rain song
-
రిమ్జిమ్ గిరే సావన్.. ఒక జంట.. ఒక వాన.. ఒక పాట..
వానొస్తుంటే ఎవరైనా ఏం చేస్తారు? కిటికీలో నుంచి చూస్తారు. బయటకెళ్లకండి అని భార్య అంటుంది. టీ పెట్టమని భర్త అంటాడు. కాని ముంబైకి చెందిన శైలేష్, వందన అనే భార్యాభర్తలు మాత్రం ముంబై రోడ్ల మీద తడవడానికి బయలుదేరారు. ఒకప్పటి‘మంజిల్’ సినిమాలో ‘రిమ్జిమ్ గిరే సావన్’ హిట్ పాటలో ఎలాగైతే అమితాబ్, మౌసమీ చటర్జీ తడుస్తూ తిరిగారో అచ్చు అలాగే తిరిగారు. పాటను షూట్ చేసి వదిలితే వైరలే వైరలు. ఒక జంట. ఒక వాన. ఒక పాట. గతం మళ్లీ వర్తమానం అయ్యింది. నిజ పాత్రలు నటీనటులు అయ్యారు. ముంబై నగర వీధుల్లో ఒక సుందర దృశ్యం ఆవిష్కృతం అయ్యింది. చూసిన ప్రేక్షకులు మురిసిపోయారు. ఆనంద్ మహీంద్ర అంతటి వాడు ట్వీట్ చేసి మెచ్చుకున్నాడు. ఇప్పటి వరకూ లక్షల మంది వీక్షించారు. ఇంతకూ ఏమిటది? రిమ్జిమ్ గిరె సావన్ పాట. రీమేక్ పాట. మంజిల్ సినిమా నుంచి అమితాబ్, మౌసమీ చటర్జీ నటించిన ‘మంజిల్’ (1979) సినిమాకు దర్శకుడు బాసూ చటర్జీ. సినిమా ఓ మోస్తరుగా ఆడినా ‘రిమ్జిమ్ గిరె సావన్’ పాట పెద్ద హిట్. కిశోర్ కుమార్ వెర్షన్, లతా వెర్షన్ ఉంటాయి. లతా వెర్షన్‌ను బాసూ చటర్జీ నిజమైన వర్షంలో తీయాలనుకున్నాడు. ముంబైలో వాన కురుస్తున్న రోజు ఒక చిన్న యూనిట్‌ను పెట్టుకుని సూట్లో ఉన్న అమితాబ్‌ను, చీరలో ఉన్న మౌసమీ చటర్జీని రోడ్ల మీద నడిపిస్తూ పిక్చరైజ్ చేశాడు. ఈ పాట పెద్ద హిట్. సేమ్ ఇదే పాటను ఇన్నేళ్ల తర్వాత ఈ జంట మళ్లీ అభినయించింది. వారి పేర్లు శైలేష్, వందన ముంబైలోని థానేలో నివసించే శైలేష్, వందనలకు పెళ్లయ్యి 26 ఏళ్లు. ఒకరి పట్ల ఒకరికి చాలా ప్రేమ, ఇష్టం. ఈ ఇష్టం ఒక వానరోజున రికార్డు చేద్దామని, అదీ రిమ్జిమ్ గిరే సావన్ పాటలా ఉండాలని శైలేష్ కోరిక. భార్య దగ్గర ఎప్పుడు ప్రస్తావన తెచ్చినా ఆమె సిగ్గుతో ‘నేను చేయనండీ’ అనేది. శైలేష్ పట్టు వీడక ఈ సంగతి తన స్నేహితుడు అనుప్ రింగాన్గవాకర్కు చెప్పాడు. అనుప్ భార్య అంకిత ఇది విని ఉత్సాహపడింది. వాళ్లిద్దరినీ మనిద్దరం వానలో షూట్ చేద్దాం అని చెప్పింది. ఇంకేముంది శైలేష్ అచ్చు మంజిల్ సినిమాలోని సూట్ లాంటిది కుట్టించుకున్నాడు. వందన అలాంటి చీరలోనే నిరాడంబరంగా తయారైంది. మొన్న మొదలైన వానల్లో ఒకరోజు మొత్తం పాటను సేమ్ అవే లొకేషన్లలో తీశారు. పెద్ద హిట్ పాత పాట ఎంత హిట్టో ఈ పాట అంతే హిట్ అయ్యింది. ‘మేము ఇంత రెస్పాన్స్ ఊహించలేదు’ అని శైలేష్ అన్నాడు. ‘మా లొకాలిటీలో మేము సెలబ్రిటీలం అయిపోయాం’ అని చెప్పాడు. దేశవిదేశాల్లో ఈ వీడియోకు ఆదరణ లభించింది. ‘మనసుండాలి గాని ప్రతి సందర్భాన్ని ఆనందమయం చేసుకోవచ్చు’ అని చాలా మంది మెచ్చుకున్నారు. ఈ జంటను చాలామంది డిన్నర్‌కు పిలుస్తున్నారు. అన్నట్టు ‘మంజిల్’ కోసం ఈ పాటను నిజమైన వానలో తీసేప్పుడు అమితాబ్ నడకను అందుకోవడానికి మౌసమీ చటర్జీ పరుగులు తీయాల్సి వచ్చేది. అమితాబ్ కాళ్లు పొడవు కదా. ‘చాలాసార్లు ఆయన మెల్లగా నడిచి బేలెన్స్ చేసేవాడు. షూటింగ్ కోసం చాలాసేపు చీర నానడం వల్ల ఇంటికొచ్చాక దాని రంగు నా ఒంటి మీద అంటుకుపోయింది. వానలో పాట మాకు ఏమీ వినిపించేది కాదు. దూరం నుంచి డైరెక్టర్ కర్చీఫ్ ఆడిస్తే యాక్షన్ అని, మళ్లీ ఆడిస్తే కట్ అని భావించే నటించాం’ అని మౌసమీ చటర్జీ గుర్తు చేసుకుంది. వానలు మనకు అంతగా పడట్లేదు. పడినప్పుడు ఈ పాట చూడండి. -
వెండి తెరపై చినుకుల తుళ్లింత
నిజ జీవితంలోనే కాదు సినిమాలో కూడా వాన కురిస్తే సన్నివేశంలోని ఎమోషనే మారిపోతుంది. వానలో ప్రేమ... వానలో వాదన... వానలో సంఘర్షణ బలం ప్రేక్షకుణ్ణి తాకుతాయి. తడుపుతాయి. అయితే అందరు దర్శకులు వానను సరిగ్గా తీయలేరు. వానంటే ప్రేమ ఉన్నవారే గొప్ప వాన సన్నివేశాలు తీశారు.ఈ ఆదివారం కొన్ని గొప్ప వాన సన్నివేశాల గురించి... గొప్ప దర్శకులు వానను కూడా పాత్రగా తీసుకున్నారు. ప్రఖ్యాత జపనీస్ దర్శకుడు అకిరా కురసావా తీసిన ‘రోషమాన్’ సినిమా ప్రారంభంలోనే రోషమాన్ నగర శిథిల ద్వారం దగ్గర హోరుమని కురిసే వర్షాన్ని చూపుతాడు దర్శకుడు. ఆ శిథిల ద్వారం, ఆ క్రూర వర్షం 12వ శతాబ్దపు జపనీయ స్థితిగతులకు సంకేతం. 1950లో తీసిన ఈ సినిమాకు ముందు వానను అలా చూపినవారు లేరు. స్టూడియోల్లో వాన కాదు ఇది. ఔట్‌డోర్‌లో వాన. ఆ వానలో లాంగ్షాట్లో ఒక మనిషి పరిగెత్తుకొని ప్రధాన ద్వారం దగ్గరకు వెళ్లడం ప్రేక్షకులు నోరు వెళ్లబెట్టుకుని చూశారు. అంటే కథలో వెంటనే లీనమైపోయారు. ఈ సన్నివేశం తీస్తున్నప్పుడు ముందు కురుస్తున్న వానే తప్ప వెనుక కొండల మీదుగా కురుస్తున్న వాన కెమెరాలో రిజిస్టర్ కావడం లేదని కురసావా గమనించాడు. వాన ముందు కురిసి వెనుక కురియకపోతే సహజత్వం ఉండదు. ఈ సమస్య అధిగమించడానికి వెనుక కురిసే వానలో కొంచెం నల్ల ఇంకును కలిపారు. రెయిన్ మిషన్లతో కృత్రిమంగా సృష్టించిన ఈ వాన అందువల్ల అత్యంత సహజంగా ఉంటుంది. దీని తర్వాత ‘సింగింగ్ ఇన్ ది రెయిన్’లో నటుడు జీన్ కెల్లి తన స్వీయ దర్శకత్వంలో, స్వీయ కొరియోగ్రఫీలో పాడిన ‘సింగింగ్ ఇన్ ద రెయిన్’ పాట చరిత్ర సృష్టించింది. ప్రియురాలికి ముద్దు పెట్టి గుడ్‌నైట్ చెప్పాక ఆ పారవశ్యంతో బయటికొస్తే వాన కురుస్తుంటుంది. టాక్సీని వద్దని అతడు వానలో తడవడానికి ఇష్టపడతాడు. ఆనంద తాండవం చేస్తాడు. బజారులో తెరిచిన, మూసిన దుకాణాల మీదుగా అతడు ఆడి పాడుతూ ఉంటే ఇవాళ్టికి కాపీ చేయని దర్శకుడు లేదు. 1955లో ఇదే మేజిక్‌ని దర్శకుడు రాజ్ కపూర్ ‘శ్రీ 420’లో సాధించాడు. ఆ సినిమాలో భారతీయ తెర మీద ఇప్పటికీ పునరావృత్తం కానంత అందంగా ‘ప్యార్ హువా ఇక్రార్ హువా హై’ పాటను చిత్రీకరణ చేశారు. హీరో రాజ్ కపూర్, హీరోయిన్ నర్గీస్ అంతవరకూ స్నేహంలో ఉండి ఆ క్షణంలో ఒకరి పై మరొకరికి ప్రేమ ఉన్నట్టు గ్రహిస్తారు. వాన మొదలవుతుంది. అద్భుతమైన పాట కూడా. రాజ్ కపూర్ దీనిని స్టూడియోలోనే తీసినా రోడ్డు, వంతెన, దూరంగా వెళ్లే రైలు, చాయ్ బడ్డీ, వానలో తడిసే పిల్లలు, వణికే ప్రియురాలు, మురిసిపోయి చూసే ప్రియుడు ఇందరిని తెచ్చి పాటను చిరపుంజీ చేశాడు. తెలుగులో 1961లో వచ్చిన ‘ఆత్మ బలం’లో ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే’ పాటను మనోహరంగా చిత్రీకరించిన దర్శకుడు విక్టరీ మధుసూదనరావుకు పేరు రావాల్సిందేగానీ నిజానికి ఆ పేరుకు వారసుడు ఆయన కాదు. ఎందుకంటే అక్కడ వాన పాట ఉండాలని అనుకోలేదు. ఆత్రేయ బెంగళూరులో పాట రాయడానికి వెళ్లి పల్లవి తోచక తిరుగుతూ అప్పుడే మొదలైన వానను చూసి రాశాడు. అక్కినేని కంటే బి.సరోజా ఎక్కువ మార్కులు కొట్టేసిన పాట ఇది. వాన సన్నివేశాలు, పాటలు తీయడం కష్టం. కారణం అందుకు చాలా ఖర్చవుతుంది. నటీనటులు పదేపదే తడవాలి. కొందరు ఒప్పుకోరు. నీటి సమస్య. ఇవన్నీ ఉంటాయి. అయినప్పటికీ కొందరు దర్శకులు పట్టుబట్టి వానను సినిమాల్లోకి తెచ్చారు. ‘బలిపీఠం’ సినిమాలో క్లయిమాక్స్ అంతా భీకరమైన గాలివానలో జరిగినట్టు చూపి ఉత్కంఠ కలిగిస్తాడు దర్శకుడు దాసరి నారాయణ రావు. రీమేకే అయినప్పటికీ బాపు ‘తూర్పు వెళ్లే రైలు’ సినిమాలో వానను అత్యంత గొప్పగా తీశాడనిపిస్తుంది. ప్రేక్షకులు కూడా గాలివానలో ఉన్నట్టు చూపారు ఈ సినిమాలో. అసలు నిజ జీవితంలో పగలూ ఉంటుంది... రాత్రి ఉంటుంది... ఎండ ఉంటుంది... వాన ఉంటుంది. కొందరు దర్శకులు మొత్తం కథంతా పగలే జరుగుతున్నట్టు తీస్తారు. కొందరు దర్శకులు పగలు సన్నివేశాలు, రాత్రి సన్నివేశాలతో కనెక్ట్ చేస్తారు. కొందరు దర్శకులు ఎండను, వానను చూపి కనెక్ట్ చేస్తారు. ‘శంకరాభరణం’లో అవమానం పొందిన శంకరశాస్త్రి దానిని ‘శంకరా నాదశరీరాపరా’ అని శివుడితో చెప్పుకుంటాడు. అంతటితో ఎఫెక్ట్ రాదు. ఆ ఆలయం మీద హోరున కురిసే వానలో ప్రాథేయ నృత్యం చేస్తాడు శంకర శాస్త్రి. గొప్ప ఎమోషన్ కలుగుతుంది. దర్శకుడు మణిరత్నం ‘గీతాంజలి’ సినిమాలో గిరిజ నాగార్జునను నిలదీసే సన్నివేశానికి వానను వాడుకున్నాడు. అద్భుతంగా ఉంటుంది ప్లాట్‌ఫాం పై కురిసే ఆ వాన. అలాగే ‘అమృత’ సినిమాలో అమృతకు తల్లి కనిపించే క్లయిమాక్స్‌లో గొప్ప వానను చూపిస్తాడు. ఎల్‌టిటిఇ పోరాటంలో ఉన్న ఆ తల్లి వానలాంటిదే. శాశ్వతం కాదు. అందుకే పెంపుడు తల్లి సిమ్రాన్‌కు గాఢంగా ముద్దు పెడుతుంది అమృత. ‘మనసంతా నువ్వే’లో వానను ఒక సన్నివేశంలో అద్భుతంగా ఉపయోగించుకున్నాడు దర్శకుడు వి.ఎన్.ఆదిత్య. ప్రేమ సఫలమయ్యే వేళకు అది విఫలం అయ్యే ఘడియ రావడంతో ఉక్కిరిబిక్కిరి అవుతాడు ఉదయ్ కిరణ్. బయటకు చెప్పుకోలేడు. స్నేహితుడు సునీల్ ఆ క్షణంలో కుండపోత కురియడం చూసి ‘ఏడవరా... ఈ వానలో నీ ఏడుపును దాచుకో’ అంటాడు. అజిత్ నటించిన ‘ప్రేమలేఖ’ సినిమాలో క్లయిమాక్స్ అంతా వానలో తీయడం దర్శకుడు అగస్త్యన్‌కు పేరు తెచ్చింది. అజిత్‌ను వెతుక్కుంటూ వచ్చిన దేవయాని ఆ రాత్రి సిటీలో ఆటోలో వానలోనే అటూ ఇటూ తిరుగుతుంది. ఆ వాన కృత్రిమంగా అనిపించదు. సినిమాలో అందరూ తడిసినట్టే ప్రేక్షకులూ తడుస్తారు. వానకు తడిసిన షర్ట్ తీయడం వల్లే అజిత్ వేసుకున్న స్వెటర్ బయటపడి దాని ద్వారా దేవయాని అతణ్ణి గుర్తిస్తుంది. ఆ సీన్ పెద్ద హిట్ అయ్యింది. ఇటీవల విడుదలైన ‘విరాట పర్వం’లో దర్శకుడు వేణు ఉడుగుల వానను చాలా సమర్థంగా ఉపయోగించాడు. నక్సలైట్ రవన్నను వెతుక్కుంటూ వెన్నెల పాత్రధారి సాయి పల్లవి భోరున కురిసే వానలో పౌరహక్కుల నాయకురాలు నందితా దాస్ ఇంటికి వెళ్లడం ప్రేక్షకులను కూడా తడిసి ముద్దయిన భావనను కలిగిస్తుంది. అలాగే ‘పలాస’ సినిమాలో దర్శకుడు కరుణ కుమార్ వానను ఎమోషన్ కోసం కీలక సన్నివేశాలలో ఉపయోగించాడు. వానలో జల్లు, తుప్పర, చినుకులు, జడివాన, హోరు వాన, కుండపోత వాన, ముసురు... అంటూ ఇన్ని రకాలు ఉన్నాయి. వేటిని వాడితే ఏ సన్నివేశం పండుతుందో తెలిసినవాడే ధన్యుడు సుమతి. -
వానలకు పర్ఫెక్ట్ అవే
‘టిప్ టిప్ బర్సా పానీ’ పాట అంటే నభా నటేశ్‌కి చాలా ఇష్టం. అక్షయ్‌కుమార్, రవీనా టాండన్ తడుస్తూ పాడుకున్న వాన పాట ఇది. ఈ పాట అంటే నభాకి చాలా ఇష్టం కానీ వానలో తడవడం అంటే ఆమెకు కష్టం. మరి.. ఏడాదంతా దాదాపు వానలు చూస్తూ పెరిగితే అలానే ఉంటుంది. ఇక ‘వానాకాలమ్’ గురించి నభా నటేశ్ చెప్పిన విశేషాలు తెలుసుకుందాం. ► వర్షాలప్పుడు కాగితపు పడవలు చేసేవారా? కాగితపు పడవల ఎంజాయ్మెంట్ మిస్సయ్యేదాన్ని కాదు. ఇంటి దగ్గరే చిన్న స్ట్రీట్‌లో పడవలు వదిలేదాన్ని. అది కూడా నేను తడవకుండా. ► చివరిసారిగా ఫుల్లుగా ఎప్పుడు తడిశారు? ఓ సినిమా షూట్లో భాగంగా బాగా తడిశాను. కానీ సినిమా షూటింగ్ కోసం ఏర్పాటు చేసిన కృత్రిమ వర్షం అది. అయితే వర్షాల్లో తడవడం నాకు ఇష్టం ఉండదు. ► వర్షాకాలాన్ని ఎలా ఆస్వాదిస్తారు? రెయినీ సీజన్లో ఫుడ్‌ను బాగా ఎంజాయ్ చేస్తాను. పుట్టింది తినడం కోసమే అన్నట్లుగా తింటాను. మా అమ్మ చేసే ఫ్రైడ్ అండ్ స్పైసీ మిర్చి బజ్జీలు, కాఫీ నా ఫేవరెట్. వర్షం పడుతున్నప్పుడు ఇవి పర్ఫెక్ట్. ► వానా కాలంలో మీరు తీసుకునే జాగ్రత్తలు? చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటాను. కొంచెం తడిసినా నాకు వెంటనే జలుబు చేస్తుంది. అందుకే పెద్దగా తడవాలనుకోను. ఎప్పుడు బయటకు వెళ్లినా నా వెంట గొడుగును తీసుకుని వెళతాను. టిష్యూ పేపర్స్‌ను కూడా క్యారీ చేస్తుంటాను. ► ఈ సీజన్లో మీ డ్రెస్సింగ్ స్టయిల్ ఎలా ఉంటుంది? వర్షాకాలంలో బయటకు వెళితే ఎవరూ గుర్తుపట్టలేనంతగా నన్ను నేను కవర్ చేసుకుంటాను. స్వెటర్, షూస్, రెయిన్ కోట్, క్యాప్... ఇలా నా ముఖం తప్పు ఇంకేమీ కనిపించకుండా కవర్ చేసుకుంటాను. ► మామూలుగా పిల్లలను వర్షంలో తడనివ్వరు. మరి.. చిన్నప్పుడు మీ ఇంట్లో? వర్షాలు అప్పుడప్పుడూ అంటే ఓ మజా ఉంటుంది. కానీ మా ప్రాంతంలో ఎప్పుడూ అవే కదా. పైగా బాగా చలిగా ఉండేది. దాంతో నాకే బయటకు వెళ్లాలనిపించేది కాదు. మా అమ్మకు కోప్పడే పని తప్పింది (నవ్వుతూ). ► మరి.. వానపాటల్లో నటించడం మీకిష్టమేనా? పెద్దగా ఇష్టం లేదు కానీ వాన కురుస్తున్నప్పుడు ఇంట్లోనే ఉండి, రెయినీ సాంగ్స్‌కు డ్యాన్స్ చేయడం ఇష్టం. ► నచ్చిన వాన పాట? ‘టిప్ టిప్ బర్సా పానీ’ (అక్షయ్‌కుమార్, రవీనా టాండన్ నటించిన ‘మొహ్రా’ చిత్రంలోని పాట) అంటే చాలా ఇష్టం. ► చిన్నప్పటి వర్షాకాలపు జ్ఞాపకాలు... వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే చిక్మగలూర్ నా స్వస్థలం. నా చిన్నతనంలో మాప్రాంతం ఎప్పుడూ చిత్తడి చిత్తడిగా ఉండేది. అంతా బురదమయం. వర్షాకాలంలో నేను నాలుగైదు రకాల స్లిప్పర్స్‌ను మార్చేదాన్ని. అందుకే ఈ సీజన్ అంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదు. ఏదైనా పని కోసం బయటకు వెళ్లినప్పుడు వర్షంలో చిక్కుకుపోవాల్సి వస్తుంది. భారీ వర్షాలు కురిసినప్పుడు స్కూల్స్‌కు వారాల పాటు సెలవులు ఇచ్చేవారు. వర్షాకాలపు జ్ఞాపకాలంటే ఇబ్బందులు తప్ప తీపి అనుభూతులు ఏవీ లేవు. -
అలాంటివి ఇష్టం ఉండదు.. సింపుల్‌గా 'నో' అనేస్తా : హీరోయిన్
సవ్యసాచి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన భామ నిధి అగర్వాల్. తొలి సినిమాతోనే హీరోయిన్గా మంచి గుర్తింపు పొందిన నిధి ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బాగా పాపులర్ అయ్యింది . గ్లామర్ డోస్‌కు సైతం ఏమాత్రం వెనక్కి తగ్గని నిధి యూత్‌లో మాంచి క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నిధి సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాలను సైతం పంచుకుంది. వర్షం పాటల్లో నటించడం అంత సులువు కాదని, షూటింగ్ సమయంలో చాలా ఇబ్బందులు ఉంటాయని పేర్కొంది. పైనుంచి వర్షం పడుతున్నా, కళ్లు తెరిచి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం తన వల్ల కాదని, అలాంటి పాటలకు దూరంగా ఉంటానని చెప్పుకొచ్చింది. అందుకే ఇప్పట్లో రెయిన్ సాంగ్స్ చేయడం గురించి ఆలోచించడం లేదని పేర్కొంది. ప్రస్తుతం ఈ భామ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న 'హరిహర వీరమల్లు' సినిమాలో నటిస్తోంది. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. -
అందుకే వాన పాటల గురించి ఆలోచించడం లేదు: నిధీ అగర్వాల్
చిరుజల్లులను చూడటం నిధీకి ఎంతో ఇష్టం. వానలో తడవడం చాలా చాలా ఇష్టం. వాన పాటలంటే ఇష్టం. మరి.. వాన పాట చేయడం నిధీకి ఇష్టమేనా? ఆ విషయంతో పాటు ‘వర్షం సాక్షి’గా నిధీ అగర్వాల్ చెప్పిన ‘వానాకాలమ్’ కబుర్లు తెలుసుకుందాం. ► చిన్నప్పటి వానాకాలపు జ్ఞాపకాలు... నిధీ అగర్వాల్: చిన్నప్పుడు వర్షం అంటే.. వేడి వేడి టీ తాగుతూ, పకోడీలు తినేదాన్ని. ► మామూలుగా పిల్లలను వర్షంలో తడవనివ్వరు. మరి.. మీ అమ్మగారు తిట్టేవారా? వర్షంలో తడవడం ఏ పిల్లలకు ఇష్టం ఉండదు చెప్పండి. మా అమ్మగారు తడవడానికి అనుమతించేవారు కాదు కానీ, మనం ఆగం కదా (నవ్వుతూ). నేను మాత్రం వర్షంలో బాగా ఆడుకునేదాన్ని. ఇక రెయినీ సీజన్లో స్కూల్‌కి వెళ్లడం అంటే పండగే. ఫుల్లుగా తడిచేదాన్ని. ► కాగితపు పడవలు చేసేవారా? ఈ మధ్య చేయలేదు. 10, 11 ఏళ్లప్పుడు చేశాను. బోట్ చేయడం.. నీళ్లల్లో వదలడం.. భలే సరదాగా అనిపించేది. ► చివరిసారిగా ఫుల్లుగా తడిసిందెప్పుడు? ఈ మధ్యే. ఒక షూటింగ్లో ఉన్నప్పుడు ఒకేసారి భారీగా వర్షం వచ్చింది. షూటింగ్ లొకేషన్ దగ్గర్లోనే ఉన్న నా వ్యాన్‌లోకి వెళ్లేలోపే తడిసిపోయాను. ► ఈ సీజన్లో ఎలాంటి రంగు దుస్తులు వేసుకుంటారు? వర్షాకాలంలో తెలుపు రంగు దుస్తులకు నో. అది కాకుండా ఏదైనా ఓకే. ► నచ్చిన వాన పాట? వాన బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే రొమాంటిక్ సాంగ్ ఏదైనా ఇష్టమే. బాగా నచ్చే పాట అంటే... ఐశ్వర్యా రాయ్ ‘బరసో రే మేఘా.. మేఘా...’ (‘గురు’ సినిమా). నాకు ఐశ్వర్యా రాయ్ అంటే చాలా చాలా ఇష్టం. ఈ పాటే కాదు.. నటిగా ఆమె ఏం చేసినా ఇష్టమే. ► వాన పాటల్లో నటించడం ఇష్టమేనా? వాన పాటలు చేయడం అంత ఈజీ కాదు. నటిస్తున్నప్పుడు తడవడం, షాట్ గ్యాప్‌లో ఆరడం, మళ్లీ తడవడం.. బాబోయ్... ముఖ్యంగా వాన పడుతుంటే కళ్లు తెరిచి ఉంచి, నటించడం అంటే కష్టమే. అందుకే వాన పాటల గురించి ఆలోచించడంలేదు. ► వానలో ఇరుక్కున్న ఘటన ఏదైనా? ముంబయ్‌లో ఉన్నప్పుడు జరిగింది. జోరు వాన కారణంగా ఫ్లయిట్ టైమింగ్స్ మారడంతో నేను ఒకే ఫ్లయిట్లో కాకుండా కనెక్టింగ్ ఫ్లయిట్స్‌లో జర్నీ చేయాల్సి వచ్చింది. అలా ఫ్లయిట్లు మారడం ఇబ్బందిగా అనిపించింది. ఈ మధ్య వర్షం కారణంగా ఓ సినిమా షూటింగ్ క్యాన్సిల్ అయింది. అలా జరగడంవల్ల ఇంకో రోజు జర్నీ చేసి, మళ్లీ ఆ షూట్లో పాల్గొనాల్సి వచ్చింది. ► వానాకాలంలో తీసుకునే జాగ్రత్తలు? జలుబు చేయకూడదని ఈ సీజన్లో ఎక్కువగా వేడి నీళ్లు తాగుతుంటాను. ►వర్షాలప్పుడు షూటింగ్లో పాల్గొనడం ఇష్టమేనా? సంవత్సరం మొత్తంలో వాన రోజు తప్ప ఏరోజైనా షూటింగ్లో పాల్గొనడం ఇష్టమే. రెయినీ డే మాత్రం ఇంట్లోనే ఉండిపోవాలనిపిస్తుంది. చక్కగా రూమ్‌లో కూర్చుని, కిటికీలోంచి వాన జుల్లులు చూస్తుంటే చాలా హాయిగా అనిపిస్తుంది. అప్పుడు వేడి వేడిగా ఏదైనా తింటూ, టీ తాగితే మాటల్లో ఎక్స్‌ప్రెస్ చేయలేనంత అనుభూతి కలుగుతుంది. -
విరహం అయినా..విషాదం అయినా 'వాన' ఉండాల్సిందే..
‘‘మెరిసే మెరుపులు ఉరిమే ఉరుములు సిరిసిరి మువ్వలు కాబోలు’’... శంకరశాస్త్రికి కూడా వాన సాయం కావాల్సి వచ్చింది. ‘‘ఆ రెండి నట్టనడుమ నీకెందుకింత తపన’’... నాట్య కళాకారుడు బాలు బావి గట్టుమీద వాననే సవాలు చేశాడు. జగపతి వారి చిటపట చినుకులు నుంచి ‘‘ఈ వర్షానికి స్పర్శుంటే..’’ పాట వరకు ఎన్నో సందర్భాల్లో వాన హార్మోనియం మెట్లను తడిపింది.. కలెక్షన్ల బాక్సుల్ని నింపింది. ఒక వాన విహారం... ‘శంకరాభరణం’లో శంకర శాస్త్రిని జనం సందేహించారు. అతడి శీలాన్ని శంకించారు. శంకర శాస్త్రి ఏమిటి... పరాయి స్త్రీని తన పక్కన కచ్చేరీకి కూచోబెట్టుకోవడం ఏమిటి? కాని నిప్పులాంటి శంకర శాస్త్రికి తానేమిటో తెలుసు. ఆ సంగతి శంకరుడికీ తెలుసు. అందుకే ఆ శంకరుడితో తన ఆగ్రహాన్ని చెప్పుకున్నాడు. గానం చేశాడు. ఇంతటి ఆగ్రహ జ్వాల లోకాన్ని ఏం చేయాలని? అతణ్ణి చల్లబరచాలే. అందుకే గంగ దూకింది. మెరుపులు మెరిశాయి. ఉరుములు ఫెటిల్మన్నాయి. ‘శంకరా నాదశరీరాపరా’... గానవాహిని కొనసాగింది. వాన లేకపోతే ఆ పాటకు బలం లేదు. వాన ఆ పాటకూ పాత్రకూ శక్తినిచ్చింది. వాన.. శక్తి. వానను దుబారా చేయకూడదు. సరిౖయెన సమయంలో నేలకు దించాలి. ఝల్లుమనిపించాలి. గుండె తడిపించాలి. ‘సాగర సంగమం’లో విఫల ప్రేమికుడు, పరాజిత కళాకారుడు అయిన బాలుకు మందు తప్ప మరో తోడు లేదు. అతడు తాగి తాగి చనిపోబోతున్నాడు. చనిపోయేవాడికి భయం ఏమిటి? రెండు గుక్కలు తాగి బావి గట్టున ఎక్కితే? మనసు ‘తకిట తధిమి తకిట తధిమి తందానా’ అంటే? కాని అతణ్ణి ఆపాలి. ఆపాలంటే ఆమె రావాలి. రావాలంటే వాన రావాలి. వానలో అతడికి ప్రమాదమేమో అని ఆమె వొణికిపోవాలి. అప్పుడు వితంతువు అయిన ఆమె బొట్టు పెట్టుకుంటుంది. అతడు దానికి అరచేయి అడ్డుపెడతాడు. వాన వారి గత జ్ఞాపకాలను తడుపుతూ కురుస్తుంది. మనోజ్వరం ఆ సన్నివేశానిది.వానలో అందరం తడుస్తాము. కాని వయసులో ఉన్నప్పుడు, జోడు తోడుగా ఉన్నప్పుడు తడవడం అందరికీ కుదరదు. కనుక సినిమాలో అలాంటి జోడి తడిస్తే సంతోషపడతాము. ముచ్చటపడతాము. ఆ అచ్చట్లు ముచ్చట్లు తీసి నాలుగు డబ్బులు రాబట్టుకునే సినిమావారు ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే’ అని వానను తెర మీదకు తెచ్చారు. ‘ముత్యాల జల్లు కురిసే’ అని హీరోయిన్ను మైమరిపించారు. సందర్భాలను సృష్టించి సంగీత దర్శకులకు సవాలు విసిరారు. వారు అందుకు సరేగమా అన్నారు. ‘ప్రేమ్‌నగర్’లో శ్రీమంతుల కుర్రాడు తన దగ్గర సెక్రటరీగా పని చేసే అమ్మాయిని వానలో తడిచి చూసే మోహిస్తాడు. బయట వాన కురుస్తుంటే లోపల పాట. హార్మోనియం పలికింది. ‘తేట తేట తెలుగులా’ అని ఉత్ప్రేక్షల కుంభవృష్టి కురిసింది.లవ్ ఫెయిల్యూర్ కుర్రాళ్లకు ఎలాగూ కన్నీళ్లు వస్తాయి. ఆ బాధా సమయంలో వాన కూడా వస్తే ఇక వరదే. ఆ రేంజ్ కావాలంటే కేరళ నుంచి ఏసుదాస్ రావాల్సిందే. ‘స్వయంవరం’లో ‘గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం’... ఆ పాట హోరు సులువుగా వదిలిపోదు. వాన ఎందుకనో ఆడపిల్లల నేస్తం. వాన వస్తే అమ్మాయిలు పాడతారు. ‘మౌనరాగం’లో ‘అహో మేఘమొచ్చెనే’ అని రేవతి పాడుతుంది. ‘గీతాంజలి’లో ‘వొళ్లంత జల్లంత కావాలిలే’ అని గిరిజ పాడుతుంది. ‘వర్షం’లో ‘ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వానా’ అని త్రిష పాడుతుంది. ‘వచ్చె వచ్చె నల్ల మబ్బుల్లారా’ అని ‘ఆనంద్’లో కమలిని ముఖర్జీ పాడుతుంది. కె.వి.మహదేవన్ నుంచి కె.ఎం. రాధాకృష్ణన్ వరకు వానమీటలు మీటిన వారే. హీరో ఎంతటివాడైనా హీరోయిన్ ఎవ్వరైనా వాన ఉంటే ఆ ఫీల్ వేరు. ఆడియెన్స్‌కు ఆ థ్రిల్ వేరు. ఎన్.టి.ఆర్–శ్రీదేవి ‘ఆకు చాటు పిందె తడిసె’ అనాల్సిందే. అక్కినేని–శ్రీదేవి ‘చిటపట చినుకుల మేళం’ అని పాడాల్సిందే. చిరంజీవి– రాధ ‘వానా వానా వందనం’ అంటే ‘అడవి దొంగ’ పెద్ద హిట్ అయ్యింది. వాణి విశ్వనాథ్‌తో ఆయనే పాడిన ‘అబ్బా.. ఇది ఏమి వాన’ పాట ‘ఘరానా అల్లుడు’కు కిక్ ఇచ్చింది. ‘స్వాతి ముత్యపు జల్లుల’లో (నాగార్జున), ‘స్వాతిలో ముత్యమంత’ (బాలకృష్ణ), ‘చిత్తడి చిత్తడి వాన’ (సుమన్).. ఆ వానలాహిరి అలా సాగిపోతూనే వచ్చింది.ఆకాశం ఆనాటిదే. ప్రేమా ఈనాటిదే. వాన ఏనాటిదే. అందుకే కొత్తతరం వచ్చినా వానచప్పుడు ప్రేమచప్పుడు సినిమాల్లో వినిపిస్తూనే ఉంది. వరుణ్ తేజ్ ‘తొలి ప్రేమ’లో ‘ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా’ పాట అందరినీ అందుకే తడిపింది. వానలో ఒక లయ, సవ్వడి ఉంటుంది. ఆ సంగీతం ఎప్పుడైనా బాగుంటుంది. ముఖ్యంగా సినిమా కోసం అది ట్యూన్లో కురిసినప్పుడు. ఆకాశగంగా... దూకావె పెంకితనంగాఆకాశగంగా జలజలజడిగా తొలిఅలజడిగా... -
16 గంటలు వర్షంలో కంగనా.. జ్వరంతోనే వాన పాట!
‘ఇలా... ఇలా..’ అంటూ పాడుతూ, కంగనా రనౌత్ అలవోకగా డ్యాన్స్ చేశారు. కానీ, ఆ పాట చిత్రీకరణ వెనక పెద్ద కష్టం ఉంది. దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘తలైవి’లోని పాట ఇది. జయలలిత పాత్రను కంగనా చేశారు. ఈ చిత్రంలోని ‘ఇలా.. ఇలా..’ పాటను ఇటీవల విడుదల చేశారు. జయలలిత డ్యాన్స్‌ని తలపించేలా ఈ పాటలో కంగనా కనబడుతున్నారు. మొత్తం మూడు రోజులు ఈ పాట చిత్రీకరణకు పట్టింది. గత ఏడాది అక్టోబర్‌లో చిత్రీకరించారు. ఇది వాన పాట. మూడు రోజుల్లో దాదాపు 16 గంటలు ఈ పాట కోసం కంగనా తడవాల్సి వచ్చింది. సరిగ్గా పాట చిత్రీకరిస్తున్న సమయంలో ఆమెకు జ్వరం అట. అయినప్పటికీ లెక్క చేయకుండా, షూట్లో పాల్గొన్నారు. విశ్రాంతి తీసుకుని, కోలుకున్నాక చిత్రీకరించవచ్చని చిత్రబృందం అన్నప్పటికీ కంగనా మాత్రం తన కారణంగా షూటింగ్ ఆగకూడదనుకున్నారట. ఆమె కమిట్మెంట్ని చిత్రబృందం అభినందిస్తోంది. ఈ పాట కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో వాటర్ ఫాల్ సెట్ వేశారు. డ్యాన్స్ మాస్టర్ బృందా గోపాల్ నేతృత్వంలో ఈ పాటను చిత్రీకరించారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఈ నెల 23న ‘తలైవి’ విడుదల కానుంది. -
తెల్ల చీరలో తడవడమా?
సాధారణంగా వానపాటల్లో నాయికలు తెల్లచీర ధరించి అందాలారబోయడం పరిపాటి. సీనియర్ నటీమణుల నుంచి ఈ తరం నాయికల వరకు చాలామంది అలా తడి తడి అందాలు ఆరబోసినవారే. ఆ మధ్య తమన్న తెలుగు చిత్రం రచ్చలోను, తమిళ చిత్రం పైయ్యాలోను ఈ తరహా అందాలారబోశారు. అలాంటిది పెద్దగా అవకాశాలు లేకపోయినా తాప్సీ బికినీ లాంటివి ధరించేది లేదని ఖరాఖండిగా చెప్పేస్తుందట. అంతేకాదు తెల్లచీర ధరించి వాన పాటల్లో నటించడానికి ససేమిరా అంటోందట. దీని గురించి ఈ అమ్మడు తెలుపుతూ కొన్ని చిత్రాల్లో తనను ఈత దుస్తుల్లో ధరించి నటించమన్నారని అందుకు సరిపడే శరీరాకారం తనకు లేదని అనుకుంటున్నానన్నారు. ఏదేమైనా తాను నటించే చిత్రాల్లో దుస్తులు విషయంలో చాలా శ్రద్ధ చూపుతానని చెప్పింది. సమీపకాలంలో ఒక హిందీ చిత్రం కోసం తెల్లచీర ధరించి వానపాటలో నటించమని అన్నారని అందుకు తాను అంగీకరించలేదని అన్నారు. చివరికి వేరే కలర్ చీరతో వర్షంలేకుండా ఆ చిత్రంలో నటించానని తాప్సీ తెలిపింది. -
వాన అనుభవం బాగుందన్న హుమైమా
బాలీవుడ్లో తొలిసారిగా వానపాటలో నర్తించిన పాకిస్థానీ మోడల్, నటి హుమైమా మాలిక్.. ఆ అనుభవం చాలా బాగుందని చెబుతోంది. ఇమ్రాన్ హష్మీతో కలిసి 'రాజా నట్వర్లాల్' అనే సినిమాలో 'తేరే హోకే రహేంగే' అనే వానపాటకు ఆమె నర్తించింది. తాను వానపాటలో నటించడం ఇదే తొలిసారని, ఈ అనుభవం చాలా బాగుందని ఆమె చెప్పింది. బాలీవుడ్లో వానపాటల్లో ఎలా చేస్తారో తెలుసుకోడానికి ఆమె పలు వానపాటల వీడియోలు ముందుగా చూసి మరీ చేసిందట. తొలిసారి తాను వానపాటలో నటించానని, ముందు రోజు రాత్రంతా బాలీవుడ్ వానపాటలను చూస్తూనే ఉన్నానని పాట ఆవిష్కరణ సందర్భంగా హుమైమా చెప్పింది. వానపాటల్లో నర్తించడం చాలా ఆసక్తికరమైన అనుభవమని, దాన్ని తాను చాలా ఆస్వాదించానని తెలిపింది. రెండు రోజుల పాటు చాలా కష్టపడి ఆ పాట షూటింగ్ చేశామని వివరించింది. ఈ పాటను అరిజిత్ సింగ్ పాడాడు. కునాల్ దేశ్‌ముఖ్ దర్శకత్వం వహించిన 'రాజా నట్వర్లాల్' సినిమాలో పరేష్ రావల్, కే కే మీనన్ కూడా ఉన్నారు. ఇది ఆగస్టు 29న విడుదల కానుంది.