వెండితెరపై నా తెలంగాణ | Telangana movie directed by N Shankar | Sakshi
Sakshi News home page

వెండితెరపై నా తెలంగాణ

Published Wed, Mar 26 2014 1:33 AM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM

వెండితెరపై నా తెలంగాణ - Sakshi

వెండితెరపై నా తెలంగాణ

ఎన్.శంకర్... తెలంగాణ సినీ దర్శకుడు. ఎన్‌కౌంటర్ వంటి సూపర్ హిట్ సినిమాతో  మొద లైన ఆయన ప్రస్థానం...విభిన్న చిత్రాలతో ఉవ్వెత్తుకు ఎగసింది. ‘జైబోలో తెలంగాణ’తో లబ్దప్రతిష్టుడైన ఆయన వెండితెరపై నవ తెలంగాణ ఎలా ఉండాలో ఇలా విశ్లేషిస్తున్నారు...
 
 తెలుగు జాతి రెండుగా విడిపోయినా సినిమా రంగం మాత్రం ఒకటిగా ఉంటుంది. హైదరాబాద్ నుంచే రెండు రాష్ట్రాల్లోనూ తమ ప్రస్థానాన్ని కొనసాగించాలని సినీ నిర్మాతలు భావిస్తున్నారు. ఒకప్పుడు మద్రాసు నుంచే తెలుగు, తమిళ, కన్నడ, మళయాల సినీ పరిశ్రమ నడిచింది. ఇప్పుడు తెలంగాణ వచ్చినా పరిశ్రమ మాత్రం హైదరాబాద్ నుంచే కొనసాగుతుందని నిర్మాతలు, కళాకా రులు భావిస్తున్నారు. తెలంగాణ సంస్కృతిని, కళలను, భాషను, వ్యక్తిత్వాన్ని గౌరవించే సినిమాలు రావాల్సిన అవసరం ఉంది.  అయితే తెలంగాణకు చెందిన చాలామంది కళాకారులకు అలాంటి అవకాశాలు రాలేదన్న భావన ఉంది.  
 
 తరగని సాహిత్య సంపదకు నిలయం
 తెలంగాణలో కథలు, కథాంశాలు కోకొల్లలు. సాంస్కృతిక చరిత్ర అధికం. వీరగాధలు చాలా ఉన్నాయి. కథలకు ఉపయోగపడే ముడిసరుకు తెలంగాణలో ఎక్కువగా ఉంది. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి అనేక కథాంశాలను తీసుకుని సినిమాలు నిర్మించే వీలుంది. ఇప్పటివరకు రాయలసీమ ఫ్యాక్షన్, కోస్తాంధ్ర కథాంశాలతోనే సినిమాలు వచ్చాయి. తెలంగాణ పోరాటం నేపథ్యంతో వచ్చిన సినిమాలు పెద్దగా లేవు. తెలంగాణలో సాహిత్య చైతన్యం, రచయితల సృజనాత్మకత అద్భు తం. హాస్యం, డ్రామా, ఉద్వేగం, చరిత్ర, సమ్మక్క-సారక్క, రుద్రమదేవి వీరగాధలు ఉన్నాయి. వందల సినిమాలకు ఉపయోగపడే కళా సంపద ఇక్కడ ఉంది. 120 రకాల కళలు తెలంగాణలో ఉన్నాయి. అందులో 25 కళలు ఇంకా బతికున్నాయి. ప్రతి జిల్లాకు ఒక్కో ప్రత్యేకమైన కళా సంస్కృతి ఉంది. వాటన్నింటినీ సినిమాగా రూపొందించే కార్యాచరణ జరగాలి.  
 
 మూడంచెల వ్యవస్థను పునరుద్ధరించాలి
 ప్రస్తుత సినిమా భవిష్యత్ దళారుల చేతుల్లో చిక్కుకుపోయింది. సినిమా ఎన్ని రోజులు ఆడాలో కూడా వారే నిర్ణయిస్తున్నారు. కొన్ని సినిమాలకు మొదట్లో పెద్దగా ఓపెనింగ్స్ లేకున్నా టాక్‌ను బట్టి క్రమంగా కలెక్షన్లు పెరుగుతాయి. కానీ దళారులు మాత్రం మొదట్లో ఓపెనింగ్స్ రాకపోతే సినిమా హాలు అద్దె వృథా అని ఆ సినిమాను ఎత్తివేస్తున్నారు. ఇది చిన్న సినిమాల పాలిట శాపంగా మారుతోంది. సినిమా హాళ్లను దళారులకు లీజుకు ఇవ్వడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. సినిమా భవితవ్యాన్ని దళారులు నిర్ణయించడం తగ దు. సినిమా తలరాత వారి చేతుల్లో ఉండడం పరిశ్రమకు మంచిది కాదు. కాబట్టి పాత విధానంలోలా మూడంచెల వ్యవస్థ రావాలి. అప్పుడే తెలంగాణ సినిమాకు భవిష్యత్ ఉంటుంది.
 
 ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు చేస్తే..
 తెలంగాణ రాష్ట్రం ఉనికిలోకి వచ్చాక తామూ హీరో, హీరోయిన్లు అవ్వొచ్చని, సాంకేతిక నిపుణులుగా ఎదగొచ్చని యువతీ యువకులు కలలు కంటున్నారు. ‘జైబోలో తెలంగాణ’ సినిమా నిర్మాణానికి ముందు నిర్వహించిన ఆడిషన్ టెస్ట్‌కు పదివేల మందికిపైగా వచ్చారు. ఆడిషన్‌కే మూడు నెలలు పట్టింది. దీనిని బట్టి ఎంతమంది ఔత్సాహికులు ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఎంతటి కళాకారుడైనా శిక్షణ లేనిదే రాణించలేడు. కాబట్టి ప్రభుత్వమే హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఓ ఫిల్మ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేయాలి. చెన్నై, పుణెల్లో ప్రభుత్వ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లున్నాయి. చెన్నై ఇన్‌స్టిట్యూట్‌లో రజనీకాంత్, చిరంజీవి వంటి ప్రముఖ హీరోలు శిక్షణ తీసుకున్నారు. ఇక తెలంగాణ కళాకారులు తీసే సినిమాలకు ప్రత్యేకంగా పన్ను రాయితీలు కల్పించాలి. ఒకప్పుడు లండన్‌లో సినిమా షూటింగ్ జరిగినా రాయితీ ఇచ్చేవారు.
 
 అలాగే గుజరాతీ, భోజ్‌పురి భాషల్లో తీసే సినిమాలకు ఆయా రాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో రాయితీలు ఇచ్చేవారు. తమిళనాడులో కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమిళ టైటిల్ పెట్టిన సినిమాలకు పన్ను రాయితీ కల్పించారు. అగ్రహీరో రజనీకాంత్ సినిమా ‘రోబో’ను తమిళ పేరు ‘ఎందిరన్’ (యంత్రం) అని తమిళ టైటిల్ పెట్టినందుకే కరుణానిధి పన్ను రాయితీ కల్పించారు. సబ్సిడీ, పన్ను రాయితీ ఇస్తే సినిమాలు తీసేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నారు.
 
నవ తెలంగాణ: పోల్‌కేక
 టీకొట్టు వ్యాఖ్య

 ఎండలకు జనం ఫ్యాన్‌గాలిని కోరుకుంటున్నారు.
 
 కొత్త సామెత
 కొట్టక్కరలేదు, తిట్టక్కరలేదు కాంగ్రెస్ టికెట్ ఇస్తే వాడే కాలిపోతాడు.
 మాటకు మాట కొత్తవారికి పగ్గాలిస్తాం
 - రఘువీరారెడ్డి

పగ్గాలు సరే, గుర్రమెక్కడిది?
 మాజీ కాంగ్రెస్ నాయకుడి ఆవేదన
 టైర్లు, గేర్లు లేని బస్సులో
 యాత్రకు బయలుదేరింది
 మా కాంగ్రెస్ పార్టీ.
 
 కాంగ్రెస్ పార్టీకి ఇష్టమైన పాటలు
 అయ్యయ్యో చేతిలో పవర్ పోయెనే అయ్యయ్యో పార్టీ ఖాళీ ఆయెనే
 ఢిల్లీయే మాయ, సోనియానే మాయ
 కాంగ్రెస్‌లో సారమింతేనయా!
 
 సమైక్యాంధ్ర పార్టీ నినాదం
 పోటీచే స్తే పోయేదేమీ లేదు డిపాజిట్లు తప్ప
 
 పిట్ట కథ
 ఒక ముసలిపులి ‘పథకాలు’ అనే చంద్రహారాన్ని చేతిలో పట్టుకుని దారిన పోతున్న ఓటర్ని పిలిచింది. ‘నా దగ్గరికి వస్తే ఈ హారం నీదే’ అని చెప్పింది.
 ‘అయ్యా, చంద్రపులి, హారానికి ఆశపడితే నీకు ఆహారంగా మారుతానని నాకు తెలుసు’ అని వెళ్లిపోయాడు.
 నీతి: పథకాలు కూడా ఒక పథకమే
 
 - జి.ఆర్.మహర్షి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement