'శరత్‌బాబు కనపడలేదు.. ఆ పాత్రే కనిపిస్తుంది'
ప్రేక్షకులు గుర్తుపెట్టుకోవడమే పెద్ద అవార్డు
సాగరసంగమం ఇష్టమైన సినిమా
అప్పన్నను దర్శించుకున్న సినీనటుడు శరత్‌బాబు
విశాఖపట్నం : ఒక మంచి సినిమాకు అవార్డులతో పనిలేదని, ప్రేక్షకుల మనస్సులో ఆ చిత్రం కలకాలం నిలిచిపోవడమే పెద్ద అవార్డు అని సినీనటుడు శరత్‌బాబు అన్నారు. సింహాచల శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామిని గురువారం ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ నలుగురు కూర్చుని ఇచ్చే అవార్డు కన్నా నాలుగు కోట్ల మంది మదిలో ఆ చిత్రం ఉండడమే ఎంతో గొప్పవన్నారు.
సాగరసంగమం సినిమా అంటే తనకు చాలా ఇష్టమని, దాంట్లో శరత్‌బాబు కనపడలేదని, రఘు పాత్రే కనిపిస్తుందని చెప్పారు. దర్శకుడు కె.విశ్వనాథ్ ఆ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారన్నారు. తెలుగులో పది మంచి సినిమాలు చెప్పమంటే.. అందులో విశ్వనాథ్ తీసినవే సింహభాగంలో ఉంటాయన్నారు.
ఉత్తమ నటుల్లో కమల్‌హాసన్ ఒకరని వివరించారు. సూర్య హీరోగా తెరకెక్కుతున్న సింగం-3లో తాను నటిస్తున్నానన్నారు. కన్నడంలో మరో రెండు సినిమాలు చేస్తున్నట్టు తెలిపారు. అన్నయ్య, క్రిమినల్ సినిమాల్లో తాను చేసిన విలన్ పాత్రలకు ఎంతగానో పేరు వచ్చిందన్నారు. స్వామి దర్శనం కోసం వచ్చిన ఆయన కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకుని అంతరాలయంలో అష్టోత్తరం పూజ నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం ఆయనకు స్వామి ప్రసాదాన్ని ఏఈవో ప్రసాద్ అందజేశారు.