ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రీ ఇకలేరన్న వార్త టాలీవుడ్‌లో విషాదం నింపింది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం 4:07 గంటలకు తుదిశ్వాస విడిచారు.
సిరివెన్నెల పూర్తి పేరు చేంబోలు సీతారామశాస్త్రి. విశాఖ జిల్లా అనకాపల్లిలో1955 మే 20న జన్మించారు . ఆయన తల్లిదండ్రులు డాక్టర్ సి.వి.యోగి, తల్లి సుబ్బలక్ష్మి. కాకినాడలో ఇంటర్మీడియెట్ వరకూ చదువుకున్నా ఆయన , ఆంధ్ర విశ్వ కళాపరిషత్తులో బిఏ పూర్తి చేశారు. ఆయన కొంతకాలంపాటు టెలిఫోన్స్ శాఖలో పని చేశారు. ప్రఖ్యాత దర్శకుడు విశ్వనాధ్ అవకాశం కల్పించడంతో సిరివెన్నెల సినిమాలో పాటలన్నీ రాశారు. సిరివెన్నెల చిత్రం సూపర్ హిట్ కావడంతో సిరివెన్నెల సీతారామశాస్త్రిగా ప్రసిద్ధి గాంచారు.
సిరివెన్నెల సినిమాలోని అన్ని పాటలను ఆయనే రాశారు. ప్రతి పాట సూపర్ హిట్టయింది. సిరివెన్నెల సినిమాలోని... విధాత తలపున ప్రభవించినది, చందమామ రావే, ఆది భిక్షువు వాడినేది కోరేదీ, ఈ గాలీ ఈ నేలా...ఇలా ప్రతిపాట అద్భుత సాహితీ గుబాళింపులతో సాహితీ ప్రియుల మనసు దోచాయి.
స్వయంకృషి, రుద్రవీణ, స్వర్ణకమలం, శృతిలయలు, శివ, క్షణక్షణం, గాయం , గులాబీ, మనీ, శుభలగ్నం, నిన్నే పెళ్లాడతా, సింధూరం, దేవీపుత్రుడు, చంద్రలేఖ, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావు, శుభసంకల్పం, పట్టుదల..ఇలా అనేక సినిమాల్లో ఆయన రాసిన ప్రతిపాటా ఆణిముత్యమే. పండితులను పామరులను ఆకట్టుకున్న అద్భుత కవితామృత గుళికలే.
కె. విశ్వనాధ్, వంశీ, క్రాంతికుమార్, బాలచందర్, జంధ్యాల, రాఘవేంద్రరావు, రామ్ గోపాల్‌వర్మ, సింగీతం శ్రీనివాసరావు, శివనాగేశ్వరరావు, కోదండరామిరెడ్డి, కృష్ణారెడ్డి, కృష్ణవంశీ, మణిరత్నం, వి.ఎన్ . ఆదిత్య, రాజమౌళి, పూరీ జగన్నాధ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, శ్రీనువైట్ల, ఇంద్రగంటి......ఇలా...ఎంతో మంది దిగ్గజ దర్శకులనుంచి, కొత్త దర్శకులదాకా....అందరూ ఆయన పాటల పరిమళాల్ని ప్రజలకు పంచారు.
2019లో పద్మశ్రీ పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. ఇక ఉత్తమ గేయ రచయితగా ఆయన పొందిన పురస్కారాలకు లెక్క లేదు. మొదట్లో భరణి అనే కలం పేరుతో కథలు, కవిత్వ రచనలు చేసిన సీతారామశాస్త్రి... ...సిరివెన్నెల సినిమా హిట్టుతో ఆ సినిమా పేరే ఇంటిపేరుగా మార్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment