కళాతపస్వి కె. విశ్వనాథ్..కళామతల్లి ముద్దుబిడ్డ అనే పేరుకు అసలైన రూపం. తెలుగు సినిమాకు గౌరవం, గుర్తింపు తెచ్చిన దర్శకుల్లో ఆయన పేరు ముందు వరుసలో ఉంటుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. సౌండ్ రికార్డిస్ట్‌గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి ఆపై అసిస్టెంట్ డైరెక్టర్గా, దర్శకుడిగా ఎన్నో అత్యున్నత చిత్రాలను తెరకెక్కించారు. సినిమా అంటే కేవలం కమర్షియల్ హంగులు,డ్యాన్సులు మాత్రమే కాదని, సంస్కృతి, సంప్రదాయాలు, విలువలు, కళలకు ప్రతిరూపం అని తన ప్రతి సినిమాల్లో నిరూపించిన మహారిషి కె. విశ్వనాథ్.
స్టార్ హీరోలు లేకపోయినా, సినిమా మొత్తం పాటలు ఉన్నా సామాజిక అంశాలను కథలుగా మార్చుకొని సినిమా హిట్స్ కొట్టారు. తెలుగుదనాన్ని సమున్నతంగా నిలబెట్టారు. ఆయన ఒక్కో సినిమా ఒక్కో ఆణిముత్యం. శంకరాభరణం, సాగరసంగమం, స్వాతిముత్యం, స్వాతికిరణం, స్వర్ణకమలం, శుభసంకల్పం ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు వారికి అందించారు.
సామాజిక సమస్యలను ప్రస్తావిస్తూ.. ఆయన తీసిన సప్తపది, స్వాతిముత్యం, స్వయంకృషి, శుభోదయం, శుభలేఖ, ఆపద్బాంధవుడు, శుభసంకల్పం ఆలోచింపజేశాయి. ఇలా ఆయన సినిమాల కోసం ప్రేక్షకులే కాదు అవార్డులు, రివార్డులు ఎదురు చూసేవి. సంగీతం, సంస్కృతి, సంప్రదాయలకు అత్యంత విలువనిచ్చే కె. విశ్వనాథ్ కమర్షియల్ హంగులు లేకపోయినా కేవలం కళలతో హిట్స్ కొట్టొచ్చని నిరూపించిన డైరెక్టర్.
తన సినీ ప్రస్థానంలో సుమారు 50కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. డైరెక్టర్‌గానే కాకుండా, నటుడిగానూ తెలుగు సినీ ప్రేక్షకులను అలరించారు. కలిసుందాం రా, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, అతడు, ఆంధ్రుడు, మిస్టర్ పర్‌ఫెక్ట్ వంటి ఎన్నో సినిమాల్లో విశ్వనాథ్ నటించారు. తెలుగులో చివరగా హైపర్ సినిమాలో కనిపించారు.
Comments
Please login to add a commentAdd a comment