హైకోర్టును మోసం చేశారు | Brokers who cheated in name of houses during TDP government regime | Sakshi
Sakshi News home page

హైకోర్టును మోసం చేశారు

Published Mon, Oct 11 2021 2:57 AM | Last Updated on Mon, Oct 11 2021 4:17 PM

Brokers who cheated in name of houses during TDP government regime - Sakshi

నిజమేనా...? అత్యున్నత న్యాయస్థానాన్ని,రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఏకంగా న్యాయ వ్యవస్థనే ఈ స్థాయిలో మోసం చేయడం సాధ్యమా? దుర్మార్గపుటెత్తుగడలతో... అమాయకుల పేరిట.. వారికి తెలియకుండా పిటిషన్‌ తయారు చేసి... 31 లక్షల మంది నిరుపేదల సొంతిళ్లకు బ్రేకులేశారంటే ఏ స్థాయి దుర్మార్గమిది? నిరుపేదల ఆశలను చిదిమేయడానికి కంకణం కట్టుకున్న నయవంచన ఎవరిది? వారి వెనకున్న కుట్రదారులెవరు? 

అయినా వీళ్ల కక్ష ఎవరిమీద? ఓ 50–70 గజాల్లో ఉండటానికింత పైకప్పు వేసుకుంటున్న నిరుపేదల మీదా? లేక వారి సొంతింటి కలలకు పూచీదారుగా నిలుచున్న ప్రభుత్వం మీదా? ఉన్నత న్యాయస్థానాల్లోనే ఈ అరాజకీయ క్రీడలు మొదలెట్టేశారంటే వీళ్లనేమనుకోవాలి? వీరు వ్యతిరేకిస్తున్నది తమ రాజకీయ ప్రత్యర్థులనా? లేక ప్రజలనా?

ఇల్లు కట్టుకోబోతున్నాం నేనెందుకు కేసు వేస్తా?
మల్లేశ్వరరావు అనే వ్యక్తి ఇళ్లస్థలాలు ఇప్పిస్తానని చెబితే ఆధార్, రేషను కార్డు ఇచ్చా. సంతకం చేయించుకున్నాడు. చాలా ఏళ్లయింది. ఎప్పుడు అడిగినా వస్తాయి... వస్తాయి అనేవాడు. తర్వాత ఆ విషయమే మర్చిపోయాం. ఇప్పుడు నా భార్య పేరిట నేలపాడులో ఇంటి స్థలం వచ్చింది. ఇల్లు కట్టుకోబోతున్నాం. కోర్టులో కేసు విషయం మాకు తెలీదు. మేమెందుకు వేస్తాం? ఆ పిటిషన్‌తో సంబంధం లేదు. 
– పొదిలి శివమురళి, పిటిషనర్‌ నంబర్‌–1గా పేర్కొన్న వ్యక్తి.

సాక్షి, ప్రతినిధి గుంటూరు/తెనాలి: 27 వేల కోట్ల రూపాయల విలువైన భూముల్ని... 31 లక్షల మందికి కేటాయించి... ఊళ్లను తలపించే కాలనీలు కట్టడానికి సంకల్పించింది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. నిజానికిది గత ప్రభుత్వాల ఊహలక్కూడా అందని విషయం. ప్రభుత్వ దృఢదీక్షతో స్థలాల కేటాయింపు పూర్తయి... తొలిదశలో 15.6 లక్షల మంది ఇళ్ల నిర్మాణాలూ మొదలయ్యాయి. కాకపోతే దీనిపై గుంటూరు జిల్లా తెనాలిలోని పొదిలి శివమురళి, మరో 128 మంది పేరిట పిటిషన్‌ దాఖలైంది. మహిళల పేరిటే ఎందుకివ్వాలి? ఇళ్లు చిన్నవికదా? ఆ ఇళ్ల సదుపాయాల సంగతేంటి? ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్న ఈ పిటిషన్‌పై విచారణ... వాదనలూ పూర్తయి... ఇళ్ల నిర్మాణాలన్నింటినీ తాత్కాలికంగా నిలిపేయాలంటూ న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తి ఈ నెల 8న ఆదేశాలిచ్చారు. దీనిపై రాష్ట్రప్రభుత్వం హైకోర్టులో హౌస్‌మోషన్‌ దాఖలు చేసింది.

ఈ విషయాలన్నీ పత్రికల్లో చూసే వరకూ అసలు తమ పేర్లతో పిటీషన్‌ వేసినట్లు తెనాలి వాసులకు తెలియదు. దీంతో... తాము పిటిషన్‌ వేయకున్నా తమ పేర్లు వినిపిస్తున్నాయంటూ కొందరు ‘సాక్షి’ని ఆశ్రయించారు. వారి వద్దకు వెళ్లి ఒక్కొక్కరినీ ఆరా తీసేసరికి నిర్ఘాంతపోయే నిజాలు బయటపడ్డాయి. ‘‘అయ్యా! ఈ పిటిషన్‌తో మాకెలాంటి సంబంధమూ లేదు. ఈ ప్రభుత్వ హయాంలో నా భార్యకు స్థలమిచ్చి ఇల్లు మంజూరు చేశారు. కట్టుకుంటున్నాం. మా ఇంటిని మేమే నిలిపేసుకుంటామా?’’ అనేది ప్రధాన పిటిషనర్‌గా (నెంబర్‌–1) పేర్కొన్న పొదిలి శివ మురళి ప్రశ్న. మరి మురళికి సంబంధం లేకుండా తన పేరిట పిటిషన్‌ ఎవరు వేశారు? వారికి కావాల్సిందేంటి? వారి వెనక ఎవరున్నారు? పేదల ఇళ్లపై ఎందుకింత పెద్ద కుట్ర చేశారు?

న్యాయ ప్రక్రియ అపహాస్యం...
అన్యాయం జరిగిన వారికి న్యాయం చెయ్యటమే కోర్టుల పరమోద్దేశం. దానికోసమే న్యాయ ప్రక్రియ. మరి ఈ ప్రక్రియ మొత్తాన్ని అపహాస్యం చేసి... ఓ 31 లక్షల మందికి అన్యాయం చేయాలనే ఉద్దేశంతో కోర్టులనే మోసం చేస్తే ఏమనుకోవాలి? ప్రధాన పిటిషనర్‌గా ఉన్న శివ మురళి మాత్రమే కాదు. అఫిడవిట్‌ దాఖలు చేశారంటూ పేర్కొన్న గోపిది కూడా ఇదే మాట. ‘‘ఆరేళ్ల కిందట ఓ వ్యక్తి ఇంటి స్థలం ఇíప్పిస్తానని తలా రూ.5వేలు తీసుకున్నాడు. ఆధార్, రేషన్‌ కార్డులు తీసుకుని సంతకాలు చేయించుకున్నాడు.

కాళ్లరిగేలా తిప్పించుకున్నాడు కానీ ఇప్పటికీ ఏమీ జరగలేదు. మోసపోయానని తెలిసినా పోలీసుల దగ్గరికే వెళ్లలేకపోయా. కోర్టులో కేసు ఎలా వేస్తా?’’ అనేది గోపి ప్రశ్న. దీన్నిబట్టే న్యాయప్రక్రియను ఎంత దుర్వినియోగం చేశారో అర్థంకాకమానదు. ఇక పిటిషన్లో 14, 15 పేర్లుగా ఉన్న షేక్‌ నయాబ్‌ రసూల్, షేక్‌ మాబులా ప్రస్తుతం ఉపాధి కోసం వేరే ఊరు వెళ్లారు. ఫోన్లోనే మాట్లాడారు. ‘‘నాలుగేళ్ల కిందట ఇంటి స్థలం కోసం ఎం.ఎస్‌.రావు అనే వ్యక్తికి రూ.25 వేలు, «ధ్రువపత్రాలు కూడా ఇచ్చా’’ అని నయాబ్‌ చెప్పగా... అదే వ్యక్తికి రూ.40 వేలు ఇచ్చానని మాబులా చెప్పాడు. ‘‘ఈ ప్రభుత్వం మా ఇంటి ఆడవారి పేరిట ఇంటిస్థలం ఇచ్చింది. మేమెందుకు కేసు వేస్తాం?’’ అని ఇద్దరూ ఎదురు ప్రశ్నించారు.

అప్పుడు దళారుల చుట్టూ... ఇçప్పుడు కోర్టు రికార్డుల్లో
పలువురు పిటిషనర్లు ‘సాక్షి’ని సంప్రదించాక... వారందరితో మాట్లాడాక ఒక విషయం ప్రధానంగా అర్థమయింది. దాదాపు పిటిషనర్లంతా దీంతో తమకు సంబంధం లేదన్నవారే. పైపెచ్చు అందరూ ఐదారేళ్ల కిందట టీడీపీ హయాంలో సొంత ఇంటి కోసం దళారుల చుట్టూ తిరిగి, ఒక్కొక్కరూ పరిస్థితిని బట్టి రూ.5వేల నుంచి రూ.40 వేల వరకూ లంచంగా ముట్టజెప్పిన వారే. ఆ క్రమంలో చాలామంది తమ ఆధార్‌ కార్డులు, రేషన్‌ కార్డులు ఇవ్వటంతో పాటు పలు పత్రాలపై సంతకాలు కూడా చేశారు. తెనాలిలోని కొత్తపేట, మారీసు పేట, సీబీఎన్‌ కాలనీల్లో ఒక్కోచోట ఒక్కో దళారీ ఈ విధంగా పేదలపై ఇళ్లస్థలం పేరుతో వల వేశారు. స్థలం రాకపోగా, డబ్బులూ తిరిగివ్వలేదు. ఏళ్లు గడిచేసరికి ఆ విషయమే మర్చిపోయారు. వీరంతా పేదలే.  కానీ వారి పేర్లు పిటిషనర్లుగా ప్రత్యక్షమయ్యాయి. ఈ మొత్తం ప్రక్రియను నడిపించింది కొందరైతే... వారి వెనక బలంగా నిలుచున్న శక్తులు మాత్రం వేరే ఉన్నట్టు స్పష్టంగానే తెలియకమానదు.

మేమెలాంటి కేసూ వేయలేదు...
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో తహశీల్దారు ఆఫీసు దగ్గరకు తరచూ వెళుతూ... పనులు చేయిస్తుండే ఓ బ్రోకర్‌ కలిశాడు. ఇంటిస్థలం ఇప్పిస్తానన్నాడు. తలా రూ.5 వేలు తీసుకున్నాడు. ఆధార్‌ కార్డులు, రేషను కార్డులు ఇచ్చాం. సంతకాలు చేయించుకున్నాడు. ఇది జరిగి ఆరేడు సంవత్సరాలవుతోంది. ఇదిగో వస్తాయనేవాడు. నాలుగైదు నెలల కిందట అడిగితే నవరత్నాల కింద ప్రభుత్వం ఇస్తుందని చెప్పాడు. ఇపుడు నేనూ, నా భార్య విడిపోయాం. మేమెవ్వరం కోర్టులో ఎలాంటి కేసూ వేయలేదు. 
    – గుండిమెడ గోపి, చినరావూరు పార్కు రోడ్డు, తెనాలి

కేసుల సంగతి మాకేం తెలీదు...
కోర్టులో కేసు సంగతి నాకేం తెలీదు. అదెలా జరిగిందో అర్థంకావటం లేదు. ఈ ప్రభుత్వంలో నాకు అమ్మ ఒడి డబ్బులు వచ్చాయి. కాపు నేస్తం కింద సాయం అందింది. ఇంటిస్థలం కూడా వచ్చింది. నేనెందుకు కేసు వేస్తాను?
    – శానంశెట్టి వాణి, మారీసుపేట, తెనాలి

ఎవరికీ ఆధార్‌ కార్డు, రేషను కార్డు ఇవ్వలేదు...
నాకు అమ్మ ఒడి డబ్బులు పడ్డాయి. ఇంటి స్థలం పట్టా ఇచ్చారు. భర్త తిరుపతిరావు తాపీ పని. నేను టైలరింగ్‌ చేస్తాం. నేనెలాంటి కేసూ వేయలేదు. మాకేం అవసరం? రోజు కష్టంమీద బతికే వాళ్లం. మా ఆధార్‌ కార్డు, రేషను కార్డు కూడా ఎవరికీ ఇవ్వలేదు.
    – చైని సుభాషిణి, సీబీఎన్‌ కాలనీ, తెనాలి

పోలీసు స్టేషన్‌కే వెళ్లలేని వారు కోర్టుకా?
టీడీపీ హయాంలో కొందరు దళారులు ఇళ్లస్థలాల పేరుతో మా సంఘంలోని పేదలను మభ్యపెట్టి డబ్బులు కాజేశారు. వాళ్లకు జరిగిన మోసంపై పోలీసులను కూడా ఆశ్రయించలేని ఆ పేదలు ప్రభుత్వంపై కోర్టుకెలా వెళతారు? దీనిపై లోతుగా విచారణ చేయించాలి.     
    – రిమ్మనపూడి నరసింహారావు, తెనాలి నాయీబ్రాహ్మణ సేవాసంఘం

ప్రభుత్వం ధర్మాసనం దృష్టికి తేవాలి...
కోర్టులో వేసిన కేసుతో సంబంధం లేదని పిటిషనర్లు చెబుతున్నారు కనుక ఆ విషయాన్ని ప్రభుత్వం తన అప్పీల్‌లో ధర్మాసనం దృష్టికి తీసుకురావాలి. కేసుతో సంబంధం లేదన్న విషయాన్ని అఫిడవిట్‌ల రూపంలో కోర్టు ముందుంచాలి. పిటిషనర్లకు తెలియకుండా, వారి ప్రమేయం లేకుండా వారి పేరుతో పిటిషన్‌ దాఖలు చేయడం కోర్టును మోసం చేయడమే.     
    – సీవీ మోహన్‌రెడ్డి, సీనియర్‌ న్యాయవాది

ఏదో జరిగి ఉండాలి...
పిటిషనర్లే ఆ పిటిషన్‌తో సంబంధం లేదంటున్నారంటే దీని వెనుక ఏదో జరిగి ఉండాలి. పిటిషనర్లను మోసం చేసి వారి సంతకాలను దుర్వినియోగం చేసి ఉండాలి. వారి సంతకాలు తీసుకున్నది ఎవరు..? వారి తరఫున కేసు ఫైల్‌ చేసిన అడ్వొకేట్‌ ఆన్‌ రికార్డ్‌ ఎవరు? పిటిషనర్ల సంతకాలు సరైనవేనా? తదితర విషయాలపై విచారణ జరపాల్సిన అవసరం ఉంది. పిటిషనర్ల సమ్మతి లేకుండా పిటిషన్‌ దాఖలు చేయడం కోర్టును మోసం చేయడమే. కోర్టు ధిక్కారం కిందకు వస్తుంది. పిటిషనర్లంతా కేసుతో సంబంధం లేదని అఫిడవిట్‌లో చెబితే, అసలు తీర్పే అమల్లో ఉండదు. 
    – సర్వ సత్యనారాయణ ప్రసాద్, సీనియర్‌ న్యాయవాది 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement