విశ్వనాథ వనితలు | Sakshi Special Story About K Viswanath Birthday | Sakshi
Sakshi News home page

విశ్వనాథ వనితలు

Published Fri, Feb 19 2021 12:24 AM | Last Updated on Fri, Feb 19 2021 8:30 AM

Sakshi Special Story About K Viswanath Birthday

పాశ్చాత్య సంగీతపు పెనుతుఫానుకు అరచేతులు అడ్డుపెడుతుంది ఒక స్త్రీ. ఒక గొప్ప నాట్యకారుడి అంతిమ రోజులను అర్థమంతం చేస్తుంది మరో స్త్రీ. తనలోని కళను తాను కనుగొనడానికి గొప్ప సంఘర్షణ చేస్తుంది ఒక స్త్రీ. వ్యసనపరుడైన భర్తను సంస్కరించడానికి ఎడబాటు నిరసనను ఆశ్రయిస్తుంది మరో స్త్రీ. ప్రేమకు కులం లేదు అనే స్త్రీ... వరకట్నం వద్దు అనే స్త్రీ.. మందమతితో జీవితాన్ని పునర్నిర్మించుకునే స్త్రీ.
అతడు చూపిన స్త్రీలు ఆత్మాభిమానం కలిగిన స్త్రీలు. ఆత్మవిశ్వాసాన్ని కలిగిన స్త్రీలు. భారతీయ సంస్కృతిని గౌరవించాలనుకునే స్త్రీలు. కె.విశ్వనాథ్‌ 92వ జన్మదినం సందర్భంగా....


ఆమెకు సంగీతం, నృత్యం అంటే ప్రాణం. కాని తల్లి ఆమెను ఒక వేశ్యను చేయాలనుకుంటుంది. బలవంతంగా ఆమెపై అత్యాచారం జరిగేలా చూస్తుంది. ఆమె కడుపున నలుసు పడుతుంది. కాని అది ఇష్టం లేని సంతానం. ఒక పాము కాటేస్తే వచ్చిన గర్భం. పుట్టబోయేది కూడా పామే. ఆమె అబార్షన్‌ చేయించుకోదు. ఆత్మహత్య చేసుకోదు. ఆ బిడ్డకు జన్మనిస్తుంది. ఆ బిడ్డకు సంగీతం నేర్పిస్తుంది. తరువాత తను దేవుడిగా భావించే శంకరశాస్త్రి దగ్గరకు పంపి ఆయన శిష్యుడిగా మారుస్తుంది. బయట దారిలో కనిపిస్తే ‘పాము’ పామే అవుతుంది. కాని శివుని మెడలో ఉండి కనిపిస్తే ‘శంకరాభరణం’ అవుతుంది. అథోముఖమైన తన జీవితాన్ని ఊర్థ్వంలోకి మార్చుకుని సంతృప్తి పొందిన ఆ స్త్రీ ‘శంకరాభరణం’లో మంజుభార్గవి. ఆ పాత్రను అంత తీక్షణంగా, ఔన్నత్యంగా తీర్చిదిద్దినవారు దర్శకడు కె.విశ్వనాథ్‌.

ఒక కళాకారుణ్ణి తెలుసుకోవాలంటే అతడు పుట్టించిన పాత్రలను చూడాలి. మహిళల పట్ల అతడి దృక్పథం తెలియాలంటే అతడు సృష్టించిన మహిళా పాత్రలను చూడాలి. కె.విశ్వనాథ్‌ సృష్టించిన మహిళా పాత్రలు ప్రేక్షకులకు నచ్చిన పాత్రలు. ప్రేక్షకులు మెచ్చిన పాత్రలు. అంతేకాదు పరోక్షంగా తమ ప్రభావాన్ని వేసే పాత్రలు.

‘శుభలేఖ’ సినిమాలో సుమలత లెక్చరర్‌. ఎంతో చక్కని అమ్మాయి. ఆమెతో జీవితం ఏ పురుషుడికైనా అపురూపంగా ఉండగలదు. కాని ఆమెను కోడలిగా తెచ్చుకోవడానికి బోలెడంత కట్నం అడుగుతాడు ఆ సినిమాలో పెద్దమనిషి సత్యనారాయణ. డబ్బు, కానుకలు, కార్లు... ఒకటేమిటి అడగనిది లేదు. ఆత్మాభిమానం ఉన్న ఏ అమ్మాయి అయినా ఊరుకుంటుందా? సుమలత తిరగబడుతుంది. సంతలో పశువును కొన్నట్టు వరుణ్ణి కొననని చెప్పి సంస్కారం ఉన్న వ్యక్తి హోటల్‌లో వెయిటర్‌ అయినా సరే అతణ్ణే చేసుకుంటానని చిరంజీవిని చేసుకుంటుంది. మనిషికి ఉండాల్సిన సంస్కార సంపదను గుర్తు చేస్తుంది ఈ సినిమాలో సుమలత.

‘సాగర సంగమం’లో జయప్రద ఫీచర్‌ జర్నలిస్ట్‌. చదువుకున్న అమ్మాయి. భారతీయ కళలు ఎంత గొప్పవో తెలుసు. అందుకే కమల హాసన్‌లోని ఆర్టిస్ట్‌ను గుర్తించింది. అతణ్ణి ఇష్టపడటం, కోరుకోవడం జరక్కపోవచ్చు. అతడి కళను ఇష్టపడటం ఆపాల్సిన అవసరం లేదని గ్రహిస్తుంది. విఫల కళాకారుడిగా ఉన్న కమల హాసన్‌ చివరి రోజులను అర్థవంతం చేయడానికి అతడిలోని కళాకారుణ్ణి లోకం గుర్తించేలా చేయడానికి ఆమె ప్రయత్నిస్తుంది. తన కుమార్తెనే అతని శిష్యురాలిగా చేస్తుంది. ఆమె రాకముందు అతడు తాగుబోతు. కాని మరణించే సమయానికి గొప్ప కళాకారుడు. స్త్రీ కాదు లత. ఒక్కోసారి పురుషుడే లత. ఆ లతకు ఒక దన్ను కావాలి. ఆ దన్ను జయప్రదలాంటి స్త్రీ అని ఆ సినిమాలో విశ్వనాథ్‌ చూపిస్తారు.

‘సప్తపది’లో ఆ అమ్మాయి అతడి కులాన్ని చూడదు. అతడి చేతిలోని వేణువునే చూస్తుంది. ఆ వేణునాదాన్నే వింటుంది. ఏడడుగుల బంధంలోకి నడవాలంటే కావాలసింది స్త్రీ, పురుషుల మధ్య ఏర్పడే పరస్పర ప్రేమ, గౌరవం. అంతే తప్ప కులం, అంతస్తు కాదు. సంప్రదాయాల కట్టుబాట్లు ఉన్న ఇంట పుట్టినా హృదయం చెప్పిందే చేసిందా అమ్మాయి. ఆమె ప్రేమను లోకం హర్షించింది.

యువతకు లక్ష్యం ఉందా? కళ పట్ల అనురక్తి ఉందా? తమలోని కళను కాకుండా కాసులను వెతికే వేటను కొనసాగిస్తే అందులో ఏదైనా సంతృప్తి ఉందా? ‘స్వర్ణకమలం’లో గొప్ప నాట్యగత్తె భానుప్రియ. కాని ఆ నాట్యాన్ని ఆమె గుర్తించదు. ఆ కళను గుర్తించదు. ఒక కూచిపూడి నృత్యకళాకారిణిగా ఉండటం కన్నా హోటల్‌లో హౌస్‌కీపింగ్‌లో పని చేయడమే గొప్ప అని భావిస్తుంది. ఆ అమ్మాయికి ధైర్యం ఉంది. తెగువ ఉంది. చురుకుదనం ఉంది. టాలెంట్‌ ఉంది. స్వీయజ్ఞానమే కావాల్సింది. కాని చివరలో ఆత్మసాక్షాత్కారం అవుతుంది. తను గొప్ప డ్యాన్సర్‌ అవుతుంది. మూసలో పడేవాళ్లు మూసలో పడుతూనే ఉంటారు. కొత్తదారి వెతికినవారు భానుప్రియ అవుతారు. మీరు మాత్రమే నడిచే దారిలో నడవండి అని చెప్పిందా పాత్ర.

లైఫ్‌లో ఒక్కోసారి ఆప్షన్‌ ఉండదు. మనం టిక్‌ పెట్టేలోపలే విధి టిక్‌ పెట్టేస్తుంది. ‘స్వాతిముత్యం’లో రాధికకు భర్త చనిపోతాడు. ఒక కొడుకు. ఆ కష్టం అలా ఉండగానే మందమతి అయిన కమల హాసన్‌ తాళి కట్టేస్తాడు. అంతవరకూ ఆమె జీవితం ఏమిటో ఆమెకు తెలియదు. ఇప్పుడు ఒక మీసాలు లేని, ఒక మీసాలు ఉన్న పిల్లాడితో కొత్త జీవితం నిర్మించుకోవాలి. ఆమె నిర్మించుకుంటుంది. అతణ్ణి కర్తవ్యోన్ముఖుణ్ణి చేస్తుంది. అడ్డంకులను జయించుకుంటూ అతడి ద్వారా తన జీవితాన్ని జయిస్తుంది. స్థిర సంకల్పం ఉంటే కష్టాలను దాటొచ్చని చెబుతుంది. కె.విశ్వనాథ్‌ మహిళా పాత్రలలో స్వాతిముత్యంలో రాధిక పాత్ర మర్చిపోలేము.

‘శృతిలయలు’లో సుమలత భర్త రాజశేఖర్‌. కళకారుడు. కాని స్త్రీలోలుడు అవుతాడు. వ్యసనపరుడవుతాడు. లక్ష్యరహితుడవుతాడు. అతణ్ణి సరిచేయాలి. దానికి ఇంట్లో ఉండి రాద్ధాంతం పెట్టుకోదు ఆమె. కొడుకును తీసుకుని దూరం జరుగుతుంది. హుందాగా ఉండిపోతుంది. ఎదురు చూస్తుంది. ఏ మనిషైనా బురదలో ఎక్కువసేపు ఉండలేరు. రాజశేఖర్‌ కూడా ఉండలేకపోతాడు. మగాడికి గౌరవం కుటుంబంతోనే అని గ్రహిస్తాడు. మగాడికి గౌరవం భార్య సమక్షంలోనే అని గ్రహిస్తాడు. మగాడికి గౌరవం ఒక లక్ష్యంతో పని చేయడమే అని గ్రహిస్తాడు. ఆమె పాదాల దగ్గరకు తిరిగి వస్తాడు.

విశ్వనాథ్‌ సృష్టించిన స్త్రీలు లౌడ్‌గా ఉండరు. కాని వారు స్పష్టంగా ఉంటారు. సౌమ్యంగా ఉంటారు. స్థిరంగా సాధించుకునే వ్యక్తులుగా ఉంటారు. సమాజంలో స్త్రీలకు ఉండే పరిమితులు వారికి తెలుసు. కాని వాటిని సవాలు చేయడం పనిగా పెట్టుకోకుండా ఆ ఇచ్చిన బరిలోనే ఎలా విజయం సాధించాలో తెలుసుకుంటారు. విశ్వనాథ్‌ స్త్రీలు తెలుగుదనం చూపిన స్త్రీలు. మేలిమిదనం చూపిన స్త్రీలు. అందమైన స్త్రీలు... రూపానికి కాని... వ్యక్తిత్వానికి కాని!

సీతాలు సింగారం మాలచ్చి బంగారం
సీతామాలచ్చిమంటే శ్రీలచ్చి అవతారం


– సాక్షి ఫ్యామిలీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement