List Of Best And Popular Rain Songs In Tollywood - Sakshi
Sakshi News home page

శంకర శాస్త్రి శీలాన్ని శంకించినప్పుడు వానే సాయం చేసింది

Published Sun, Jul 18 2021 10:27 AM | Last Updated on Sun, Jul 18 2021 3:54 PM

Top Tollywood Movies With Best Rain Songs - Sakshi

‘‘మెరిసే మెరుపులు ఉరిమే ఉరుములు సిరిసిరి మువ్వలు కాబోలు’’...
శంకరశాస్త్రికి కూడా వాన సాయం కావాల్సి వచ్చింది.
‘‘ఆ రెండి నట్టనడుమ నీకెందుకింత తపన’’...
నాట్య కళాకారుడు బాలు బావి గట్టుమీద వాననే సవాలు చేశాడు.
జగపతి వారి చిటపట చినుకులు నుంచి 
‘‘ఈ వర్షానికి స్పర్శుంటే..’’ పాట వరకు ఎన్నో సందర్భాల్లో 
వాన హార్మోనియం మెట్లను తడిపింది.. కలెక్షన్ల బాక్సుల్ని నింపింది. 
ఒక వాన విహారం...

‘శంకరాభరణం’లో శంకర శాస్త్రిని జనం సందేహించారు. అతడి శీలాన్ని శంకించారు. శంకర శాస్త్రి ఏమిటి... పరాయి స్త్రీని తన పక్కన కచ్చేరీకి కూచోబెట్టుకోవడం ఏమిటి? కాని నిప్పులాంటి శంకర శాస్త్రికి తానేమిటో తెలుసు. ఆ సంగతి శంకరుడికీ తెలుసు. అందుకే ఆ శంకరుడితో తన ఆగ్రహాన్ని చెప్పుకున్నాడు. గానం చేశాడు. ఇంతటి ఆగ్రహ జ్వాల లోకాన్ని ఏం చేయాలని? అతణ్ణి చల్లబరచాలే. అందుకే గంగ దూకింది. మెరుపులు మెరిశాయి. ఉరుములు ఫెటిల్మన్నాయి. ‘శంకరా నాదశరీరాపరా’... గానవాహిని కొనసాగింది. వాన లేకపోతే ఆ పాటకు బలం లేదు. వాన ఆ పాటకూ పాత్రకూ శక్తినిచ్చింది. వాన.. శక్తి.
వానను దుబారా చేయకూడదు. సరిౖయెన సమయంలో నేలకు దించాలి. ఝల్లుమనిపించాలి. గుండె తడిపించాలి.

‘సాగర సంగమం’లో విఫల ప్రేమికుడు, పరాజిత కళాకారుడు అయిన బాలుకు మందు తప్ప మరో తోడు లేదు. అతడు తాగి తాగి చనిపోబోతున్నాడు. చనిపోయేవాడికి భయం ఏమిటి? రెండు గుక్కలు తాగి బావి గట్టున ఎక్కితే? మనసు ‘తకిట తధిమి తకిట తధిమి తందానా’ అంటే? కాని అతణ్ణి ఆపాలి. ఆపాలంటే ఆమె రావాలి. రావాలంటే వాన రావాలి. వానలో అతడికి ప్రమాదమేమో అని ఆమె వొణికిపోవాలి. అప్పుడు వితంతువు అయిన ఆమె బొట్టు పెట్టుకుంటుంది. అతడు దానికి అరచేయి అడ్డుపెడతాడు. వాన వారి గత జ్ఞాపకాలను తడుపుతూ కురుస్తుంది. మనోజ్వరం ఆ సన్నివేశానిది.వానలో అందరం తడుస్తాము. కాని వయసులో ఉన్నప్పుడు, జోడు తోడుగా ఉన్నప్పుడు తడవడం అందరికీ కుదరదు. కనుక సినిమాలో అలాంటి జోడి తడిస్తే సంతోషపడతాము. ముచ్చటపడతాము. ఆ అచ్చట్లు ముచ్చట్లు తీసి నాలుగు డబ్బులు రాబట్టుకునే సినిమావారు ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే’ అని వానను తెర మీదకు తెచ్చారు.

‘ముత్యాల జల్లు కురిసే’ అని హీరోయిన్‌ను మైమరిపించారు. సందర్భాలను సృష్టించి సంగీత దర్శకులకు సవాలు విసిరారు. వారు అందుకు సరేగమా అన్నారు. ‘ప్రేమ్‌నగర్‌’లో శ్రీమంతుల కుర్రాడు తన దగ్గర సెక్రటరీగా పని చేసే అమ్మాయిని వానలో తడిచి చూసే మోహిస్తాడు. బయట వాన కురుస్తుంటే లోపల పాట. హార్మోనియం పలికింది. ‘తేట తేట తెలుగులా’ అని ఉత్ప్రేక్షల కుంభవృష్టి కురిసింది.లవ్‌ ఫెయిల్యూర్‌ కుర్రాళ్లకు ఎలాగూ కన్నీళ్లు వస్తాయి. ఆ బాధా సమయంలో వాన కూడా వస్తే ఇక వరదే. ఆ రేంజ్‌ కావాలంటే కేరళ నుంచి ఏసుదాస్‌ రావాల్సిందే. ‘స్వయంవరం’లో ‘గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం’... ఆ పాట హోరు సులువుగా వదిలిపోదు. 

వాన ఎందుకనో ఆడపిల్లల నేస్తం. వాన వస్తే అమ్మాయిలు పాడతారు. ‘మౌనరాగం’లో ‘అహో మేఘమొచ్చెనే’ అని రేవతి పాడుతుంది. ‘గీతాంజలి’లో ‘వొళ్లంత జల్లంత కావాలిలే’ అని గిరిజ పాడుతుంది. ‘వర్షం’లో ‘ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వానా’ అని త్రిష పాడుతుంది. ‘వచ్చె వచ్చె నల్ల మబ్బుల్లారా’ అని ‘ఆనంద్‌’లో కమలిని ముఖర్జీ పాడుతుంది. కె.వి.మహదేవన్‌ నుంచి కె.ఎం. రాధాకృష్ణన్‌ వరకు వానమీటలు మీటిన వారే.

హీరో ఎంతటివాడైనా హీరోయిన్‌ ఎవ్వరైనా వాన ఉంటే ఆ ఫీల్‌ వేరు. ఆడియెన్స్‌కు ఆ థ్రిల్‌ వేరు. ఎన్‌.టి.ఆర్‌–శ్రీదేవి ‘ఆకు చాటు పిందె తడిసె’ అనాల్సిందే. అక్కినేని–శ్రీదేవి ‘చిటపట చినుకుల మేళం’ అని పాడాల్సిందే. చిరంజీవి– రాధ ‘వానా వానా వందనం’ అంటే ‘అడవి దొంగ’ పెద్ద హిట్‌ అయ్యింది. వాణి విశ్వనాథ్‌తో ఆయనే పాడిన ‘అబ్బా.. ఇది ఏమి వాన’ పాట ‘ఘరానా అల్లుడు’కు కిక్‌ ఇచ్చింది.  ‘స్వాతి ముత్యపు జల్లుల’లో (నాగార్జున), ‘స్వాతిలో ముత్యమంత’ (బాలకృష్ణ), ‘చిత్తడి చిత్తడి వాన’ (సుమన్‌).. ఆ వానలాహిరి అలా సాగిపోతూనే వచ్చింది.ఆకాశం ఆనాటిదే. ప్రేమా ఈనాటిదే. వాన ఏనాటిదే. అందుకే కొత్తతరం వచ్చినా వానచప్పుడు ప్రేమచప్పుడు సినిమాల్లో వినిపిస్తూనే ఉంది. వరుణ్‌ తేజ్‌ ‘తొలి ప్రేమ’లో ‘ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా’ పాట అందరినీ అందుకే తడిపింది. వానలో ఒక లయ, సవ్వడి ఉంటుంది. ఆ సంగీతం ఎప్పుడైనా బాగుంటుంది. ముఖ్యంగా సినిమా కోసం అది ట్యూన్‌లో కురిసినప్పుడు. ఆకాశగంగా... దూకావె పెంకితనంగాఆకాశగంగా జలజలజడిగా తొలిఅలజడిగా...
  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement