంగీతం, నృత్యం అంటే ప్రాణం. కాని తల్లి ఆమెను ఒక వేశ్యను చేయాలనుకుంటుంది. బలవంతంగా ఆమెపై అత్యాచారం జరిగేలా చూస్తుంది. ఆమె కడుపున నలుసు పడుతుంది. కాని అది ఇష్టం లేని సంతానం. ఒక పాము కాటేస్తే వచ్చిన గర్భం. పుట్టబోయేది కూడా పామే. ఆమె అబార్షన్ చేయించుకోదు. ఆత్మహత్య చేసుకోదు. ఆ బిడ్డకు జన్మనిస్తుంది. ఆ బిడ్డకు సంగీతం నేర్పిస్తుంది. తరువాత తను దేవుడిగా భావించే శంకరశాస్త్రి దగ్గరకు పంపి ఆయన శిష్యుడిగా మారుస్తుంది. బయట దారిలో కనిపిస్తే ‘పాము’ పామే అవుతుంది. కాని శివుని మెడలో ఉండి కనిపిస్తే ‘శంకరాభరణం’ అవుతుంది. అథోముఖమైన తన జీవితాన్ని ఊర్థ్వంలోకి మార్చుకుని సంతృప్తి పొందిన ఆ స్త్రీ ‘శంకరాభరణం’లో మంజుభార్గవి. ఆ పాత్రను అంత తీక్షణంగా, ఔన్నత్యంగా తీర్చిదిద్దినవారు దర్శకడు కె.విశ్వనాథ్. ఒక కళాకారుణ్ణి తెలుసుకోవాలంటే అతడు పుట్టించిన పాత్రలను చూడాలి. మహిళల పట్ల అతడి దృక్పథం తెలియాలంటే అతడు సృష్టించిన మహిళా పాత్రలను చూడాలి. కె.విశ్వనాథ్ సృష్టించిన మహిళా పాత్రలు ప్రేక్షకులకు నచ్చిన పాత్రలు. ప్రేక్షకులు మెచ్చిన పాత్రలు. అంతేకాదు పరోక్షంగా తమ ప్రభావాన్ని వేసే పాత్రలు. ‘శుభలేఖ’ సినిమాలో సుమలత లెక్చరర్. ఎంతో చక్కని అమ్మాయి. ఆమెతో జీవితం ఏ పురుషుడికైనా అపురూపంగా ఉండగలదు. కాని ఆమెను కోడలిగా తెచ్చుకోవడానికి బోలెడంత కట్నం అడుగుతాడు ఆ సినిమాలో పెద్దమనిషి సత్యనారాయణ. డబ్బు, కానుకలు, కార్లు... ఒకటేమిటి అడగనిది లేదు. ఆత్మాభిమానం ఉన్న ఏ అమ్మాయి అయినా ఊరుకుంటుందా? సుమలత తిరగబడుతుంది. సంతలో పశువును కొన్నట్టు వరుణ్ణి కొననని చెప్పి సంస్కారం ఉన్న వ్యక్తి హోటల్లో వెయిటర్ అయినా సరే అతణ్ణే చేసుకుంటానని చిరంజీవిని చేసుకుంటుంది. మనిషికి ఉండాల్సిన సంస్కార సంపదను గుర్తు చేస్తుంది ఈ సినిమాలో సుమలత. ‘సాగర సంగమం’లో జయప్రద ఫీచర్ జర్నలిస్ట్. చదువుకున్న అమ్మాయి. భారతీయ కళలు ఎంత గొప్పవో తెలుసు. అందుకే కమల హాసన్‌లోని ఆర్టిస్ట్‌ను గుర్తించింది. అతణ్ణి ఇష్టపడటం, కోరుకోవడం జరక్కపోవచ్చు. అతడి కళను ఇష్టపడటం ఆపాల్సిన అవసరం లేదని గ్రహిస్తుంది. విఫల కళాకారుడిగా ఉన్న కమల హాసన్ చివరి రోజులను అర్థవంతం చేయడానికి అతడిలోని కళాకారుణ్ణి లోకం గుర్తించేలా చేయడానికి ఆమె ప్రయత్నిస్తుంది. తన కుమార్తెనే అతని శిష్యురాలిగా చేస్తుంది. ఆమె రాకముందు అతడు తాగుబోతు. కాని మరణించే సమయానికి గొప్ప కళాకారుడు. స్త్రీ కాదు లత. ఒక్కోసారి పురుషుడే లత. ఆ లతకు ఒక దన్ను కావాలి. ఆ దన్ను జయప్రదలాంటి స్త్రీ అని ఆ సినిమాలో విశ్వనాథ్ చూపిస్తారు. ‘సప్తపది’లో ఆ అమ్మాయి అతడి కులాన్ని చూడదు. అతడి చేతిలోని వేణువునే చూస్తుంది. ఆ వేణునాదాన్నే వింటుంది. ఏడడుగుల బంధంలోకి నడవాలంటే కావాలసింది స్త్రీ, పురుషుల మధ్య ఏర్పడే పరస్పర ప్రేమ, గౌరవం. అంతే తప్ప కులం, అంతస్తు కాదు. సంప్రదాయాల కట్టుబాట్లు ఉన్న ఇంట పుట్టినా హృదయం చెప్పిందే చేసిందా అమ్మాయి. ఆమె ప్రేమను లోకం హర్షించింది. యువతకు లక్ష్యం ఉందా? కళ పట్ల అనురక్తి ఉందా? తమలోని కళను కాకుండా కాసులను వెతికే వేటను కొనసాగిస్తే అందులో ఏదైనా సంతృప్తి ఉందా? ‘స్వర్ణకమలం’లో గొప్ప నాట్యగత్తె భానుప్రియ. కాని ఆ నాట్యాన్ని ఆమె గుర్తించదు. ఆ కళను గుర్తించదు. ఒక కూచిపూడి నృత్యకళాకారిణిగా ఉండటం కన్నా హోటల్లో హౌస్‌కీపింగ్‌లో పని చేయడమే గొప్ప అని భావిస్తుంది. ఆ అమ్మాయికి ధైర్యం ఉంది. తెగువ ఉంది. చురుకుదనం ఉంది. టాలెంట్ ఉంది. స్వీయజ్ఞానమే కావాల్సింది. కాని చివరలో ఆత్మసాక్షాత్కారం అవుతుంది. తను గొప్ప డ్యాన్సర్ అవుతుంది. మూసలో పడేవాళ్లు మూసలో పడుతూనే ఉంటారు. కొత్తదారి వెతికినవారు భానుప్రియ అవుతారు. మీరు మాత్రమే నడిచే దారిలో నడవండి అని చెప్పిందా పాత్ర. లైఫ్‌లో ఒక్కోసారి ఆప్షన్ ఉండదు. మనం టిక్ పెట్టేలోపలే విధి టిక్ పెట్టేస్తుంది. ‘స్వాతిముత్యం’లో రాధికకు భర్త చనిపోతాడు. ఒక కొడుకు. ఆ కష్టం అలా ఉండగానే మందమతి అయిన కమల హాసన్ తాళి కట్టేస్తాడు. అంతవరకూ ఆమె జీవితం ఏమిటో ఆమెకు తెలియదు. ఇప్పుడు ఒక మీసాలు లేని, ఒక మీసాలు ఉన్న పిల్లాడితో కొత్త జీవితం నిర్మించుకోవాలి. ఆమె నిర్మించుకుంటుంది. అతణ్ణి కర్తవ్యోన్ముఖుణ్ణి చేస్తుంది. అడ్డంకులను జయించుకుంటూ అతడి ద్వారా తన జీవితాన్ని జయిస్తుంది. స్థిర సంకల్పం ఉంటే కష్టాలను దాటొచ్చని చెబుతుంది. కె.విశ్వనాథ్ మహిళా పాత్రలలో స్వాతిముత్యంలో రాధిక పాత్ర మర్చిపోలేము. ‘శృతిలయలు’లో సుమలత భర్త రాజశేఖర్. కళకారుడు. కాని స్త్రీలోలుడు అవుతాడు. వ్యసనపరుడవుతాడు. లక్ష్యరహితుడవుతాడు. అతణ్ణి సరిచేయాలి. దానికి ఇంట్లో ఉండి రాద్ధాంతం పెట్టుకోదు ఆమె. కొడుకును తీసుకుని దూరం జరుగుతుంది. హుందాగా ఉండిపోతుంది. ఎదురు చూస్తుంది. ఏ మనిషైనా బురదలో ఎక్కువసేపు ఉండలేరు. రాజశేఖర్ కూడా ఉండలేకపోతాడు. మగాడికి గౌరవం కుటుంబంతోనే అని గ్రహిస్తాడు. మగాడికి గౌరవం భార్య సమక్షంలోనే అని గ్రహిస్తాడు. మగాడికి గౌరవం ఒక లక్ష్యంతో పని చేయడమే అని గ్రహిస్తాడు. ఆమె పాదాల దగ్గరకు తిరిగి వస్తాడు. విశ్వనాథ్ సృష్టించిన స్త్రీలు లౌడ్‌గా ఉండరు. కాని వారు స్పష్టంగా ఉంటారు. సౌమ్యంగా ఉంటారు. స్థిరంగా సాధించుకునే వ్యక్తులుగా ఉంటారు. సమాజంలో స్త్రీలకు ఉండే పరిమితులు వారికి తెలుసు. కాని వాటిని సవాలు చేయడం పనిగా పెట్టుకోకుండా ఆ ఇచ్చిన బరిలోనే ఎలా విజయం సాధించాలో తెలుసుకుంటారు. విశ్వనాథ్ స్త్రీలు తెలుగుదనం చూపిన స్త్రీలు. మేలిమిదనం చూపిన స్త్రీలు. అందమైన స్త్రీలు... రూపానికి కాని... వ్యక్తిత్వానికి కాని! సీతాలు సింగారం మాలచ్చి బంగారం సీతామాలచ్చిమంటే శ్రీలచ్చి అవతారం – సాక్షి ఫ్యామిలీ -
‘సాగర సంగమం’ ఫోటోగ్రాఫర్ కన్నుమూత
ప్రముఖ ఛాయాగ్రాహకుడు పీఎస్ నివాస్ (73) సోమవారం తుదిశ్వాస విడిచారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన కేరళలోని కోళిక్కోడ్‌లో ప్రభుత్వాస్పత్రిలో కన్నుమూశారు. క్యాలికట్‌లోని నడక్కావులో పుట్టారు నివాస్. చెన్నైలోని అడయార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిలిం టెక్నాలజీలో సినిమాటోగ్రఫీ కోర్స్ చేశారు. ఛాయాగ్రాహకుడిగా ఆయన తొలి చిత్రం మలయాళ ‘సత్యత్తింటే నిళల్’ (1975). మలయాళ చిత్రం ‘మోహినీయాట్టమ్’ ఆయనకు ఉత్తమ ఛాయాగ్రాహకుడిగా జాతీయ అవార్డు తెచ్చిపెట్టింది. భారతీరాజా దర్శకత్వంలో కమల్‌హాసన్–రజనీకాంత్–శ్రీదేవి కాంబినేషన్లో రూపొందిన ‘16 వయదినిలే’ (1977) చిత్రం ద్వారా తమిళ తెరకు పరిచయమయ్యారు. మలయాళ, తమిళ చిత్రాలు చేస్తూ ‘వయసు పిలిచింది’ చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత చేసిన ‘నిమజ్జనం’ (1979) ఆయనకు ఉత్తమ ఛాయాగ్రాహకుడిగా నంది అవార్డు తెచ్చిపెట్టింది. చిరంజీవి ‘పునాదిరాళ్లు, కె. విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన క్లాసిక్ ‘సాగర సంగమం’ చిత్రాలకు ఛాయాగ్రాహకుడు నివాసే. భారతీరాజా లీడ్ రోల్లో నటించిన తమిళ చిత్రం ‘కల్లుక్కుళ్ ఈరమ్’ ద్వారా దర్శకుడిగా మారారు నివాస్. ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత తమిళంలో 3 సినిమాలకు దర్శకత్వం వహించారు. నివాస్ మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు. -
వెండితెరపై మహాగణపతి
సాక్షి,హైదరాబాద్: కళాతపశ్వి కె. విశ్వనాథ్ అద్భుత కళాసృష్టి ‘సాగర సంగమం’ చిత్రం. 1983లో తీసిన ఈ చిత్రం.. ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహం బ్యాక్‌డ్రాప్‌లో కమల్‌హాసన్ వీరావేశంతో నర్తిస్తున్న దృశ్యాలను చిత్రీకరించారు. అలా మన గణనాథుడు వెండితెరకు సైతం ఎక్కాడు. -
కృష్ణమ్మకు మంత్రి మాణిక్యాలరావు పూజలు
కోడూరు : హంసలదీవి సమీపంలోని పవిత్ర కృష్ణా సాగర సంగమ ప్రాంతం వద్ద రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. సాగర సంగమాన్ని దర్శించడం పూర్వ జన్మ సుకృతమని మంత్రి అన్నారు. నదీమ తల్లికి పసుపు, కుంకుమతో పాటు నూతన వస్త్రాలు సమర్పించారు. రైస్మిలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదానం కేంద్రాన్ని సందర్శించారు. ఆయన వెంట శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ఉన్నారు. పుష్కరాలకు మంచి ఏర్పాట్లు చేశాం విజయవాడ(వన్‌టౌన్) : పుష్కరాలకు ప్రభుత్వం పక్కాగా ఏర్పాట్లు చేసిందని దేవాదాయ ధర్మాదాయ శా మంత్రి పీ మాణిక్యాలరావు అన్నారు. పుష్కరాల్లో భాగంగా ఆదివారం ఉదయం ఆయన దుర్గాఘాట్‌ను పరిశీలించారు. మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడు తూ నీటిలో ఎటువంటి బ్యాక్టిరీయా లేదని అది కేవలం పుకారు మాత్రమేనన్నారు. అన్ని శాఖలకు చెందిన అధికారులు అప్రమత్తం చేసినట్లు చెప్పారు. -
'శరత్‌బాబు కనపడలేదు.. ఆ పాత్రే కనిపిస్తుంది'
ప్రేక్షకులు గుర్తుపెట్టుకోవడమే పెద్ద అవార్డు సాగరసంగమం ఇష్టమైన సినిమా అప్పన్నను దర్శించుకున్న సినీనటుడు శరత్‌బాబు విశాఖపట్నం : ఒక మంచి సినిమాకు అవార్డులతో పనిలేదని, ప్రేక్షకుల మనస్సులో ఆ చిత్రం కలకాలం నిలిచిపోవడమే పెద్ద అవార్డు అని సినీనటుడు శరత్‌బాబు అన్నారు. సింహాచల శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామిని గురువారం ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ నలుగురు కూర్చుని ఇచ్చే అవార్డు కన్నా నాలుగు కోట్ల మంది మదిలో ఆ చిత్రం ఉండడమే ఎంతో గొప్పవన్నారు. సాగరసంగమం సినిమా అంటే తనకు చాలా ఇష్టమని, దాంట్లో శరత్‌బాబు కనపడలేదని, రఘు పాత్రే కనిపిస్తుందని చెప్పారు. దర్శకుడు కె.విశ్వనాథ్ ఆ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారన్నారు. తెలుగులో పది మంచి సినిమాలు చెప్పమంటే.. అందులో విశ్వనాథ్ తీసినవే సింహభాగంలో ఉంటాయన్నారు. ఉత్తమ నటుల్లో కమల్‌హాసన్ ఒకరని వివరించారు. సూర్య హీరోగా తెరకెక్కుతున్న సింగం-3లో తాను నటిస్తున్నానన్నారు. కన్నడంలో మరో రెండు సినిమాలు చేస్తున్నట్టు తెలిపారు. అన్నయ్య, క్రిమినల్ సినిమాల్లో తాను చేసిన విలన్ పాత్రలకు ఎంతగానో పేరు వచ్చిందన్నారు. స్వామి దర్శనం కోసం వచ్చిన ఆయన కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకుని అంతరాలయంలో అష్టోత్తరం పూజ నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం ఆయనకు స్వామి ప్రసాదాన్ని ఏఈవో ప్రసాద్ అందజేశారు. -
ఇవాళ్టికీ అదే తపన... అతనికి అదే శ్రీరామరక్ష!
ఒకరు అద్భుతమైన నటుడు... మరొకరు అంకితభావం ఉన్న నటి... వేరొకరు తెలుగు సినిమా దారేది అని చాలామంది వాపోతున్న తరుణంలో తళుక్కుమన్న రచయిత - దర్శకుడు. ముగ్గురివీ మూడు వేర్వేరు మార్గాలు... మూడు వేర్వేరు మనస్తత్వాలు... కానీ, ఇవాళ సినీ రంగం సగర్వంగా చెప్పుకొనే స్థాయి కృషి ఈ ముగ్గురి సొంతం. కమలహాసన్, అనుష్క, త్రివిక్రమ్ - ఈ ముగ్గురి పుట్టినరోజూ చిత్రంగా ఒకటే... నవంబర్ 7. సినిమాల్లోనే కాదు... బయటా జనం తలెత్తి చూసే ఈ ముగ్గురి గురించి... వారిని సన్నిహితంగా చూసిన మరో ముగ్గురు దిగ్గజాలు మనసు కిటికీ తెరిచి ‘సాక్షి’తో పంచు కుంటున్న అను భవాలు, అను భూతులు ఇవాళ్టి ఫ్యామిలీ గిఫ్ట్. - ‘కళాతపస్వి’ కె. విశ్వనాథ్ అప్పుడే కమలహాసన్‌కు అరవై ఏళ్ళు నిండాయంటే నమ్మబుద్ధి కావడం లేదు. ఇవాళ్టికీ అతనిలోని ఉత్సాహం, ఉద్వేగం చూస్తుంటే, అతనికి అంత వయసుందని అనిపించదు. దర్శకుడిగా కమలహాసన్‌తో నేను తీసిన చిత్రాలు మూడే! మా మొదటి సినిమా ‘సాగర సంగమం’. నిర్మాత ఏడిద నాగేశ్వరరావు గారి వద్ద కమల్ డేట్లున్నాయి కాబట్టి, అతణ్ణి దృష్టిలో పెట్టుకొనే ‘సాగరసంగమం’ కథ అల్లుకొన్నా. బాలనటుడిగా కొన్ని చిత్రాల్లో నటించిన కమల్ పెద్దయ్యాక కొన్నాళ్ళు డ్యాన్స్‌మాస్టర్ తంగప్పన్ దగ్గర సహాయకుడిగా పనిచేశాడు. దాన్ని ప్రాతిపదికగా తీసుకొని ‘సాగర సంగమం’లోని బాలు పాత్రను రాసుకున్నాను. కొన్ని ఘట్టాల్లో అతను చూపిన నటన ఇవాళ్టికీ చూస్తుంటే, ‘తీసింది నేనేనా, చేసింది అతనేనా’ అనిపిస్తుంటుంది. ఇన్నేళ్ళ తన కెరీర్లో అత్యుత్తమమైన 10 చిత్రాల జాబితా వేస్తే, అందులో ‘సాగర సంగమం’ ఒకటని కమల్ పదే పదే ఇంటర్వ్యూల్లో చెప్పాడు. అన్ని భావోద్వేగాలూ ఉన్న ఆ చిత్ర రూపకల్పన ఇవాళ్టికీ ఓ తీపి గుర్తు. ఏది చేసినా అందులో ప్రత్యేకత, పర్ఫెక్షన్ ఉండాలని కమల్ భావిస్తాడు. దాని కోసం ప్రతి సన్నివేశంలో, సందర్భంలో ప్రయత్నిస్తాడు. సరిగ్గా అలాంటి తపనతో సినిమాలు తీసే మా లాంటి దర్శకులకు అతను బాగా ఉపయోగపడతాడు. అతను ఎంత ప్రొఫెషనల్ అంటే, దర్శకుడు ఆశించినది ఇచ్చే వరకు, చాలాసార్లు అంతకు మించి ఇచ్చేవరకు రాజీ పడడు. షాట్ తీస్తున్నప్పుడు మన రియాక్షన్లో ఏదైనా తేడా ఉన్నా, మనం సరేనని కట్ చెప్పడం ఒక్క సెకన్ ఆలస్యమైనా చటుక్కున గ్రహించేస్తాడు. ఆశించినంత తృప్తిగా రాలేదని గ్రహించి, మళ్ళీ చేయడానికి సిద్ధపడతాడు. అంత సునిశితమైన గ్రహణశక్తి అతనిది. మనం ఎదైనా చెబితే సహృదయంతో తీసుకుంటాడు. చాలామంది లాగా అహంభావానికి పోడు. అతనిలో కళాతృష్ణ ఇవాళ్టికీ తీరలేదు.తీరని దాహంతో ఆయన నిరంతరం కొత్త పాత్రలు, కథల కోసం అన్వేషిస్తూనే ఉంటాడు. అందుకే, అప్పటి ‘పుష్పక విమానం’ మొదలు ఇటీవలి ‘దశావతారం’ దాకా రకరకాల ప్రయోగాలు చేస్తూనే ఉంటాడు. అలాంటి కథలు, పాత్రలతో ఎవరు వచ్చినా ధైర్యంగా ముందుకు వస్తాడు. ‘నీ పాత్ర గొప్ప ఫుట్‌బాల్ ఆటగాడి పాత్ర. కానీ, దురదృష్టవశాత్తూ రెండు కాళ్ళూ లేవు’ అని ఒక లైన్ చెప్పామనుకోండి. వెంటనే, సవాలుగా నిలిచే ఆ పాత్ర పోషించడానికి సిద్ధమైపోతాడు. పెపైచ్చు, చాలామందిలా అతనిది ఆరంభ శూరత్వం కాదు. సవాలుగా నిలిచే చిత్ర నిర్మాణాన్నో, పాత్రనో తీసుకున్న తరువాత చివరిదాకా అదే తపనను నిలుపుకొంటూ, పూర్తి చేస్తాడు. ఎక్కడా రాజీ పడడు. ఒక్కమాటలో చెప్పాలంటే, దర్శకుల నటుడు - కమల్. ఒక పాత్రను ఎలా మలుచుకోవాలనుకున్నా సరే, నటుడిగా అతణ్ణి ఎంచుకోవచ్చు. దర్శకుడు నిశ్చింతగా కళ్ళు మూసుకొని పాత్రను అతని చేతుల్లో పెట్టవచ్చు. తీసుకున్న పాత్రలోకి ఇమిడిపోవడానికి ఏవేం కావాలో అవన్నీ కమల్ సమకూర్చుకుంటాడు. ఆ పాత్రను పండించడం కోసం హోమ్‌వర్క్ చేస్తాడు. మొదటి రోజుల నుంచి ఇప్పటికీ అతని పద్ధతి అదే! అలాగే, షూటింగ్ జరుగుతుండగా అక్కడికక్కడ, అప్పటికప్పుడు బుర్రలో తళుక్కున మెరిసిన ఆలోచనను అమలు చేసేసి, సన్నివేశం అద్భుతంగా రావడానికి సహకరించే అరుదైన లక్షణం కమల్‌కు ఉంది. ఉదాహరణకు, ‘సాగర సంగమం’లో జయప్రదతో కలసి ఆలిండియా డ్యాన్స్ ఫెస్టివల్ ఆహ్వానపత్రిక చూసే సన్నివేశం చిత్రీకరిస్తున్నప్పుడు ఆ షాట్ చివరలో నాకేదో అనిపించి, ‘కమల్! ఒక్కసారిగా నవ్వేసెయ్’ అని పక్క నుంచి అరిచా. చాలామంది ఆర్టిస్టులు అలాంటి సందర్భాల్లో గందరగోళపడతారు. ‘కట్’ చెప్పారనుకుంటారు. కానీ, క్షణంలో వెయ్యోవంతులో కమల్ నా మాట గ్రహించి, అప్పడికప్పుడు నవ్వును జత చేర్చి, తన నట ప్రతిభతో ఆ సీన్‌ను పండించాడు. ‘దర్శకుడి భావం ఇదై ఉంటుంది, ఇలా చేయాలన్న’ సిక్స్త్సెన్స్ అతనికి బాగా పనిచేస్తుంది. ఇవాళ ఇంత పెద్ద స్టార్‌గా ఎదిగినప్పటికీ, ఇంకా తెలుసుకోవాలి, నేర్చుకోవాలన్న తపన ఉంది. అదే అతనికి శ్రీరామరక్ష. ‘శుభసంకల్పం’ చిత్రం అయిపోయిన తరువాత తమిళులకు పెద్ద పండుగ దీపావళికి అతను స్వయంగా మా ఇంటికి వచ్చి, మా దంపతులిద్దరికీ కొత్త బట్టలు పెట్టి, నమస్కారం చేసి వెళ్ళిన సంఘటన నాకిప్పటికీ గుర్తు. ఇవాళ ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగినా, అదే భక్తి, గౌరవంతో ఉండడం అతని సంస్కారం. ఇక, సినీ జీవిత గురువు కె. బాలచందర్ అంటే భక్తి గౌరవాలే కాక, చనువు కూడా! ఇప్పటికీ తన కష్టసుఖాలన్నీ ఆయనతో మనసు విప్పి చెప్పుకుంటాడు. నన్ను బలవంతాన ఒప్పించి, నటుణ్ణి చేసింది కమలహాసన్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాలే. వాళ్ళిద్దరూ పట్టుబట్టి, ‘శుభసంకల్పం’లో తొలిసారిగా నన్ను నటింపజేశారు. ఆ సినిమా అయిపోయాక కూడా, ‘ఇక్కడితో ఆపవద్దు. నటన కొనసాగించండి’ అని నాకు సలహా ఇచ్చింది కూడా కమలే! అలా నా రెండో ఇన్నింగ్స్ నటుడిగా మొదలై తాజా ‘ఉత్తమ విలన్’, రజనీకాంత్ ‘లింగా’ వరకు కొనసాగుతోంది. కమల్లో వెర్సటాలిటీ ఉంది. వినోదింపజేయగలడు. అంతే గొప్పగా విషాదమూ పలికించగలడు. ఇవాళ, దక్షిణభారతావని నుంచి వచ్చిన అత్యుత్తమ సినీ ప్రతిభాసంపన్నుల్లో అతను ఒకడని నిస్సందేహంగా చెప్పవచ్చు. అతను పుస్తకాలు బాగా చదువుతాడు. బాగా రాస్తాడు కూడా! తమిళంలో కొన్ని పాటలు అతనే రాశాడు. ఇక, సినిమాల్లో డైలాగులైతే, పేరుకు వేరొక డైలాగ్ రైటర్ ఉన్నా, కమల్ భాగస్వామ్యం ఎక్కువగా ఉంటుందట! విభిన్నమైన కథాంశాలతో స్వయంగా చిత్రాలు నిర్మిస్తుంటాడు. ఇన్ని లక్షణాలున్న అతను దర్శకుడిగా కూడా వ్యవహరించడం పెద్ద విశేషమేమీ కాదు. అయితే, నేరుగా అతని దర్శకత్వంలో నటించే అవకాశం నాకు ఇప్పటి దాకా రాలేదు. టీవీ, చలనచిత్రోత్సవాలు, ప్రపంచ సినిమా గురించి అతనికి ఉన్న అవగాహన కూడా చాలా ఎక్కువ. అందుకే, ఎప్పుడైనా వాటి ప్రస్తావన వచ్చి, మాట్లాడితే - అన్నీ పూసగుచ్చినట్లు చెబుతాడు. అలాంటి వ్యక్తికి తాజా సినీ సాంకేతిక పరిజ్ఞానం క్షుణ్ణంగా తెలిసుండడంలో ఆశ్చర్యం లేదు. ఒక్కమాటలో, ఇటు సృజనాత్మక అంశాల్లోనూ, అటు సాంకేతికంగానూ అతను దిట్ట. సమయం, సందర్భం వచ్చినప్పుడు ఆధ్యాత్మిక అంశాలూ గొప్పగా మాట్లాడతాడు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా - ఇంత సాధించిన వ్యక్తికి ఇవాళ మా లాంటి వాళ్ళం కొత్త కథ, పాత్ర రూపకల్పన చేయడం కూడా కష్టమే. నిజం చెప్పాలంటే, అతని ఇమేజ్ ఇవాళ మాబోటి వాళ్ళకు అందకుండా వెళ్ళిపోయింది. ‘దశావతారం’, ‘విశ్వరూపం’ లాంటి స్థాయి ప్రయోగాలు తాజాగా చేసిన నటుడికి ఎలాంటి పాత్ర రాయాలన్నది పెద్ద సవాలే. అందుకే, ‘ఇప్పుడు నీకు తగ్గ కథ రాయడం కష్టం’ అని నవ్వుతూ అంటూ ఉంటా. అయితే, ‘నందనార్’, ‘రామానుజాచారి’ లాంటి చారిత్రక ప్రసిద్ధమైన పాత్రలకు అతను చక్కగా సరిపోతాడు. అలాంటి పాత్రలు చేయడం అతనికిష్టం కూడా! ఆ ప్రయోగాలు కూడా అతను చేస్తే, ఒక సినీ ప్రియుడిగా చూడాలని ఉంది. ఎప్పుడూ బద్ధకించకుండా, మనసులో ఏదో ఆలోచిస్తూ, కొత్తదనం కోసం అన్వేషించే కమల్‌ది మన సినీ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం. అతని కన్నా వయసులో పెద్దవాణ్ణి కాబట్టి, అతనికి ఈ షష్టిపూర్తి క్షణంలో చెప్పేదొక్కటే - ‘‘శతమానం భవతి.’’ -
వెండితెరపై విశ్వరూపుడు
‘బాలు.. నృత్యమే జీవికగా.. ఆత్మగా భావించి అనుభవించి తరిస్తున్న ఓ కళాజీవి. భారతీయ నృత్యరీతుల్ని కలగలిపి సరికొత్త ఒరవడిని సృష్టించేందుకు కష్టిస్తున్న తపస్వి. అప్పుడే ఓ వెండితెర అవకాశం పలకరించింది. తన ప్రతిభను చాటేందుకు ఇదో గొప్ప అవకాశమని పులకరించిపోయాడు. అద్భుత సాహిత్యంతో సాగే ఆ పాటకు పాదం కదిపాడు.‘కట్’.. మరుక్షణమే నృత్యదర్శకుని నోట బాణంలా దూసుకొచ్చిందీ మాట. మిడిమిడి జ్ఞానంతో మిడిసిపడ్డ అతని ముందు బాలు తర్కం పనిచేయలేదు. అనుకున్న రీతిగా సాగడమా.. అవకాశాన్ని వదలుకోవడమా..! ఇక్కడే సంఘర్షణ మొదలైంది. ఆత్మఘోషను అణచుకుని అడ్డదిడ్డంగా అడుగులేశాడు. అదిరింది అన్నారందరూ.. ఆత్మనైతే అణచుకున్నాడు గానీ గుండెను ఎగదన్నే లావాను ఎలా దాచుకోగలడు.. నృత్యాన్నే సంకరం చేస్తున్న వారి మాటను అయిష్టంగానైనా వినాల్సివచ్చిందనే అపరాధ భావం అతణ్ని దహించి వేసింది. చెప్పుకునే వీల్లేదు.. చెప్పుకునేందుకు దిక్కూ లేదు.. ఏం చేయాలి? అధినాయకుడే గుర్తొచ్చాడు. ఆ విశ్వరూప గణపతి మూర్తికి గాయపడిన మనసును నివేదించాడు. వీరావేశంతో నర్తించాడు. గుండెలు కరిగేలా.. దిక్కులు అదిరేలా..’ ఈ సన్నివేశం ఎక్కడిదో ఈ పాటికే మీ మనసులో మెదలుతోంది కదూ. 1983లో వచ్చిన సాగర సంగమం సినిమాలోనిదే ఈ దృశ్యం. అయితే మీకు తెలియాల్సిందల్లా.. బాలూగా కమల్‌హాసన్ నర్తించింది మన ఖైరతాబాద్ వినాయకుని ముందే అని. ఇంతటి అద్భుత సన్నివేశం ఇలా మలచాలని దర్శకుడు కె.విశ్వనాథ్‌కి ఎలా స్ఫురించింది అని అడిగితే కళాతపస్వి ఏమన్నారో మీరే చదవండి. ‘నేను హోటల్ నుంచి షూటింగ్‌కు వెళ్తున్నప్పుడల్లా... ఈ విగ్రహాన్ని చూస్తుండేవాణ్ని. మద్రాసు నుంచి వచ్చిన మాకు ఈ భారీ విగ్రహం.. తయారీ అంతా కొత్తగా అనిపించేది. ఎలాగైనా సరే దీన్ని సినిమాలో చూపించాలని అప్పుడే మనసులో బీజం పడింది. అప్పుడు సాగరసంగమం షూట్ చేస్తున్నాం. కథానాయకుడు తన ఆత్మసాక్షికి విరుద్ధంగా సినిమా నృత్యదర్శకుడు కోరినట్టుగా నృత్యం చేయాల్సి రావడం.. ఎందుకిలా మంచి సాహిత్యాన్ని పాడు చేస్తున్నారని బాధపడే సన్నివేశాన్ని చిత్రీకరించాలి. అప్పుడు నాకు ఈ ఖైరతాబాద్ వినాయకుడి ఎదుట పశ్చాత్తాప దృశ్యాన్ని షూట్ చేస్తే బావుంటుందనిపించింది. అనుమతులు ఇతర విషయాల్ని యూనిట్వాళ్లకి అప్పగించా. నాకు ఇప్పటికీ బాగా గుర్తు. షూటింగ్ ముందు రోజు సాయంత్రం కమల్‌హాసన్‌ను హోటల్‌కు పిలిచి నా ఆలోచన వివరించాను. ఖైరతాబాద్ వినాయకుని ఎదుట దీన్ని తీశాము. అలా నా మనసులో మెరిసిన ఖైరతాబాద్ వినాయకుణ్ని తెరపై చూపగలిగాను. తెలుగు వారు గర్వించే చరిత్ర సొంతం చేసుకున్న ఈ వినాయకోత్సవ ప్రస్థానానికి 60 ఏళ్లు నిండాయంటే ఆశ్చర్యంగా.. ఆనందంగా ఉంది.’ -ఖైరతాబాద్ -
ఐదు నిమిషాల్లో కథ చెప్పమన్నారు...:గీతాకృష్ణ
తొలియత్నం అతడు పదం. ఆమె పాదం. అతడు గానం. ఆమె ప్రాణం. అతడు పాటై ఎగిసినప్పుడు ఆ కెరటాలకు ఆమె అందెల. ఆమె నాట్యానికి అతని పదం ఆది తాళం. సముద్రం దిగంతమై, కళ అనంతమైనప్పుడు కళకు ఆమె చేసే నివేదన నాట్యం. ప్రకృతికి అతడి అభిషేకం కవిత్వం. ఇద్దరు కళాకారుల ఆధ్యాత్మిక ప్రేమకు దృశ్యకవి గీతాకృష్ణ వెండితెరపై చేసిన కళార్చన ఈ సంకీర్తన. అసిస్టెంట్‌గా అంటూ చేస్తే బాలచందర్, బాపు, విశ్వనాథ్ వీళ్ల దగ్గరే చేయాలి. లేకపోతే పూణె ఫిలిం ఇన్స్టిట్యూట్. ఇదీ లెక్క. బాలచందర్‌గారిని కలిస్తే నేనిప్పుడే తమిళ్ సినిమా చేస్తున్నాను. తెలుగు సినిమా చేసినప్పుడు తప్పక తీసుకుంటాను. నెక్స్ట్ బాపుగారు. నేనిప్పుడు హిందీ సినిమా చేస్తున్నాను, తెలుగు సినిమా చేసినప్పుడు కలువు. ఇక మిగిలింది విశ్వనాథ్‌గారు. నాకు బాగా తెలిసిన కె.వాసు (ప్రాణం ఖరీదు, కోతలరాయుడు వంటి హిట్ చిత్రాల దర్శకుడు)గారి ద్వారా విశ్వనాథ్‌గారిని కలిశాను. అప్పట్లో అది కాన్ఫిడెన్సో, యారగెన్సో తెలియదు. నేను మీ దగ్గర మూడు సినిమాలకు అసిస్టెంట్‌గా పనిచేస్తాను. ఆ తరువాత డెరైక్ట్‌గా సినిమా డెరైక్షన్ చేస్తానన్నాను. విశ్వనాథ్‌గారు సరేనన్నారు. ‘సాగరసంగమం’ ఆయనతో అసోసియేషన్ ప్రారంభమైంది. ఆ సినిమా చేస్తున్నప్పుడు రష్యాలో ఒక ఫిలిం ఫెస్టివల్లో విశ్వనాథ్‌గారి రెట్రాస్పెక్టివ్ కోసం అక్కడి నుంచి ఒక టీమ్ వచ్చింది. వాళ్లకు విశ్వనాథ్‌గారి సినిమాలు చూపిస్తూ, వాటి థీమ్‌ను వివరించడం నా పని. చెన్నయ్‌లో ఆండాళ్ ప్రొడక్షన్స్ అధినేత రామ అరంగణళ్కు సంబంధించిన ఆండాళ్ థియేటర్ బుక్ చేశాం. వాళ్లకు ఒక్కో సినిమా చూపిస్తూ, ప్రతి రెండు రీళ్లకు ఒకసారి సినిమా ఆపి ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. ఇదంతా గమనించిన అక్కడి మేనేజర్ కృష్ణమూర్తి నా గురించి అరంగణళ్గారికి చెప్పారు. ఇది గడిచిన కొంతకాలానికి వాళ్ల నుంచి నాకు ఫోన్ వచ్చింది. సినిమా చేస్తావా అని అడిగారు. ఎందుకు చేయను, అందుకోసమే కదా వచ్చింది అన్నాను. రామ్ అరంగణళ్గారిని కలవగానే నా చేతిలో ఫైల్స్ చూసి ఏంటివన్నీ అని అడిగారు. నేను తయారుచేసుకున్న సబ్జెక్ట్స్ అన్నా. మొదట అవన్నీ పక్కన పెట్టు అన్నారు. మొదట నువ్వు చెప్పాలనుకున్న కథ అయిదు నిమిషాల్లో చెప్పడం నేర్చుకో. అందుకు కావాలంటే ఇంకో అయిదు నెలలు తీసుకో. ఎందుకంటే నువ్వు చెప్పాలనుకున్న కథ అయిదు నిమిషాలకు మించి చెపితే అవతలివాళ్లకు నిద్ర వచ్చే ప్రమాదముంది. అయిదు నిమిషాల కథను తెరమీద మూడు గంటల్లో చెప్పడం తరువాత పని అన్నారు. అయితే నాకు ఒక గంట టైమ్ కావాలని అడిగాను. సరేనని నాకో గది కేటాయించారు. గంట తరువాత కలిసి పది నిమిషాల్లో రెండు కథలు వినిపించాను. నీ వయసుకు మించిన కథలు చెప్పావని మెచ్చుకున్నారు. అందులో ఒక కథలో ఇద్దరు భార్యాభర్తలు, వాళ్ల మధ్యకు మరో చిన్న బాబు రావడమనే కథ ఆయనకు చాలా నచ్చింది. అయితే అది మ్యాన్ ఉమన్ అండ్ ఏ ఛైల్డ్ అనే నవల నుంచి తీసుకున్నానని, అది హాలీవుడ్లో క్రామర్ వర్సెస్ క్రామర్ అనే సినిమాగా వచ్చిందని చెప్పాను. దాని ఆధారంగా శేఖర్‌కపూర్ మాసూమ్, బాలూమహేంద్ర మలయాళంలో ఓలంగళ్ తీశారని చెప్పాను. అయినా మనం చేద్దామన్నారాయన. నేను విశ్వనాథ దగ్గర మూడు సినిమాలు చేస్తానని మా అన్నకు మాట ఇచ్చాను కాబట్టి, ఇప్పుడు సినిమా చేయలేనన్నాను. కానీ నాకిదో గొప్ప అనుభవమని చెప్పి వచ్చేశాను. ‘సాగరసంగమం’, ‘స్వాతిముత్యం’ చేస్తున్నప్పుడు కమలహాసన్, నేను చాలా విషయాలు చర్చించుకునేవాళ్లం. ‘స్వాతిముత్యం’ మధ్యలో ఉన్నప్పుడు మా ఊరి పక్కన కడియానికి చెందిన గిరిజాల కృష్ణారావు, డాక్టర్ గంగయ్యను పరిచయం చేశారు. ఆయన సినిమా చేద్దాం కధ చెప్పమనగానే రెండు కథలు వినిపించాను. మన్మథ పూజారి, సంకీర్తన కథల్లో రెండవది ఆయనకు బాగా నచ్చింది. విశ్వనాథ్‌గారికి చెబితే సరే అన్నారు. తరువాత ‘స్వాతిముత్యం’ శత దినోత్సవానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆ వేదిక మీదే విశ్వనాథ్‌గారి శిష్యుడు, దర్శకుడు కాబోతున్నారని ప్రకటించారు. హీరో కాశీ పాత్ర కోసం వెతుకుతున్నప్పుడు అనుకోకుండా సచిత్ర వారపత్రికలో కవర్‌పేజీలో ఒక యువకుడి ఫొటో చూశాను. కింద అక్కినేని వారసుడు నాగార్జున హీరోగా ఆరంగేట్రం చేయబోతున్నాడని వార్త. అది పట్టుకెళ్లి కమలహాసన్‌కు చూపించాను. ఎవరితను అని అడిగాడు. నాగేశ్వరరావుగారి అబ్బాయి అనగానే బావున్నాడన్నారు. తరువాత నాగేశ్వరరావుగారిని కలిసి కథ చెప్పాను. పొయెటిక్‌గా ఉంది, కొంచెం దృష్టి పెడితే చాలా బాగా వస్తుందన్నారాయన. అప్పటికే నాగేశ్వరరావుగారి నిర్మాతలు నాగార్జునతో సినిమాలు వరుసగా ప్రకటిస్తున్నారు. అన్నపూర్ణ బ్యానర్లో విక్రమ్ మొదలైంది. విక్రమ్ ఒక షెడ్యూల్ అయ్యాక, సంకీర్తన మొదలైంది. హీరోయిన్ కీర్తన పాత్ర కోసం చాలామందిని చూశాం. శోభన ,అమల ఇంకా చాలా మందిని అనుకున్నా రకరకాల కారణాల వల్ల కుదరలేదు. అదే సమయంలో ముఖ్యమంత్రి రామారావుగారి ప్రోత్సాహంతో హైదరాబాద్‌లో ఫిల్మోత్సవ్ జరుగుతోంది. అందులో ప్రారంభోత్సవ నృత్యానికి నేను వెళ్లాను. స్టేజ్ మీద ఒక యాభై మంది డ్యాన్సర్స్ ఉన్నారు. అందులో ఒకమ్మాయి నన్ను ఆకర్షించింది. కార్యక్రమ నిర్వాహకురాలు రాజసులోచనగారిని కలిస్తే తన పేరు రమ్యకృష్ణ అని చెప్పింది. అడ్రెస్ తీసుకుని ఫొటో షూట్ చేసి తనను ఎంపిక చేసుకున్నాం. తను అంతకుముందు ఒక సినిమాలో ఏదో చిన్న పాత్ర చేసినా, పూర్తి స్థాయిలో హీరోయిన్గా తనకిదే మొదటి సినిమా. మిగతా ముఖ్యపాత్రల్లో గిరీష్ కర్నాడ్, సోమయాజులును తీసుకున్నాం. నిజానికి కథ రాజమండ్రి దగ్గర ఒక చిన్న పల్లెటూళ్లో జరుగుతుంది. కానీ రాజమండ్రి, పోలవరం, పట్టెసీమ, దేవీపట్నం ఇలా చాలా ప్రాంతాల్లో చిత్రించాం. గడప లోపల ఒక ఊరు, గడప దాటితే మరో ఊరు. ఇలా చాలా ప్రాంతాల్లో షూటింగ్ జరిపాం. ఇందులో హీరో, హీరోయిన్ మొదటిసారి కలిసినప్పుడు తీసిన సీన్ కోసం మాత్రం చాలా శ్రమపడ్డాం. ఉదయం పూట కీర్తన నదికి నీళ్లకోసం వచ్చినప్పుడు కాశీ పడవలో పడుకుని ఉంటాడు. అందెల శబ్దం విని లేచి మొదట ఆకాశంలో పక్షులను చూస్తాడు. తరువాత కీర్తనను చూస్తాడు. అలవోకగా ఒక కవిత చెబుతాడు. ఈ సీన్లో పక్షులు, నది, అవసరమైన క్లోజప్స్, ఇంటర్‌కట్స్ తీసిన తరువాత కీర్తన సజెషన్లో కాశీ, అతడి సజెషన్లో కీర్తన షాట్స్, వాళ్లిద్దరి వైడ్ షాట్స్ తీయాలి. అందుకు స్థానికంగా ఉన్న జాలరిని పిలిచి, బోట్ ఏ యాంగిల్లో ఉంచాలని చెబుతున్నప్పుడు అర్థం కాక, అతను కొంత అసహనం వ్యక్తం చేశాడు. దాంతో ఆర్టిస్టులు కూడా అసౌకర్యానికి గురయ్యారు. దాంతో ఆ సీన్ వాయిదా వేశాం. షూటింగ్ పూర్తయ్యేలోపు ఆ సీన్ తీయాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా ఏదో ఒక అవాంతరం వచ్చేది. చివరికి మద్రాస్ దగ్గర ఎన్నూర్ టూరిస్ట్ ప్లేస్‌లో బ్యాక్‌వాటర్‌లో ఈ సీన్ తీశాం. అది పూర్తయ్యేసరికి ఇంకో సినిమా తీసినంత పనయింది. ఇలా ఎన్నో చోట్ల షూటింగ్ చేసినా అంతా ఒకే దగ్గర తీసినట్టు అనిపించడానికి కారణం, స్క్రిప్ట్ దశలోనే ఎడిటింగ్ మీద అవగాహన ఉండటం. ఈ సినిమాకు ముఖ్యంగా చెప్పుకోవలసింది ఇళయరాజా సంగీతం గురించి. తను ఒకరోజు పదిహేను ట్యూన్స్ ఇచ్చాడు. నాకు మరీ అంత సంప్రదాయకంగా కాదు, సెమీ క్లాసికల్ కావాలన్నాను. తరువాత తను ముప్ఫై తొమ్మిది ట్యూన్స్ ఇచ్చాడు. అందులోంచి తొమ్మిది సెలక్ట్ చేసుకుని, ఆత్రేయ, సి.నారాయణరెడ్డి, వేటూరితో పాటలు రాయించాను. తనికెళ్ల భరణి కథను అర్థం చేసుకుని అందుకు తగినట్టుగా మాటలు రాశారు. సినిమా చూసిన నాగేశ్వరరావుగారు చాలా బాగా తీశావు కానీ, ఈ సినిమా ప్రేక్షకులు నచ్చకపోతే మళ్లీ భవిష్యత్తులో మంచి సినిమాలు తీసే ప్రయత్నం చేయకు అన్నారు. సినిమా చూసిన సెన్సార్‌వాళ్లు టైటిల్స్ చూడకపోతే, ఇది విశ్వనాథ సినిమా అనుకోవచ్చు అన్నారు. నేనది కాంప్లిమెంట్‌లా ఫీలయ్యాను. కొన్ని రోజులు ఆ ఆనందంలో తేలియాడాను. ఒకరోజు ఇళయరాజాగారు నాతో నువ్వు, వంశీ విశ్వనాథ్‌లా తీస్తారన్న పేరు తెచ్చుకుంటే ఏం ఉపయోగం. నీదైన మార్క్ కోసం ప్రయత్నించు అన్నారు. ఆ మాట నాపై తీవ్ర ప్రభావం చూపించి, నా సినిమా శైలిని, ఆలోచనా విధానాన్నీ మార్చేసింది. సినిమాలో పాట అనేది సంభాషణలా ఉండాలనేది నా ఫీలింగ్. అదే పద్ధతిలో సంకీర్తన పాటల రూపకల్పన జరిగింది. ఈ సినిమాలో ప్రతి మాటా ఒక చిన్న పాటలా కవితాత్మకంగా ఉంటుంది. - కె.క్రాంతికుమార్‌రెడ్డి -
అనురాగ సంగమం
జూన్ 3న సాగర సంగమం విడుదలైంది. జూలై 3న అలేఖ్య, వినయ్‌ల పెళ్లయింది. ఈ ముప్పై ఏళ్ల దాంపత్య జీవితంలో... ఇద్దరూ కలిసి చూసిన సినిమా సాగర సంగమం ఒక్కటే! అది కూడా పెళ్లికి ముందర! వినయ్ ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్. అలేఖ్య ప్రముఖ కూచిపూడి నాట్యకారిణి. ప్రముఖులైన భార్యాభర్తలకు... సినిమాలకు, షికార్లకు టైమ్ దొరక్కపోవడంలో ఆశ్యర్యం లేదు. అయితే ‘దొరకని టైమ్’లో ఈ దంపతులు దొరకపుచ్చుకున్నవి చాలా ఉన్నాయి! ఆమె అభినయం... ఆయన పరవశం. ఆయన అనునయం... ఆమె జన్మఫలం. ‘మనసే జతగా...’ సాగిన వీరి దాంపత్యం... ఒక అనురాగ సంగమం! అచ్చ తెలుగింటి ఆహార్యంతో కనిపించే ఆమె పేరు అలేఖ్యపుంజాల. కూచిపూడి నృత్యకళాకారిణి. మూడు దశాబ్దాలుగా నృత్యరీతులెన్నింటినో వేదికల మీద అభినయిస్తున్నారు. ఇప్పుడు పొట్టి శ్రీరాములు కూచిపూడి విభాగానికి అధిపతిగా విధులను నిర్వర్తిస్తున్నారు. వేదికమీద లయబద్ధంగా అందెల రవళులు చేస్తూనే, విధి నిర్వహణలో మెలకువగా ఉంటూనే, ఇంటిల్లిపాదికి స్వయంగా వంట చేసి ఆప్యాయంగా వడ్డన చేయడం... ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు? అని ఆమెను ఆడిగితే చిరునవ్వుతో తన శ్రీవారు డాక్టర్ వినయకుమార్ వైపు చూశారు ఆమె. ఈ డాక్టర్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్. ‘‘నాట్యం అంటే నాకు అమితమైన ప్రేమ. నా నాట్యాన్ని ప్రేమించడం ఈయనకు హాబీ’’ అంటూ సంసారపు తొలి అడుగులను గుర్తుచేసుకుంటూ తమ దాంపత్య బంధంలోని మధురానుభూతులను మనముందుంచారు అలేఖ్య. ఇద్దరూ పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే! వినయ్‌కుమార్ అక్క, అలేఖ్య ఇద్దరూ డ్యాన్స్ క్లాస్‌లో స్నేహితులు. అక్కను కలుసుకోవడానికి వెళ్లినప్పుడు అలేఖ్యను చూసి, మొదటి చూపులోనే ప్రేమించేశారట ఈ డాక్టర్‌గారు. వెంటనే వెళ్లి ఆమెకు తన మనసులోని మాట చెప్పేశారట. ‘పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తులకు మాత్రమే సంబంధించింది కాదు, ఇరువైపుల కుటుంబాలూ సరే అనాలి. ముందు పెద్దలందరినీ ఒప్పించండి’ అని చెప్పారట అలేఖ్య. దాంతో నేరుగా ఆమె తల్లిదండ్రులను కలిశారు వినయ్‌కుమార్. పెళ్లినాటి పరిస్థితులను అలేఖ్య వివరిస్తూ-‘‘ముందు వీళ్ల అమ్మగారు మా పెళ్లికి ఒప్పుకోలేదు. కొడుకు డాక్టర్ కాబట్టి మెడిసిన్ చదివిన అమ్మాయి అయితేనే కొడుకు భవిష్యత్తు బాగుంటుంది అనుకున్నారు. ఈయన మూడేళ్ల మౌనవ్రతానికి ఆవిడా సరే అనక తప్పలేదు. మొత్తానికి ఇరువైపుల పెద్దల అంగీకారంతో జూలై 3, 1983లో మా పెళ్లి అయ్యింది. అత్తగారింట్లో ఉమ్మడి కుటుంబం.. కొద్దిరోజుల్లోనే వారందరితో కలిసిపోయాను. ముందు మా పెళ్లిని కాదన్న మా అత్తగారే నన్ను కూతురిలా చూసుకునేవారు. ‘ఎదుటి వారికి మంచిని పంచితే నీకు మంచే వస్తుంది’ అని మా అమ్మ నా చిన్నప్పటి నుంచి చెబుతుండేవారు. ఆ సూచనను ఇప్పటికీ పాటిస్తూ ఉంటాను’’ అన్నారు ఆమె. వీలైనంత ఎక్కువ సమయం... పెళ్లయిన తర్వాత ఇంటిని చక్కదిద్దుకున్న విధానాన్ని చెబుతూ-‘‘ఈయన చాలా మితభాషి. ఏదీ బయటకు చెప్పేవారు కాదు. ఈయన వ్యక్తిత్వాన్ని అర్థ్ధం చేసు కుని అందుకు అనుగుణంగా నన్ను నేను తీర్చిదిద్దు కోవ డానికి కొంత కాలం పట్టింది. అదేవిధంగా భార్యగా, కోడలిగా బాధ్యతల నడుమ రోజూ డ్యాన్స్ క్లాస్‌కు వెళ్లడం కుదిరేది కాదు. ప్రాక్టీస్‌ను ఐదేళ్ల పాటు వారానికి రెండు రోజులకు తగ్గించుకున్నాను. పెద్దబాబు పుట్టి, వాడిని స్కూల్లో జాయిన్ చేశాక మా గురువుల సూచనతో అధ్యాపకురాలిగా యూనివర్శిటీలో చేరాను. అభిరుచి, ఉద్యోగం, ఇల్లు... వీటన్నింటినీ బ్యాలెన్స్ చేసుకోవడానికి కొంచెం కష్టపడ్డాను. దాంతో పనులను విభజించుకోవడం మొదలుపెట్టాను. స్టేజ్ ప్రోగ్రామ్‌లు, డ్యాన్స్ క్లాస్‌లు, ప్రాక్టీస్, రీసెర్చ్.. సమయానుకూలంగా చూసుకుంటూనే కుటుంబంతో గడపడానికి ప్లాన్ చేసుకునేదాన్ని. ఇంట్లోని వారితో ఎక్కువగా మాట్లాడుతూ, అరమరికలు లేకుండా చూసుకోవడం వల్ల బంధాలు బలపడతాయి అనేది నా నమ్మకం. ఇప్పటికీ ఈ సూత్రాన్ని పాటిస్తుంటాను’’ అని అలేఖ్య చెబుతుంటే... ‘‘ఈవిడ ఎప్పుడైనా నొచ్చుకుంటే... రెండు మూడు రోజులవరకు మూడీగా ఉంటుంది. తనంతట తనే ఆ బాధ నుంచి బయటపడాలి తప్ప ఎంత ప్రయత్నించినా లాభం ఉండదు. తన మూడ్ మారేంతవరకు ఓపిగ్గా ఎదురు చూడటం ఇప్పటికీ నాకు అలవాటు’’ అంటూ భార్య మనస్తత్వాన్ని అర్థం చేసుకున్న తీరును వివరించారు వినయ్‌కుమార్! ప్రోత్సాహమిచ్చిన బంధం కళాకారిణిగా తన భర్త ప్రోత్సాహంతోనే నాట్యంలో ఎన్నో ప్రయోగాలను చేయగలిగాను. నేను ప్రోగ్రామ్‌లు, క్లాస్‌లు అంటూ వెళ్లినప్పుడు పిల్లలను ఈయనే చూసుకునేవారు’’ అని అలేఖ్య చెబుతుంటే... ‘‘తనకు పేరు వస్తుందంటే అది నాకు వచ్చినట్టుగానే భావిస్తాను’’ అని వినయ్‌కుమార్ సంతోషంగా చెప్పారు. అలేఖ్య మాట్లాడుతూ- ‘‘నా డ్యాన్స్ ఇన్విటేషన్ కార్డ్స్ డిజైన్ చేయడం దగ్గరనుంచి, అందరికీ పంచడం వరకు ఈయనే చూసుకుంటారు. ఈయన ప్రోత్సాహం వల్లే నేను పీహెచ్‌డి చేసి డాక్టరేట్ తీసుకోగలిగాను. ఎన్నో అవార్డులు, సన్మానాలు పొందగలిగాను’’ అన్నారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు. ఒకరు ‘లా’ మరొకరు బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్‌లు చేస్తున్నారు. ‘స్నేహం’గా విశాలమైన కుటుంబం... కుటుంబమంటే... ఇరువైపులా బంధువులతో పాటూ ఇరువైపు స్నేహాలూ సవ్యంగా ఉండాలనేది ఈ దంపతుల మాట. ‘‘మా ఇద్దరికీ చిన్ననాటి స్నేహితులు ఇప్పటికీ ఉన్నారు. వారి కుటుంబాలతో సహా అందరం తరచూ కలుసుకుంటాం’’ అన్నారు వినయ్‌కుమార్. ‘‘ఈయనకు నిరుపేదలు చాలా ముఖ్యమైన స్నేహితులు. హాస్పిటల్‌కి వచ్చే పేదలను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. నెలకు ముప్పై సర్జరీలెనా పేదవారికి ఉచితంగా చేసేవారు. ఈయన చికిత్స చేసిన పేషంట్స్ దగ్గు వచ్చినా ఈయనకే ఫోన్ చేస్తుంటారు. ఇది మీకు సంబంధించింది కాదు కదా! అలాంటి వాటికి కూడా రెస్పాండ్ అవడం ఎందుకు అని అంటుంటాను. కాని, వారికి ఓపికగా చెప్పే సమాధానాలు వింటున్నప్పుడు ఈయనలోని సహనానికి ఆశ్చర్యం కూడా వేస్తుంటుంది’’ అన్నారు ఆమె. ‘‘దాంపత్యం అంటే అర్థం ఏంటో కాబోయే ప్రతి జంట తెలుసుకొని ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలి. డబ్బు ప్రధానం కాదు ఇద్దరూ ఒకరి కోసం ఒకరు ఎంత సమయం, శక్తి ఉపయోగిస్తే అంతగా ఆ ఇద్దరి బంధం బాగుంటుంది’’ అన్నారు ఈ దంపతులు. - నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ‘‘అలేఖ్య ఒక్క డ్యాన్స్ అనే కాదు... ఇంటి అలంకరణ, వంట, ఉద్యోగం, అందరితో కలివిడిగా ఉండటంలో ఎక్కడా చిరునవ్వు చెదరనీయదు. - డా. పి. వినయ్‌కుమార్ ఇంట్లో డ్యాన్స్ క్లాస్ ఏర్పాటు చేయాలన్నా, క్లాస్‌కు వెళ్లాలన్నా,.. నాకు నచ్చినట్టు సౌకర్యాలను ఏర్పాటు చేయడంలో ఈయన ఎప్పుడూ ముందుంటారు ఆ ప్రోత్సాహమే నా బలం. - అలేఖ్య పుంజాల