
భారతీయ సంస్కృతికి చిహ్నమైన శాస్త్రీయ కళలను తన కథలుగా మలుచుకుని, అద్భుతమైన చిత్ర కావ్యాలను తెరకెక్కించి కె. విశ్వనాథ్ కళాతపస్వి అనిపించుకున్నారు అయన ఆవిష్కరించిన శంకరాభరణం సినిమా జాతీయ పురస్కారాన్ని అందుకుని తెలుగుతెరపై ఒక కళాఖండంగా మిగిలిపోయింది. అలాగే, స్వాతిముత్యం, సాగరసంగమం, స్వయంకృషి, స్వర్ణకమలం, సిరివెన్నెల.. ఇలా ఆయన ప్రతి చిత్రం తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి.
ఇంతటి గొప్ప చిత్రాలు అందించినందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ఆయన్ని పద్మశ్రీ, దాదాసాహెబ్ ఫాల్కే తదితర అవార్డులతో సత్కరించింది. కానీ, తన సినిమాలతో ప్రేక్షకుల మనసుని తేలికపరిచే విశ్వనాథ్ మనసుని మాత్రం ఒక సినిమా చిత్రవధ చేసిందట. అదే ‘సిరివెన్నెల’ సినిమా. ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘మిమ్మల్ని బాగా తృప్తిపరిచిన సినిమా ఏది’ అని ప్రశ్నించగా.. విశ్వనాథ్ బదులిస్తూ, ‘కళాకారుడు అనేవాడు జీవితాంతం తృప్తి పొందడు.
ఇంకా ఏదో చేయాలి, సాధించాలనే అసంతృప్తితోనే బతుకుతాడు. నేను అంతే. కానీ, నన్ను మానసికంగా చాలా సంఘర్షణకు గురిచేసిన సినిమా మాత్రం ‘సిరివెన్నెల’. అసలు ఒక మాటలు రాని అమ్మాయి ఏంటి.. కళ్లు కనబడని అబ్బాయి ఏంటి.. వారిద్దరి మధ్య సన్నివేశాలు సృష్టించడానికి నేను రాత్రి పగలు కష్టపడడం ఎందుకు? ఆ కథ ఎందుకు మొదలుపెట్టానా అని ఎంతో బాధపడ్డా.
చిత్రీకరణ మధ్యలో సినిమాను ముగించలేను, ఆపేయలేను.. ఆ సమయంలో మానసికంగా ఎంతో చిత్రవధ అనుభవించా’.. అంటూ విశ్వనాథ్ తన అనుభవాన్ని పంచుకున్నారు. కట్ చేస్తే.. సిరివెన్నెల సినిమా తెలుగుతెరపై మరో కళాఖండమైంది.