అతిరథ మహారథులతో కళకళలాడిన తెలుగు రచయితల మహాసభలు
ఆలోచన, హాస్యం మేళవించిన బ్రహ్మానందం ప్రసంగం
చదివించే రచనలు రావాలన్న జస్టిస్ రమణ
ముగిసిన ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు
విజయవాడ : గజురంలో రెండు రోలపాటు జరిగిన ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో భాషా చైతన్యం వెల్లివిరిసింది. వేషధారణలో తెలుగుదనం కనిపించడమే కాకుండా వక్తలు చేసిన ప్రసంగాలు పలువురిలో చైతన్యాన్ని నింపాయి. ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమైన సభలు రాత్రి పది గంటలకు ముగిశాయి. సినీ కళాకారులు బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, గొల్లపూడి మారుతీరావులు పలువురు సాహితీవేత్తలతో కలియతిరిగారు. గొల్లపూడి, తనికెళ్ల రెండు రోజులూ సభల్లో పాల్గొనగా బ్రహ్మానందం ఆదివారం వచ్చారు. ముగింపు సభ రాత్రి ఏడు గంటల వరకు జరిగింది. ఈ సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ, రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, గంటా శ్రీనివాసరావు, పల్లె రఘునాథరెడ్డి, కొల్లు రవీంద్ర, ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాసరావు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మేయర్ కోనేరు శ్రీధర్ , కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ విశ్వనాథ ప్రసాద్ తివారీ, సాక్షి మీడియా గ్రూప్ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి, సీనియర్ జర్నలిస్టులు ఎ.కృష్ణారావు, శంకరనారాయణ, అభ్యుదయ కవయిత్రి డాక్టర్ ఓల్గా, సభల నిర్వాహకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, గుత్తికొండ సుబ్బారావు, జీవీ పూర్ణచంద్ పాల్గొన్నారు. మంచి రచనలు చేస్తే ఎవరైనా చదివేందుకు ఉత్సుకత చూపుతారని, దీనివల్ల భాషా ప్రచారం విశ్వవ్యాప్తమవుతుందని అతిథులు తమ ప్రసంగాల్లో వివరించారు.
రాచకొండ రచనలు ఆలోచింపజేస్తాయి : జస్టిస్ ఎన్‌వీ రమణ
‘తెలుగు భాష ఎంతో ఉన్నతమైనదని గత రచనలు చెబుతున్నాయి. ఇప్పుడు వస్తున్న రచనల్లో ఆ పటుత్వం లేదు. సాహిత్యం అంతకన్నా లేదు. ఉత్తేజం తెచ్చే రచనలు రావడం లేదు. అందుకు కొంచెం బాధగా ఉంది’ అని సుప్రీంకోర్టు జస్టిస్ ఎన్‌వీ రమణ పేర్కొన్నారు. తాను అభిమానించే కవుల్లో రాచకొండ విశ్వనాథశాస్త్రి ఒకరని చెప్పారు. ఆయన ఎంతో గొప్పవారని, ఆయన రచనలు ఆలోచింప చేస్తాయని తెలిపారు. ఆయన సారా వ్యతిరేక ఉద్యమ సమయంలో రాసిన ఆరు సారా కథలు తనకు నచ్చాయన్నారు. అందులో ఒక కథ చాలా బాగా నచ్చిందని చెబుతూ.. ఏదో ఒక పనిచేయాలనుకునే వాడికి విశ్వనాథశాస్త్రి చెప్పిన కథలోని ఒక అంశాన్ని చదివి వినిపించారు. ‘న్యాయస్థానంలో ఏమి జరుగుతుందో వివరిస్తూ.. నీకు ఏదో ఒక పనిచేయాలని ఉంటే ఉదయం గేటు వేసేచోట ఉండు, సాయంత్రం గేటు మూసే చోట ఉండు. మధ్యలో ఎక్కడికీ వెళ్లకు, వెళితే నీవు అనుకున్నది సాధించలేవు. అక్కడ జరుగుతున్నవి చూసిన తరువాత ఏమి చేయాలో తెలుస్తుంది’ అని వివరించిన తీరు కళ్లకు కట్టినట్లు ఉందని చెప్పారు. విశ్వనాథశాస్త్రి రాసిన ఆ కథలోని రెండు పేరాలు చదివి వినిపించారు. కోర్టుల్లో తీర్పులు తెలుగులోనే రావాలని తాను చేపట్టిన ఉద్యమం కొంతవరకు విజయం సాధించిందని, ఆ తరువాత రాష్ట్ర విభజన ఉద్యమం రావడం, తాను ఢిల్లీకి బదిలీ కావడంతో తిరిగి మరుగున పడిందన్నారు.
ఏడాది కాలంలో ఎన్నో తీర్పులు తెలుగులోనే వచ్చాయన్నారు. న్యాయస్థానాల్లో తెలుగులోనే వాదించడం, మాట్లాడటం ద్వారా ఏం జరుగుతున్నదో అందరికీ అర్థమవుతుందని చెప్పారు. తాను ఢిల్లీకి వెళ్లి తెలుగులో నేమ్ బోర్డు పెట్టుకుంటే వద్దని చెప్పినవారు ఉన్నారని, తెలుగులో బోర్డు వద్దని ఇక్కడివారు శాసించే స్థాయికి వస్తే ఉద్యోగం మానేసి వెళతానని వారితో చెప్పానని వివరించారు. ఈ సభల్లో ఏడు దేశాలకు చెందిన 12 మంది ఎన్‌ఆర్‌ఐలు పాల్గొన్నారు. దేశంలోని పది రాష్ట్రాలకు చెందిన 120 మంది ప్రతినిధులు, తెలంగాణ నుంచి 600 మంది ప్రతినిధులతో పాటు మొత్తం 1,300 మంది ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు. అతిరథ మహారథులు సభలకు హాజరు కావడంతో ప్రపంచ తెలుగు మహాసభలకు నిండుదనం వచ్చింది.
నవ్వులు పూయించిన బ్రహ్మానందం
తెలుగు భాష గొప్పదనాన్ని సినీనటుడు, తెలుగు మాజీ అధ్యాపకుడు బ్రహ్మానందం చెబుతున్నప్పుడు సభలో నవ్వులు విరిశాయి. ఎంతోమంది ప్రాచీన కవుల గురించి, వారు చేసిన రచనల గురించి ఆయన వివరించిన తీరు సభికులను ఆకట్టుకుంది. బమ్మెర పోతన లేడని, ఆయన రచనలు శాశ్వతమయ్యాయని అన్నారు. ఆ కాలం తిరిగివచ్చి పోతన ఇక్కడ ఉంటే ఆయన కాళ్లకు దండం పెట్టుకోవాలని ఉందని చెప్పా రు. ఇద్దరు కవులు ఒకరిని ఒకరు విమర్శించుకుంటే ఎంత అందంగా, హాయిగా ఉంటుందో శ్రీశ్రీ, విశ్వనాథ సత్యనారాయణ గురించి ఆయన చెప్పినప్పుడు సభలో నవ్వులు విరిశాయి. తెలుగులో ప్రస్తుతం మనం మాట్లాడితే ఎలా ఉంటుందో విన్నారు.. అదే పూర్వకాలంలో పాండవుల్లోని భీమసేనుడు మాట్లాడితే ఎలా ఉంటుందో మాట్లాడతానంటూ గంభీరంగా మాట్లాడారు. దీంతో సభలో చప్పట్ల మోతలు మోగాయి.
వెల్లివిరిసిన భాషా చైతన్యం
Published Mon, Feb 23 2015 12:51 AM | Last Updated on Sat, Sep 2 2017 9:44 PM
Advertisement
Advertisement