అనురాగ సంగమం | alekya, vinay interview | Sakshi
Sakshi News home page

అనురాగ సంగమం

Published Tue, Oct 22 2013 11:38 PM | Last Updated on Fri, Sep 1 2017 11:52 PM

అనురాగ సంగమం

అనురాగ సంగమం


 జూన్ 3న సాగర సంగమం విడుదలైంది.
 జూలై 3న అలేఖ్య, వినయ్‌ల పెళ్లయింది.
 ఈ ముప్పై ఏళ్ల దాంపత్య జీవితంలో...
 ఇద్దరూ కలిసి చూసిన సినిమా సాగర సంగమం ఒక్కటే!
 అది కూడా పెళ్లికి ముందర!
 వినయ్ ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్.
 అలేఖ్య ప్రముఖ కూచిపూడి నాట్యకారిణి.
 ప్రముఖులైన భార్యాభర్తలకు...
 సినిమాలకు, షికార్లకు టైమ్ దొరక్కపోవడంలో ఆశ్యర్యం లేదు.
 అయితే ‘దొరకని టైమ్’లో
 ఈ దంపతులు దొరకపుచ్చుకున్నవి చాలా ఉన్నాయి!
 ఆమె అభినయం... ఆయన పరవశం.
 ఆయన అనునయం... ఆమె జన్మఫలం.
 ‘మనసే జతగా...’ సాగిన వీరి దాంపత్యం...
 ఒక అనురాగ సంగమం!
 
 అచ్చ తెలుగింటి ఆహార్యంతో కనిపించే ఆమె పేరు అలేఖ్యపుంజాల. కూచిపూడి నృత్యకళాకారిణి. మూడు దశాబ్దాలుగా నృత్యరీతులెన్నింటినో వేదికల మీద అభినయిస్తున్నారు. ఇప్పుడు పొట్టి శ్రీరాములు కూచిపూడి విభాగానికి అధిపతిగా విధులను నిర్వర్తిస్తున్నారు. వేదికమీద లయబద్ధంగా అందెల రవళులు చేస్తూనే, విధి నిర్వహణలో మెలకువగా ఉంటూనే, ఇంటిల్లిపాదికి స్వయంగా వంట చేసి ఆప్యాయంగా వడ్డన చేయడం... ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు? అని ఆమెను ఆడిగితే చిరునవ్వుతో తన శ్రీవారు డాక్టర్ వినయకుమార్ వైపు చూశారు ఆమె. ఈ డాక్టర్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్. ‘‘నాట్యం అంటే నాకు అమితమైన ప్రేమ. నా నాట్యాన్ని ప్రేమించడం ఈయనకు హాబీ’’ అంటూ సంసారపు తొలి అడుగులను గుర్తుచేసుకుంటూ తమ దాంపత్య బంధంలోని మధురానుభూతులను మనముందుంచారు అలేఖ్య.
 
 ఇద్దరూ పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే! వినయ్‌కుమార్ అక్క, అలేఖ్య ఇద్దరూ డ్యాన్స్ క్లాస్‌లో స్నేహితులు. అక్కను కలుసుకోవడానికి వెళ్లినప్పుడు అలేఖ్యను చూసి, మొదటి చూపులోనే ప్రేమించేశారట ఈ డాక్టర్‌గారు. వెంటనే వెళ్లి ఆమెకు తన మనసులోని మాట చెప్పేశారట. ‘పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తులకు మాత్రమే సంబంధించింది కాదు, ఇరువైపుల కుటుంబాలూ సరే అనాలి. ముందు పెద్దలందరినీ ఒప్పించండి’ అని చెప్పారట అలేఖ్య. దాంతో నేరుగా ఆమె తల్లిదండ్రులను కలిశారు వినయ్‌కుమార్. పెళ్లినాటి పరిస్థితులను అలేఖ్య వివరిస్తూ-‘‘ముందు వీళ్ల అమ్మగారు మా పెళ్లికి ఒప్పుకోలేదు. కొడుకు డాక్టర్ కాబట్టి మెడిసిన్ చదివిన అమ్మాయి అయితేనే కొడుకు భవిష్యత్తు బాగుంటుంది అనుకున్నారు. ఈయన మూడేళ్ల మౌనవ్రతానికి ఆవిడా సరే అనక తప్పలేదు. మొత్తానికి ఇరువైపుల పెద్దల అంగీకారంతో జూలై 3, 1983లో మా పెళ్లి అయ్యింది. అత్తగారింట్లో ఉమ్మడి కుటుంబం.. కొద్దిరోజుల్లోనే వారందరితో కలిసిపోయాను. ముందు మా పెళ్లిని కాదన్న మా అత్తగారే నన్ను కూతురిలా చూసుకునేవారు. ‘ఎదుటి వారికి మంచిని పంచితే నీకు మంచే వస్తుంది’ అని మా అమ్మ నా చిన్నప్పటి నుంచి చెబుతుండేవారు. ఆ సూచనను ఇప్పటికీ పాటిస్తూ ఉంటాను’’ అన్నారు ఆమె.
 
 వీలైనంత ఎక్కువ సమయం...
 పెళ్లయిన తర్వాత ఇంటిని చక్కదిద్దుకున్న విధానాన్ని  చెబుతూ-‘‘ఈయన చాలా మితభాషి. ఏదీ బయటకు చెప్పేవారు కాదు. ఈయన వ్యక్తిత్వాన్ని అర్థ్ధం చేసు కుని అందుకు అనుగుణంగా నన్ను నేను తీర్చిదిద్దు కోవ డానికి కొంత కాలం పట్టింది. అదేవిధంగా భార్యగా, కోడలిగా బాధ్యతల నడుమ రోజూ డ్యాన్స్ క్లాస్‌కు వెళ్లడం కుదిరేది కాదు. ప్రాక్టీస్‌ను ఐదేళ్ల పాటు వారానికి రెండు రోజులకు తగ్గించుకున్నాను. పెద్దబాబు పుట్టి, వాడిని స్కూల్లో జాయిన్ చేశాక మా గురువుల సూచనతో అధ్యాపకురాలిగా యూనివర్శిటీలో చేరాను. అభిరుచి, ఉద్యోగం, ఇల్లు... వీటన్నింటినీ బ్యాలెన్స్ చేసుకోవడానికి కొంచెం కష్టపడ్డాను. దాంతో పనులను విభజించుకోవడం మొదలుపెట్టాను. స్టేజ్ ప్రోగ్రామ్‌లు, డ్యాన్స్ క్లాస్‌లు, ప్రాక్టీస్, రీసెర్చ్.. సమయానుకూలంగా చూసుకుంటూనే కుటుంబంతో గడపడానికి ప్లాన్ చేసుకునేదాన్ని. ఇంట్లోని వారితో ఎక్కువగా మాట్లాడుతూ, అరమరికలు లేకుండా చూసుకోవడం వల్ల బంధాలు బలపడతాయి అనేది నా నమ్మకం. ఇప్పటికీ ఈ సూత్రాన్ని పాటిస్తుంటాను’’ అని అలేఖ్య చెబుతుంటే... ‘‘ఈవిడ ఎప్పుడైనా నొచ్చుకుంటే... రెండు మూడు రోజులవరకు మూడీగా ఉంటుంది. తనంతట తనే ఆ బాధ నుంచి బయటపడాలి తప్ప ఎంత ప్రయత్నించినా లాభం ఉండదు. తన మూడ్ మారేంతవరకు ఓపిగ్గా ఎదురు చూడటం ఇప్పటికీ నాకు అలవాటు’’ అంటూ భార్య మనస్తత్వాన్ని అర్థం చేసుకున్న తీరును వివరించారు వినయ్‌కుమార్!
 
 ప్రోత్సాహమిచ్చిన బంధం
 కళాకారిణిగా తన భర్త ప్రోత్సాహంతోనే నాట్యంలో ఎన్నో ప్రయోగాలను చేయగలిగాను. నేను ప్రోగ్రామ్‌లు, క్లాస్‌లు అంటూ వెళ్లినప్పుడు పిల్లలను ఈయనే చూసుకునేవారు’’ అని అలేఖ్య చెబుతుంటే... ‘‘తనకు పేరు వస్తుందంటే అది నాకు వచ్చినట్టుగానే భావిస్తాను’’ అని వినయ్‌కుమార్ సంతోషంగా చెప్పారు. అలేఖ్య మాట్లాడుతూ- ‘‘నా డ్యాన్స్ ఇన్విటేషన్ కార్డ్స్ డిజైన్ చేయడం దగ్గరనుంచి, అందరికీ పంచడం వరకు ఈయనే చూసుకుంటారు. ఈయన ప్రోత్సాహం వల్లే నేను పీహెచ్‌డి చేసి డాక్టరేట్ తీసుకోగలిగాను. ఎన్నో అవార్డులు, సన్మానాలు పొందగలిగాను’’ అన్నారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు. ఒకరు ‘లా’ మరొకరు బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్స్‌లు చేస్తున్నారు.
 
 ‘స్నేహం’గా విశాలమైన కుటుంబం...
 కుటుంబమంటే... ఇరువైపులా బంధువులతో పాటూ ఇరువైపు స్నేహాలూ సవ్యంగా ఉండాలనేది ఈ దంపతుల మాట. ‘‘మా ఇద్దరికీ చిన్ననాటి స్నేహితులు ఇప్పటికీ ఉన్నారు. వారి కుటుంబాలతో సహా అందరం తరచూ కలుసుకుంటాం’’ అన్నారు వినయ్‌కుమార్. ‘‘ఈయనకు నిరుపేదలు చాలా ముఖ్యమైన స్నేహితులు. హాస్పిటల్‌కి వచ్చే పేదలను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు.  నెలకు ముప్పై సర్జరీలెనా పేదవారికి ఉచితంగా చేసేవారు. ఈయన చికిత్స చేసిన పేషంట్స్ దగ్గు వచ్చినా ఈయనకే ఫోన్ చేస్తుంటారు. ఇది మీకు సంబంధించింది కాదు కదా! అలాంటి వాటికి కూడా రెస్పాండ్ అవడం ఎందుకు అని అంటుంటాను. కాని, వారికి ఓపికగా చెప్పే సమాధానాలు వింటున్నప్పుడు ఈయనలోని సహనానికి ఆశ్చర్యం కూడా వేస్తుంటుంది’’ అన్నారు ఆమె.
 
 ‘‘దాంపత్యం అంటే అర్థం ఏంటో కాబోయే ప్రతి జంట తెలుసుకొని ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలి. డబ్బు ప్రధానం కాదు ఇద్దరూ ఒకరి కోసం ఒకరు ఎంత సమయం, శక్తి ఉపయోగిస్తే అంతగా ఆ ఇద్దరి బంధం బాగుంటుంది’’ అన్నారు ఈ దంపతులు.
 - నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
 
 ‘‘అలేఖ్య ఒక్క డ్యాన్స్
 అనే కాదు... ఇంటి అలంకరణ, వంట, ఉద్యోగం, అందరితో కలివిడిగా ఉండటంలో ఎక్కడా చిరునవ్వు చెదరనీయదు.
 - డా. పి. వినయ్‌కుమార్
 
 ఇంట్లో డ్యాన్స్ క్లాస్ ఏర్పాటు చేయాలన్నా, క్లాస్‌కు
 వెళ్లాలన్నా,.. నాకు నచ్చినట్టు
 సౌకర్యాలను ఏర్పాటు చేయడంలో ఈయన ఎప్పుడూ ముందుంటారు
 ఆ ప్రోత్సాహమే నా బలం.
 - అలేఖ్య పుంజాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement