గర్భగుళ్లో అభిషేకం చేస్తున్నంత పవిత్రంగా.. అమ్మ ఒళ్లో పసిపాపను లాలిస్తున్నంత ప్రేమగా.. సముద్రంలో కలిసిపోతున్న నదీమతల్లంత పరవశంగా.. వెండితెరపై సినిమాను సాకాడాయన.. అందుకే మనకిన్ని కళాఖండాలు.. కలకండలు.. పనినే తపస్సుగా ఆచరించిన ఈ కళాతపస్వి ప్రతి ప్రయత్నం సుందరం.. సుమధురం.. సున్నితం.. సమున్నతం.. సముద్రం.. ఇంతటి కీర్తి గడించిన ఆయన కెరీర్ ఎలా మొదలైందో ఓసారి చూద్దాం.
కళా తపస్వి కె విశ్వనాథ్‌కు సంగీతమంటే చాలా ఇష్టం. అది నేర్చుకోవాలనుకున్నా కానీ కుదరలేదు. ఆయన ఇంట్లో వాళ్లు ఇంజినీర్ చేయాలనుకున్నారే కానీ.. ఆయనలోని సంగీత తపనను మాత్రం గుర్తించలేకపోయారు.
అప్పట్లో బీఎన్‌రెడ్డి, నాగిరెడ్డి ప్రారంభించిన వాహినీ పిక్చర్స్‌లో విజయవాడ బ్రాంచ్‌కి జనరల్ మేనేజర్‌గా విశ్వనాథ్ తండ్రి పనిచేసేవారు. కానీ ఆయన సినిమాల్లో రావడానికి అది కారణం కాదు. అప్పట్లోనే మద్రాసులో కొత్తగా వాహినీ స్టూడియోస్ ప్రారంభించారు. అందులో యంగ్ గ్రాడ్యుయేట్స్‌ని ట్రైనింగ్ ఇచ్చి టెక్నీషియన్స్‌గా తీసుకునేవారు. ఆ విషయం గురించి తెలిసిన అంకుల్ ఒకరు.. మనవాడిని ఎందుకు చేర్చకూడదని విశ్వనాథ్ తండ్రితో చెప్పారట. ఆ తర్వాత విశ్వనాథ్ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక నాన్న చెప్పగానే సౌండ్ డిపార్ట్‌మెంట్‌లో చేరారు కె. విశ‍్వనాథ్
ఆ రోజుల్లో ఆర్టిస్టులు కూడా టెక్నీషియన్లకు చాలా గౌరవం ఇచ్చేవారు. ఒకవేళ ఎవరైనా ఆర్టిస్ట్ డైలాగ్స్ చెప్పలేకపోతే సౌండ్ రికార్డిస్ట్ సాయం తీసుకునేవాళ్లని చెప్పేవారు. నీకేం తెలుసు.. నువ్వెవరు చెప్పడానికి అని గర్వం ఉండేది కాదు. అందుకని అప్పట్లో ఎదైనా చెప్పడానికి చాలా స్వేచ్ఛ ఉండేదని.. రకరకాల సన్నివేశాలు, వ్యక్తులు, వారి మనస్తత్వాలు లాంటి అనుభవం పొందడానికి మంచి అవకాశం దొరికేదని విశ్వనాథ్ చెప్పేవారు.
సినీరంగంలో మొదట కె.విశ్వనాథ్ కెరీర్ సౌండ్ రికార‍్డిస్ట్‌గానే ప్రారంభమైంది. ఆ తర్వాత విశ్వనాథ్ ప్రతిభ, ఆసక్తిని గమనించి అక్కినేని నాగేశ్వరరావు లాంటి మహానుభావులు సౌండ్ రికార్డింగ్‌కే ఎందుకు పరిమితం అవుతారు. క్రియేటివ్ సైడ్ ఎందుకు రాకూడదు అడిగారట. ఆ తర్వాతే మూగమనసులుతో పాటు కొన్ని చిత్రాలకు సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గా పనిచేశారు. సౌండ్ రికార్డిస్ట్‌గా చేరినప్పుడు డైరెక్టర్ అవుతానని ఎప్పుడు కూడా అనుకోలేదనట విశ్వనాథ్.
Comments
Please login to add a commentAdd a comment