K Viswanath Movies, Directed Films List, Filmography in Telugu - Sakshi
Sakshi News home page

అలా విశ్వనాథ్‌ సినీ జీవితం ఊహించని మలుపు తిరిగింది

Published Thu, Mar 11 2021 8:52 AM | Last Updated on Thu, Mar 11 2021 9:48 AM

Popular Director K Viswanath Filmography - Sakshi

ఎంతటి నిర్‌ఝర గంగా ప్రవాహమైనా గంగోత్రి లాంటి ఓ పవిత్ర స్థానంలో చిన్నగా, ఓ పాయలా మొదలవుతుంది. వెండితెరపై ‘శంకరాభరణం’, ‘సాగర సంగమం’ లాంటి ఎన్నో కళాఖండాలను సృజించిన కళాతపస్వి కె. విశ్వనాథ్‌ దర్శకత్వ ప్రయాణం కూడా అలాగే ఓ చిన్న పాయలా మొదలైనదే! సౌండ్‌ రికార్డిస్టుగా మొదలై, దర్శకత్వ శాఖకు విస్తరించిన విశ్వనాథ్‌ సరిగ్గా 55 ఏళ్ళ క్రితం ‘ఆత్మగౌరవం’తో మెగాఫోన్‌ పట్టుకున్నారు. 

ఈ అయిదున్నర దశాబ్దాల కాలంలో తెలుగు, హిందీల్లో అర్ధశతం దాకా వెండితెర అద్భుతాలు అందించారు. తొలితరం గూడవల్లి రామబ్రహ్మం, బి.ఎన్‌. రెడ్డి, కె.వి. రెడ్డి, మలితరం ఆదుర్తి సుబ్బారావు తదితరుల తరువాత మూడో తరంలో తెలుగు సినిమాకు ఆత్మగౌరవం తెచ్చిన దర్శక కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్‌. ఆయన నిర్దేశకత్వంలో, అక్కినేని నాగేశ్వరరావు హీరోగా, కాలేజీ అమ్మాయిలుగా కాంచన, రాజశ్రీ, జీవిత సత్యాలు పలికే పిచ్చి అమ్మాయిగా అతిథి పాత్రలో వాసంతి నటించగా, దుక్కిపాటి మధుసూదనరావు నిర్మించిన ‘ఆత్మగౌరవం’కి ఈ మార్చి 11తో అయిదున్నర దశాబ్దాలు నిండాయి. 

ఒక్కొక్కరిలో ఒక్కో ప్రతిభ ఉంటుంది. ఎదుటివారిలోని ఆ ప్రతిభను గుర్తించి, తగిన రీతిలో ప్రోత్సహించి, సరైన సమయంలో అవకాశం ఇవ్వడమే ఎప్పుడైనా గొప్పతనం. వాహినీ స్టూడియోలో సౌండ్‌ రికార్డింగ్‌ విభాగంలో కెరీర్‌ ను ప్రారంభించి, బి.ఎన్‌. రెడ్డి, కె.వి. రెడ్డి, ఆదుర్తి సుబ్బారావు లాంటి వాళ్ళ పనితీరును సన్నిహితం గా పరిశీలిస్తూ వచ్చిన కె. విశ్వనాథ్‌ స్క్రిప్టులో తోచిన సలహాలు, సూచనలు ఇస్తుండేవారు. ఆదుర్తి తన సినిమాలకు స్క్రిప్ట్‌ అసిస్టెంట్‌గా, అసోసియేట్‌గా పనిచేసే అవకాశం ఆయనకిచ్చారు. అలా కథా విస్తరణ, స్క్రీన్‌ ప్లే రచనలో విశ్వనాథ్‌కు ఉన్న ప్రతిభను ఆదుర్తి దగ్గర గుర్తించి, ఆయన ను వాహినీ వదిలేసి, తమ అన్నపూర్ణా పిక్చర్స్‌ సంస్థలోకి, పూర్తిగా దర్శకత్వశాఖలోకి రమ్మని ప్రోత్సహించింది – హీరో అక్కినేని నాగేశ్వరరావే. మొదట తటపటాయించినా, చివరకు గురుతుల్యులు ఆదుర్తి వద్ద అక్కినేని – దుక్కిపాటి మధుసూదనరావుల అన్నపూర్ణా పిక్చర్స్‌లో దర్శకత్వ శాఖలోకి వచ్చారు విశ్వనాథ్‌. అలా ఆయన సినీ జీవితం ఓ ఊహించని మలుపు తిరిగింది.

ఆలస్యమైన అవకాశం...
స్వతహాగా సృజనశీలి అయిన విశ్వనాథ్‌ ఆదుర్తి శిష్యరికంలో సానబెట్టిన వజ్రంలా మరిన్ని మెరుగులు దిద్దుకున్నారు. కథ, స్క్రీన్‌ ప్లే రచన, ఆదుర్తి ప్రోత్సాహంతో సెకండ్‌ యూనిట్‌ డైరెక్షన్‌ – ఇలా విశ్వనాథ్‌ చేయనిది లేదు. నిజానికి ‘‘అన్నపూర్ణాలో రెండు సినిమాలకు ఆదుర్తి గారి దగ్గర దర్శకత్వ శాఖలో వర్క్‌ చేశాక, నాకు రెండు సినిమాలకు డైరెక్షన్‌ ఛాన్స్‌ ఇస్తామని మాట ఇచ్చారు. తీరా నాలుగు చిత్రాలకు (‘వెలుగు నీడలు’, ‘ఇద్దరు మిత్రులు’–1961, ‘చదువుకున్న అమ్మాయిలు’– ’63, ‘డాక్టర్‌ చక్రవర్తి’– ’64) వర్క్‌ చేశాకనే అయిదో సినిమాకు ‘ఆత్మగౌరవం’తో మెగాఫోన్‌ నా చేతికిచ్చారు. ‘పూలరంగడు’కూ నేనే దర్శకత్వం వహించాల్సింది. మొదట నా పేరే చెప్పారు. నాతో వర్క్‌ చేయించారు. అయితే, స్క్రిప్టు వర్కు వగైరా చేశాక, అనుకోని కారణాల వల్ల మా గురువు ఆదుర్తి గారే డైరెక్ట్‌ చేస్తున్నారన్నారు. ఏమైతేనేం, ‘ఆత్మగౌరవం’తో దర్శకుడినయ్యా’’ అని కె. విశ్వనాథ్‌ గుర్తుచేసుకున్నారు. 

అప్పట్లో మద్రాసులో అన్నపూర్ణా ఆఫీసు – భగీరథ అమ్మాళ్‌ స్ట్రీట్‌లో! ఆ పక్కనే కృష్ణారావు నాయుడు స్ట్రీట్‌లో దుక్కిపాటి గారిల్లు. ఇది కాక హైదరాబాద్‌లో లక్డీకాపూల్‌ దగ్గర శాంతి నగర్‌ లో దుక్కిపాటి గారికి గెస్ట్‌ హౌస్‌ ఉండేది. ‘ఆత్మగౌరవం’కి డైరెక్షన్‌ ఛాన్స్‌ ఇచ్చే ముందే దుక్కిపాటి గట్టిగా పట్టుబట్టడంతో కొన్నేళ్ళుగా మద్రాసులో స్థిరపడ్డ విశ్వనాథ్‌ సైతం కాపురాన్ని హైదరాబాద్‌కు మార్చాల్సి వచ్చింది. ట్యాంక్‌ బండ్‌ దగ్గర గగన్‌ మహల్‌ కాలనీలో ఒకటి రెండేళ్ళు చిన్న అద్దె ఇంట్లో గడిపిన ఆ రోజులు, ఉత్తమ కథా చిత్రాలను అందించడం కోసం రాత్రీ పగలూ, పండగ పబ్బం తేడా లేకుండా పనిలో నిమగ్నమైన క్షణాలు విశ్వనాథ్‌ దంపతులకు ఇప్పటికీ గుర్తే. దర్శకుడిగా విశ్వనాథ్‌ పేరు వేయడం ‘ఆత్మగౌరవం’తోనే తొలిసారి అయినా, అప్పటికే ఆదుర్తి గారి బాబూ మూవీస్‌ ‘మూగమనసులు’ (1964) సహా అనేక చిత్రాల్లో స్వతంత్రంగా దర్శకత్వ బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఆయనది.

పచ్చికలో రచన!
అప్పటి దాకా ఫ్యామిలీ డ్రామా నిండిన సెంటిమెంట్, సీరియస్‌ సినిమాలు ఎక్కువ తీసింది అన్నపూర్ణా పిక్చర్స్‌. ఈసారి యువకులను ఆకర్షించేలా, కొత్తదనంతో కాలేజీ స్టూడెంట్స్‌ పాత్రలు ఉండేలా ఫుల్‌ లెంగ్త్‌ రొమాంటిక్‌ కామెడీ విత్‌ సెంటిమెంట్‌ తీస్తే బాగుంటుందని అనుకున్నారు. ‘పూలరంగడు’ ఇతివృత్తం ఆదుర్తి చేస్తే బాగుంటుందనీ, యువతరాన్ని ఆకర్షించే కొత్త ఇతివృత్తాన్ని విశ్వనాథ్‌ చేస్తే బాగుంటుందని నిర్మాతల భావన. అదే ‘ఆత్మగౌరవం’ సినిమా. అన్నపూర్ణా వారి అన్ని సినిమాల లానే ఈ సినిమా కథకూ పలువురు రచయితలతో కలసి దర్శక, నిర్మాతలు మేధామథనం జరిపారు. అలా ఈ ‘ఆత్మగౌరవం’ రచనకు ఒకరికి ముగ్గురి పేర్లు తెరపై కనిపిస్తాయి. విశ్వనాథ్, దుక్కిపాటి సహా అందరి భాగస్వామ్యం ఉన్నా – టైటిల్స్‌లో ప్రముఖ నాటక రచయిత గొల్లపూడి మారుతీరావు, ప్రముఖ నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి కలసి ఈ కథను అల్లారు.

ఇక, సినిమా అనుసరణ నిర్మాత దుక్కిపాటి చేశారు. సంభాషణలేమో మరో ప్రముఖ నాటక రచయిత భమిడిపాటి రాధాకృష్ణతో కలసి గొల్లపూడి రాశారు. అప్పటికి గొల్లపూడి హైదరాబాద్‌ ఆలిండియా రేడియోలో పనిచేస్తున్నారు. ఆయనలోని ప్రతిభను గుర్తించి, ‘డాక్టర్‌ చక్రవర్తి’ (1964) ద్వారా దుక్కిపాటి సినిమాల్లోకి లాగారు. దానికి ఆత్రేయతో కలసి మాటలు రాశారు గొల్లపూడి. అయితే, గొల్లపూడి సినిమా కథంటూ రాసింది విశ్వనాథ్‌ దర్శకత్వంలోని తొలి చిత్రమైన ‘ఆత్మగౌరవం’కి! అలా విశ్వనాథ్‌ దర్శకత్వంలోని తొలి చిత్రం... గొల్లపూడి కథారచన చేసిన తొలి చిత్రమైంది. అప్పట్లో గొల్లపూడి సహా అన్నపూర్ణా బృందం ఆకాశవాణి కేంద్రానికి ఎదురుగా ఉన్న పబ్లిక్‌ గార్డెన్స్‌ చెట్లనీడల్లో, పచ్చికబయళ్ళలో కూర్చొని, కథాచర్చలు, ఆలోచనలు సాగిస్తూ, ఈ సినీ రచన చేశారు. డైలాగుల్లో కామెడీ పార్ట్‌ భమిడిపాటి, మిగతాది గొల్లపూడి రాశారు. 

ఆస్తుల కన్నా అనుబంధాలే మిన్న!
రక్తసంబంధం ఎన్నటికీ విడదీయరానిది అనేది ఈ చిత్ర కథాంశం. అందులోనూ కథానాయిక (కాంచన) ఆత్మగౌరవం ప్రధానాంశం. అటు కన్నవారికీ, ఇటు పెంచినవారికీ మధ్య నలిగిపోయే హీరో మీదుగా కథ నడుస్తుంది. సొంత అన్నయ్య, వదినలకు దూరమై, పిల్లలు లేని జమీందారు దంపతుల (రేలంగి, సూర్యకాంతం) ఇంటికి దత్తత వెళ్ళి, పట్నంలో హాస్టలులో పెరుగుతాడు కౌలు రైతు రామయ్య (గుమ్మడి) తమ్ముడైన హీరో (అక్కినేని). అయితే, హీరోకు చిన్నప్పుడే నిశ్చయమైన కన్నవారింటి మేనరికం సంబంధం కాకుండా, గొప్పింటి జడ్జి (రమణారెడ్డి) గారి కూతురి (రాజశ్రీ) బయటి సంబంధం చేయాలని చూస్తుంది జమీందారీ పెంపుడు తల్లి. పెంచినవాళ్ళను ఎదిరించి, ఆస్తి వదులుకొనైనా సరే మేనరికం చేసుకోవాలనుకుంటాడు హీరో. ఈ సమస్యలన్నిటినీ హీరో ఎంత ఆహ్లాదంగా పరిష్కరించాడన్నది సుఖాంతం అయ్యే ఈ కుటుంబకథా చిత్రంలో చూడవచ్చు.

అద్దం మీద తొలి షాట్‌ తమాషా...
సంగీతాభిరుచి ఉన్న విశ్వనాథ్‌ మద్రాసు వర్క్‌ బిజీకి దూరంగా రచయితలు, సంగీత దర్శకుడిని హైదరాబాద్‌ రప్పించి, ఇక్కడ మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ జరిపారు. పాటల రికార్డింగ్‌ ముహూర్తం మాత్రం మద్రాసు భరణీ స్టూడియో లో ఘంటసాల, సుశీల తదితరుల నడుమ చేశారు. ఇక, హైదరాబాద్‌ సారథీ స్టూడియోలో షూటింగ్‌ ముహూర్తం. తొలి షాట్‌ చిత్రీకరణ తమాషాగా సాగింది. సంప్రదాయ శైవ కుటుంబంలో పుట్టిన విశ్వనాథ్‌ ఇంట్లో అంతా పరమ దైవభక్తులు. నిర్మాత దుక్కిపాటి ఏమో బహిరంగ నాస్తికులు. తొలిషాట్‌ దేవుడి పటాల మీద తీసే సావకాశం లేదు. చివరకు అద్దం సాక్షాత్తూ లక్ష్మీదేవి స్వరూపం గనక, విశ్వనాథ్‌ తెలివిగా ఫస్ట్‌ షాట్‌ ఖాళీగా ఉన్న అద్దం మీద పెట్టారు. క్షణమాగి, అద్దంలో ప్రతిబింబంగా అక్కినేని ఫ్రేములోకి వచ్చి, డ్రెస్‌ సర్దుకుంటారు. అద్దం మీద నుంచి హీరో అక్కినేని మీదకు వచ్చేలా కెమేరామ్యాన్‌ సెల్వరాజ్‌ తో కలసి విశ్వనాథ్‌ వేసిన ప్లాన్‌ అద్భుతంగా ఫలించింది. విశ్వనాథ్‌ సెంటిమెంట్‌ నిలిచింది. నిర్మాతకూ ఇబ్బంది లేకుండా పోయింది. అద్దం మీద మొదలైన విశ్వనాథ్‌ దర్శకత్వ ప్రస్థానం అపూర్వంగా ముందుకు సాగింది.

శ్రీశ్రీతో సాలూరి తమాషా
సౌండ్‌ రికార్డిస్ట్‌ రోజుల నుంచి సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావుతో విశ్వనాథ్‌కు మంచి అనుబంధం. సాలూరి ఎంత అద్భుతమైన సంగీత దర్శకులు, గాయకులో, అంత పసి మనస్తత్త్వం. ఆయనలో భలే చిలిపితనం ఉండేది! అది అర్థం చేసుకోకపోతే గొడవ. ఒక్కోసారి ఆయన కావాలని ఆటపట్టించేందుకు గమ్మత్తు చేసేవారు. ఈ సినిమా లో ఓ పాట కోసం శ్రీశ్రీ గారికి అన్నీ లఘువులతో (హ్రస్వాక్షరాలు వచ్చేలా) ఓ క్లిష్టమైన బాణీ ఇచ్చారు. శ్రీశ్రీ కూడా విషయం గ్రహించి, చిరునవ్వుతో దాన్ని ఓ సవాలుగా తీసుకొని, ‘వలపులు విరిసిన పూవులే...’ అంటూ పాట రాసిచ్చారు. ఇదే సినిమా కోసం సి. నారాయణరెడ్డి రాసిన ‘మా రాజులొచ్చారు...’ పాట అంటే కె. విశ్వనాథ్‌కు ఇప్పటికీ భలే ఇష్టం. దాశరథి రాసిన ‘అందెను నేడే అందని జాబిల్లి..’, డ్యూయట్‌ ‘ఒక పూలబాణం..’, ఆరుద్ర రచన ‘రానని రాలేనని..’ పాటలు ఇప్పటికీ పాపులర్‌. 

ఆ నంది బొమ్మతోనే అవార్డులు!
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 1964 నుంచే ఉత్తమ తెలుగు చిత్రాలకు నంది అవార్డులు ఇవ్వడం మొదలుపెట్టింది. ప్రభుత్వం ఇవ్వడం మొదలుపెట్టిన ఆ నందీ అవార్డుల చిహ్నం కూడా మరేదో కాదు – రామప్ప గుడిలోని నంది ఏకశిలా విగ్రహం. ఇంకా విచిత్రం ఏమిటంటే, అవార్డులు ఇవ్వడం మొదలుపెట్టిన  ఏడాదే ప్రభుత్వం నుంచి 1964లో అన్నపూర్ణా వారి ‘డాక్టర్‌ చక్రవర్తి’ ఉత్తమ కథాచిత్రంగా బంగారు నందిని గెలిస్తే, 1965లో అన్నపూర్ణా వారిదే ‘ఆత్మగౌరవం’ చిత్రం నంది ఉత్తమ తతీయ చిత్రంగా కాస్యనందిని గెలిచింది. ఆ రెండు చిత్రాల రచన, రూపకల్పన, దర్శకత్వాల్లో విశ్వనాథ్‌ గణనీయమైన భాగస్వామ్యం ఉండడం విశేషం. అలా ‘ఆత్మగౌరవం’ చిత్రం తమ షూటింగ్‌ జరిగిన అదే రామప్ప గుడి ఏకశిలా విగ్రహం తాలూకు చిహ్నమైన నంది అవార్డును అందుకుంది. 

ఇక, ఉత్తమ కథారచయితలకు నంది అవార్డులివ్వడం 1965 నుంచి మొదలుపెట్టారు. ఆ తొలి నంది అవార్డు కూడా ‘ఆత్మగౌరవం’దే! అలా గొల్లపూడి, యద్దనపూడి – ఇద్దరూ ఆ ఏటి ఉత్తమ కథా రచయితలుగా నంది అందుకున్నారు. గాంధీభవన్‌ ఎగ్జిబిషన్‌ ఆవరణలో రాష్ట్ర ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి చేతుల మీదుగా బహుమతి ప్రదానోత్సవం. అక్కినేని, కాంచన, రేలంగి, దుక్కిపాటి, విశ్వనాథ్‌ లాంటి సినీ ప్రముఖులతో పాటు రాష్ట్ర గవర్నర్‌ పట్టం థానూ పిళ్ళై దంపతులు, ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి దంపతులు – ఇలా వేదికపై అతిరథ మహారథులతో హైదరాబాద్‌లో గొప్ప గ్లామరస్‌ సభగా ఆ నంది ఉత్సవం సాగింది. అలాగే, ‘మద్రాస్‌ ఫిల్మ్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌’ నుంచి అక్కినేని ఉత్తమ నటుడిగా, గొల్లపూడి ఉత్తమ రచయితగా అవార్డులు పొందారు. తొలి చిత్రంతోనే కె. విశ్వనాథ్‌ అవార్డు చిత్రాల దర్శకుడిగా తన అప్రతిహత ప్రయాణానికి నాంది పలికారు.

న్టీఆర్‌ తో నాలుగు... ఏయన్నార్‌ తో రెండు...
‘ఆత్మగౌరవం’ తరువాత దర్శకుడిగా రెండో సినిమా కూడా అన్నపూర్ణా పిక్చర్స్‌లోనే కె. విశ్వనాథ్‌ చేయాల్సింది. ఆయన కూడా అలాగే అనుకొని, తనను సంప్రతించిన బయట నిర్మాతలతో ఆ కమిట్మెంటే చెబుతూ వచ్చారు. కానీ, ఎందుకనో ఆ తరువాత అన్నపూర్ణా అధినేత దుక్కిపాటి తన మాట నిలబెట్టుకోలేదు. ‘ఆత్మగౌరవం’ తర్వాత విశ్వనాథ్‌ మళ్ళీ సకుటుంబంగా మద్రాసుకు షిఫ్టయి, మరో నిర్మాత డి.బి. నారాయణ ఇంట్లో అద్దెకు చేరారు. 

చివరకు రెండో సినిమాగా తాను తీర్చిదిద్దిన హీరోలు రామ్మోహన్, కృష్ణలతోనే బయట నిర్మాతలకు ‘ప్రైవేటు మాష్టారు’ (1967 సెప్టెంబర్‌ 14) తీశారు. అయితేనేం, దర్శకుడిగా ఆయన ప్రస్థానం క్రమక్రమంగా పైపైకి దూసుకుపోయింది. చివరకు ‘శంకరాభరణం’ లాంటి కళాఖండాలతో దర్శకుడిగా శిఖరాగ్రానికి చేరుకున్నాక తొమ్మిదేళ్ళకు మళ్ళీ అక్కినేనితో రెండోచిత్రం ‘సూత్రధారులు’ (’89) రూపొందించారు విశ్వనాథ్‌. అప్పటి మరో స్టార్‌హీరో ఎన్టీఆర్‌ తో తన కెరీర్‌ లో ఏకంగా 4 సినిమాలు చేసిన ఆయన, ఏయన్నార్‌తో 2 చిత్రాలే తీయడం ఓ విచిత్రం. 

ఫస్ట్‌ లేడీ కొరియోగ్రాఫర్‌కు ఛాన్స్‌!
ప్రఖ్యాత కూచిపూడి నృత్యగురువు సుమతీ కౌశల్‌ (ప్రముఖ నాట్యాచారిణి ఉమా కె. రామారావుకు సోదరి) అప్పట్లో హైదరాబాద్‌ లోని విశ్వనాథ్‌ ఇంటికి దగ్గరలోనే బషీర్‌బాగ్‌లో డ్యాన్స్‌ స్కూల్‌ ‘నృత్యశిఖర’ నడుపుతుండేవారు. రవీంద్రభారతిలో ఆమె నృత్యప్రతిభ చూసి, ఈ చిత్రంలో ఆమెకు నృత్య దర్శకురాలిగా అవకాశమిచ్చారు. ‘ముందటి వలె నాపై నెనరున్నదా సామి...’ అనే క్షేత్రయ్య పదానికి, హీరోయిన్లు రాజశ్రీ, కాంచనలతో శ్రీకృష్ణుడు, రాధ పాత్రలు వేయించి, కూచిపూడి నృత్యగీతాన్ని చిత్రీకరించారు. అలా సుమతి తెలుగుతెరపై తొలి మహిళా కొరియోగ్రాఫరయ్యారు. ‘ఆత్మగౌరవం’ కు మరో కొరియోగ్రాఫర్‌గా హీరాలాల్‌ పనిచేశారు. సినిమా ఔట్‌డోర్‌ దృశ్యాల్ని రామప్ప గుడి, సరస్సు పరిసరాల్లో, డిండి ప్రాజెక్ట్‌ ప్రాంతంలో తీశారు.

ఆ పాటల పల్లవులు విశ్వనాథ్‌వే!
విశ్వనాథ్‌ లో బాహ్య ప్రపంచానికి తెలియని ఓ అద్భుత సినీ గీతరచయిత ఉన్నారు. ఆదుర్తి దగ్గర సహాయకుడిగా ఉన్నరోజుల్లో గీత రచయితలతో పాటలు రాయించుకుంటున్నప్పుడు సైతం వారికి తనదైన ఇన్‌ పుట్స్‌తో పాటల పల్లవులు అందించడం విశ్వనాథ్‌కు అలవాటు. డమ్మీ లిరిక్స్‌... ‘‘అబద్ధపు సాహిత్యం’’ అని ముద్దుగా పిలుస్తూ అలా ఆయన ఇచ్చిన పల్లవులే ఇవాళ తలమానికమైన ఎన్నో సినీగీతాలకు కిరీటాలయ్యాయి. ‘ఆత్మగౌరవం’లోనూ ‘మా రాజులొచ్చారు..’, ‘అందెను నేడే..’ పాటల పల్లవులు అలా విశ్వనాథ్‌ రాసినవే. ఆ పదాలకు మరింత సొబగులద్ది, రచయితలు మిగతా పాటంతా అద్భుతంగా అల్లడం విశేషం. ‘ఆత్మగౌరవం’ నుంచి లేటెస్ట్‌ ‘శుభప్రదం’ దాకా తన సినిమాలన్నిటిలో విశ్వనాథ్‌ ఇలా అందించిన పల్లవులు ఎన్నెన్నో!

అవార్డులకు కేరాఫ్‌ అడ్రస్‌!
మునుపెన్నడూ రామప్ప గుడికి వెళ్ళకపోయినా, ఆ పరిసరాలు బాగుంటాయని దుక్కిపాటి, గొల్లపూడి, సెవన్‌ స్టార్స్‌ సిండికేట్‌ సాంస్కృతిక సంస్థ శాండిల్య బృందం చూసొచ్చి చెప్పడంతో, అక్కడకు వెళ్ళి మరీ షూటింగ్‌ చేసినట్టు విశ్వనాథ్‌ ఆ సంగతులు చెప్పారు. అంతకు మునుపెవ్వరూ షూటింగ్‌ చేసిన రామప్ప గుడిలోనే దాశరథి రాసిన ‘ఒక పూలబాణం..’ చిత్రీకరించారు. 1965 చివరలో సెన్సార్‌ జరుపుకొన్న ‘ఆత్మగౌరవం’ ఆ మరుసటేడు రిలీజైంది. ప్రజాదరణ పొంది, విజయవాడ లాంటి చోట్ల శతదినోత్సవం చేసుకుంది. దర్శకుడిగా విశ్వనాథ్‌ ప్రతిభా సామర్థ్యాలు ధ్రువపడిపోయాయి. తొలి చిత్రం నుంచి ఇప్పటి దాకా ఓ నాలుగైదు మినహా విశ్వనాథ్‌ రూపొందించిన చిత్రాలన్నీ నందులో, జాతీయ అవార్డులో ఏవో ఒకటి అందుకున్నవే! స్వయంగా కె. విశ్వనాథ్‌ సైతం కళాప్రపూర్ణ, రఘుపతి వెంకయ్య అవార్డు, పద్మశ్రీ పురస్కారం, సినీరంగంలో ఇచ్చే అత్యున్నత దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు – ఇలా ఎన్నో శిఖరాలు అధిరోహించారు. ఈ 55 ఏళ్ళ దర్శకత్వ ప్రస్థానంలో తెలుగుతెరకు జాతీయ, అంతర్జాతీయస్థాయిలో అమితమైన ఆత్మగౌరవం తెచ్చారు.  
– రెంటాల జయదేవ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement