‘కళాతపస్వికి కళాంజలి’ లో హీరో చిరంజీవితో నటీమణులు
‘‘కె.విశ్వనాథ్‌గారు వృత్తి పరంగా, ప్రవృత్తి పరంగా (నటుడిగా) పరిపూర్ణమైన జీవితం అనుభవించారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకున్నా ఆణిముత్యాల్లాంటి సినిమాల ద్వారా శాశ్వితంగా మన మనసుల్లో ఉంటారు’’ అని హీరో చిరంజీవి అన్నారు. ఫిబ్రవరి 19న(ఆదివారం) కె.విశ్వనాథ్ జయంతి. ఈ సందర్భంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూఛిబొట్ల ఆధ్వర్యంలో ‘కళాతపస్వికి కళాంజలి’ కార్యక్రమం హైదరాబాద్‌లో నిర్వహించారు.
ఈ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ–‘‘కె.విశ్వనాథ్‌గారి జయంతిని మనం ఒక సంబరంలా జరుపుకోవాలి. ఆయన వదిలి వెళ్లిన కీర్తి, తీపి జ్ఞాపకాలు మనకు మిగిలిన గొప్ప అనుభవాలు.. జీవితాంతం మనం గుర్తుకు తెచ్చుకుని సంతోషించే ఆయన గుర్తులు. మూడు సినిమాల్లో నాకు అద్భుతమైన పాత్రలు ఇచ్చి, నాకు అవార్డులు తీసుకొచ్చిన నటనను నా నుంచి రాబట్టిన దర్శకుడాయన.
నటనలో మెళకువలు చెబుతూ, హావభావాలు ఎలా పలికించాలో గురువులా నేర్పించారు. షూటింగ్ చేస్తున్నప్పుడు నన్ను ఒక నటుడిలాగా కాకుండా ఓ బిడ్డలాగా ఆయనతో పాటు కూర్చొబెట్టుకునేవారు. కంచిలో ఓ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు ఆయన పెరుగు అన్నం కలిపించి నాకు పంపించినప్పుడు తినకుండా ఎలా కాదనగలను? ఆ సమయంలో ఓ తండ్రిలాగా అనిపించారాయన.
యాక్షన్ హీరోగా నిలదొక్కుకుంటున్న సమయంలో ఆయనతో తొలిసారి ‘శుభలేఖ’ చేసే అవకాశం వచ్చింది. ఆయన చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారని తెలియడంతో కొంచె టెన్షన్‌గా ఉండేది. డైలాగులు ఫాస్ట్‌గా కాదు.. అర్థమయ్యేలా కరెక్ట్‌గా పలకాలని చెప్పారాయన. ఆయన ఓ అద్భుతమైన నటుడు.. మన నుంచి ఒరిజినాలిటీని రాబట్టుకుంటారు. నేను కూడా క్లాసికల్ డ్యాన్స్ చేయగలను అనే నమ్మకాన్ని ఇచ్చింది విశ్వనాథ్‌గారు.
నేను మాస్ హీరోగా దూసుకెళుతున్న సమయంలో ‘స్వయం కృషి’ లాంటి మంచి సందేశాత్మక చిత్రం చేయించారాయన. ‘ఆపద్బాంధవుడు’ చిత్రంలో ఓ సీన్ కోసం ఆయనవద్దకు వెళ్లి రాత్రి రిహార్సల్స్ చేశాను.. మరుసటి రోజు ఆ సన్నివేశం అద్భుతంగా వచ్చింది. ఎమోషన్స్‌ని అద్భుతంగా తీయగలరు విశ్వనాథ్‌గారు. ఆయన వద్ద నేను నేర్చుకున్న అంశాలను నాతో పనిచేస్తున్న దర్శకులకు చెబుతుంటాను. విశ్వనాథ్‌గారి వద్ద పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం’’ అన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ–‘‘యువహీరో తారకరత్న పరమదించడం బాధగా ఉంది’’ అన్నారు. ‘కళాతపస్వికి కళాంజలి’ లో కె.విశ్వనాథ్‌తో పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు జ్ఞాపికలు అందించారు. ఈ సందర్భంగా ఆయనతో తమకున్న అనుబంధాలను వారు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో కె.విశ్వనాథ్ పెద్దబ్బాయి కె.నాగేంద్ర నాథ్, ఆర్.నారాయణ మూర్తి, కె.రాఘవేంద్ర రావు, రమేశ్ ప్రసాద్, కేఎస్ రామారావు, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, మాజీ ఎంపీ ‘కళాబంధు’ టి.సుబ్బరామి రెడ్డి, ‘శంకరాభరణం’ ఝాన్సీ, మంజు భార్గవి, శివలెంక కృష్ణప్రసాద్, మురళీ మోహన్, సి.అశ్వినీదత్, దామోదర్ ప్రసాద్, సుమలత, రాజశేఖర్, అలీ, భానుచందర్, శేఖర్ కమ్ముల తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment