కృష్ణానది సముద్రంలో కలిసేచోట కనువిందు
సాక్షి, అమరావతి: సాగర సంగమ తీరంలో డాల్ఫిన్లు కనువిందు చేస్తున్నాయి. కృష్ణాజిల్లా హంసలదీవిలో ఇవి తరచూ కనిపిస్తున్నాయి. ఇది కృష్ణా నది సముద్రంలో కలిసేచోటు కావడంతో అవి ఎక్కువగా ఈ ప్రాంతంలో కనిపిస్తాయని స్థానికులు చెబుతున్నారు. ఇవి గుంపులు గుంపులుగా తిరుగుతూ అప్పుడప్పుడు సముద్ర తీరానికి దగ్గరగా వస్తున్నాయని.. ఒక్కో గుంపులో 15 నుంచి 30 వరకూ ఉంటూ కనిపిస్తాయని వారంటున్నారు. విశాఖపట్నం, బాపట్లలోని సూర్యలంక, కాకినాడ బీచ్‌ల్లోనూ ఈ డాల్ఫిన్లు ఎక్కువగా కనిపిస్తాయి. తాజాగా.. ఆదివారం విజయవాడ నేచర్ క్లబ్‌కు చెందిన డాక్టర్ కిషోర్ హంసలదీవి వద్ద సముద్రంలో రెండు డాల్ఫిన్లను తన కెమెరాలో బంధించారు.
తూర్పు తీరంలో సర్వ సాధారణం
హిందూ మహా సముద్రంలో కనిపించే వీటిని హంప్ బ్యాక్ డాల్ఫిన్లుగా పిలుస్తారు. మన దేశ తూర్పు, పశ్చిమ తీరాల్లో ఇవి కనిపించడం చాలా సాధారణం. అయితే, తూర్పు, పశ్చిమ తీరాల్లో కనిపించే డాల్ఫిన్ల మధ్య జన్యుపరంగా స్వల్ప తేడాలుంటాయి. హంప్ బ్యాక్ డాల్ఫిన్లు ముదురు బూడిద రంగులో ఉంటాయి. వాటి ఉపరితల భాగం చాలా చిన్నదిగా కనిపిస్తుంది. వాటికి ఎత్తయిన మూపురం ఉంటుంది. సముద్రంలో డాల్ఫిన్ల మూపురం బయటకు కనిపిస్తుంది. వాటి ఆధారంగానే డాల్ఫిన్లను గుర్తిస్తారు. ఒక పెద్ద హంప్ బ్యాక్ డాల్ఫిన్ పొడవు సుమారు 3.5 మీటర్లు ఉంటుంది. కొత్తగా పుట్టిన డాల్ఫిన్లు కూడా ఒక మీటర్ పొడవు ఉంటాయి. వాటిలో ఆడ, మగ గురించి మాత్రం సరైన అధ్యయనాల్లేవు.
తీరానికి దగ్గరగా వచ్చే డాల్ఫిన్లు ఇవే..
డాల్ఫిన్లు మన తీరంలో కనిపించడం సాధారణం. అయితే, వాటిల్లో తీరానికి దగ్గరగా కనిపించేవి హంప్‌బ్యాక్ డాల్ఫిన్లు మాత్రమే. మిగిలిన డాల్ఫిన్ జాతులు సముద్రంలోనే ఇంకా లోతులో ఉంటాయి. డాల్ఫిన్ల గురించి అధ్యయనం చేసేవాళ్లు, చూసేవాళ్లు లేకపోవడంవల్ల వాటి గురించి పెద్దగా బయటకు తెలీడంలేదు. చూసేవాళ్లకు మాత్రం అవి రెగ్యులర్‌గా కనిపిస్తూనే ఉంటాయి. సూర్యుడు ఉదయించే సమయాల్లో అవి తీరానికి దగ్గరగా వస్తాయి. శీతాకాలంలో స్పిన్నర్ డాల్ఫిన్లు (పైకి ఎగిరి నీటిలో పడేవి) విశాఖలో తీరంలో కనిపిస్తాయి. డాల్ఫిన్లు, తిమింగలాలు చనిపోయి లేదా దెబ్బతగిలి ఒడ్డుకు కొట్టుకువస్తే వాటి వివరాలు సేకరించి అటవీ శాఖకు సమాచారం ఇస్తున్నాం. – ప్రణవ్, ఈస్ట్ కోస్ట్ కన్జర్వేషన్ టీమ్
Comments
Please login to add a commentAdd a comment