Sirivennela Movie
-
తెలుగుతెరపై మరో కళాఖండం
ఎక్కువ భాగం రాజస్థాన్‌లోనే... ఇక షూటింగ్ విషయానికొస్తే... ఈ సినిమాలో చాలాభాగం రాజస్థాన్ లోని జైపూర్‌లో చిత్రీకరించారు. ఇక్కడ షూటింగ్ పర్మిషన్ కోసం జైపూర్ టూరిజం డిపార్ట్మెంట్ సంప్రదించగా కేంద్రం నుంచి అనుమతి తెచ్చుకోమన్నారట. దీంతో అజ్మీర్ జిల్లా కలెక్టరును కలవడానికి వెళ్లగా ఆయన ‘శంకరాభరణం’ సినిమాకు పెద్ద అభిమాని కావడంతో విశ్వనాథ్‌ని గుర్తుపట్టి క్షణాల్లో అనుమతి ఇప్పించారట.తెలుగుతెరపై మరో కళాఖండం ‘సిరివెన్నెల’. కళాతపస్వి కె. విశ్వనాథ్ కెరీర్లో మైలురాయిగా నిలిచియిన సినిమాల్లో ఇదొకటి. శాస్త్రీయ సంగీత ప్రాధాన్యమున్న ‘సిరివెన్నెల’ 1986లో విడుదలై అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ పతాకం నుంచి వచ్చిన మరో ఆణిముత్యం. ఈ సినిమా కథ ఓ అంధుడైన ఫ్లూటిస్ట్ హరిప్రసాద్, మూగమ్మాయి అయిన ఓ ఆర్టిస్ట్ చుట్టూ నడుస్తుంది. కేవీ మహదేవన్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాలోని పాటలన్నీ ఇప్పటికీ తెలుగు లోగిళ్లలో వినిపిస్తూనే ఉంటాయి. అన్ని పాటల్నీ సీతారామ శాస్త్రి రాశారు. ఈయనకు పాటల రచయితగా ఇదే తొలి సినిమా. ఈ సినిమాతో చేబ్రోలు సీతారామ శాస్త్రి పేరు తెరమీద ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రిగా మారింది. ‘విధాత తలపున ప్రభవించినదీ..’ పాటకు సీతారామ శాస్త్రి ఉత్తమ గేయరచయితగా, ఉత్తమ గాయకుడిగా ఎస్పీ బాలసుబ్రమణ్యం, మూన్ మూన్ సేన్ ఉత్తమ సహాయనటిగా, ఎంవీ రఘు ఉత్తమ ఛాయాగ్రాహకుడిగా నంది పురస్కారాలు అందుకున్నారు.చిత్రవధకు గురి చేసిన కథచక్కటి సంస్కృతీ సంప్రదాయాలు కలబోసిన కథా కథనాలతో ప్రేక్షకుడికి పంచభక్ష పరమాన్నాలను వడ్డించే విశ్వనాథ్‌ను ‘సిరివెన్నెల’ కథ మాత్రం చిత్రవధకు గురి చేసిందట. మాటలు రాని అమ్మాయేంటి, కళ్లు కనపడని అబ్బాయేంటి? ఈ కథను ఎందుకు తీసుకున్నానా? అని బాధపడని రోజు లేదట. మధ్యలో వదల్లేను... అలాగని కంటిన్యూ చేయలేను అని మానసికంగా చిత్రవధకు గురయ్యారట. అంతలా విశ్వనాథ్‌ను ఇబ్బంది పెట్టిన ఈ కథ చివరికి తెలుగు సినీ చరిత్రలో ఓ కళాఖండమై నిలిచింది.‘విధాత తలపున...’కు వారం రోజులుసీతారామ శాస్త్రి ఈ సినిమాతోనే సినీరంగ ప్రవేశం చేశారు. తన తొలి సినిమాకే చిరస్థాయిగా గుర్తుండిపోయే పాటలందించి శభాష్ అనిపించుకున్నారు. వాస్తవానికి తన సినిమాలన్నింటికీ వేటూరి చేత పాటలు రాయించుకునే విశ్వనాథ్‌పై ఏదో కారణం చేత ఆ సమయంలో వేటూరి అలిగారట. దీంతో ఆయన్నెందుకు ఇబ్బంది పెట్టడమని సీతారామశాస్త్రిని పిలిపించి రాయించుకున్నారట. అప్పటì కి ఆయన టెలిఫోన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగి. సెలవుపై వచ్చి మరీ ఈ సినిమాకు పాటలు రాశారు.తొలుత భరణి పేరుతో కథలు, పాటలు రాసేవారు ఆయన. ‘సిరివెన్నెల’తో తన తొలి సినిమానే ఇంటి పేరుగా నిలుపుకున్నారు. అలాగే ఈ సినిమాలో హీరో వేణువు నుంచి వచ్చే సంగీతాన్ని ప్రఖ్యాత వేణుగాన విద్వాంసుడు హరిప్రసాద్ చౌరాసియా అందించారు. ముఖ్యంగా ఈ సినిమాలో ఓంకార సంబంధమున్న ‘విధాత తలపున ప్రభవించినది...’ పాట రాయడానికి సీతారామశాస్త్రికి వారం రోజులు పట్టిందట. ‘సిరివెన్నెల’ (1986) విడుదలై పాతికేళ్లకు పైనే అయినప్పటికీ ఈ చిత్రం గురించి ఇంకా మాట్లాడుకుంటూనే ఉంటారు. ఏ తరానికైనా నచ్చే ఈ ప్రేమకథ ఎప్పటికీ చెరిగిపోదు. తెలుగు చలన చిత్ర చరిత్రలో, ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర ఈ ‘సిరివెన్నెల’. – దాచేపల్లి సురేష్‌కుమార్ -
కళాతపస్వి కె. విశ్వనాథ్.. ఆ సినిమా విషయంలో చిత్రవధ అనుభవించారట
కళాతపస్వి కె. విశ్వనాథ్ కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయిన చిత్రాల్లో 'సిరివెన్నెల' ఒకటి. తెలుగుతెరపై మరో కళాఖండముగా నిలిచిపోయిందీ చిత్రం. అద్భుతమైన విజయాన్ని సాధించడంతో పాటు దర్శకుడిగా విశ్వనాథ్ కీర్తిని ఆకాశాన్ని తాకేలా చేసింది.కానీ ఇదే సినిమా తనను మానసికంగా చిత్రవధకు గురిచేసిందని స్వయంగా విశ్వనాథ్ గతంలో సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయన అలా ఎందుకు అన్నారు? ఇంతకీ విశ్వనాథ్‌ను ఈ చిత్రం ఎందుకు అంతలా బాధించిందో ఇప్పుడు తెలుసుకుందాం.. 'సిరివెన్నెల' సినిమాలో ఒక గుడ్డివాడిని, మూగ అమ్మాయిని కలపాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందన్నదాని గురించి విశ్వనాథ్ ప్రస్తావిస్తూ.. ''ఆ సంవత్సరం హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సంబంధించిన ఇయర్ ఏదో అయింది. అప్పుడు అనిపించింది... అదే నేపథ్యంలో సినిమా తీస్తే ఎలా ఉంటుందని... అలా ఒక గుడ్డివాడిని, ఒక మూగ అమ్మాయిని తీసుకుని వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ బిహేవియర్‌ని తెరకెక్కించాలనిపించింది. అంతేకాక, నాకు ఎప్పుడూ అనిపించే విషయం. దేవుడు ఒకచోట ఎవరికయినా తగ్గించి ఇస్తే దాన్ని వేరేచోట భర్తీ చేస్తారని.మనం కూడా వాళ్ళ మీద సానుభూతి చూపించకుండా నార్మల్ పర్సన్స్‌లా ట్రీట్ చేయాలని. సిరివెన్నెల ప్రాజెక్ట్ నా మనసుకు దగ్గరైన సినిమా. ఎందుకంటే, దాన్ని పిక్చరైజ్ చేయడానికి, బయటికి తేవడానికి నేను మానసికంగా ఎంత వ్యధ అనుభవించానో నాకు తెలుసు. ప్రతి సీన్‌కీ కష్టపడ్డాను. ఉదాహరణకు సుహాసిని, బెనర్జీ కోటలో కలిసినప్పుడు అతన్ని (మూగ భాషలో) అడుగుతుంది – ‘మీరు ఇంతకుముందు ఇక్కడే వాయించే వారటగా?’ అని... ‘అవును, ఎవరికి తోచింది వారిచ్చేవారు... మరి మీరేమిస్తారు?’ అంటాడు. తగినంత డబ్బు లేకపోవడంతో తన బ్రేస్లెట్ తీసిస్తుంది. అప్పుడు ఒక పాటను చిత్రీకరించి ఆ సీన్‌ను ఎండ్ చేయచ్చుకదా? లేదు, అలా చేయాలనిపించలేదు. నేనే కాంప్లికేట్ చేసుకుంటాను... తగిన సమాధానం కోసం వెతుక్కుంటాను. వెంటనే అతను ‘ఇది వెండా? బంగారమా?’ అంటాడు. దానికి సమాధానం ఆ అమ్మాయి ఎలా చెప్పగలదు? అప్పటికీ ‘మీ మనసు లాంటిది’ అని చూపిస్తుంది. అప్పుడయినా ఊరుకోవచ్చు కదా! లేదు... ‘నా మనసు అయితే మట్టి’ అంటాడు... ‘పోనీ, నా మనసు అనుకోండి’ అన్నట్లు చూపిస్తుంది సుహాసిని... అలా మొత్తం సినిమాలో నాకై నేను కాంప్లికేట్ చేసుకున్న సీన్లు ఎన్నో! తన బొమ్మ గీసేటప్పుడు కళ్ళు బాగా రావాలంటాడు బెనర్జీ సుహాసినితో ఓసారి... సరే... బొమ్మ ఉన్నదున్నట్టుగా గీస్తే కాంప్లికేషనే లేదుగా? అలా తీయకూడదనుకున్నాను. చివరికి ఆ అమ్మాయి మంచి కళాఖండం ... సూర్యచంద్రుల్ని రెండు కళ్ళుగా, వేణువును ముక్కుగా, దానినుంచీ వెలువడే ఉచ్ఛ్వాస – నిశ్వాసల ఓంకారం పెదవులుగా, త్రినేత్రం అతని జ్ఞాననేత్రంగా... గీస్తుంది. గీసింది సరే, కానీ దాన్ని తనేమో చెప్పలేదు, అతనేమో చూడలేడు. సిచ్యుయేషన్ ఎంత కాంప్లికేటెడో ఆలోచించండి! నమ్ముతారో లేదో ఆ బొమ్మ గీయడానికి నంది హిల్స్‌లో నేను, మా ఆర్ట్ డైరెక్టర్ ఎన్ని రోజులు స్పెండ్ చేశామో చెప్పలేము. రోజూ వచ్చి అడిగేవాడు ‘ఏం గీయాలి సార్!’ అని... ‘నువ్వు ఏదయినా యాబ్స్ట్రాక్ట్తో రా, నేను దాన్ని ఇంటర్పెట్ చేయగలనో లేదో చూస్తాను’ అని చెప్పి పంపేవాడిని. సింపుల్‌గా చెప్పాలంటే.. రివర్స్‌లో వర్క్ చేయడం అన్నమాట. అతనికీ అర్థం కావట్లేదు, నాకూ క్లారిటీ లేదు... అలా రోజులు గడిచాయి... సడెన్‌గా ఓరోజుతెల్లవారుజామున ఐడియా వచ్చి అతన్ని పిలిచి ఎక్స్ప్లెయిన్ చేశాను. అంత కష్టం దాగుంది ఆ సీన్ వెనుక! అయితే, పడ్డ కష్టానికి ఫలితం దక్కింది. అది వేరే విషయం. ఇందులో ‘సూర్యోదయం’ సీన్ ఒకటుంది. ఒక గుడ్డివాడికి సూర్యోదయాన్ని ఎలా చూపించాలని. నేను ఎంతో రిసెర్చ్ చేశాను, ఎందరో మేధావులని కలిశాను, ఎన్నో రోజులు ఆలోచించాను. ఆ సీన్లో మూన్‌మూన్‌సేన్ అతన్ని అడుగుతుంది...‘నువ్వు ఎప్పుడయినా, ఏ అమ్మాయినైనా ప్రేమించావా?’ అని. లేదంటాడతను. ‘పోనీ ఎప్పుడయినా, ఏ అమ్మాయినైనా ముట్టుకున్నావా?’ అని అడుగుతుంది... ‘అయ్యయ్యో!’అంటాడతను. ‘అయితే నీకు చెప్పడం చాలా తేలిక’ అంటుంది తను. అంటే... మొదటిసారి ఓ అమ్మాయిని ముట్టుకున్నప్పుడు కలిగే ఎలక్ట్రో మాగ్నెటిక్ వేవ్‌ల ఆధారంగా ప్రకృతిని చాలా ఈజీగా చూపించవచ్చని అనుకున్నాను. అసలు ఈ థాట్ వెనకాల చాలా గమ్మత్తైన విషయం దాగుంది. ఇంతవరకూ ఈ విషయం నేను ఎవ్వరికీ చెప్పలేదు. మేము విజయవాడలో ఉన్నప్పుడు... మా ఇంట్లో అద్దెకుండే అమ్మాయి కాఫీ పౌడర్ అప్పు తీసుకెళ్ళింది. తిరిగి గ్లాస్ ఇవ్వడానికొచ్చినప్పుడు ఇంట్లో అమ్మ లేకపోవడంతో నాకిచ్చింది. అలా ఇవ్వడంలో, అనుకోకుండా ఆమె చేయి నాకు తగిలింది... అంతే! ఏదో జరిగిందినాలో! 50–60 ఏళ్ళ క్రితం కలిగిన ఆ ఫీలింగ్ నాకిప్పటికీ అలానే గుర్తుంది.అదే సినిమాలోఎందుకు పెట్టకూడదని అనుకుని పెట్టాను. ఇక సాహిత్యం విషయానికి వస్తే.. అప్పటిదాకా వేటూరి గారితో ఎన్నో పాటలు రాయించిన నేను ఈ సినిమాకు మాత్రం సిరివెన్నెల గారితో రాయించాను. అప్పట్లో వేటూరి గారు నామీద ఎందుకో తెలీదు, అలిగారు (కారణం తెలీదు). వారికి ఇష్టం లేనప్పుడు మనం బలవంతంచేయకూడదు కదా అని, వేరెవరితోనైనా రాయించాలనుకున్నాను. ఈలోపల నేను ఓరోజు ‘గంగావతరణం’ పాటలు విన్నాను. వినగానే నచ్చేశాయి. రాసిందెవరని వాకబు చేస్తే తెలిసింది ‘సీతారామశాస్త్రి’ అని. అప్పుడతన్ని పిలిపించి, అతనికి సిరివెన్నెల కథ మొత్తం వినిపించి, రాయించుకున్నాను. మొదటిసారి ‘విధాత తలపున’రాశాడు. చాలా అద్భుతం అనిపించింది. అప్పటిదాకా వచ్చిన సినిమాల్లో శివుడ్ని స్తుతించాను. మహా అయితే ప్రశ్నించాను. కానీ ఎన్నడూ నిందించలేదు. ఈ సినిమాలో మాత్రం ‘ఆదిభిక్షువు’ పాటలో నిందాస్తుతి కనిపిస్తుంది. షూటింగ్ టైంలో లిరిక్ రైటర్, డైలాగ్‌రైటర్ ఎప్పుడూ నాతోనే ఉండేవారు. అందులోశాస్త్రికి ఇది ఫస్ట్ ఫిల్మ్ కదా, ఉద్యోగానికి సెలవుపెట్టుకొచ్చాడు, బోలెడు ఖాళీ ఉండేది. షూటింగ్ అవ్వగానే ఈవెనింగ్ కూర్చుని కబుర్లు చెప్పుకునేవాళ్ళం. అలా ఓరోజు నేను అతనిని అడిగాను...‘ఏమయ్యా, ఏమయినా కొత్తగా రాశావా?’ అని. అప్పుడు... ‘ఆదిభిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చేవాడినేది అడిగేది?’ అని నాలుగు లైన్లు వినిపించాడు. ‘ఏదేది మళ్ళీ చెప్పు’ అన్నాను. థాట్బాగా నచ్చింది! వెంటనే నేను ‘అదే లైన్లో చరణాలు కూడా రాసెయ్. సినిమాలో దానికి తగ్గసిట్యుయేషన్ నేను క్రియేట్ చేస్తాను’' అన్నాను. -
ఆ కథ.. తీరని వ్యథ.. ‘సిరివెన్నెల’పై కళాతపస్వి మానసిక సంఘర్షణ
భారతీయ సంస్కృతికి చిహ్నమైన శాస్త్రీయ కళలను తన కథలుగా మలుచుకుని, అద్భుతమైన చిత్ర కావ్యాలను తెరకెక్కించి కె. విశ్వనాథ్ కళాతపస్వి అనిపించుకున్నారు అయన ఆవిష్కరించిన శంకరాభరణం సినిమా జాతీయ పురస్కారాన్ని అందుకుని తెలుగుతెరపై ఒక కళాఖండంగా మిగిలిపోయింది. అలాగే, స్వాతిముత్యం, సాగరసంగమం, స్వయంకృషి, స్వర్ణకమలం, సిరివెన్నెల.. ఇలా ఆయన ప్రతి చిత్రం తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఇంతటి గొప్ప చిత్రాలు అందించినందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ఆయన్ని పద్మశ్రీ, దాదాసాహెబ్ ఫాల్కే తదితర అవార్డులతో సత్కరించింది. కానీ, తన సినిమాలతో ప్రేక్షకుల మనసుని తేలికపరిచే విశ్వనాథ్ మనసుని మాత్రం ఒక సినిమా చిత్రవధ చేసిందట. అదే ‘సిరివెన్నెల’ సినిమా. ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘మిమ్మల్ని బాగా తృప్తిపరిచిన సినిమా ఏది’ అని ప్రశ్నించగా.. విశ్వనాథ్ బదులిస్తూ, ‘కళాకారుడు అనేవాడు జీవితాంతం తృప్తి పొందడు. ఇంకా ఏదో చేయాలి, సాధించాలనే అసంతృప్తితోనే బతుకుతాడు. నేను అంతే. కానీ, నన్ను మానసికంగా చాలా సంఘర్షణకు గురిచేసిన సినిమా మాత్రం ‘సిరివెన్నెల’. అసలు ఒక మాటలు రాని అమ్మాయి ఏంటి.. కళ్లు కనబడని అబ్బాయి ఏంటి.. వారిద్దరి మధ్య సన్నివేశాలు సృష్టించడానికి నేను రాత్రి పగలు కష్టపడడం ఎందుకు? ఆ కథ ఎందుకు మొదలుపెట్టానా అని ఎంతో బాధపడ్డా. చిత్రీకరణ మధ్యలో సినిమాను ముగించలేను, ఆపేయలేను.. ఆ సమయంలో మానసికంగా ఎంతో చిత్రవధ అనుభవించా’.. అంటూ విశ్వనాథ్ తన అనుభవాన్ని పంచుకున్నారు. కట్ చేస్తే.. సిరివెన్నెల సినిమా తెలుగుతెరపై మరో కళాఖండమైంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
జ్ఞాపకాల ‘సిరి’.. ఆ రెండు చిత్రాలూ ఆణిముత్యాలే..
1970, 80లలో ఒక మంచి సినిమాను ప్రేక్షకులకు అందించాలని తపనతో నిర్మాతలు, దర్శకులు పని చేసేవారు. భక్తి రసం, కళాత్మకం, సందేశాత్మకం ఇలా ఏదో ప్రత్యేకతతో సినిమా తీసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని ఉండేది. ఇప్పుడు పూర్తిగా వ్యాపార దృక్పథంతోనే చిత్రాలు తీస్తున్నారు. సినిమాలు తీయడానికి రూ.కోట్లలో ఖర్చు అవుతున్నా ఆడించేందుకు థియేటర్లు ఉండటంలేదు. రామచంద్రపురం: తెలుగు సినీరంగంలో గుర్తుండిపోయే రెండు చిత్రాల నిర్మాణ సారథ్యంలో ఆయన పాలుపంచుకున్నారు. ఆ రెండు సినిమాలూ విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొంది అపూర్వ విజయాలు సాధించినవే.. చిరస్మరణీయ చిత్రాలైన సిరివెన్నెల, సిరిసిరిమువ్వ చిత్రాల నిర్మాతల్లో ఒకరు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురానికి చెందిన ఊజూరి వీర్రాజు.. ఈ రెండు సినిమాలూ ఆఖండ విజయభేరి మోగించినా తర్వాత ఆయన మరో సినిమా జోలికి పోలేదు. 76ఏళ్ల వీర్రాజుకు ఒక అబ్బాయి..నలుగురు అమ్మాయిలు ఉన్నారు. తనను సినిమా నిర్మాణం వైపు అడుగులు వేయించిన పరిస్థితులను ఆయన సాక్షితో పంచుకున్నారు. తన జీవితంపై చెరగని ముద్ర వేసిన ఆ సినిమాల గుర్తులు తన గుండెలో ఎప్పటికీ పదిలంగాఉంటాయంటారాయన. రాజస్దాన్‌లో షూటింగ్ అనంతరం సిరివెన్నెల చిత్రం బృందం అంగరతో స్నేహమే నడిపించింది.. రామచంద్రపురంలో మాకు మార్కేండేయ ఇంజినీరింగ్ వర్క్ షాపు ఉండేది. సిని నిర్మాత అంగర సత్యం నేను స్నేహితులం..కలిసి చదువుకున్నాం. ఆయన తరచూ మా వర్క్‌షాప్ వద్దకు వచ్చేవారు. ఈయన ద్వారా పూర్ణోదయ క్రియేషన్స్ సంస్థ అధినేత ఏడిద నాగేశ్వరరావు పరిచయమమ్యారు. వీరు మా షెడ్డు వద్దే సినిమా ప్లాన్ల గురించి చర్చించుకునేవారు. అప్పుడే నా మనసు సినిమా నిర్మాణం వైపు మళ్లింది. 1975లో అంగర సత్యంతో కలిసి తమిళ వెర్షన్ ‘‘తిరుమల దైవం’’ సినిమాను శ్రీవెంకటేశ్వర కల్యాణంగా డబ్ చేసి నిర్మించాం. రూ. 2 లక్షల వరకూ ఖర్చయింది. రూ.1లక్ష లాభం వచ్చింది. తరువాత రెండు మూడు సినిమాలు డబ్బింగ్ సినిమాలు రిలీజ్ చేశాం. ఏడిద నాగేశ్వరరావు డైరెక్ట్ సినిమాకు ప్లాన్ చేద్దామన్నారు. 1976లో దర్శకులు కె విశ్వనాథ్ వద్దకు వెళ్లాం. నా క్లాస్మేట్ నల్లమిల్లి భాస్కర్‌రెడ్డితో కలిసి సిరిసిరిమువ్వ సినిమాను నిర్మించాలనుకున్నాం. రూ. 3లక్షలు అవుతుందని ఏడిద నాగేశ్వరరావు నన్ను ఒప్పించారు. రూ 13లక్షలయ్యింది. డిస్ట్రిబ్యూటర్స్ సహాయ పడ్డారు. నవయుగ డిస్ట్రిబ్యూటర్స్ సగం పెట్టుబడి పెట్టి వెనక్కి వెళ్లిపోయారు. సినిమా కథ.. దర్శకుని మీద నమ్మకంతో అప్పులు చేసి సినిమా తీశాం. సినిమా పెద్ద హిట్ అయ్యింది. మాకు రూ.కోటి వరకు లాభమొచి్చంది. ఈ సినిమా హక్కులు మాకే ఉన్నాయి. దీనిపై ఇప్పటికీ ఎంతోకొంత డబ్బులు వస్తూనే ఉన్నాయి. సిరిసిరిమువ్వ ఎక్కువ సార్లు రిలీజ్ చేశాం. 1978లో శంకరాభరణం తీద్దామని అనుకున్నా కుదరలేదు. అదే సమయంలో రామచంద్రపురంలో గీతా థియటర్ నిర్మాణంలో ఉండటంతో అవకాశం మిస్సయ్యాను. ప్రముఖులకు దగ్గరయ్యా.. ‘‘ సిరిసిరి మువ్వ సినిమా చాలా వరకు రామచంద్రపురం పరిసరాల్లోనే చిత్రీకరించాం. ఇక్కడి వాళ్లు చాలా మంది అందులో నటించారు. అప్పట్లో ఇక్కడ బస చేయటానికి సరైన వసతులుండేవి కావు. దర్శకులు కె విశ్వనాథ్‌తో పాటు చంద్రమోహన్, జయప్రద వంటి నటులను మా స్నేహితుల ఇళ్లలోనే ఉంచేవాళ్లం. ఈ సినిమాకు జాతీయ స్ధాయిలో రెండు, రాష్ట్ర స్ధాయిలో 6 అవార్డులను అందుకున్నాం. విశ్వనాథ్, వేటూరి, కనకాల దేవదాసులాంటి వారికి దగ్గరయ్యాను. పదేళ్ల గ్యాప్ తర్వాత 1986లో మళ్లీ విశ్వనాథ్‌గారితో కలిసి సిరివెన్నెల సినిమా నిర్మించాం. సందేశాత్మక చిత్రంగానే విడుదల చేశాం. నిర్మాణ సందర్భంలో మా చిత్రం హిట్ అవ్వదని.. డబ్బులు రావని విమర్శలు వినిపించేవి. కానీ డబ్బులు గురించి ఆలోచించలేదు. సందేశంతో కూడిన కళాత్మకమైన చిత్రం అందించాలనే భావించాం. దీనికి కూడా అవార్డుల పంట పండింది. ఇందులో సీతారామశాస్త్రి రాసిన పాటలు పెద్ద హిట్ అయ్యాయి. ఆ చిత్రమే ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. ఆయన పేరు విన్నప్పుడల్లా గర్వంగా..ఆనందంగా ఉంటుంది. బాలకృష్ణ, ఏ కోదండరామిరెడ్డిలతో, స్వాతి ముత్యం తరువాత కమలహాసన్‌తో సినిమాలకు ప్లాన్ చేసినా కుదరలేదు. విశ్వనాథ్‌గారితో పరిచయంతో స్వాతికిరణం, స్వాతిముత్యం, శుభసంకల్పం చిత్రాలకు పనిచేశాను. రామచంద్రపురంలో తీసిన ప్రతి చిత్రానికి వెనకుండి సహకరించేవాడ్ని. ఇప్పటికీ సినిమా మీద మక్కువ పోలేదు. రామచంద్రపురంలో ఏదైనా సినిమా షూటింగ్ చేస్తే కచ్చితంగా నన్ను సంప్రదిస్తుంటారు. నాటి సినిమా జ్ఞాపకాలు నేటికి గుర్తుకు వస్తునే ఉంటాయి. హిందీలో సర్గమ్(సిరిసిరిమువ్వ) కోసం మద్రాసు నుంచి బెంగళూరుకు హిందీ నటి రేఖను విమానంలో తీసుకువచ్చే బాధ్యతను నాకు పురమాయించారు. అప్పుడు టిక్కెట్ ధర రూ250. ఎంతో పేరున్న హిందీ హీరోయిన్ రేఖను తీసుకువస్తుంటే అందరి మావైపే చూశారు. సినిమా తీశాక ఆర్థిక పరంగా ఎలా ఉన్నా సంతృప్తి అనేది మిగిలి ఉంటుంది. సిరిసిరి మువ్వ, సిరివెన్నెల నిర్మాతలలో ఒకడిగా నా జన్మకు సరిపడా సంతృప్తి మిగిలింది. సిరిసిరిమువ్వ తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ, కన్నడ భాషలతో పాటుగా అమెరికా, మాస్కో వంటి దేశాలలోనూ పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. నేటికి ఆ సినిమా సంఘటనలు తీపి గుర్తులే. -
సిరివెన్నెలను వరించిన 11 నంది అవార్డులు.. ఆ పాటలు ఇవే..
Top 11 Sirivennela Sitaramasastry Nandi Award Winning Songs List: సిరివెన్నెల సీతారామశాస్త్రి పాట ఎవరైనా మెచ్చుకోవాల్సిందే.. అందులోని భావానికి వావ్ అనాల్సిందే. ఆయన రచన, సాహిత్యం అలాంటిది. అంతే కాదు అక్షరానికి ఎంత శక్తి ఉంటుందని తెలియజేసేవారిలో అతి ముఖ్యులు సీతారామశాస్త్రి. సరసం, శృంగారం, వేదన, ఆలోచన.. ఇలా కవిత్వానికి ఎన్ని ఒంపులు ఉన్నాయో, అక్షరంలో ఎన్ని అందాలు ఉన్నాయో అన్నీ తెలిసిన చిత్రకారుడు సిరివెన్నెల. ‘విధాత తలపున ప్రభవించినదీ’ అంటూ ఏ క్షణాన ఆయన తెలుగు సినిమా పాట కోసం కలం పట్టుకున్నారో, అప్పుడే ఆయన తెలుగు పాటకు ముద్దు బిడ్డ అయిపోయారు. ‘సరస స్వర సుర ఝరీ గమనమౌ’ అంటూ మొదలైన ప్రయాణంలో ఎన్నో అవార్డులు. ఒకటి కాదు, రెండు కాదు, భారత ప్రభుత్వ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ కూడా ఆయన సాహిత్యానికి కానుకగా వరించింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ గీత రచయితగా 11 సార్లు నంది అవార్డు అందుకున్నారు. ఆయన సాహిత్యం అందించిన పాటలు, నంది అవార్డులు గెలుచుకున్న విశేషాలు ఇవే. 1. చెంబోలు సీతారామశాస్త్రి తెలుగు సినిమాకు రాసిన మొదటి పాట ‘విధాత తలపున’. ‘సిరివెన్నెల’ చిత్రంలోని ఈ పాటకు ఉత్తమ గీత రచయితగా తొలిసారి నంది అవార్డు అందుకున్నారు. కే. విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి కె.వి. మహదేవన్ స్వరాలు అందించారు. 2. రెండోసారి కూడా కే. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన 'శ్రుతిలయలు' సినిమాలోని 'తెలవారదేమో స్వామి' పాటకు ఉత్తమ గీత రచయితగా నంది అవార్డు అందుకున్నారు. ఈ పాటకు కూడా కె.వి. మహదేవన్ స్వరాలు సమకూర్చారు. 3. మూడోసారి హైట్రిక్గా కే. విశ్వనాథ్ డైరెక్ట్ చేసిన సినిమాలోని పాటకే నంది అవార్డు సీతారామ శాస్త్రిని వరించింది. ఇళయరాజా స్వరాలు అందించిన ‘స్వర్ణకమలం’లో ‘అందెల రవమిది పదములదా!’ అంటూ సాగే పాట ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. 4. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో జగపతిబాబు కీలక పాత్రలో నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ‘గాయం’. ఇందులో ‘సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకని’ అంటూ సాగే పాటను సిరివెన్నెల రాశారు. శ్రీ కొమ్మినేని స్వరాలు సమకూర్చిన ఈ పాటకు నంది అవార్డు దక్కింది. 5. ఐదో నంది అవార్డు 'శుభలగ్నం' సినిమాలోని ‘చిలుక ఏ తోడు లేక’ అనే పాట రచిచించనందుకు దక్కింది. 6. శ్రీకారం చిత్రంలోని ‘మనసు కాస్త కలత పడితే' అంటూ సాగే గేయానికి ఆరో నంది అవార్డు లభించింది. 7. ఏడో నంది అవార్డు ‘సింధూరం’ చిత్రంలోని ‘అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే’ పాటకు వరించింది. 8. సుమంత్ హీరోగా అరంగ్రేటం చేసిన ‘ప్రేమకథ’ సినిమాలోని 'దేవుడు కరుణిస్తాడని' అనే పాటకు ఎనిమిదో నంది అవార్డు వచ్చింది. 9. తొమ్మిదో నంది అవార్డు ‘చక్రం’లోని 'జగమంత కుటుంబం నాది' అనే పాటకు దక్కింది. 10. పదో నంది అవార్డు ‘గమ్యం’ (ఎంత వరకూ ఎందుకొరకు) 11. పదకొండో నంది అవార్డు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (మరీ అంతగా) వీటితో పాటు సిరివెన్నెలకు నువ్వొస్తానంటే నేనొద్దంటానా, గమ్యం, మహాత్మ, కంచె చిత్రాలకు పాటలు రాసినందుకుగాను సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డులు వరించాయి. గోవాలోని పనాజీలో 2017లో ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు చేతులమీదుగా 'సంస్కృతి' కేటగిరీ కింద 'ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్' అవార్డును అందుకున్నారు సిరివెన్నెల. ఇది చదవండి: సంగీత ప్రపంచంలో వికసించిన తామరలు.. సిరివెన్నెల ఆణిముత్యాలు -
ఓకే గూగుల్, ప్లే సిరివెన్నెల సాంగ్స్.. గూగుల్ నివాళి
Google India Tribute To Sirivennela Sitaramasastry: జగమంత కుటుంబాన్ని వదిలి సినీ అభిమానుల్ని ఒంటరి చేసి లోకాన్ని విడిచిపెట్టారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి. 'సిరివెన్నెల' సినిమా పేరును ఇంటిపేరుగా మార్చుకుని, సాహిత్యంలో తనకు తానే సాటి అనిపించుకున్నారు. మెలోడీలు, జాగృతం, జానపదం , శృంగారం, విప్లవాత్మక గీతాలను అందించారు. ఆయన పాట రాస్తే చాలనుకునే గొప్ప రచయత సిరివెన్నెల. సిరివెన్నెల సీతరామ శాస్త్రి కలం సాహిత్యం నుంచి జాలువారే ప్రతీ పాట ఓ అద్భుతమే. అలాంటి సాహితీ దిగ్గజాన్ని కోల్పోవడం సాహిత్యాభిమానులు, ప్రేక్షకులు, సినీ పెద్దలు, రాజకీయనాయకులు ఒకరేంటీ యావత్ దేశం జీర్ణించుకోలేకపోతుంది. ఆ దిగ్గజ కవితో గడిపిన క్షణాలను నెమరువేసుకుంటూ ఆయన మృతికి నివాళులర్పిస్తున్నారు. ఇది చదవండి: సంగీత ప్రపంచంలో వికసించిన తామరలు.. సిరివెన్నెల ఆణిముత్యాలు ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సైతం కవి మహాశయుడికి నివాళి ఘటించింది. 'సిరివెన్నెలతో మొదలైన జీవన గీతం, సీతారామ శాస్త్రి గారి సాహిత్యంతో నిలిచిపోతుంది చిరకాలం' అని గూగుల్ ఇండియా ట్వీట్ చేసింది. 'ఓకే గూగల్, ప్లే సిరివెన్నెల సాంగ్స్' అంటూ ప్రస్తుతం ట్రెండింగ్ సెర్చ్‌ను తన ట్వీట్లో రాసుకొచ్చింది. Ok Google, play Sirivennela songs 😞💔 "సిరివెన్నెల" తో మొదలయిన జీవన గీతం, సీతారామ శాస్త్రి గారి సాహిత్యంతో నిలిచిపోతుంది చిరకాలం 🙌 — Google India (@GoogleIndia) November 30, 2021 ఇది చదవండి: టాలీవుడ్లో వరుస విషాదాలు.. నాలుగు రోజుల్లోనే ముగ్గురు కన్నుమూత -
సిరివెన్నెలకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రీ ఇకలేరన్న వార్త టాలీవుడ్లో విషాదం నింపింది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం 4:07 గంటలకు తుదిశ్వాస విడిచారు. సిరివెన్నెల పూర్తి పేరు చేంబోలు సీతారామశాస్త్రి. విశాఖ జిల్లా అనకాపల్లిలో1955 మే 20న జన్మించారు . ఆయన తల్లిదండ్రులు డాక్టర్ సి.వి.యోగి, తల్లి సుబ్బలక్ష్మి. కాకినాడలో ఇంటర్మీడియెట్ వరకూ చదువుకున్నా ఆయన , ఆంధ్ర విశ్వ కళాపరిషత్తులో బిఏ పూర్తి చేశారు. ఆయన కొంతకాలంపాటు టెలిఫోన్స్ శాఖలో పని చేశారు. ప్రఖ్యాత దర్శకుడు విశ్వనాధ్ అవకాశం కల్పించడంతో సిరివెన్నెల సినిమాలో పాటలన్నీ రాశారు. సిరివెన్నెల చిత్రం సూపర్ హిట్ కావడంతో సిరివెన్నెల సీతారామశాస్త్రిగా ప్రసిద్ధి గాంచారు. సిరివెన్నెల సినిమాలోని అన్ని పాటలను ఆయనే రాశారు. ప్రతి పాట సూపర్ హిట్టయింది. సిరివెన్నెల సినిమాలోని... విధాత తలపున ప్రభవించినది, చందమామ రావే, ఆది భిక్షువు వాడినేది కోరేదీ, ఈ గాలీ ఈ నేలా...ఇలా ప్రతిపాట అద్భుత సాహితీ గుబాళింపులతో సాహితీ ప్రియుల మనసు దోచాయి. స్వయంకృషి, రుద్రవీణ, స్వర్ణకమలం, శృతిలయలు, శివ, క్షణక్షణం, గాయం , గులాబీ, మనీ, శుభలగ్నం, నిన్నే పెళ్లాడతా, సింధూరం, దేవీపుత్రుడు, చంద్రలేఖ, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావు, శుభసంకల్పం, పట్టుదల..ఇలా అనేక సినిమాల్లో ఆయన రాసిన ప్రతిపాటా ఆణిముత్యమే. పండితులను పామరులను ఆకట్టుకున్న అద్భుత కవితామృత గుళికలే. కె. విశ్వనాధ్, వంశీ, క్రాంతికుమార్, బాలచందర్, జంధ్యాల, రాఘవేంద్రరావు, రామ్ గోపాల్‌వర్మ, సింగీతం శ్రీనివాసరావు, శివనాగేశ్వరరావు, కోదండరామిరెడ్డి, కృష్ణారెడ్డి, కృష్ణవంశీ, మణిరత్నం, వి.ఎన్ . ఆదిత్య, రాజమౌళి, పూరీ జగన్నాధ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, శ్రీనువైట్ల, ఇంద్రగంటి......ఇలా...ఎంతో మంది దిగ్గజ దర్శకులనుంచి, కొత్త దర్శకులదాకా....అందరూ ఆయన పాటల పరిమళాల్ని ప్రజలకు పంచారు. 2019లో పద్మశ్రీ పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. ఇక ఉత్తమ గేయ రచయితగా ఆయన పొందిన పురస్కారాలకు లెక్క లేదు. మొదట్లో భరణి అనే కలం పేరుతో కథలు, కవిత్వ రచనలు చేసిన సీతారామశాస్త్రి... ...సిరివెన్నెల సినిమా హిట్టుతో ఆ సినిమా పేరే ఇంటిపేరుగా మార్చుకున్నారు. -
‘సిరివెన్నెల’ నుంచి జై జై గణేషా సాంగ్
లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు తెరకెక్కుతున్న ఈ తరుణంలో ప్రియమణి ముఖ్య పాత్రలో నటిస్తున్న సిరివెన్నెల చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. హారర్ మూవీగా రూపొందించిన ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. వినాయక చవితి సందర్భంగా ఈ సినిమాలో సందర్భానుసారంగా వచ్చే వినాయకుడి పాటను నిర్మాతలు విడుదల చేశారు. శ్రీరామ్ తపస్వి రాసిన ఈ పాటను ప్రణతి రావు, రామ్సీ, హరి గుంటా శ్రోతల హృదయాలకు హత్తుకునేలా ఆలపించారు. ఈ సినిమాకు కమ్రాన్ స్వరాలు సమకూర్చాడు. మహానటి ఫేమ్ బేబి సాయి తేజస్విని, కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని కమల్ బోహ్రా, ఏ ఎన్ భాషా, అరిపక రామసీత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ప్రకాశ్ పులిజాల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఆసక్తికరంగా ‘సిరివెన్నెల’ ట్రైలర్
హారర్ మూవీస్ ఎప్పుడూ వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. కథనాన్ని గ్రిప్పింగ్‌గా చెప్పగలిగితే.. సినిమా విజయవంతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హారర్ చిత్రాలకు ఏ సీజన్‌తో పని ఉండదు.. కాస్త పాజిటివ్ టాక్ వస్తే హిట్ గ్యారంటీ. అందుకే మన వాళ్లు హారర్ సినిమాలు రెగ్యులర్‌గా తెరకెక్కిస్తుంటారు. దెయ్యాలు, ఆత్మల కథలతో తెరకెక్కిన ఎన్నో చిత్రాలు హిట్ అయ్యాయి. తాజాగా ఆ జాబితాలోకి చేరేందుకు ‘సిరివెన్నెల’ అనే చిత్రం రాబోతోంది. మహానటి ఫేమ్ బేబి సాయి తేజస్విని (రాజేంద్ర ప్రసాద్ మనవరాలు), ప్రియమణి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సిరివెన్నెల ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది. ఈ ట్రైలర్లో డైలాగ్స్ హైలెట్‌గా నిలిచాయి. కమల్ బోహ్రా, ఏఎన్‌బి కోఆర్డినేటర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రకాష్ పులిజాల తెరకెక్కిస్తున్నారు. -
పిల్లల సక్సెస్ చూసినప్పుడే ఆనందం
‘‘మీ తాతయ్య(రాజేంద్రప్రసాద్) నవ్వించేవారు.. నువ్వు(సాయి తేజస్విని) భయపెడుతున్నావ్. ‘మహానటి’ చిత్రంతో నటన మొదలుపెట్టావు. మన సక్సెస్ కన్నా మన పిల్లల సక్సెస్ చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది’’ అని డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు అన్నారు. ప్రియమణి ప్రధాన పాత్రలో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ చిత్రం ‘సిరివెన్నెల’. ప్రకాష్ పులిజాల దర్శకత్వం వహించారు. ‘మహానటి’ ఫేమ్ సాయి తేజస్విని, ‘బాహుబలి’ ఫేమ్ ప్రభాకర్, అజయ్ రత్నం, రాకెట్ రాఘవ కీలక పాత్రల్లో నటించారు. కమల్ బోరా, ఏఎన్‌బాషా, రామసీత నిర్మించిన ఈ సినిమా పాటల విడుదల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. రాఘవేంద్రరావు మాట్లాడుతూ– ‘‘నిర్మాతల్లో ఒకరైన బాషాకి రాఘవేంద్రరావు తెలుసు.. రాజమౌళి తెలుసు... అందరితోనూ పని చేశాడు. నా సినిమాలకు చాలా వరకు ఆయనే నేపథ్య సంగీతం అందించారు. నేపథ్య సంగీతం లేకపోతే సినిమానే లేదు. సావిత్రిలాగా అటు మోడ్రన్, ఇటు ట్రెడిషనల్.. ఇలా ఏ పాత్రకైనా ప్రియమణి సరిపోతుంది’’ అన్నారు. నటుడు డా.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ– ‘‘తెలుగు సంగీతాన్ని అంతర్జాతీయ స్థాయికి పరిచయం చేసిన కీరవాణిగారిని, ఆర్.పి. పట్నాయక్.. ఇంకా ఇంత మంచి మహానుభావులను ఒకే వేదికపై కలవడం ఆనందంగా ఉంది. మా మనవరాలు గురించి నేను చెప్పకూడదు.. ప్రేక్షకులే ఈ సినిమా చూసి ఎలా నటించిందో చెప్పాలి’’ అన్నారు. ‘‘ఈ సినిమాతో నా రెండో ఇన్నింగ్స్ ప్రారంభం అయినట్లే. టీజర్, ట్రైలర్ చాలా బాగున్నాయి. తేజస్విని బాగా నటించింది’’ అన్నారు ప్రియమణి. ‘‘నేను చేసిన ‘అనగనగా ఓ దుర్గ’ చిత్రం చూసి బాషాగారు కథ చెప్పమన్నప్పుడు ‘సిరివెన్నెల’ కథ చెప్పాను. బాషాగారికి, బోరాగారికి నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ కుదిరింది’’ అన్నారు ఓం ప్రకాష్. ‘‘ఈ సినిమా చాలా బాగా వచ్చింది. తప్పకుండా విజయం సాధిస్తుంది’’ అని బాషా, కమల్ బోరా అన్నారు. డైరెక్టర్ వైవీఎస్ చౌదరి, సంగీత దర్శకులు ఎం.ఎం. కీరవాణి, ఆర్.పి. పట్నాయక్, నిర్మాత సురేష్ కొండేటి తదితరులు పాల్గొన్నారు. -
‘సిరివెన్నెల’ పాటకు లెజెండరీ సింగర్స్ ప్రశంసలు
పెళ్ళి తరువాత ప్రముఖ నటి ప్రియమణి నటిస్తున్న చిత్రం సిరివెన్నెల. శాంతి టెలిఫిల్మ్స్ సమర్పణలో ఎ.ఎన్.బి కొఆర్డినేటర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ మెత్తం పూర్తిచేసుకుని ప్రస్తుతం పొస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుటుంది. ప్రకాష్ పులిజాల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను కమల్ బోరా, ఏ.ఎన్. భాషా, ఏ.రామసీతాలు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంబందించిన టీజర్‌ని ఇటీవలే బాలీవుడ్ స్టార్ డైరక్టర్ నీరజ్ పాండే చేతుల మీదుగా విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు కమ్రాన్ సంగీతం అందించిన పాటను క్రేజీ సంగీత దర్శకుడు ఎస్.ఎస్.థమన్ తన సోషల్‌మీడియా ద్వారా లాంచ్ చేశారు. ఆయన విడుదల చేసిన సాంగ్‌కి లెజండరి సింగర్స్ ఎస్.పి.బాలసుబ్రమణ్యం , శంకర్ మహదేవ్‌లు ప్రశంసలు కురిపించారు. ఈ సందర్బంగా ఎస్.పి.బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ.. సంగీత ప్రియులందరికి నమస్కారాలు.. ఇప్పుడే ఒకే పాట వున్నాను. శాంతి టెలిఫిల్మ్స్ సమర్పణ లో ఎ.ఎన్.బి కొఆర్డినేటర్స్ నిర్మిస్తున్న సినిమా సిరివెన్నెల సినిమాలోనిది. మా బాషా, కమల్ బోరా సంయుక్తంగా నిర్మించారు. జై జై గణేషా అనే పాట చాలా చక్కగా వుంది. ముఖ్యంగా పాత సిరివెన్నెల నాకు చాలా ఇష్టమైన సినిమా.. అలాగే ఈ సినిమా కూడా అంతే విజయాన్ని అందుకోవాలని కొరుకుంటున్నాను. అలాగే ఈ సాంగ్ పాడిన ప్రణతి రావు చాలా చాలా బాగా పాడింది.. చివరలో వాయిస్ కలిపిన రాంసి, హరిగుంట.. సాహిత్యాన్ని అందించిన శ్రీరామ్ తపస్వికి సంగీతం అందించిన కమ్రాన్ కి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే చక్కటి తెలుగు పదాలతో తెలుగు పాట, అందులోను గణేశ నామ స్మరణతో మొదలయ్యిన ఈ పాట సినిమా విజయానికి నాంది కావాలని కొరుకుంటున్నాను. అందరూ బాగుండాలి సర్వేజనా సుఖినో భవంతు’ అన్నారు. శంకర్ మహదేవ్ మాట్లాడుతూ.. ‘జై జై గణేశ అనే మొదలయ్యే ఈ పాట చాలా బాగుంది. నిర్మాత బాషా గారు నిర్మించిన సిరివెన్నెల చిత్రం నుండి మెదటి సాంగ్ బ్యూటిఫుల్ సాంగ్, ఈ సాంగ్ విజయం సాధించాలి. అలాగే సినిమా కూడా చాలా మంచి విజయాన్ని అందుకొవాలనికి కొరుకుంటున్నాను’ అన్నారు.