
శ్రావ్య, అనీ, రాజీవ్ కనకాల, ప్రజ్వల్
రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్రజ్వల్ యాద్మ, సాయిరామ్, అనీ, అనిరుధ్, జ్యోతి ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘హోమ్ టౌన్’. శ్రీకాంత్ రెడ్డి పల్లే దర్శకత్వంలో నవీన్ మేడారం, శేఖర్ మేడారం నిర్మించిన ఈ సిరీస్ నేటి నుంచి ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుంది. కాగా ఈ సిరీస్ ప్రివ్యూను హైదరాబాద్‌లో ప్రదర్శించారు.
ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో రాజీవ్ కనకాల మాట్లాడుతూ– ‘‘హోమ్ టౌన్’ వెబ్ సిరీస్‌లో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఈ సిరీస్ ప్రివ్యూ చూసిన వారిలో కొందరికి తమ సొంత ఊరు, మరికొందరికి తమ గత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి ఉంటాయి. ఈ సిరీస్‌లో పిల్లల అల్లరి చూస్తుంటే 35 ఏళ్లు వెనక్కి వెళ్లిన ఫీలింగ్ కలిగింది. నవీన్ మేడారంగారు ఈ సిరీస్‌కు బ్యాక్‌బోన్‌లా నిలబడ్డారు. నాతో కలిసి నటించిన ఝాన్సీగారికి, ఇతర టీమ్ కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు.
‘‘90స్: ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’ తర్వాత మా సంస్థలో చేసిన వెబ్ సిరీస్ ‘హోమ్ టౌన్’.‘90స్: ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’ సిరీస్‌లో నటించిన ఆ ముగ్గురు పిల్లలు ఓవర్ నైట్ స్టార్స్ ఎలా అయ్యారో, ‘హోం టౌన్’ సిరీస్ స్ట్రీమింగ్ తర్వాత ఈ ముగ్గురు పిల్లలకు కూడా అంతే పేరు వస్తుందని ఆశిస్తున్నాను’’ అన్నారు నవీన్ మేడారం.
‘‘సొంతూరుతో ముడిపడిన జ్ఞాపకాలను మర్చిపోలేం. అలాంటి భావోద్వేగాలు ఈ ‘హోమ్ టౌన్’ వెబ్ సిరీస్‌లో ఉంటాయి. సిరీస్‌లోని అందరు వారి బెస్ట్ పెర్ఫార్మెన్స్‌లు ఇచ్చారు. అవకాశం ఇచ్చిన నిర్మాత నవీన్, ఆహాకు థ్యాంక్స్’’ అని తెలిపారు శ్రీకాంత్‌రెడ్డి పల్లే. ఈ కార్యక్రమంలో ప్రజ్వల్ యాద్మ, సాయిరామ్, అనిరుధ్, అనీ, శ్రావ్య, మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి మాట్లాడారు.