Telugu cinema director
-
ఆ కథ.. తీరని వ్యథ.. ‘సిరివెన్నెల’పై కళాతపస్వి మానసిక సంఘర్షణ
భారతీయ సంస్కృతికి చిహ్నమైన శాస్త్రీయ కళలను తన కథలుగా మలుచుకుని, అద్భుతమైన చిత్ర కావ్యాలను తెరకెక్కించి కె. విశ్వనాథ్ కళాతపస్వి అనిపించుకున్నారు అయన ఆవిష్కరించిన శంకరాభరణం సినిమా జాతీయ పురస్కారాన్ని అందుకుని తెలుగుతెరపై ఒక కళాఖండంగా మిగిలిపోయింది. అలాగే, స్వాతిముత్యం, సాగరసంగమం, స్వయంకృషి, స్వర్ణకమలం, సిరివెన్నెల.. ఇలా ఆయన ప్రతి చిత్రం తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఇంతటి గొప్ప చిత్రాలు అందించినందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ఆయన్ని పద్మశ్రీ, దాదాసాహెబ్ ఫాల్కే తదితర అవార్డులతో సత్కరించింది. కానీ, తన సినిమాలతో ప్రేక్షకుల మనసుని తేలికపరిచే విశ్వనాథ్ మనసుని మాత్రం ఒక సినిమా చిత్రవధ చేసిందట. అదే ‘సిరివెన్నెల’ సినిమా. ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘మిమ్మల్ని బాగా తృప్తిపరిచిన సినిమా ఏది’ అని ప్రశ్నించగా.. విశ్వనాథ్ బదులిస్తూ, ‘కళాకారుడు అనేవాడు జీవితాంతం తృప్తి పొందడు. ఇంకా ఏదో చేయాలి, సాధించాలనే అసంతృప్తితోనే బతుకుతాడు. నేను అంతే. కానీ, నన్ను మానసికంగా చాలా సంఘర్షణకు గురిచేసిన సినిమా మాత్రం ‘సిరివెన్నెల’. అసలు ఒక మాటలు రాని అమ్మాయి ఏంటి.. కళ్లు కనబడని అబ్బాయి ఏంటి.. వారిద్దరి మధ్య సన్నివేశాలు సృష్టించడానికి నేను రాత్రి పగలు కష్టపడడం ఎందుకు? ఆ కథ ఎందుకు మొదలుపెట్టానా అని ఎంతో బాధపడ్డా. చిత్రీకరణ మధ్యలో సినిమాను ముగించలేను, ఆపేయలేను.. ఆ సమయంలో మానసికంగా ఎంతో చిత్రవధ అనుభవించా’.. అంటూ విశ్వనాథ్ తన అనుభవాన్ని పంచుకున్నారు. కట్ చేస్తే.. సిరివెన్నెల సినిమా తెలుగుతెరపై మరో కళాఖండమైంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కే. విశ్వనాథ్: ఇనుమడించిన పల్లెటూరు ప్రతిష్ట.. ‘సూపర్ స్టార్’కు శిక్షణ
తెనాలి: కల్మషం లేని పల్లె జీవితాలు.. పాడి పంటలతో భాసిల్లుతుండే పల్లెటూళ్లకు కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్ తన సినిమాల్లో పెద్దపీట వేశారు. మనవైన సంస్కృతీ సంప్రదాయాల ప్రస్తావన తప్పనిసరి. వీటన్నిటి మేళవింపుతో వినోదాత్మకమైన సినిమాతో చక్కని సందేశాన్ని ఇచ్చారు. అదికూడా కళాత్మకంగా, షడ్రుచుల సమ్మేళన విందు భోజనం అనిపించిన సంతృప్తితో ప్రేక్షకులు తెరబాట నుంచి ఇంటిబాట పట్టేలా ఉంటుంది. జనం మెచ్చిన ఈ సినీపరి‘శ్రమ’ను గుర్తించి ఎన్నో అవార్డులు అందుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వైఎస్సార్ జీవితకాల పురస్కారంతో ఇటీవలే సత్కరించింది. అంతలోనే ఆయన ఇకలేరన్న వార్త వినాల్సి రావటం దురదృష్టకరం. ఉమ్మడి గుంటూరు జిల్లా రేపల్లె సమీపంలో భట్టిప్రోలు మండలంలోని పెదపులివర్రు కె.విశ్వనాథ్ స్వస్థలం. కృష్ణాతీరంలో ఒకప్పుడు వాఘ్రపురంగా చారిత్రక ప్రసిద్ధి చెందిన ఈ గ్రామం చోళరాజులు, విజయనగర రాజులు, జమీందారుల పాలనలో విలసిల్లింది. 19వ శతాబ్ది మొదటిపాదం వరకు లలిత కళాకారులు, వేద, ఆగమశాస్త్ర పండితులు, సాహిత్య కోవిదులు, సంగీత విద్వాంసులు, ఆయుర్వేద వైద్యులు, భరతనాట్య కోవిదులు, చిత్రకారులు, శిల్పులు, మంత్రద్రష్టలు, స్వాతంత్య్ర యోధులకు నిలయం ఈ గ్రామం. సినీ సంభాషణలు, పాటల రచనలో వెండితెరను ఏలిన సముద్రాల రాఘవాచారి (సీనియర్ సముద్రాల), సముద్రాల రామానుజాచారి (జూనియర్ సముద్రాల), సినీతార హలం ఈ ఊరి బిడ్దలు. సుప్రసిద్ధ సంగీత దర్శకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు బాల్యం ఇక్కడే గడచింది. ఇదే ఊరి బిడ్డ, సినీదర్శకుడు కె.విశ్వనాథ్ తన సృజనతో ప్రతిష్టాత్మక గౌరవాలను పొందటం ద్వారా మాతృభూమి పెదపులివర్రును పులకరింపజేశారు. ‘సూపర్ స్టార్’కు శిక్షణ అప్పట్లో అంటే 53 ఏళ్ల క్రితం బాబూ మూవీస్ కొత్త తారలతో ప్రయోగాత్మకంగా తీసిన తొలి సాంఘిక ఈస్ట్‌మన్ కలర్ చిత్రం ‘తేనె మనసులు’. ఆదుర్తి సుబ్బారావు దర్శకుడు. కె.విశ్వనాథ్ సహ దర్శకుడు. తెనాలి సమీపంలోని బుర్రిపాలెం యువకుడు ఘట్టమనేని కృష్ణ తొలి సినిమా అది. సినిమా కోసమని కృష్ణకు నడకలో, వాచకంలో శిక్షణ ఇచ్చింది విశ్వనాథ్ కావటం విశేషం. ఆ అనుబంధం తర్వాత కూడా కొనసాగింది. కృష్ణతో ‘కన్నె మనసులు’ తీశారు. మళ్లీ ‘ప్రైవేట్ మాస్టర్’లో కృష్ణను నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రకు ఉపయోగించారు. ‘ఉండమ్మా బొట్టుపెడతా’, ‘నేరము–శిక్ష’ సినిమాలను కృష్ణతో చేశారాయన. ఆ తర్వాత దర్శకత్వ రంగంలో విశ్వనాథ్ తనదైన ‘కళాతపస్వి’గా చరిత్రను సృష్టించుకొంటే, కృష్ణ సూపర్‌స్టార్‌గా ఎదగడం తెలిసిందే. తెనాలితో అనుబంధం హీరో కృష్ణతోనే కాదు. ఊర్వశి శారద హీరోయిన్గా తీసిన అవార్డు సినిమా ‘శారద’కు దర్శకుడు విశ్వనాథే. ఇదే సినిమాకు తెనాలికి చెందిన అభ్యుదయ రచయిత బొల్లిముంత శివరామకృష్ణ సంభాషణలు సమకూర్చారు. బొల్లిముంత కన్నుమూశాక, ఏటా ఆయన పేరుతో ఇస్తున్న పురస్కారాన్ని 2012లో కె.విశ్వనాథ్ తెనాలిలో అందుకున్నారు. ఈ సందర్భంగా సమీపంలోని అంగలకుదురులో కళాకారుడు, రచయిత రావినూతల శ్రీరామమూర్తి, విశ్వనాథ్‌కు స్వర్ణ కంకణ ధారణ చేశారు. అంతకు ముందు 1974లో తెనాలిలో కల్చరల్ ఫిలిం సొసైటి తరపున విశ్వనాథ్‌ను సత్కరించారు. సినిమాల మంచి చెడ్డలను బేరీజు వేస్తూ, ఉత్తమ చిత్రాలను ప్రోత్సహిస్తున్న ఫిలిం సొసైటి నిర్వాహకుడు డాక్టర్ పి.దక్షిణామూర్తి అంటే ఆపేక్షగా ఉండేవారు. సొంతూరుపై తరగని మమకారం ఎంతగా ఎదిగినా, నగరంతో జీవితం ముడిపడినా.. విశ్వనాథ్‌కు సొంతూరు అంటే అమితమైన మమకారం. ఇక్కడి ప్రజలన్నా ప్రేమ. గ్రామంలోని శివాలయం అంటే ఎంతో ఇష్టం. తాను తీసిన ప్రతి సినిమాలో భట్టిప్రోలు మండలం పెదపులివర్రు పేరు వినిపిస్తుంది. సొంత గ్రామంలో నిర్వహించే దసరా, మహాశివరాత్రి ఉత్పవాలకు ఆలయాల్లో పూజలు నిర్వహించేవారు. పండగ వస్తే చిన్ననాటి స్నేహితుడు కొడమంచిలి వెంకట సుబ్బారావుకు పట్టువస్త్రాలు పంపేవారు. ఇప్పుడు విశ్వనాథ్ కన్ను మూశారని తెలిసి ఆయనతో పరిచయం ఉన్న వారంతా శోకసంద్రంలో మునిగిపోయారు. స్వాతంత్య్రయోధుని కుటుంబం విశ్వనాథ్ తాత కాళహస్తిలింగం స్వాతంత్య్రయోధుడు, పండితుడు. 1930లో కాంగ్రెస్ కార్యకర్తకు ఆతిథ్యం ఇచ్చినందుకు ఆరునెలలు జైలుశిక్ష అనుభవించారు. జైలు భోజనం నిరాకరించినందుకు ఆలీపురం క్యాంపు జైలుకు పంపారు. అక్కడ కూడా భోజనం లేకుండా నిత్యసంధ్యానుష్టానాలు జరుపుకున్నారు. జైలు డాక్టర్ వీరి గురించి తెలుసుకుని గోధుమపిండి, పాలు, నూనె వంటివి ఏర్పాటు చేశారు. విశ్వనాథ్ తండ్రి కాశీనాథుని సుబ్రహ్మణ్యం పెదపులివర్రు శివాలయంలో ప్రధాన అర్చకులుగా 1956 వరకు పని చేశారు. తల్లి సరస్వతి. సినీ నిర్మాణ సంస్థ వాహినిలో ఉద్యోగం రావటంతో సుబ్రహ్మణ్యం మకాం చెన్నైకి మారింది. విశ్వనాథ్ నాలుగో తరగతి వరకు గ్రామంలోని పాఠశాలలో చదువుకున్నారు. తర్వాత గుంటూరులో హిందూ, ఏసీ కాలేజీల్లో చదివారు. బీఎస్సీ పూర్తి చేశారు. చెన్నైలోని వాహిని స్టూడియోలో సౌండ్ ఇంజినీరుగా కెరీర్ ఆరంభించారు. -
తెలుగు సినిమా ‘ఆత్మగౌరవం’!
‘మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు.. ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు..’ అంటూ శంకరుడిని ప్రార్థించిన తీరు ప్రేక్షకుల ఆనంద వృష్టిని తడిపింది. ‘పంచ భూతములు ముఖ పంచకమై.. ఆరు రుతువులు ఆహార్యములై.. నీ దృక్కులే అటు అష్ట దిక్కులై.. నీ వాక్కులే నవరసమ్ములై..’ అంటూ ఉర్రూతలూగించిన తీరు అజరామరం. ‘కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం..’ చూపడంలో మీ శైలికి సెల్యూట్. తెలుగు సినిమా ఉత్తుంగ తరంగంలా ఎగిసి పడేలా చేయడంలో మీ తర్వాతే ఎవరైనా. మీ గురించి మేమెంత చెప్పినా, అవి మీకు కొత్తగా కిరీటాలేమీ పెట్టవు. ఆకాశమంత మీ నిబద్ధతకు అరచెయ్యంత అద్దం ఈ మాటలు. మీరు నింగికెగిసినా మా కళ్లముందుంచిన ఆ అపురూప దృశ్య కావ్యాల్లో అనునిత్యం మీరు కనిపిస్తూనే ఉంటారన్నది అక్షర సత్యం. ఎంతటి గంగా ప్రవాహమైనా గంగోత్రి లాంటి ఓ పవిత్ర స్థానంలో చిన్నగా, ఓ పాయలా మొదలవుతుంది. వెండితెరపై శంకరాభరణం, సాగర సంగమం వంటి ఎన్నో కళాఖండాలను సృజించిన కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వ ప్రయాణం కూడా అలాగే ఓ చిన్న పాయలా మొదలైంది. సౌండ్ రికార్డిస్టుగా మొదలై.. దర్శకత్వ శాఖకు విస్తరించిన విశ్వనాథ్ 1965లో తొలిసారిగా ‘ఆత్మగౌరవం’ సినిమాతో మెగాఫోన్ పట్టుకున్నారు. నాటి నుంచి ఐదున్నర దశాబ్దాలకుపైగా వెండితెర అద్భుతాలను అందించారు. తొలితరంలో గూడవల్లి రామబ్రహ్మం, బీఎన్ రెడ్డి, కేవీ రెడ్డి, మలితరంలో ఆదుర్తి సుబ్బారావు తదితరుల తర్వాత మూడో తరంలో తెలుగు సినిమాకు ‘ఆత్మగౌరవం’ తెచ్చిన దర్శక కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్. వాహినీ స్టూడియోలో సౌండ్ రికార్డింగ్ విభాగంలో కెరీర్‌ను ప్రారంభించి బీఎన్ రెడ్డి, కేవీ రెడ్డి, ఆదుర్తి సుబ్బారావు వంటి వారి పనితీరును దగ్గరగా పరిశీలిస్తూ వచ్చిన కె.విశ్వనాథ్ స్క్రిప్టులో తోచిన సలహాలు, సూచనలు ఇస్తుండేవారు. ఈ క్రమంలో ఆదుర్తి తన సినిమాలకు స్క్రిప్ట్ అసిస్టెంట్‌గా, అసోసియేట్‌గా పనిచేసే అవకాశం ఇచ్చారు. అలా కథా విస్తరణ, స్క్రీన్ ప్లే రచనలో విశ్వనాథ్‌కు ఉన్న ప్రతిభను గుర్తించి తమ అన్నపూర్ణా పిక్చర్స్ సంస్థలో దర్శకత్వ శాఖలోకి రమ్మని హీరో అక్కినేని నాగేశ్వరరావు ప్రోత్సహించారు. మొదట తటపటాయించినా, తర్వాత అన్నపూర్ణా పిక్చర్స్‌లో చేరారు. ఇలా కె.విశ్వనాథ్ సినీ జీవితం ఊహించని మలుపు తిరిగింది. అవకాశం కోసం వేచి చూస్తూ.. స్వతహాగా సృజనశీలి అయిన విశ్వనాథ్.. ఆదుర్తి శిష్యరికంలో మరిన్ని మెరుగులు దిద్దుకున్నారు. కథ, స్క్రీన్‌ప్లే రచన, సెకండ్ యూనిట్ డైరెక్షన్.. ఇలా విశ్వనాథ్ చేయనిది లేదు. నిజానికి ‘‘అన్నపూర్ణాలో రెండు సినిమాలకు ఆదుర్తి గారి దగ్గర దర్శకత్వ శాఖలో వర్క్ చేసిన తర్వాత నాకు రెండు సినిమాలకు డైరెక్షన్ చాన్స్ ఇస్తామని మాటిచ్చారు. కానీ నాలుగు చిత్రాలకు (వెలుగు నీడలు, ఇద్దరు మిత్రులు –1961; ‘చదువుకున్న అమ్మాయిలు – 63; ‘డాక్టర్ చక్రవర్తి’–64) వర్క్ చేశాకే ఐదో సినిమా దుక్కిపాటి మధుసూదనరావు నిర్మించిన ‘ఆత్మగౌరవం’తో మెగాఫోన్ నా చేతికిచ్చారు. ‘పూలరంగడు’ సినిమాకూ నేనే దర్శకత్వం వహించాల్సింది. మొదట నాతో స్క్రిప్టు వర్క్ వగైరా చేయించారు. అనుకోని కారణాల వల్ల మా గురువు ఆదుర్తి గారే డైరెక్ట్ చేస్తున్నారన్నారు. ఏమైతేనేం ‘ఆత్మగౌరవం’తో దర్శకుడినయ్యా’’ అని కె.విశ్వనాథ్ ఒక సందర్భంలో గుర్తుచేసుకున్నారు. ‘ఆత్మగౌరవం’కి డైరెక్షన్ చాన్స్ ఇచ్చే ముందు.. దుక్కిపాటి గట్టిగా పట్టుబట్టడంతో కె.విశ్వనాథ్ కాపురాన్ని హైదరాబాద్‌కు మార్చాల్సి వచ్చింది. ట్యాంక్ బండ్ దగ్గర గగన్ మహల్ కాలనీలో రెండేళ్లు చిన్న అద్దె ఇంట్లో గడిపారు. 1. తేనెమనసులు సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా కె. విశ్వనాథ్, 2. ‘స్వాతిముత్యం’ సినిమా షూటింగ్లో కమల్‌హాసన్‌కు సూచనలిస్తూ.., 3. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన శంకరాభరణంలోని ఓ సన్నివేశం పబ్లిక్ గార్డెన్స్ చెట్ల నీడలో.. ఖాళీ అద్దం షాట్లో.. అన్నపూర్ణా వారి అన్ని సినిమాలలానే ‘ఆత్మగౌరవం’ సినిమా కథ కోసం పలువురు రచయితలతో కలసి దర్శక, నిర్మాతలు మేధోమథనం జరిపారు. నాటక రచయిత గొల్లపూడి మారుతీరావు, నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి, మరికొందరు కలసి హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్ చెట్ల నీడల్లో పచ్చిక బయళ్లలో కూర్చొని కథా చర్చలు, ఆలోచనలు చేశారు. సంగీతాభిరుచి ఉన్న విశ్వనాథ్ మద్రాసు వర్క్ బిజీకి దూరంగా రచయితలు, సంగీత దర్శకుడిని హైదరాబాద్ రప్పించి, ఇక్కడ మ్యూజిక్ సిట్టింగ్స్ జరిపారు. హైదరాబాద్ సారథీ స్టూడియోలో షూటింగ్ ముహూర్తం. తొలి షాట్ చిత్రీకరణ తమాషాగా సాగింది. సంప్రదాయ శైవ కుటుంబంలో పుట్టిన విశ్వనాథ్ ఇంట్లో అంతా పరమ దైవభక్తులు. నిర్మాత దుక్కిపాటి నాస్తికుడు. తొలి షాట్ దేవుడి పటాల మీద తీసే అవకాశం లేదు. చివరకు అద్దం సాక్షాత్తూ లక్ష్మీదేవి స్వరూపమని విశ్వనాథ్ తెలివిగా ఫస్ట్ షాట్ ఖాళీగా ఉన్న అద్దం మీద పెట్టారు. క్షణమాగి అద్దంలో ప్రతిబింబంగా అక్కినేని ఫ్రేములోకి వచ్చి డ్రెస్ సర్దుకుంటారు. ఇలా అద్దం మీద నుంచి హీరో అక్కినేని మీదకు వచ్చేలా కెమెరామ్యాన్ సెల్వరాజ్‌తో కలసి విశ్వనాథ్ వేసిన ప్లాన్ అద్భుతంగా ఫలించింది. విశ్వనాథ్ సెంటిమెంట్ నిలిచింది. నిర్మాతకూ ఇబ్బంది లేకుండా పోయింది. అద్దం మీద మొదలైన విశ్వనాథ్ దర్శకత్వ ప్రస్థానం అపూర్వంగా ముందుకు సాగింది. తొలి చిత్రంతోనే అవార్డుల వేట కె.విశ్వనాథ్ నిర్మించిన తొలి చిత్రం ‘ఆత్మ గౌరవం’ 1965లో ఉత్తమ తృతీయ చిత్రంగా కాంస్య నంది అవార్డును గెల్చుకుంది. ఇదే చిత్రానికి ఉత్తమ నటుడిగా అక్కినేది నాగేశ్వరరావు, ఉత్తమ కథా రచయితలుగా గొల్లపూడి, యద్ధనపూడి నంది అవార్డులు అందుకున్నారు. ఇలా తొలి చిత్రంతోనే విశ్వనాథ్ అవార్డు చిత్రాల దర్శకుడిగా తన అప్రతిహత ప్రయాణానికి నాంది పలికారు. అప్పటి అగ్ర హీరోలు ఎన్టీఆర్‌తో నాలుగు, ఏఎన్నార్‌తో రెండు సినిమాలు తీశారు. ‘శంకరాభరణం’ సినిమాతో శిఖరాగ్రానికి చేరుకున్నారు. తెలుగులో తొలి మహిళా కొరియోగ్రాఫర్‌గా సుమతీ కౌశల్‌కు కె.విశ్వనాథ్ అవకాశం ఇచ్చారు. ఆ పాటల పల్లవులు విశ్వనాథ్‌వే విశ్వనాథ్‌లో బాహ్య ప్రపంచానికి తెలియని ఓ అద్భుత సినీ గీత రచయిత ఉన్నారు. ఆదుర్తి దగ్గర సహాయకుడిగా ఉన్న రోజుల్లో గీత రచయితలతో పాటలు రాయించుకుంటున్నప్పుడు సైతం వారికి తన ఇన్‌పుట్స్‌గా పాటల పల్లవులు అందించేవారు. ‘డమ్మీ లిరిక్స్.. అబద్ధపు సాహిత్యం’ అంటూ ఆయన ఇచ్చిన పల్లవులే.. తలమానికమైన ఎన్నో సినీ గీతాలకు కిరీటాలయ్యాయి. ‘ఆత్మగౌరవం’లో ‘మా రాజులొచ్చారు..’, ‘అందెను నేడే..’ పాటల పల్లవులు విశ్వనాథ్ రాసినవే. ఆ పదాలకు మరింత సొబగులద్ది రచయితలు మిగతా పాటంతా అద్భుతంగా అల్లడం విశేషం. సాగర సంగమం షూటింగ్లో..., స్వయంకృషి చిత్రీకరణ సమయంలో నిర్మాత ఏడిద నాగేశ్వరరావు, చిరంజీవితో.. అవార్డులకు కేరాఫ్ అడ్రస్ మునుపెన్నడూ రామప్ప గుడికి వెళ్ళకపోయినా, ఆ పరిసరాలు బాగుంటాయని దుక్కిపాటి, గొల్లపూడి, సెవన్ స్టార్స్ సిండికేట్ సాంస్కృతిక సంస్థ శాండిల్య బృందం చూసొచ్చి చెప్పడంతో, అక్కడకు వెళ్ళి మరీ షూటింగ్ చేసినట్టు విశ్వనాథ్ చెప్పారు. రామప్ప గుడిలోనే దాశరథి రాసిన ‘ఒక పూలబాణం..’ చిత్రీకరించారు. 1965 చివరలో సెన్సార్ జరుపుకొన్న ‘ఆత్మగౌరవం’ ఆ మరుసటేడు రిలీజైంది. ప్రజాదరణ పొంది, విజయవాడ లాంటి చోట్ల శతదినోత్సవం చేసుకుంది. దర్శకుడిగా విశ్వనాథ్ ప్రతిభా సామర్థ్యాలు ధ్రువపడిపోయాయి. తొలి చిత్రం నుంచి ఇప్పటి దాకా ఓ నాలుగైదు మినహా విశ్వనాథ్ రూపొందించిన చిత్రాలన్నీ నందులో, జాతీయ అవార్డులో ఏవో ఒకటి అందుకున్నవే! స్వయంగా కె. విశ్వనాథ్ సైతం కళాప్రపూర్ణ, రఘుపతి వెంకయ్య అవార్డు, పద్మశ్రీ పురస్కారం, సినీరంగంలో ఇచ్చే అత్యున్నత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు – ఇలా ఎన్నో శిఖరాలు అధిరోహించారు. ఈ 55 ఏళ్ళ దర్శకత్వ ప్రస్థానంలో తెలుగుతెరకు జాతీయ, అంతర్జాతీయస్థాయిలో అమితమైన ఆత్మగౌరవం తెచ్చారు. -
వెండితెరపై నా తెలంగాణ
ఎన్.శంకర్... తెలంగాణ సినీ దర్శకుడు. ఎన్కౌంటర్ వంటి సూపర్ హిట్ సినిమాతో మొద లైన ఆయన ప్రస్థానం...విభిన్న చిత్రాలతో ఉవ్వెత్తుకు ఎగసింది. ‘జైబోలో తెలంగాణ’తో లబ్దప్రతిష్టుడైన ఆయన వెండితెరపై నవ తెలంగాణ ఎలా ఉండాలో ఇలా విశ్లేషిస్తున్నారు... తెలుగు జాతి రెండుగా విడిపోయినా సినిమా రంగం మాత్రం ఒకటిగా ఉంటుంది. హైదరాబాద్ నుంచే రెండు రాష్ట్రాల్లోనూ తమ ప్రస్థానాన్ని కొనసాగించాలని సినీ నిర్మాతలు భావిస్తున్నారు. ఒకప్పుడు మద్రాసు నుంచే తెలుగు, తమిళ, కన్నడ, మళయాల సినీ పరిశ్రమ నడిచింది. ఇప్పుడు తెలంగాణ వచ్చినా పరిశ్రమ మాత్రం హైదరాబాద్ నుంచే కొనసాగుతుందని నిర్మాతలు, కళాకా రులు భావిస్తున్నారు. తెలంగాణ సంస్కృతిని, కళలను, భాషను, వ్యక్తిత్వాన్ని గౌరవించే సినిమాలు రావాల్సిన అవసరం ఉంది. అయితే తెలంగాణకు చెందిన చాలామంది కళాకారులకు అలాంటి అవకాశాలు రాలేదన్న భావన ఉంది. తరగని సాహిత్య సంపదకు నిలయం తెలంగాణలో కథలు, కథాంశాలు కోకొల్లలు. సాంస్కృతిక చరిత్ర అధికం. వీరగాధలు చాలా ఉన్నాయి. కథలకు ఉపయోగపడే ముడిసరుకు తెలంగాణలో ఎక్కువగా ఉంది. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి అనేక కథాంశాలను తీసుకుని సినిమాలు నిర్మించే వీలుంది. ఇప్పటివరకు రాయలసీమ ఫ్యాక్షన్, కోస్తాంధ్ర కథాంశాలతోనే సినిమాలు వచ్చాయి. తెలంగాణ పోరాటం నేపథ్యంతో వచ్చిన సినిమాలు పెద్దగా లేవు. తెలంగాణలో సాహిత్య చైతన్యం, రచయితల సృజనాత్మకత అద్భు తం. హాస్యం, డ్రామా, ఉద్వేగం, చరిత్ర, సమ్మక్క-సారక్క, రుద్రమదేవి వీరగాధలు ఉన్నాయి. వందల సినిమాలకు ఉపయోగపడే కళా సంపద ఇక్కడ ఉంది. 120 రకాల కళలు తెలంగాణలో ఉన్నాయి. అందులో 25 కళలు ఇంకా బతికున్నాయి. ప్రతి జిల్లాకు ఒక్కో ప్రత్యేకమైన కళా సంస్కృతి ఉంది. వాటన్నింటినీ సినిమాగా రూపొందించే కార్యాచరణ జరగాలి. మూడంచెల వ్యవస్థను పునరుద్ధరించాలి ప్రస్తుత సినిమా భవిష్యత్ దళారుల చేతుల్లో చిక్కుకుపోయింది. సినిమా ఎన్ని రోజులు ఆడాలో కూడా వారే నిర్ణయిస్తున్నారు. కొన్ని సినిమాలకు మొదట్లో పెద్దగా ఓపెనింగ్స్ లేకున్నా టాక్‌ను బట్టి క్రమంగా కలెక్షన్లు పెరుగుతాయి. కానీ దళారులు మాత్రం మొదట్లో ఓపెనింగ్స్ రాకపోతే సినిమా హాలు అద్దె వృథా అని ఆ సినిమాను ఎత్తివేస్తున్నారు. ఇది చిన్న సినిమాల పాలిట శాపంగా మారుతోంది. సినిమా హాళ్లను దళారులకు లీజుకు ఇవ్వడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. సినిమా భవితవ్యాన్ని దళారులు నిర్ణయించడం తగ దు. సినిమా తలరాత వారి చేతుల్లో ఉండడం పరిశ్రమకు మంచిది కాదు. కాబట్టి పాత విధానంలోలా మూడంచెల వ్యవస్థ రావాలి. అప్పుడే తెలంగాణ సినిమాకు భవిష్యత్ ఉంటుంది. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేస్తే.. తెలంగాణ రాష్ట్రం ఉనికిలోకి వచ్చాక తామూ హీరో, హీరోయిన్లు అవ్వొచ్చని, సాంకేతిక నిపుణులుగా ఎదగొచ్చని యువతీ యువకులు కలలు కంటున్నారు. ‘జైబోలో తెలంగాణ’ సినిమా నిర్మాణానికి ముందు నిర్వహించిన ఆడిషన్ టెస్ట్‌కు పదివేల మందికిపైగా వచ్చారు. ఆడిషన్‌కే మూడు నెలలు పట్టింది. దీనిని బట్టి ఎంతమంది ఔత్సాహికులు ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఎంతటి కళాకారుడైనా శిక్షణ లేనిదే రాణించలేడు. కాబట్టి ప్రభుత్వమే హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఓ ఫిల్మ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేయాలి. చెన్నై, పుణెల్లో ప్రభుత్వ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లున్నాయి. చెన్నై ఇన్స్టిట్యూట్లో రజనీకాంత్, చిరంజీవి వంటి ప్రముఖ హీరోలు శిక్షణ తీసుకున్నారు. ఇక తెలంగాణ కళాకారులు తీసే సినిమాలకు ప్రత్యేకంగా పన్ను రాయితీలు కల్పించాలి. ఒకప్పుడు లండన్‌లో సినిమా షూటింగ్ జరిగినా రాయితీ ఇచ్చేవారు. అలాగే గుజరాతీ, భోజ్‌పురి భాషల్లో తీసే సినిమాలకు ఆయా రాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో రాయితీలు ఇచ్చేవారు. తమిళనాడులో కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమిళ టైటిల్ పెట్టిన సినిమాలకు పన్ను రాయితీ కల్పించారు. అగ్రహీరో రజనీకాంత్ సినిమా ‘రోబో’ను తమిళ పేరు ‘ఎందిరన్’ (యంత్రం) అని తమిళ టైటిల్ పెట్టినందుకే కరుణానిధి పన్ను రాయితీ కల్పించారు. సబ్సిడీ, పన్ను రాయితీ ఇస్తే సినిమాలు తీసేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నారు. నవ తెలంగాణ: పోల్కేక టీకొట్టు వ్యాఖ్య ఎండలకు జనం ఫ్యాన్‌గాలిని కోరుకుంటున్నారు. కొత్త సామెత కొట్టక్కరలేదు, తిట్టక్కరలేదు కాంగ్రెస్ టికెట్ ఇస్తే వాడే కాలిపోతాడు. మాటకు మాట కొత్తవారికి పగ్గాలిస్తాం - రఘువీరారెడ్డి పగ్గాలు సరే, గుర్రమెక్కడిది? మాజీ కాంగ్రెస్ నాయకుడి ఆవేదన టైర్లు, గేర్లు లేని బస్సులో యాత్రకు బయలుదేరింది మా కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఇష్టమైన పాటలు అయ్యయ్యో చేతిలో పవర్ పోయెనే అయ్యయ్యో పార్టీ ఖాళీ ఆయెనే ఢిల్లీయే మాయ, సోనియానే మాయ కాంగ్రెస్‌లో సారమింతేనయా! సమైక్యాంధ్ర పార్టీ నినాదం పోటీచే స్తే పోయేదేమీ లేదు డిపాజిట్లు తప్ప పిట్ట కథ ఒక ముసలిపులి ‘పథకాలు’ అనే చంద్రహారాన్ని చేతిలో పట్టుకుని దారిన పోతున్న ఓటర్ని పిలిచింది. ‘నా దగ్గరికి వస్తే ఈ హారం నీదే’ అని చెప్పింది. ‘అయ్యా, చంద్రపులి, హారానికి ఆశపడితే నీకు ఆహారంగా మారుతానని నాకు తెలుసు’ అని వెళ్లిపోయాడు. నీతి: పథకాలు కూడా ఒక పథకమే - జి.ఆర్.మహర్షి