కె. విశ్వనాథ్ చిత్రాలన్నీ విలక్షణమైనవే అయినా వాటిలో ‘శంకరాభరణం’ గురించి ముందుగా చెప్పుకోవాలి. తెలుగు సినిమా కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన కళాత్మక దృశ్య కావ్యమిది. ఇన్నేళ్ల తర్వాత కూడా ఆ సినిమాను చూస్తే మనవైన సంగీత, సాహిత్య, నృత్య కళలపై గౌరవం ఉప్పొంగి గర్వం పెల్లుబుకుతుంది. 1980లో విడు దలైన ఈ సినిమా అప్పట్లో పెను సంచలనం. ఇందులోని సంగీతం, సాహిత్యం ఇప్పటికీ వీనుల విందు చేస్తాయి. విశ్వనాథ్ దర్శకత్వ ప్రతిభను గొప్పగా ఆవిష్కరించిన సినిమా ఇది. ఇంకా చెప్పాలంటే ఆయన సినీ కెరీర్‌నే మార్చేసిన మూవీ. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎందరో మేధావులతో పాటు సామాన్యులను సైతం మెప్పించింది.
రూ. పదమూడున్నర లక్షలతో...
పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ ఏడిద నాగేశ్వరరావు, ఆకాశం శ్రీరాములు ఈ సినిమాను నిర్మించారు. శంకర శాస్త్రి పాత్ర కోసం ముందుగా కృష్ణంరాజు, శివాజీ గణేశన్ వంటి వారిని అనుకున్నారు. చివరగా ఇమేజ్ ఉన్న నటుడు ఈ పాత్ర చేస్తే పండదని భావించి జేవీ సోమయాజులను తీసుకున్నారు విశ్వనాథ్. అప్పటికే ఆయన డిప్యూటీ
కలెక్టర్‌గా పని చేస్తున్నారు. అప్పట్లో ఈ సినిమాను పదమూడున్నర లక్షల రూపాయలతో తెరకెక్కించారు. 55 నుంచి 60 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశారు. ఈ సినిమాను ఎక్కువగా రాజమండ్రి, రఘుదేవపురం, పోలవరం, రామచంద్రాపురం, అన్నవరం, సోమవరం, చెన్నైలోని తిరువాన్మయూరు, కర్ణాటకలోని బేలూరు, హలిబేడులో చిత్రీకరించారు.
తెలుగు సినిమాకు కొత్త దారి...
అప్పటివరకూ ఉన్న ట్రెండ్‌కి భిన్నంగా తెరకెక్కిన ‘శంకరాభరణం’ తెలుగు సినిమాకు సరికొత్త దారి చూపించింది. తెలుగు సినీ చరిత్రలోనే ఓ మైలురాయిగా నిలిచిపోయింది. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు, కళలకు పట్టం కడుతూ తీసిన ఈ సినిమాలోని పాటలు కూడా చరిత్రలో నిలిచిపోయాయి. విశ్వనాథ్ సినిమాల కథాకథనాలు సున్నితంగానే ఉంటాయి. కానీ, బలమైన అంశాలను ఆయన తన సినిమాల్లో చర్చిస్తారు.
సాంఘిక దురాచారాలను, పశుప్రవృత్తిని ఎండగడతారు. మన సంస్కృతీ సంప్రదాయాలను గుర్తు చేస్తారు. మనలోని సున్నిత భావాలను మేల్కొలిపే ప్రయత్నం చేస్తారు. ఆకాంక్షలు, ఆశయాలు, విలువలను ముందు తరాలకు అందించే ప్రయత్నం చేస్తారు. ‘శంకరాభరణం’ సినిమాలో శంకర శాస్త్రి క్యారెక్టర్ ఇలాగే ఉంటుంది. అందుకే కాలాన్ని, మారుతున్న అభిరుచుల్ని తట్టుకుని ఇప్పటికీ గొప్ప సినిమాగా నిలిచిపోయింది.
ఫక్తు క్లాస్ సినిమా అయినప్పటికీ...
శాస్త్రీయ సంగీతానికి ఆదరణ కరువైన ఆ రోజుల్లో ఎంతో మంది సంగీతం నేర్చుకోవటం మొదలు పెట్టారంటే ‘శంకరాభరణం’ ప్రభావం ఎంతలా పని చేసిందో అర్థమవుతుంది. స్వర్ణ కమలం అవార్డ్ అందుకున్న తొలి తెలుగు సినిమా ఇదే. ఈ సినిమాకు ఉత్తమ నేప«థ్య గాయకుడుగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తొలి సారి జాతీయ అవార్డు అందుకున్నారు. అంతేకాదు వాణి జయరాంకు ఉత్తమ గాయకురాలిగా, కేవీ మహదేవన్స్ కు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డులు దక్కాయి. ఫక్తు క్లాస్ సినిమా అయిన ‘శంకరాభరణం’కు మాస్ ఆడియన్స్ కూడా ఫిదా అయిపోయారు. సినిమాలంటే ఇష్టం లేని వారు సైతం ఈ సినిమా కోసం థియేటర్‌కు వెళ్లిన సందర్భాలున్నాయి.
‘శంకరాభరణం’ విడుదలైన రోజునే...
విశ్వనాథ్ దర్శకత్వ ప్రతిభతో పాటు కేవీ మహదేవన్ సంగీతం ఈ సినిమాకు ప్రాణంగా నిలిస్తే.. జంధ్యాల మాటలు, జేవీ సోమయాజులు, మంజుభార్గవి, అల్లు రామలింగయ్యల నటన ‘శంకరాభరణం’ను ఓ కళాఖండంగా మార్చాయి. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, శివాజీ గణేశన్, యంజీఆర్, రాజ్‌కుమార్, హిందీలో శాంతారామ్, దిలీప్ కుమార్, రాజ్ కుమార్, జితేంద్ర, సంజీవ్ కుమార్ ఈ సినిమాను పని గట్టుకొని మరీ చూసి చిత్ర యూనిట్‌ను అభినందించారు.
కాకతాళీయమో విధి విచిత్రమో గాని... 44 ఏళ్ల క్రితం ‘శంకరాభరణం’ రిలీజైన రోజునే విశ్వనాథ్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. 1980 ఫిబ్రవరి 2న ‘శంకరాభరణం’ విడుదలైతే 2023 ఫిబ్రవరి 2న ఆయన కన్నుమూశారు. విశ్వనాథ్ భౌతికంగా దూరమయ్యారు కానీ తాను తెరకెక్కించిన చిత్రాల ద్వారా ప్రేక్షకుల మనసుల్లో సజీవంగా ఉన్నారు. – దాచేపల్లి సురేష్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment