ఎక్కువ భాగం రాజస్థాన్‌లోనే... ఇక షూటింగ్ విషయానికొస్తే... ఈ సినిమాలో చాలాభాగం రాజస్థాన్ లోని జైపూర్‌లో చిత్రీకరించారు. ఇక్కడ షూటింగ్ పర్మిషన్ కోసం జైపూర్ టూరిజం డిపార్ట్‌మెంట్ సంప్రదించగా కేంద్రం నుంచి అనుమతి తెచ్చుకోమన్నారట. దీంతో అజ్మీర్ జిల్లా కలెక్టరును కలవడానికి వెళ్లగా ఆయన ‘శంకరాభరణం’ సినిమాకు పెద్ద అభిమాని కావడంతో విశ్వనాథ్‌ని గుర్తుపట్టి క్షణాల్లో అనుమతి ఇప్పించారట.
తెలుగుతెరపై మరో కళాఖండం ‘సిరివెన్నెల’. కళాతపస్వి కె. విశ్వనాథ్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచియిన సినిమాల్లో ఇదొకటి. శాస్త్రీయ సంగీత ప్రాధాన్యమున్న ‘సిరివెన్నెల’ 1986లో విడుదలై అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ పతాకం నుంచి వచ్చిన మరో ఆణిముత్యం. ఈ సినిమా కథ ఓ అంధుడైన ఫ్లూటిస్ట్ హరిప్రసాద్, మూగమ్మాయి అయిన ఓ ఆర్టిస్ట్ చుట్టూ నడుస్తుంది. కేవీ మహదేవన్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాలోని పాటలన్నీ ఇప్పటికీ తెలుగు లోగిళ్లలో వినిపిస్తూనే ఉంటాయి.
అన్ని పాటల్నీ సీతారామ శాస్త్రి రాశారు. ఈయనకు పాటల రచయితగా ఇదే తొలి సినిమా. ఈ సినిమాతో చేబ్రోలు సీతారామ శాస్త్రి పేరు తెరమీద ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రిగా మారింది. ‘విధాత తలపున ప్రభవించినదీ..’ పాటకు సీతారామ శాస్త్రి ఉత్తమ గేయరచయితగా, ఉత్తమ గాయకుడిగా ఎస్పీ బాలసుబ్రమణ్యం, మూన్ మూన్ సేన్ ఉత్తమ సహాయనటిగా, ఎంవీ రఘు ఉత్తమ ఛాయాగ్రాహకుడిగా నంది పురస్కారాలు అందుకున్నారు.
చిత్రవధకు గురి చేసిన కథ
చక్కటి సంస్కృతీ సంప్రదాయాలు కలబోసిన కథా కథనాలతో ప్రేక్షకుడికి పంచభక్ష పరమాన్నాలను వడ్డించే విశ్వనాథ్‌ను ‘సిరివెన్నెల’ కథ మాత్రం చిత్రవధకు గురి చేసిందట. మాటలు రాని అమ్మాయేంటి, కళ్లు కనపడని అబ్బాయేంటి? ఈ కథను ఎందుకు తీసుకున్నానా? అని బాధపడని రోజు లేదట. మధ్యలో వదల్లేను... అలాగని కంటిన్యూ చేయలేను అని మానసికంగా చిత్రవధకు గురయ్యారట. అంతలా విశ్వనాథ్‌ను ఇబ్బంది పెట్టిన ఈ కథ చివరికి తెలుగు సినీ చరిత్రలో ఓ కళాఖండమై నిలిచింది.
‘విధాత తలపున...’కు వారం రోజులు
సీతారామ శాస్త్రి ఈ సినిమాతోనే సినీరంగ ప్రవేశం చేశారు. తన తొలి సినిమాకే చిరస్థాయిగా గుర్తుండిపోయే పాటలందించి శభాష్ అనిపించుకున్నారు. వాస్తవానికి తన సినిమాలన్నింటికీ వేటూరి చేత పాటలు రాయించుకునే విశ్వనాథ్‌పై ఏదో కారణం చేత ఆ సమయంలో వేటూరి అలిగారట. దీంతో ఆయన్నెందుకు ఇబ్బంది పెట్టడమని సీతారామశాస్త్రిని పిలిపించి రాయించుకున్నారట. అప్పటì కి ఆయన టెలిఫోన్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగి. సెలవుపై వచ్చి మరీ ఈ సినిమాకు పాటలు రాశారు.
తొలుత భరణి పేరుతో కథలు, పాటలు రాసేవారు ఆయన. ‘సిరివెన్నెల’తో తన తొలి సినిమానే ఇంటి పేరుగా నిలుపుకున్నారు. అలాగే ఈ సినిమాలో హీరో వేణువు నుంచి వచ్చే సంగీతాన్ని ప్రఖ్యాత వేణుగాన విద్వాంసుడు హరిప్రసాద్ చౌరాసియా అందించారు. ముఖ్యంగా ఈ సినిమాలో ఓంకార సంబంధమున్న ‘విధాత తలపున ప్రభవించినది...’ పాట రాయడానికి సీతారామశాస్త్రికి వారం రోజులు పట్టిందట. ‘సిరివెన్నెల’ (1986) విడుదలై పాతికేళ్లకు పైనే అయినప్పటికీ ఈ చిత్రం గురించి ఇంకా మాట్లాడుకుంటూనే ఉంటారు. ఏ తరానికైనా నచ్చే ఈ ప్రేమకథ ఎప్పటికీ చెరిగిపోదు. తెలుగు చలన చిత్ర చరిత్రలో, ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర ఈ ‘సిరివెన్నెల’. – దాచేపల్లి సురేష్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment