వెండితెరపై విశ్వరూపుడు
‘బాలు.. నృత్యమే జీవికగా.. ఆత్మగా భావించి అనుభవించి తరిస్తున్న ఓ కళాజీవి. భారతీయ నృత్యరీతుల్ని కలగలిపి సరికొత్త ఒరవడిని సృష్టించేందుకు కష్టిస్తున్న తపస్వి. అప్పుడే ఓ వెండితెర అవకాశం పలకరించింది. తన ప్రతిభను చాటేందుకు ఇదో గొప్ప అవకాశమని పులకరించిపోయాడు. అద్భుత సాహిత్యంతో సాగే ఆ పాటకు పాదం కదిపాడు.‘కట్’.. మరుక్షణమే నృత్యదర్శకుని నోట బాణంలా దూసుకొచ్చిందీ మాట. మిడిమిడి జ్ఞానంతో మిడిసిపడ్డ అతని ముందు బాలు తర్కం పనిచేయలేదు. అనుకున్న రీతిగా సాగడమా.. అవకాశాన్ని వదలుకోవడమా..!
ఇక్కడే సంఘర్షణ మొదలైంది. ఆత్మఘోషను అణచుకుని అడ్డదిడ్డంగా అడుగులేశాడు. అదిరింది అన్నారందరూ.. ఆత్మనైతే అణచుకున్నాడు గానీ గుండెను ఎగదన్నే లావాను ఎలా దాచుకోగలడు.. నృత్యాన్నే సంకరం చేస్తున్న వారి మాటను అయిష్టంగానైనా వినాల్సివచ్చిందనే అపరాధ భావం అతణ్ని దహించి వేసింది. చెప్పుకునే వీల్లేదు.. చెప్పుకునేందుకు దిక్కూ లేదు.. ఏం చేయాలి? అధినాయకుడే గుర్తొచ్చాడు.
ఆ విశ్వరూప గణపతి మూర్తికి గాయపడిన మనసును నివేదించాడు. వీరావేశంతో నర్తించాడు. గుండెలు కరిగేలా.. దిక్కులు అదిరేలా..’ ఈ సన్నివేశం ఎక్కడిదో ఈ పాటికే మీ మనసులో మెదలుతోంది కదూ. 1983లో వచ్చిన సాగర సంగమం సినిమాలోనిదే ఈ దృశ్యం. అయితే మీకు తెలియాల్సిందల్లా.. బాలూగా కమల్‌హాసన్ నర్తించింది మన ఖైరతాబాద్ వినాయకుని ముందే అని. ఇంతటి అద్భుత సన్నివేశం ఇలా మలచాలని దర్శకుడు కె.విశ్వనాథ్‌కి ఎలా స్ఫురించింది అని అడిగితే కళాతపస్వి ఏమన్నారో మీరే చదవండి.
‘నేను హోటల్ నుంచి షూటింగ్‌కు వెళ్తున్నప్పుడల్లా... ఈ విగ్రహాన్ని చూస్తుండేవాణ్ని. మద్రాసు నుంచి వచ్చిన మాకు ఈ భారీ విగ్రహం.. తయారీ అంతా కొత్తగా అనిపించేది. ఎలాగైనా సరే దీన్ని సినిమాలో చూపించాలని అప్పుడే మనసులో బీజం పడింది. అప్పుడు సాగరసంగమం షూట్ చేస్తున్నాం. కథానాయకుడు తన ఆత్మసాక్షికి విరుద్ధంగా సినిమా నృత్యదర్శకుడు కోరినట్టుగా నృత్యం చేయాల్సి రావడం.. ఎందుకిలా మంచి సాహిత్యాన్ని పాడు చేస్తున్నారని బాధపడే సన్నివేశాన్ని చిత్రీకరించాలి. అప్పుడు నాకు ఈ ఖైరతాబాద్ వినాయకుడి ఎదుట పశ్చాత్తాప దృశ్యాన్ని షూట్ చేస్తే బావుంటుందనిపించింది.
అనుమతులు ఇతర విషయాల్ని యూనిట్‌వాళ్లకి అప్పగించా. నాకు ఇప్పటికీ బాగా గుర్తు. షూటింగ్ ముందు రోజు సాయంత్రం కమల్‌హాసన్‌ను హోటల్‌కు పిలిచి నా ఆలోచన వివరించాను. ఖైరతాబాద్ వినాయకుని ఎదుట దీన్ని తీశాము. అలా నా మనసులో మెరిసిన ఖైరతాబాద్ వినాయకుణ్ని తెరపై చూపగలిగాను. తెలుగు వారు గర్వించే చరిత్ర సొంతం చేసుకున్న ఈ వినాయకోత్సవ ప్రస్థానానికి 60 ఏళ్లు నిండాయంటే ఆశ్చర్యంగా.. ఆనందంగా ఉంది.’
-ఖైరతాబాద్