World Telugu Writers Conference
-
‘ఇచ్చిన మాట కోసమే మహాసభలకు వెళ్లలేదు..’
సాక్షి, తెనాలి : సినిమా దర్శకుడిగా భగవంతుడు నిర్దేశించిన సేవను భక్తిప్రవత్తులతో ఆచరించానని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, కళాతపస్వి కె.విశ్వనాథ్ పేర్కొన్నారు. భగవంతుడు తననొక దర్శకుడిని చేసి, సినిమా మీడియా అనే బస్సులోని భక్తులను జాగ్రత్తగా సినిమా అనే పుణ్యక్షేత్రానికి తీసుకెళ్లమని చెప్పగా దానిని పాటించానన్నారు. ఎన్వీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి తెనాలిలోని నాజరుపేట ఎన్వీఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఆయన నన్నపనేని వెంకట్రావు విశిష్ట అవార్డు స్వీకరించి మాట్లాడారు. తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ విశ్వనాథ్‌కు అవార్డు అందజేశారు. తల్లి బిడ్డకు అన్నం పెట్టేటప్పుడు విషం పెట్టదని, పాల బువ్వ పెడుతుందన్నారు. తానూ కూడా అదే పని చేస్తున్నానన్నారు. ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ.. కులమత కుడ్యాలను ఛేదించాలని విశ్వనాథ్ తన చిత్రాల్లో చూపించారన్నారు. అనంతరం రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనందబాబు, ఎమ్మెల్యే ఆలపాటి రాజా మాట్లాడారు. ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఎల్‌ఆర్‌ఎం క్లబ్ సభ్యులు ఆర్థికసాయం అందజేశారు. ఎన్వీఆర్ ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి, ట్రస్ట్ కార్యదర్శి మారౌతు సీతారామయ్య, నన్నపనేని భాగ్యలక్ష్మి, సూర్యకుమారి, సుగుణ తదితరులు పర్యవేక్షించారు. ఇచ్చిన మాట కోసమే తెలుగు మహాసభలకు వెళ్లలేదు.. ‘ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం తెలుగువారి ధర్మం.. అందుకే హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలకు వెళ్లలేకపోయా..’నని ప్రముఖ సినీ దర్శకుడు, కె.విశ్వనాథ్ తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలో సోమవారం రాత్రి సోషలిస్టు ఉద్యమనేత నన్నపనేని వెంకట్రావు విశిష్ట అవార్డును రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ చేతుల మీదుగా స్వీకరించి మాట్లాడారు. హైదరాబాద్ రావాలంటూ ఆదివారం సాయంత్రం తనకు ఆహ్వానం అందిందని, కొన్ని నెలలముందే తెనాలి ఎన్వీఆర్ ట్రస్ట్‌కు మాట ఇచ్చినందున రాలేకపోతున్నట్లు నిర్వాహకులకు చెప్పానన్నారు. -
ఒద్దిరాజు సోదరులు
మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తికి చెందిన సీతారామచంద్రారావు, ఒద్దిరాజు రాఘవరావులు ఒద్దిరాజు సోదరులుగా ప్రసిద్ధి చెందారు. తెలుగు, ఆంగ్లం, సంస్కృతం, ఉర్దూ, పారశీ భాషల్లో పాండిత్యం సంపాదించారు. ‘విజ్ఞాన ప్రచారిణి’ పేరుతో గ్రంధమాలను నిర్వహించారు. ఎంతో ధైర్యసాహసాలతో 1922 ఆగస్టులో ‘తెనుగు’ అనే వారపత్రికను స్థాపించారు. వారే çస్వయంగా సైకిల్‌పై తిరుగుతూ పత్రికను విక్రయించేవారు. 1000 ప్రతులను ముద్రించేవారు. ఆరేళ్ల పాటు ఈ పత్రిక నడిచింది. ఒద్దిరాజు సోదరులు కొన్ని సాంప్రదాయ రచనలు చేశారు. ప్రబంధ పద్యాలు రాశారు. చారిత్రక నవలలతో దేశభక్తిని, త్యాగనిరతిని ప్రబోధించారు. సాంఘిక నాటకాల ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ‘నౌకాభంగం’ నవలను తెనిగించారు. షడ్రుచుల ‘పద్యా’న్నం! లింగ నిషిద్ధు కల్వల చెలింగని మేచక కంధరున్ త్రిశూ లింగని సంగతాళి లవలింగని కర్దమ దూషితం మృణా లింగని కృష్ణచేలుని హలింగని నీలకచన్ విధాతృ నా లింగని రామలింగ కవిలింగని కీర్తి హసించు వేడుకన్ పద్యాల్లో కొన్నిటికి అర్థం వల్ల మరికొన్నింటికి శబ్దవైచిత్రి వల్ల పేరొస్తుంది. ఈ చాటు పద్యం రెండో కోవకు చెందుతుంది. తెనాలి రామలింగడికి ధిషణాహంకారం ఎక్కువ. పద్యంలో లింగ శబ్దం ప్రతిసారి మరోపదంతో కలిసి చూసి అనే అర్థంలోనే తళుక్కు మంటుంటుంది. చంద్రునికి మచ్చ ఉంది, శివుని కంఠం నలుపు, తెల్లని లవలీ తీగ మీద నల్లని తుమ్మెదలు. తామరతూటికేమో బురద. నల్లని వస్త్రంలో తెల్లని బలరాముడు. ధవళం ధగధగలాడే సరస్వతి జట్టు నల్లన. చూశారా...ఎంత తెల్లగా ఉన్నా... వారికి ఏదో నలుపు అంటక తప్పలేదు. రామలింగని కీర్తిమాత్రం తెల్లగా నవ్వుతోంది! ..: రామదుర్గం -
ఇలా చేద్దాం...!
తెలుగు భాషది ఎంతో గొప్ప చరిత్ర.. ప్రాచీన హోదా ఉంది. భాషా వైభవం ఇదని, మరే ఇతర ప్రపంచ భాషకూ తీసిపోని సంపూర్ణత్వం తెలుగు భాషకుందని చాటి చెప్పాలి. స్ఫూర్తి పంచాలి. కానీ, అది మాత్రమే సరిపోదు. ప్రభుత్వాలు ఈ నిజాన్ని గ్రహించాలి. భాషను భద్రంగా భవిష్యత్తరాలకు అందించాలంటే.... తెలుగు జాతికి ఒక నమ్మకం కలిగించాలి. తెలుగును నేర్చుకోవడం వల్ల, తెలుగే మాధ్యమంగా పిల్లలకు ప్రాథమిక విద్యాభ్యాసం చేయించడం వల్ల పూర్ణవికాసం సాధ్యమనే విశ్వాసం కలిగించాలి. ఇంగ్లీషు మాధ్యమంగా ప్రాథమిక విద్య నేర్చిన వారి కన్నా తెలుగులో చదివితే ఏ విధంగాను నష్టపోము అన్న భరోసా తల్లిదండ్రులకు, సమకాలీన సమాజానికి కల్పించాలి. ప్రపంచంలో అభివృద్ధి చెందిన అన్ని దేశాలూ మాతృభాషలోనే ప్రాథమిక విద్యనేర్పడం వల్ల అంతటి సృజన పరిఢవిల్లుతోందని శాస్త్రీయ పరిశోధనల్లో వెల్లడైన విషయాల్ని తెలియపరచాలి. అది సాకారం కావడానికి అవసరమైన వనరుల అందుబాటు, సాధన సంపత్తి సమకూర్చడం, ప్రోత్సాహకాలివ్వడం వంటివి ప్రభుత్వం నిరంతరం చేయాలి. ఇవి కొరవడటం వల్లే నమ్మకం సన్నగిల్లి అత్యధికులు తమ పిల్లలను తెలుగుకు దూరం చేస్తున్నారు. ఇంగ్లీషులో పెంచుతున్నారు. తెలుగుపై ప్రేమ, అభిమానం ఉండీ... ఇంగ్లీషుతోనే భవిష్యత్తు అనుకుంటున్నారు. తెలుగు లేకపోయినా ఒరిగే నష్టం ఏమీ ఉండదని భావిస్తున్నారు. తెలుగు గొప్పతనం తెలియక కాదు. తెలుగుకింత వైభవముందని గ్రహించక కాదు. తెలుగులో తగిన సాంకేతిక సమాచారం లభించదు, పుస్తకాలుండవు, తర్జుమాలు–అనువాదాలు సరిగ్గా జరుగవు, పారిభాషిక పదకోశాలు దొరకవు, పరిశోధనలు లేవు. ఆధునికమైన ఏ అంశమూ తెలుగు భాషలో లభించదు... ఇటువంటి పరిస్థితుల్లో ఎవరికి నమ్మకం కలుగుతుంది? ఆ నమ్మకం పెంచే కృషి నిరంతరం జరగాలి. . .: దిలీప్‌రెడ్డి -
ముచ్చటగా మూడో మహాసభల్లో..
1975, 2012లో జరిగిన రెండు తెలుగు మహాసభల్లో పాల్గొన్న ఈయన ఈసారి మూడోసభల్లోనూ పాలుపంచుకోనున్నారు. ఈ సందర్భంగా గత సభల ద్వారా తెలుగు భాషకు, సాహిత్యానికి జరిగిన ప్రయోజనాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ విశేషాలివీ.. మొదటి సభలతో... వివిధ రాష్ట్రాలలో ఉన్న ఆంధ్ర సాంస్కృతిక సంస్థలను ఒకే వేదిక మీదకు చేర్చే ప్రయత్నం జరిగింది. అంతర్జాతీయ తెలుగు సంస్థ ద్వారా భాషాభివృద్ధికి చేయూత లభించింది. అజ్ఞాతంగా ఉండిపోయిన శంకరంబాడి సుందరాచారి రచన ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ గేయం ప్రాచుర్యంలోకి వచ్చి రాష్ట్రగీతంగా గుర్తింపునకు నోచుకుంది. తెలుగు బోధనాభాషగా అభివృద్ధి చెంది తెలుగు అకాడమీ కార్యకలాపాలు విస్తరించాయి. ఆ తర్వాత మలేషియా తదితర ప్రాంతాలలో జరిగిన మహాసభలతో అంతర్జాతీయ స్థాయిలో తెలుగు గుర్తింపు పొందింది. రెండవ సభలు తిరుపతిలో 2012, డిసెంబర్లో జరిగిన ఈ సభలకు దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రతినిధులు హాజరయ్యారు. అదొక భాషా బ్రహ్మోత్సవంగా జరిగాయి. ఈ సభల ద్వారా... ► అప్పటికి తెలుగు భాషలో సంస్కృతి, భాష, కళలు, సంగీతం, నాటికలు, అష్టావధానాలు... వంటి ప్రక్రియలు విస్తరించాయి. వాటన్నింటినీ ఒకే వేదిక మీదపై పంచుకునే వీలు కలిగింది. ► తెలుగు అకాడమీ చైర్మన్ యాదగిరి ఆధ్వర్యంలో వందకు పైగా తెలుగు సాహిత్యాల మోనోగ్రాఫ్‌లు వచ్చాయి. ► అమెరికా వంటి దేశాలలో తెలుగు నేర్చుకునే విద్యార్థులకు ‘తెలుగుబడి’ వంటి కార్యక్రమాలకు వ్యాప్తి జరిగింది. ఈ సభలు ఎలా ఉండనున్నాయంటే! ఇలాంటి సభల ద్వారా ఎందరో వర్ధమాన, ప్రసిద్ధ, అజ్ఞాత రచయితలకు కళాకారులకు ప్రచారం లభిస్తుంది. అజ్ఞాతంగా ఉన్న ఎందరో తెలంగాణ కళాకారులకు తమ గళం విప్పే అవకాశం వస్తుంది. ఈ సభలు కాంతులు వెదజల్లి భాషా సంస్కృతులను ప్రపంచ వేదికలపైకి చేరుస్తాయి. – డాక్టర్ రేవూరు అనంతపద్మనాభరావు, అష్టావధాని, దూరదర్శన్ మాజీ అడిషనల్ డైరెక్టర్ ..: వాకా మంజుల -
అక్షరాలా పండుగే..
దేవరకద్ర రూరల్: అరవై నాలుగేళ్ల క్రితం రవాణా సౌకర్యాలు కూడా లేని పాలమూరు జిల్లా మారుమూల ప్రాంతంలో రాష్ట్రస్థాయి సాహిత్య సభలను దిగ్విజయంగా నిర్వహించారంటే ఆశ్చర్యం కలగక మానదు! ఇప్పటి జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లో 1953లో ఈ సభలు జరిగాయి. ఈ సభల కోసం ఉపరాష్ట్రపతినే ఆహ్వానించడం, అలంపూర్ సభలకు వచ్చే సాహిత్య ప్రముఖుల కోసం ప్రత్యేక రైలు ఏర్పాటు చేయడం, 4 వేల మందికి పైగా హాజరైన అతిథులకు ఎలాంటి లోటు లేకుండా భోజన, వసతి కల్పించడం విశేషం. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన గడియారం రామకృష్ణ శర్మ రాసిన శతపత్రం పుస్తకంలో ఈ వివరాలు ఉన్నాయి. ఆ విశేషాలు ఇవీ... వంటకాల్లో లడ్డూ, పులిహోర సభలకు వచ్చే అతిథులకు చక్కని ఆతిథ్యం ఇవ్వడానికి శ్రీశైలం నుంచి 13 మంది వంట మనుషులను రప్పించారు. పూటకు 4 వేల మంది భోజనం చేస్తారని భావించగా.. 30 వేల మంది వరకు హాజరయ్యారు. అయినా ఎక్కడా లోటు లేకుండా భోజనాలు సమకూర్చారు. అది సంక్రాంతి సమయం కావడంతో ఆహూతులందరికీ లడ్డూ, పులిహోరా వడ్డించారు. ప్రత్యేక రైలుకు రూ. 5వేలు ఉపరాష్ట్రపతితో పాటు రాష్ట్ర మంత్రిమండలి సభ్యులు సభలకు హాజరయ్యారు. ఇందుకు రూ.5 వేలు చెల్లించి ప్రత్యేకంగా రైలు బుక్ చేశారు. నిజాం నవాబు ఉపయోగించే ప్రత్యేక బోగీలో ఉపరాష్ట్రపతి సర్వేపల్లితో పాటు మంత్రిమండలి సభ్యులు హాజరయ్యారు. అలంపూర్‌కు చేరిన సర్వేపల్లికి సాహితీ ప్రముఖులు ఘనస్వాగతం పలికారు. ఈ రైల్లో వచ్చిన 700 మందిని ట్రక్కుల్లో అలంపూర్ చేర్చారు. అనంతరం సర్వేపల్లి సభలను లాంఛనంగా ప్రారంభించారు. దేవులపల్లి రామానుజరావు అధ్యక్షతన జరిగిన ప్రారంభ సమావేశానికి గడియారం రామకృష్ణశర్మ స్వాగతం పలకగా సర్వేపల్లి తెలుగులో స్వాగత వచనాలు పలకడం విశేషం. నాలుగు రోజులు అంగరంగవైభవంగా 1953 జనవరి 11, 12, 13, 14వ తేదీల్లో నాలుగు రోజుల పాటు ఆంధ్రసారస్వత పరిషత్ ఏడో వార్షికోత్సవ సభలను నిర్వహించారు. అప్పట్లో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న రామానుజరావు.. ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను ఈ సభలకు హాజరయ్యేలా ఒప్పించారు. ముఖ్యమంత్రిగా ఉన్న బూర్గుల రామకృష్టారావు పూర్తిగా సహకరించారు. నెలరోజుల పాటు సమాచార శాఖకు సంబంధించి మినీ బస్సులు ఉపయోగించుకునేందుకు అనుమతి ఇచ్చారు. 200 సినిమా హాళ్ల ద్వారా ప్రచారం ఈ సభల నిర్వహణ సమాచారం తెలిసేలా ఉమ్మడి రాష్ట్రంలోని రెండు వందల సినిమా హాళ్లలో స్లైడ్ల ద్వారా ప్రచారం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గోడపత్రికలు, కరపత్రాలను పంపిణీ చేశారు. కాళోజీ ‘నా గొడవ’ ఆవిష్కరణ ఈ సభల్లోనే ప్రజాకవి కాళోజీ రాసిన ‘నా గొడవ’ కవితా సంపుటిని ప్రముఖ కవి శ్రీశ్రీ ఆవిష్కరించారు. సాహిత్య చర్చలతో పాటు ప్రముఖుల రాకతో సభా ప్రాంగణాలు కళకళలాడాయి. -
వెల్లివిరిసిన భాషా చైతన్యం
అతిరథ మహారథులతో కళకళలాడిన తెలుగు రచయితల మహాసభలు ఆలోచన, హాస్యం మేళవించిన బ్రహ్మానందం ప్రసంగం చదివించే రచనలు రావాలన్న జస్టిస్ రమణ ముగిసిన ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు విజయవాడ : గజురంలో రెండు రోలపాటు జరిగిన ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో భాషా చైతన్యం వెల్లివిరిసింది. వేషధారణలో తెలుగుదనం కనిపించడమే కాకుండా వక్తలు చేసిన ప్రసంగాలు పలువురిలో చైతన్యాన్ని నింపాయి. ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమైన సభలు రాత్రి పది గంటలకు ముగిశాయి. సినీ కళాకారులు బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, గొల్లపూడి మారుతీరావులు పలువురు సాహితీవేత్తలతో కలియతిరిగారు. గొల్లపూడి, తనికెళ్ల రెండు రోజులూ సభల్లో పాల్గొనగా బ్రహ్మానందం ఆదివారం వచ్చారు. ముగింపు సభ రాత్రి ఏడు గంటల వరకు జరిగింది. ఈ సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ, రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, గంటా శ్రీనివాసరావు, పల్లె రఘునాథరెడ్డి, కొల్లు రవీంద్ర, ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాసరావు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మేయర్ కోనేరు శ్రీధర్ , కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ విశ్వనాథ ప్రసాద్ తివారీ, సాక్షి మీడియా గ్రూప్ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి, సీనియర్ జర్నలిస్టులు ఎ.కృష్ణారావు, శంకరనారాయణ, అభ్యుదయ కవయిత్రి డాక్టర్ ఓల్గా, సభల నిర్వాహకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, గుత్తికొండ సుబ్బారావు, జీవీ పూర్ణచంద్ పాల్గొన్నారు. మంచి రచనలు చేస్తే ఎవరైనా చదివేందుకు ఉత్సుకత చూపుతారని, దీనివల్ల భాషా ప్రచారం విశ్వవ్యాప్తమవుతుందని అతిథులు తమ ప్రసంగాల్లో వివరించారు. రాచకొండ రచనలు ఆలోచింపజేస్తాయి : జస్టిస్ ఎన్వీ రమణ ‘తెలుగు భాష ఎంతో ఉన్నతమైనదని గత రచనలు చెబుతున్నాయి. ఇప్పుడు వస్తున్న రచనల్లో ఆ పటుత్వం లేదు. సాహిత్యం అంతకన్నా లేదు. ఉత్తేజం తెచ్చే రచనలు రావడం లేదు. అందుకు కొంచెం బాధగా ఉంది’ అని సుప్రీంకోర్టు జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. తాను అభిమానించే కవుల్లో రాచకొండ విశ్వనాథశాస్త్రి ఒకరని చెప్పారు. ఆయన ఎంతో గొప్పవారని, ఆయన రచనలు ఆలోచింప చేస్తాయని తెలిపారు. ఆయన సారా వ్యతిరేక ఉద్యమ సమయంలో రాసిన ఆరు సారా కథలు తనకు నచ్చాయన్నారు. అందులో ఒక కథ చాలా బాగా నచ్చిందని చెబుతూ.. ఏదో ఒక పనిచేయాలనుకునే వాడికి విశ్వనాథశాస్త్రి చెప్పిన కథలోని ఒక అంశాన్ని చదివి వినిపించారు. ‘న్యాయస్థానంలో ఏమి జరుగుతుందో వివరిస్తూ.. నీకు ఏదో ఒక పనిచేయాలని ఉంటే ఉదయం గేటు వేసేచోట ఉండు, సాయంత్రం గేటు మూసే చోట ఉండు. మధ్యలో ఎక్కడికీ వెళ్లకు, వెళితే నీవు అనుకున్నది సాధించలేవు. అక్కడ జరుగుతున్నవి చూసిన తరువాత ఏమి చేయాలో తెలుస్తుంది’ అని వివరించిన తీరు కళ్లకు కట్టినట్లు ఉందని చెప్పారు. విశ్వనాథశాస్త్రి రాసిన ఆ కథలోని రెండు పేరాలు చదివి వినిపించారు. కోర్టుల్లో తీర్పులు తెలుగులోనే రావాలని తాను చేపట్టిన ఉద్యమం కొంతవరకు విజయం సాధించిందని, ఆ తరువాత రాష్ట్ర విభజన ఉద్యమం రావడం, తాను ఢిల్లీకి బదిలీ కావడంతో తిరిగి మరుగున పడిందన్నారు. ఏడాది కాలంలో ఎన్నో తీర్పులు తెలుగులోనే వచ్చాయన్నారు. న్యాయస్థానాల్లో తెలుగులోనే వాదించడం, మాట్లాడటం ద్వారా ఏం జరుగుతున్నదో అందరికీ అర్థమవుతుందని చెప్పారు. తాను ఢిల్లీకి వెళ్లి తెలుగులో నేమ్ బోర్డు పెట్టుకుంటే వద్దని చెప్పినవారు ఉన్నారని, తెలుగులో బోర్డు వద్దని ఇక్కడివారు శాసించే స్థాయికి వస్తే ఉద్యోగం మానేసి వెళతానని వారితో చెప్పానని వివరించారు. ఈ సభల్లో ఏడు దేశాలకు చెందిన 12 మంది ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. దేశంలోని పది రాష్ట్రాలకు చెందిన 120 మంది ప్రతినిధులు, తెలంగాణ నుంచి 600 మంది ప్రతినిధులతో పాటు మొత్తం 1,300 మంది ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు. అతిరథ మహారథులు సభలకు హాజరు కావడంతో ప్రపంచ తెలుగు మహాసభలకు నిండుదనం వచ్చింది. నవ్వులు పూయించిన బ్రహ్మానందం తెలుగు భాష గొప్పదనాన్ని సినీనటుడు, తెలుగు మాజీ అధ్యాపకుడు బ్రహ్మానందం చెబుతున్నప్పుడు సభలో నవ్వులు విరిశాయి. ఎంతోమంది ప్రాచీన కవుల గురించి, వారు చేసిన రచనల గురించి ఆయన వివరించిన తీరు సభికులను ఆకట్టుకుంది. బమ్మెర పోతన లేడని, ఆయన రచనలు శాశ్వతమయ్యాయని అన్నారు. ఆ కాలం తిరిగివచ్చి పోతన ఇక్కడ ఉంటే ఆయన కాళ్లకు దండం పెట్టుకోవాలని ఉందని చెప్పా రు. ఇద్దరు కవులు ఒకరిని ఒకరు విమర్శించుకుంటే ఎంత అందంగా, హాయిగా ఉంటుందో శ్రీశ్రీ, విశ్వనాథ సత్యనారాయణ గురించి ఆయన చెప్పినప్పుడు సభలో నవ్వులు విరిశాయి. తెలుగులో ప్రస్తుతం మనం మాట్లాడితే ఎలా ఉంటుందో విన్నారు.. అదే పూర్వకాలంలో పాండవుల్లోని భీమసేనుడు మాట్లాడితే ఎలా ఉంటుందో మాట్లాడతానంటూ గంభీరంగా మాట్లాడారు. దీంతో సభలో చప్పట్ల మోతలు మోగాయి. -
నేటి నుంచి ప్రపంచ తెలుగు రచయితల సభలు
విజయవాడ బ్యూరో: మూడో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు శనివారం విజయవాడలో ప్రారం భం కానున్నాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ మహాసభలకు దేశ, విదేశాల నుంచి 1,300 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. సభలు జరుగుతున్న పటమట కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ప్రాంగణానికి విశ్వనాథ సత్యనారాయణ సభా ప్రాంగణంగా నామకరణం చేశారు. శని వారం, ఆదివారం జరిగే ఈ సభల్లో తెలుగు భాష, వికాసానికి సంబంధించి 11 సదస్సులు నిర్వహించనున్నారు. రాష్ట్ర విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులు, భావోద్వేగాలను అధిగమించి తెలుగును కాపాడుకోవడానికి చేపట్టాల్సిన చర్యల గురించి ప్రధాన చర్చ జరగనుంది. ఈ అంశాల్లో రచయితల బాధ్యత, ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి పలు తీర్మానాలు చేయనున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభ సభలో పాల్గొం టారు. ఆదివారం ముగింపు సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ పాల్గొంటారు. విదేశీ ప్రతినిధులు, ప్రముఖ సినీ రచయితలు నటులు మహాసభలకు హాజరవుతున్నారు. ప్రతినిధులకు రెండురోజూలూ సంప్రదాయ తెలుగు వంటకాలతో భోజనాలు ఏర్పాటు చేశారు. 30 మందికి తెలుగు పద్యపేటికలు మహాసభలకు హాజరవుతున్న 30 మంది విశిష్ట అతిథులకు తాళపత్రాలతో తయారుచేసిన తెలుగు పద్య పేటికలను బహూకరించనున్నారు. నన్నయ నుంచి సి. నారాయణరెడ్డి వరకూ తెలుగు కవులు రచించిన ముఖ్య పద్యాలన్నింటినీ తాళపత్రాల్లో ముద్రించారు. బెంగళూరుకు చెందిన ప్రొఫెసర్ తంగిరాల వెంకట సుబ్బయ్య వీటిని తయారు చేశారు. కాగా, మహాసభలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం సాయంత్రం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, ప్రముఖ రచయిత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితరులు వాటిని పరిశీలించారు.