K. Vishwanath
-
Swathi Muthyam@38: మాస్ మెచ్చిన క్లాస్ చిత్రం..స్వాతిముత్యం
కథానాయకుడు మానసికంగా ఎదగనివాడు. కథానాయిక అప్పటికే ఓ పిల్లాడికి తల్లి అయిన విధవరాలు. అనుకోని పరిస్థితుల్లో... వాళ్ళిద్దరికీ ముడిపడితే? ఇలాంటి పాత్రలతో, ఈ కథాంశంతో సినిమా తీయడమంటే రిస్కులకే రిస్కు. కానీ, ఆ ప్రయోగాన్ని క్లాస్‌తో పాటు మాస్ కూడా అమితంగా మెచ్చేలా చేశారో దర్శకుడు. పైపెచ్చు, బాక్సాఫీస్ వద్ద ఆ ఏటి ఇండస్ట్రీ హిట్‌గా నిలిపారు. అది ఓ క్రియేటివ్ జీనియస్ మాత్రమే చేయగల అరుదైన విన్యాసం! ఆ అద్భుతం చేసిన దర్శక కళాస్రష్ట – కె. విశ్వనాథ్. ఒకరికి ఆరుగురు తెలుగు స్టార్ హీరోలు హిట్స్ మీద హిట్స్ ఇస్తున్న సందర్భంలో కమలహాసన్ లాంటి ఓ పరభాషా హీరోతో, నిర్మాత ఏడిద నాగేశ్వరరావుకు దక్కిన ఆ బ్లాక్‌బస్టర్ అద్భుతం – ‘స్వాతిముత్యం’కి ఈ మార్చి 13తో 38 వసంతాలు. మాస్ కథాంశాలైతేనే జనం చూస్తారు. క్లాస్ కథలైతే సామాన్యులు ఆదరించరని ఎవరన్నారు! నిజానికి, అది ఓ తప్పుడు కమర్షియల్ లెక్క. తెరపై కథను చూపించే క్రియేటర్ తాలూకు ప్రతిభా సామర్థ్యాలను బట్టి జనం ఏ సినిమానైనా చూస్తారు. బాక్సాఫీస్ వద్ద బ్రహ్మరథం పడతారు. ఆ సంగతి నిరూపించిన చిత్రం – కమలహాసన్, రాధిక జంటగా, దర్శకుడు కె. విశ్వనాథ్ రూపొందించిన ‘స్వాతిముత్యం’. కల్మషం లేని కథ... కల్లాకపటం తెలీని హీరో... కల్లాకపటం తెలియని ఓ అమాయకుడి కథ ఇది. వయసు పెరిగినా, మనసు ఎదగని వెర్రిబాగులవాడు శివయ్య (కమలహాసన్). ఓ గొప్పింటి అబ్బాయిని ప్రేమించి పెళ్ళాడిన లలిత (రాధిక), ఓ పిల్లాడికి (మాస్టర్ కార్తీక్) తల్లి అయ్యాక, భర్త పోవడంతో తల చెడ్డ ఇల్లాలిగా అన్నావదినల పంచన బతుకీడుస్తుంటుంది. విధవరాలైన కథానాయిక మెడలో గుళ్ళో సీతారామ కల్యాణ వేళ అమాయకంగా తాళికట్టేస్తాడు హీరో. అమాయకుడైన హీరోను ప్రయోజకుడిగా ఆమె ఎలా తీర్చిదిద్దింది అన్నది స్థూలంగా ‘స్వాతిముత్యం’ కథ. భార్య పోతే మగాడు మరో పెళ్ళి చేసుకోవడం సహజమనే లోకంలో, భర్త పోయి, ఆర్థికంగా, మానసికంగా ఆసరా కోసం చూస్తున్న స్త్రీకి అనుకోని పరిస్థితుల్లో పెళ్ళి జరిగితే తప్పుగా భావించడం ఏమిటనే ప్రశ్నను లేవనెత్తుతుంది ఈ చిత్రం. స్వాతిముత్యమంత స్వచ్ఛమైన మనసుతో, కల్మషం లేని అమాయక చక్రవర్తి అయిన ‘శివయ్య’ పేరునే ఈ సినిమాకూ పెడదామని మొదట్లో కమలహాసన్ అన్నారు. కానీ, చివరకు అందరూ ‘స్వాతిముత్యం’ టైటిల్ కే మొగ్గారు. సున్నితమైన... విశ్వనాథ ముద్ర మద్రాసుతో పాటు మైసూరు, రాజమండ్రి, తొర్రేడు, తాడికొండ, పట్టిసీమ ప్రాంతాల్లో షూట్ చేసిన ఈ సినిమాకు కమలహాసన్, రాధిక తదితరుల నటనతో పాటు ఇళయరాజా సంగీతం, రీరికార్డింగ్ ప్రాణంపోశాయి. ‘చిన్నారి పొన్నారి కిట్టయ్య’ (ఆత్రేయ), ‘సువ్వీ సువ్వీ సువ్వాలమ్మా’, ‘రామా కనవేమిరా’, ‘ధర్మం శరణం గచ్ఛామి’, ‘మనసు పలికే మౌన గీతం’ (సినారె) పాటలు ఆల్‌టైమ్ హిట్స్. ముఖ్యంగా, మనసు పలికే మౌనగీతాన్ని అమాయకుడైన హీరోకు హీరోయిన్ పరిచయం చేసి, కానరాని ప్రేమకు ఓనమాలు దిద్దే సన్నివేశాన్నీ, ఆ ప్రణయ గీతాన్నీ విశ్వనాథ్ సున్నితమైన శైలిలో, అసభ్యతకు తావు లేకుండా అద్భుతంగా తీర్చిదిద్దడం గమనార్హం. ఆ పాటతో పాటు, సినిమాలోని చాకలి సుబ్బులు – వెంకటసామి పాత్రల్లో దీప, ఏడిద శ్రీరామ్ కూడా గుర్తుండిపోతారు. ప్రతి సినిమాలోలాగానే ‘స్వాతిముత్యం’ పాటల రచనలోనూ విశ్వనాథ్ హస్తం ఉంది. ఆడా మగా తేడా తెలియని హీరో చిన్నపిల్లాడి మనస్తత్వం తెరపై ఎస్టాబ్లిష్ చేయడానికి విశ్వనాథ్ అప్పటికప్పుడు అనుకొని, జానపద శైలిలో ‘పట్టుచీర తెస్తనని...’ పాట రాత్రికి రాత్రి రాశారు. మరునాడు షూటింగ్ కోసం మార్గమధ్యంలో కమలహాసనే ఆ పాటకు ట్యూన్ కట్టి, పాడారు. ఆ వెర్షన్‌తోనే షూటింగ్ చేశారు.తర్వాత బాలు, శైలజలతో పాడించారు. ఇక, ‘వటపత్రసాయికి...’ పాట పల్లవి లైన్లు కథాచర్చల్లో భాగంగా సినారెకు స్నేహపూర్వకంగా విశ్వనాథ్ సమకూర్చినవే. అదే పాట సినిమా చివరలో విషాదంగా వస్తుంది. ఆ రెండో వెర్షన్‌ను సీతారామశాస్త్రితో రాయించారు. ‘సిరివెన్నెల’ చిత్రం కన్నా ముందే ఈ సినిమా, ఈ పాటతో సీతారామశాస్త్రి పేరు తెర మీదకు వచ్చింది. ‘సితార’తో రచయితగా పరిచయమైన సాయినాథ్, ‘సిరివెన్నెల’కు రాసిన ఆకెళ్ళ – ఇద్దరూ ఈ సినిమాలో విశ్వనాథ్ కలానికి డైలాగుల్లో చేదోడు అయ్యారు. ఎం.వి. రఘు ఛాయాగ్రహణం అందించారు. వందరోజుల వేళ... అప్పట్లో హైదరాబాద్, కాకినాడ, బెంగళూరు లాంటి కేంద్రాల్లో మెయిన్ థియేటర్లతో పాటు సైడ్ థియేటర్లలోనూ ‘స్వాతిముత్యం’ వంద రోజులు ఆడింది. ఆ రోజుల్లో 35 థియేటర్లలో, మధ్యలో గ్యాప్ లేకుండా శతదినోత్సవం చేసుకున్న ఏకైక సినిమా ఇదే! ఏకంగా 11 కేంద్రాల్లో డైరెక్ట్‌గా ‘స్వాతి ముత్యం’ శతదినోత్సవం జరుపుకొంది. పలుచోట్ల 25 వారాలు (రజతోత్సవం) దాటి ప్రదర్శితమైంది. బెంగుళూరు, మైసూరుల్లో ఏడాదికి పైగా ఆడింది. కలెక్షన్ల రీత్యానూ ఆ ఏడాది ఇండస్ట్రీ హిట్ ఇదే! దాదాపు అన్ని సెంటర్లలో ఆ ఏడాది హయ్యస్ట్ షేర్ వసూలు చేసిన బ్లాక్ బస్టర్ కూడా ఇదే! 1986 జూన్ 20న హైదరాబాద్ దేవి థియేటర్లో జరిగిన శతదినోత్సవానికి యాదృచ్ఛికంగా ఎన్టీఆరే (అప్పటి సి.ఎం) స్వయంగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉత్తరాది నుంచి దర్శక, నిర్మాత రాజ్‌కపూర్ వచ్చారు. విశ్వనాథ్ – ఏడిద జంట నుంచి దేశం గర్వించే మరిన్ని చిత్రాలు రావాలని కళాపిపాసి అయిన ఎన్టీఆర్ ఆకాంక్షించారు. ఆస్కార్‌కు ఎంట్రీ! హాలీవుడ్ ఫిల్మ్‌తో పోలిక!! ఆస్కార్స్‌కు ఇండియన్ ఎంట్రీగా వెళ్ళిన తొలి తెలుగు సినిమా, ఆ మాటకొస్తే తొలి దక్షిణాది సినిమా కూడా ‘స్వాతిముత్య’మే! తుది జాబితాకు నామినేట్ కాకపోయినా, మరో ఎనిమిదేళ్ళకు రిలీజైన హాలీవుడ్ ‘ఫారెస్ట్‌గంప్’(1994)కూ, మన ‘స్వాతిముత్యం’కూ పోలికలు కనిపిస్తాయి. టామ్ హాంక్స్ చేసిన పాత్ర, అతని ప్రవర్తన ‘స్వాతిముత్యం’లోని శివయ్య పాత్రను గుర్తుతెస్తాయి. అలా హాలీవుడ్‌కూ మన పాత్రలు ప్రేరణనిచ్చాయని కమలహాసన్ లాంటి వాళ్ళు పేర్కొన్నారు. రాజ్‌కపూర్ మనసు దోచిన సినిమా! ‘షో మ్యాన్ ఆఫ్ ఇండియా’ రాజ్‌కపూర్ మనసు దోచిందీ సినిమా. ‘శంకరాభరణం’ మొదలు ఏ సినిమా తీసినా, బొంబాయిలో రాజ్‌కపూర్‌కు చూపించడం విశ్వనాథ్‌కు అలవాటు. అలాగే, ‘స్వాతిముత్యం’ చూశారు రాజ్‌కపూర్. సినిమా అవగానే నిశ్శబ్దంగా కూర్చుండిపోయిన రాజ్ కపూర్, వెనక్కి తిరిగి విశ్వనాథ్‌తో, ‘‘మీరు నా హృదయాన్ని టచ్ చేశారు. దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ హానెస్టీ ఇన్ దిస్ ఫిల్మ్’’ అంటూ తెగ మెచ్చుకున్నారు. కమలహాసన్, విశ్వనాథ్‌లతోనే ‘స్వాతిముత్యం’ హిందీ రీమేక్ చేయాలనీ రాజ్‌కపూర్ ముచ్చటపడ్డారు. చిత్ర శతదినోత్సవానికి వచ్చిన ఆయన ఆ అర్ధరాత్రి కమలహాసన్‌కు ఫోన్ చేసి, తన మనసులో మాట చెప్పారు. కానీ తర్వాత ఎందుకనో అది కుదరలేదు. ఏది ఏమైనా, కథ రీత్యా నేటికీ ‘స్వాతిముత్యం’ రిస్కీ ప్రయోగమే. కానీ విశ్వనాథ్ ఒకటికి రెండింతల భారాన్ని తలకెత్తుకొని, విజయతీరం చేర్చడం మన తెలుగు సినిమాకు మరపురాని మహా ఘనత. క్లాస్మాటున మాస్ డైరెక్టర్! భారతీయ సినీరంగంలో ప్రయోగాలకూ, ప్రయోగశీలురకూ కొరత లేదు. సత్యజిత్ రే, హృషీకేశ్ ముఖర్జీల నుంచి తమిళ శ్రీధర్, మలయాళ ఆదూర్ గోపాలకృష్ణ్ణన్, కన్నడ పుట్టణ్ణ కణగల్ దాకా ఎంతోమంది కళాత్మకంగా, రిస్కీ కథలతో ప్రయోగాలు చేశారు. అయితే, సహజంగానే ఆ ప్రయోగాలన్నీ విమర్శకుల ప్రశంసలకే పరిమితం. పెద్దగా ఆడవు. ఒకవేళ ఆడినా, బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్లయిన సందర్భాలు అరుదు. కానీ, మన తెలుగు దర్శక ఆణిముత్యం విశ్వనాథ్ మాత్రం ఆ విషయంలో అందరినీ ఆశ్చర్యపరిచారు. అటు సంగీత ప్రధానమైన ‘శంకరాభరణం’ అయినా, ఇటు సామాజిక కోణం ఉన్న ‘స్వాతిముత్యం’ అయినా, క్లాస్ కథాంశాలతో కమర్షియల్ గానూ మాస్ హిట్లు సాధించారు. పండితుల ప్రశంసలతో ‘కళాతపస్వి’గా పేరు ప్రతిష్ఠలు సంపాదించారు. పండితులతో పాటు పామర జనాదరణతో బాక్సాఫీస్ వద్ద మాస్ దర్శకులకు మించిన కలెక్షన్లు సాధించి, ‘క్లాస్ మాటున... కనిపించని మాస్ డైరెక్టర్’గానూ నిలిచారు. ఇలా క్లాస్ సినిమాలు తీసి, మాస్‌ను కూడా మెప్పించిన దర్శకుడు మరొకరు లేరు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై ఇది విశ్వనాథ్‌కే సాధ్యమైన ఓ ‘న భూతో న భవిష్యత్’ విన్యాసం! తమిళం, హిందీల్లోనూ... హిట్! తెలుగు వెర్షన్ రిలీజైన కొద్ది నెలలకే ‘స్వాతిముత్యం’ చిత్రాన్ని నిర్మాత ఏడిద నాగేశ్వరరావే తమి ళంలో ‘చిప్పిక్కుళ్ ముత్తు’ (1986 అక్టోబర్ 2)గా అనువదించారు. తమిళ, మలయాళ సీమల్లో అది మంచి విజయం సాధించింది. మూడేళ్ళ తరువాత అనిల్‌కపూర్, విజయశాంతి జంటగా ‘ఈశ్వర్’(’89) పేరుతో కె. విశ్వనాథ్ దర్శకత్వంలోనే మధు ఫిలిమ్స్ మల్లికార్జునరావు హిందీలో రీమేక్ చేశారు. అక్కడా విజయవంతమైంది. ఆపైన చాలాకాలానికి ఇదే కథను కొందరు కన్నడ సినీ రూపకర్తలు ‘స్వాతి ముత్తు’ (2003) పేరుతో స్వయంగా రూపొందించారు. ఇప్పటి స్టార్ హీరో సుదీప్, మీనా అందులో జంటగా నటించారు. తెలుగు ‘స్వాతిముత్యం’కు మక్కికి మక్కి కాపీ లాగా ఈ కన్నడ వెర్షన్‌ను తీశారు. అయితే, దర్శకుడు మాత్రం విశ్వనాథ్ కాదు. కమలహాసన్ మేనరిజమ్‌నే మళ్ళీ కన్నడ వెర్షన్లోనూ పెట్టారు. ఇళయరాజా సంగీతాన్నే వాడుకున్నారు. కానీ, అచ్చం జిరాక్స్ కాపీ తీసినట్లుగా రీమేక్ చేయడంతో కథలో ఆత్మ లోపించింది. దాంతో కన్నడ వెర్షన్ అనుకున్నంత జనాదరణ పొందలేదు. ‘‘మాతృకను చూడకుండా, అదే తొలిసారి చూడడమైతే ఓకే కానీ, ఒకసారి ఒక కథను చూసేసిన ప్రేక్షకులు ఆ తరువాత దాన్ని యథాతథంగా మరొకరు తీసే ప్రయత్నాన్ని పెద్దగా హర్షించరు. కథనం, పాటలు, సంగీతం – ఇలా అన్నిటిలోనూ మాతృకతో పోల్చిచూసి, విమర్శిస్తారు. ఇది నా ఇన్నేళ్ళ అనుభవం’’ అని విశ్వనాథ్ వివరించారు. బెంగళూరు సహా కన్నడసీమలోనూ తెలుగు ‘స్వాతిముత్యం’ బాగా ఆడడంతో, తీరా కన్నడంలోకి అదే కథను రీమేక్ చేసినప్పుడు ఆ మాతృక ఘనవిజయం పెద్ద ఇబ్బందిగా మారింది. చిరు పాత్రలో... అల్లు అర్జున్ ‘శంకరాభరణం’ చిత్రాన్ని తమిళనాట విడుదల చేసిన మేజర్ సౌందర్ రాజన్ అక్కడ ప్రముఖ నటుడు – ఏడిద నాగేశ్వరరావుకు స్నేహితుడు. సౌందరరాజన్ తొలిసారిగా తెలుగుతెర మీదకొచ్చి, ఈ ‘స్వాతిముత్యం’లో రాధిక మామగారి పాత్రలో కనిపిస్తారు. సినిమాల్లో హీరో అవుదామని వచ్చి, నటుడిగా చాలా పాత్రలు చేసి, నిర్మాతగా స్థిరపడ్డ ఏడిదే ఆ పాత్రకు తెలుగు డబ్బింగ్ చెప్పడం విశేషం. రాధిక కొడుకుగా జానపద హీరో కాంతారావు మనుమడు (పెద్దబ్బాయి ప్రతాప్ కొడుకు) మాస్టర్ కార్తీక్ నటించారు. కమలహాసన్ మనవడిగా అల్లు అరవింద్ కుమారుడు అల్లు అర్జున్ తెరపై కనిపించడం విశేషం. మనవరాళ్ళుగా అరవింద్ పెద బావగారు – నిర్మాతైన డాక్టర్ కె. వెంకటేశ్వరరావు కుమార్తెలు విద్య, దీపు తెరపైకి వచ్చారు. స్టార్ హీరోగా ఎదిగిన అల్లు అర్జున్ చిన్నప్పటి ఆ తీపి జ్ఞాపకాల్ని ఇప్పటికీ ఆత్మీయంగా గుర్తుచేసుకుంటూ ఉంటారు. ఎన్టీఆర్ తర్వాత ఈ సినిమానే! రిలీజులో, రికార్డుల్లో కూడా ‘స్వాతిముత్యా’నికి ప్రత్యేకత ఉంది. అది 1986. పదోతరగతి పరీక్షల సీజన్‌కు ముందు సినిమా కలెక్షన్లకు డల్ పీరియడ్‌గా భావించే మార్చి నెలలో ‘స్వాతిముత్యం’ రిలీజైంది. అన్‌సీజన్‌లోనూ అన్ని వర్గాలనూ మెప్పించి, వసూళ్ళ వర్షం కురిపించింది. రజతోత్సవాలు చేసుకుంది. అప్పట్లో తెలుగునాట సినిమాలన్నీ రెగ్యులర్ షోస్ అంటే రోజుకు 3 ఆటలే! ఉదయం ఆట ఏదైనా చిన్న, డబ్బింగ్ సినిమాలు ఆడడం ఆనవాయితీ. రిలీజ్ సినిమాకు హెవీ క్రౌడ్ ఉంటే కొద్ది రోజులు అదనపు ఆటలు వేసేవారు. కానీ, ‘స్వాతిముత్యం’ అలా ఎక్స్ట్రా షోలతోనే ఏకంగా వంద రోజులు ఆడింది. అంతకు దాదాపు పదేళ్ళ క్రితం 1977 ప్రాంతంలో మొదలై ఎన్టీఆర్ 4 చిత్రాలు (‘అడవి రాముడు’, ‘కొండవీటి సింహం’, ‘బొబ్బిలిపులి’, ‘శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’) మాత్రం తెలుగునాట ఇలా ఎక్స్ట్రా షోలతో, 4 –5 ఆటలతో వంద రోజులు ఆడాయి. అయితే, అవన్నీ మాస్ చిత్రాలు. వాటి తరువాత అలా అదనపు ఆటలతో తెలుగునాట శతదినోత్సవం చేసుకున్న ఘనత సాధించిన తొలి చిత్రం – ‘స్వాతిముత్యం’. మచ్చుకి గుంటూరు ‘వెంకట కృష్ణా’లో రోజూ 4 ఆటలతో, తిరుపతి ‘వేల్ రామ్స్’లో డైలీ 5 షోలతో ఈ చిత్రం శతదినోత్సవం చేసుకుంది. ఆ తరువాతే స్టార్లు కృష్ణ (70 ఎం.ఎం. ‘సింహాసనం’), బాలకృష్ణ (‘సీతారామకల్యాణం’), చిరంజీవి (‘పసివాడి ప్రాణం’) లాంటి చిత్రాలతో ఈ అదనపు ఆటల శతదినోత్సవాలు సాధించారు. మన స్టార్ హీరోల కన్నా ముందే ఇలాంటి అరుదైన విజయం సాధించడాన్ని బట్టి క్లాస్ సినిమా ‘స్వాతిముత్యం’ తాలూకు మాస్ హిట్ రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఆరుగురు స్టార్ల పోటీలో ఆ ఏటి ఇండస్ట్రీ హిట్! నిజానికి ఆ ఏడాది తెలుగులో ఆరుగురు స్టార్ హీరోలు పోటీలో ఉన్నారు. అదే ఏడాది బాలకృష్ణ ఆరు వరుస హిట్లతో జోరు మీదున్నారు. బాక్సాఫీస్ ‘ఖైదీ’ చిరంజీవి అగ్రస్థానం కోసం ‘కొండవీటి రాజా’, ‘రాక్షసుడు’ లాంటి హిట్స్‌తో పోటీపడుతున్నారు. కృష్ణ తెలుగులో తొలి 70 ఎం.ఎం. సినిమా ‘సింహాసనం’తో సంచలనం రేపారు. శోభన్‌బాబు ‘శ్రావణసంధ్య’తో హిట్ సాధించారు. నాగార్జున ‘విక్రమ్’ (1986 మే 23)తో, వెంకటేశ్ ‘కలియుగ పాండవులు’(1986 ఆగస్ట్14)తో మాస్ హీరోలుగా తెరంగేట్రం చేశారు. వారందరినీ అధిగమించి, ఓ పరభాషా నటుడి (కమలహాసన్)తో, నాన్‌కమర్షియల్ రిస్కీ కథతో ఆ ఏటి ఇండస్ట్రీ హిట్టయింది ‘స్వాతి ముత్యం’. వెండితెరపై విశ్వనాథ్ సమ్మోహనం అది. ఎప్పుడైనా సరే... కమర్షియల్ సూత్రాలను ఛేదించి మరీ ఆడిన చిత్రాలే అరుదైన చరిత్ర అవుతాయి. చెరగని ఆ చరిత్ర గురించే భావితరాలకు చెప్పుకోవాల్సింది. ఆ రకంగా... కె. విశ్వనాథ్ ‘స్వాతిముత్యం’ అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఓ చిరస్మరణీయ చరిత్ర. ప్రయోగాలు చేయదలుచుకున్న సినీ సృజనశీలురకు నిరంతర స్ఫూర్తి. తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘స్వాతిముత్యం’ కేంద్ర ప్రభుత్వ రజత కమలం అందుకుంది. రాష్ట్ర ప్రభుత్వమిచ్చే నంది అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా బంగారు నందిని సాధించింది. విశ్వనాథ్ ఉత్తమ దర్శకుడిగా, కమలహాసన్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఆస్కార్స్‌కు అఫిషియల్ ఇండియన్ ఎంట్రీగా పంపిన ఫస్ట్ సౌతిండియన్ ఫిల్మ్ కూడా ఇదే! ∙– రెంటాల జయదేవ -
కే. విశ్వనాథ్ సతీమణి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. దివంగత డైరెక్టర్ ‘కళాతపస్వి’ కె.విశ్వనాథ్ సతీమణి కాశీనాథుని జయలక్ష్మి(88) ఇకలేరు. ఆదివారం సాయంత్రం 5:45 గంటలపైన ఆమె తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మంచానికే పరిమితమయ్యారు. భర్త విశ్వనాథ్ మరణం తర్వాత మరింత అనారోగ్యానికి గురయ్యారు జయలక్ష్మి. ఈ క్రమంలోనే ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. అక్కడే ఆమె తుదిశ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్‌లోని కైకలూరు జయలక్ష్మి స్వస్థలం. 1935లో వినాయక చవితి రోజున జన్మించారామె. ఆమె అన్నయ్య చదువు కోసం వారి కుటుంబం బందరుకి మారింది. అక్కడి లేడీ యాంథల్ మిషనరీ స్కూల్లో చదివారు జయలక్ష్మి. ఆమె పదో తరగతి చదువుతున్నప్పుడే పద్నాలుగేళ్లకే కె.విశ్వనాథ్‌తో 1948 అక్టోబర్ 2న వివాహం జరిగింది. ఆ తర్వాత మద్రాసులో కాపురం పెట్టారు విశ్వనాథ్–జయలక్ష్మి దంపతులు. వారికి ముగ్గురు సంతానం. పద్మావతి దేవి, కాశీనాథుని నాగేంద్ర నాథ్, కాశీనాథుని రవీంద్రనాథ్. ఈ నెల 2న కె.విశ్వనాథ్ కన్నుమూశారు. ఆయనతో 75 ఏళ్ల వైవాహిక జీవితం గడిపారు జయలక్ష్మి. కె.విశ్వనాథ్ మరణించినప్పటి నుంచి ఆయన మీద ఉన్న ప్రేమతో ఆమె తీవ్ర మనో వేదనకు గురై, ఆరోగ్యం మరింత క్షీణించటంతో తుదిశ్వాస విడిచారు. ఆమె పార్థివ దేహాన్ని ఆస్పత్రి నుంచి ఫిలింనగర్‌లోని ఇంటికి తరలించారు. విశ్వనాథ్ చనిపోయిన 24 రోజులకే జయలక్ష్మి కూడా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. జయలక్ష్మి మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. కె.విశ్వనాథ్ తుదిశ్వాస విడిచిన వార్డులోనే జయలక్ష్మి కూడా కన్నుమూయటం దురదృష్టకరమని కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం పంజాగుట్ట స్మశానవాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు. వైఎస్ జగన్ సంతాపం జయలక్ష్మి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. -
విశ్వనాథ్‌గారు ఆ నమ్మకాన్ని ఇచ్చారు
‘‘కె.విశ్వనాథ్‌గారు వృత్తి పరంగా, ప్రవృత్తి పరంగా (నటుడిగా) పరిపూర్ణమైన జీవితం అనుభవించారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకున్నా ఆణిముత్యాల్లాంటి సినిమాల ద్వారా శాశ్వితంగా మన మనసుల్లో ఉంటారు’’ అని హీరో చిరంజీవి అన్నారు. ఫిబ్రవరి 19న(ఆదివారం) కె.విశ్వనాథ్ జయంతి. ఈ సందర్భంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూఛిబొట్ల ఆధ్వర్యంలో ‘కళాతపస్వికి కళాంజలి’ కార్యక్రమం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ–‘‘కె.విశ్వనాథ్‌గారి జయంతిని మనం ఒక సంబరంలా జరుపుకోవాలి. ఆయన వదిలి వెళ్లిన కీర్తి, తీపి జ్ఞాపకాలు మనకు మిగిలిన గొప్ప అనుభవాలు.. జీవితాంతం మనం గుర్తుకు తెచ్చుకుని సంతోషించే ఆయన గుర్తులు. మూడు సినిమాల్లో నాకు అద్భుతమైన పాత్రలు ఇచ్చి, నాకు అవార్డులు తీసుకొచ్చిన నటనను నా నుంచి రాబట్టిన దర్శకుడాయన. నటనలో మెళకువలు చెబుతూ, హావభావాలు ఎలా పలికించాలో గురువులా నేర్పించారు. షూటింగ్ చేస్తున్నప్పుడు నన్ను ఒక నటుడిలాగా కాకుండా ఓ బిడ్డలాగా ఆయనతో పాటు కూర్చొబెట్టుకునేవారు. కంచిలో ఓ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు ఆయన పెరుగు అన్నం కలిపించి నాకు పంపించినప్పుడు తినకుండా ఎలా కాదనగలను? ఆ సమయంలో ఓ తండ్రిలాగా అనిపించారాయన. యాక్షన్ హీరోగా నిలదొక్కుకుంటున్న సమయంలో ఆయనతో తొలిసారి ‘శుభలేఖ’ చేసే అవకాశం వచ్చింది. ఆయన చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారని తెలియడంతో కొంచె టెన్షన్‌గా ఉండేది. డైలాగులు ఫాస్ట్‌గా కాదు.. అర్థమయ్యేలా కరెక్ట్‌గా పలకాలని చెప్పారాయన. ఆయన ఓ అద్భుతమైన నటుడు.. మన నుంచి ఒరిజినాలిటీని రాబట్టుకుంటారు. నేను కూడా క్లాసికల్ డ్యాన్స్ చేయగలను అనే నమ్మకాన్ని ఇచ్చింది విశ్వనాథ్‌గారు. నేను మాస్ హీరోగా దూసుకెళుతున్న సమయంలో ‘స్వయం కృషి’ లాంటి మంచి సందేశాత్మక చిత్రం చేయించారాయన. ‘ఆపద్బాంధవుడు’ చిత్రంలో ఓ సీన్ కోసం ఆయనవద్దకు వెళ్లి రాత్రి రిహార్సల్స్ చేశాను.. మరుసటి రోజు ఆ సన్నివేశం అద్భుతంగా వచ్చింది. ఎమోషన్స్‌ని అద్భుతంగా తీయగలరు విశ్వనాథ్‌గారు. ఆయన వద్ద నేను నేర్చుకున్న అంశాలను నాతో పనిచేస్తున్న దర్శకులకు చెబుతుంటాను. విశ్వనాథ్‌గారి వద్ద పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం’’ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ–‘‘యువహీరో తారకరత్న పరమదించడం బాధగా ఉంది’’ అన్నారు. ‘కళాతపస్వికి కళాంజలి’ లో కె.విశ్వనాథ్‌తో పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు జ్ఞాపికలు అందించారు. ఈ సందర్భంగా ఆయనతో తమకున్న అనుబంధాలను వారు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో కె.విశ్వనాథ్ పెద్దబ్బాయి కె.నాగేంద్ర నాథ్, ఆర్.నారాయణ మూర్తి, కె.రాఘవేంద్ర రావు, రమేశ్ ప్రసాద్, కేఎస్ రామారావు, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, మాజీ ఎంపీ ‘కళాబంధు’ టి.సుబ్బరామి రెడ్డి, ‘శంకరాభరణం’ ఝాన్సీ, మంజు భార్గవి, శివలెంక కృష్ణప్రసాద్, మురళీ మోహన్, సి.అశ్వినీదత్, దామోదర్ ప్రసాద్, సుమలత, రాజశేఖర్, అలీ, భానుచందర్, శేఖర్ కమ్ముల తదితరులు పాల్గొన్నారు. -
‘విశ్వనాథ్ విశ్వరూపం’ పుస్తకం ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: కళాతపస్వి కె.విశ్వనాథ్ సినిమాలపై రామశాస్త్రి రచించిన ‘విశ్వనాథ్ విశ్వరూపం’ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం జరిగింది. కె.విశ్వనాథ్ చేతుల మీదగా ఆవిష్కరించారు. పుస్తకావిష్కరణలో సభలో పాల్గొన్న తనికెళ్ల భరణి మాట్లాడుతూ, విశ్వనాథ్ అంటే అందరికీ ఉండే అభిమానం, ప్రేమ.. రచయిత రామశాస్త్రి విషయంలో భక్తిగా మారిందన్నారు. విశ్వనాథ్ సినిమాలని పరమ పవిత్రమైన మనస్సుతో చూసి, పరిశీలించి, పరీక్షించి, పరామర్శించి, పరవశం చెంది ఈ పుస్తకం రాశారన్నారు. కళాతపస్వి కె.విశ్వనాథ్ మాట్లాడుతూ.. తన చిత్రాల మీద సమగ్రమైన థీసిస్ వంటి రచన చేయటం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ పుస్తకం రాయటం ఎంతో కష్టమైన పని అన్నారు. -
గుర్తుండిపోయే సినిమాలు ఇచ్చారు
ప్రముఖ దర్శకులు కె. విశ్వనాథ్ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు అందించారు. ఆయన డైరెక్ట్ చేసిన ‘స్వాతిముత్యం, స్వాతి కిరణం’ సినిమాల్లో హీరోయిన్గా నటించారు రాధిక. తనకు రెండు అద్భుతమైన చిత్రాలు అందించిన దర్శకుడిని కలిశారామె. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు రాధిక. దర్శకులు విశ్వనాథ్‌ను ఆయన స్వగృహంలో కలిశారామె. ఈ సందర్భంగా దిగిన ఫొటోను షేర్ చేసి, ‘‘విశ్వనాథ్‌గారు నాకు గుర్తుండిపోయే సినిమాలు, పాత్రలు ఇచ్చారు. ఆయన్ను కలవడం చాలా సంతోషంగా ఉంది. ఆయన ఒక లెజెండ్. విశ్వనాథ్‌గారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది’’ అన్నారు రాధిక. ‘స్వాతిముత్యం’ లొకేషన్లో... -
సంస్కార నిరూపణే శంకరాభరణం
నాటి సినిమా గంజాయివనంలో తులసి పుట్టింది. ఆ తులసికి డబ్బంటే మోజు లేదు. నగలంటే మోహం లేదు. తన తల్లిలా ఐశ్వర్యం అంటే పిచ్చి లేదు. తన కుటుంబాలలో స్త్రీలు ఇంతకాలం చేసినట్టుగా మగవాళ్ల విలాసవస్తువుగా మారి విలువలు లేని జీవితం గడపాలన్న తాపత్రయం లేదు. తులసి నిజంగా తులసే. స్త్రీ దేహానికి విలువ కట్టి వలువ ఊడదీసే ఇంట్లో పుట్టిన తులసి. ఆ అమ్మాయికి సంగీతం అంటే ఇష్టం. గానం అంటే ప్రాణం. నృత్యం అంటే అభిమానం. ముఖ్యంగా ‘శంకరాభరణం’ శంకరశాస్త్రి అంటే ఆర్తి. ఎలాంటి ఆర్తి అది? ఆయన శివుడు అయితే తను నందిలా ప్రణమిల్లాలని, ఆయన విష్ణువైతే తను పారిజాతంలా పాదం వద్ద పడి ఉండాలని, ఆయన బ్రహ్మ అయితే విశ్వసృజనలో తానొక సింధువులా మారాలని.. అంత భక్తి. ఈ భక్తిలో ఆత్మకు తప్ప శరీరానికి విలువ లేదు. ఉనికి లేదు. కాని ఊరు వేరేలా అర్థం చేసుకుంది. తనను అభిమానించి చేరదీసిన శంకరశాస్త్రిని తప్పు బట్టింది. ఊరు వెలేసే ‘కులట’ను చేరదీసినందుకు శంకరశాస్త్రిని బహిష్కరించింది. ఆయనను బహిష్కరిస్తే తప్పు లేదు. ఆయన సంగీతాన్ని కూడా బహిష్కరించింది. శంకర శాస్త్రి– తులసి. ఇద్దరూ బహిష్కృతులు. పాములు. ఒక పాము వీధిన కనబడితే కేవలం అది పాము. విషపురుగు. కాని అది శివుని మెడలో కనబడితే ఆభరణం. శివుని ఆభరణం. శంకరాభరణం. పూజలు అందుకుంటుంది. శంకరశాస్త్రి తానొక శంకరాభరణం అని లోకానికి తెలియచేయాలి. తులసి తానొక శంకరాభరణం అని నిరూపించుకోవాలి. సంగీతం కోసం జీవించి, సంగీతాన్ని శోధించి, సంగీతాన్ని ఆరాధించి, సంగీతంలో ఐక్యమై శంకరాభరణంలా గౌరవం పొందిన ఆ ఇద్దరి కథే శంకరాభరణం. శంకరశాస్త్రి ఉపాసకుడు. నాదోపాసకుడు. అగ్నిని అరచేత ధరించి సత్యం పలుకగలిగిన సరస్వతి పలుకు ఉన్నవాడు. ఆయన పాడితే పాములు కూడా పడగ విప్పి వింటాయి. పక్షులు రెక్కలు ముడుచుకుని కూచుంటాయి. చెట్లు తలలు ఊపుతూ వంత పలుకుతాయి. అటువంటి శంకరశాస్త్రి, భార్యా వియోగుడైన శంకర శాస్త్రి, ఒక్కగానొక్క కూతురిని పోషించుకుంటూ ఉన్న శంకరశాస్త్రి అనుకోని పరిస్థితిలో తులసిని చూస్తాడు. ఆమె కష్టాన్ని అర్థం చేసుకుంటాడు. కన్న తల్లే ఆమెను అమ్మేయాలనుకుంటుందని తెలిసి ఆదుకుంటాడు. కాని దానివల్ల తానే నష్టపోతాడు. సంఘం అనుమానంగా చూస్తుంది. సమాజం నోరు నొక్కుకుంటుంది. వెంట నిలిచే స్నేహితులు తప్ప ఎవరూ మిగలరు. ఇది తులసి తట్టుకోలేకపోతుంది. ఆయన కోసమే ఆయనను దూరంగా వదిలిపోతుంది. ఒకప్పుడు గజారోహణం, గండపెండేరం బహూకరణ, సన్మానం, సత్కారం, కచ్చేరి అంటే విరబడే జనాలు... ఆ వైభవం కాలం గడిచే కొద్దీ మాసిపోయింది. శాస్త్రీయ సంగీతం అరుపులు కేకల సినీ సంగీతంలో మూల్గుల నిట్టూర్పుల పాశ్చాత్య సంగీతంలో పడి కొట్టుకుపోయింది. ఇప్పుడు ఎవరూ శంకరశాస్త్రిని పిలిచేవారు లేరు. పలుకరించేవారు కూడా లేరు. ఆయన కూతురు పెళ్లికి ఎదిగి వచ్చింది. కాని పెళ్లి చేసే డబ్బు లేదు. శరీరాన ఉన్న వస్త్రాలు జీర్ణమయ్యాయి. కొత్త వస్త్రాలు కొనుక్కునే స్తోమత లేదు. మిగిలిందల్లా కంఠాన కొలువున్న సంగీతం. దివారాత్రాలు తోడుండే స్వరాలు. ఇలాంటి స్థితిలో ఆనాడు వదిలి వెళ్లిన తులసి తిరిగి వస్తుంది. తల్లి చనిపోగా బోలెడంత ఆస్తి కలిసి రాగా ఆ ఆస్తితో ఏదైనా సత్కార్యం చేయాలని శంకరశాస్త్రిని వెతుక్కుంటూ వస్తుంది. అందుకు మాత్రమే కాదు. తనను ఒక మగవాడు కాటేశాడు. అందువల్ల తాను గర్భవతి అయ్యింది. తన కడుపున కూడా కొడుకు రూపంలో ఒక పాము పుట్టింది. ఆ పామును శంకరశాస్త్రి పాదాల చెంత చేర్చి, సంగీతం నేర్చుకునేలా చేసి, ఆ పామును శంకరాభరణం చేయాలన్న లక్ష్యంతో వచ్చింది. తులసి కొడుకు శంకరశాస్త్రి శిష్యుడవుతాడు. ప్రభ కోల్పోయిన శంకరశాస్త్రి పూర్వపు వెలుగును సంతరించుకుంటూ తన చివరి కచ్చేరి ఇస్తాడు. సభికులు క్రిక్కిరిసిన ఆ సభలో ‘దొరకునా ఇటువంటి సేవా’ అంటూ సంగీతాన్ని అర్చించడానికి మించిన సేవ లేదంటూ పాడుతూ పాట సగంలో వుండగా ప్రాణం విడుస్తాడు. కాని సంగీతం అంతమాత్రాన ఆగిపోతుందా? అది జీవనది. శంకరశాస్త్రి శిష్యుడు, తులసి కొడుకు అయిన పిల్లవాడు మిగిలిన పాటను అందుకుంటాడు. గొప్ప సంగీతం, మరెంతో గొప్ప సంస్కారం, సంస్కృతి ఎక్కడికీ పోవు. మనం చేయవలసిందల్లా పూనిక చేయడమే. ఆదరించడమే. కొత్తతరాలకు అందించడమే. ఇవన్నీ సమర్థంగా సక్రమంగా చెప్పడం వల్ల శంకరాభరణం క్లాసిక్ అయ్యింది. కలెక్షన్ల శివ తాండవం ఆడింది. సినిమాలలో కైలాస కొండలా అంత ఎత్తున బంగారువర్ణంలో నిలిచింది. 1979లో విడుదలైన ‘శంకరాభరణం’ తెలుగువారి కీర్తి కారణాలలో ఒకటిగా నిలుస్తుందని ఎవరూ ఊహించలేదు. కాని బీడువారిన నేల ఎదురు చూస్తున్న కుంభవృష్టి అదేనని సినిమా విడుదలయ్యాక తెలిసివచ్చింది. ఈ నేలలో, ఈ ప్రజల రక్తంలో నిబిడీకృతమైన పురా సంస్కృతిని తట్టి లేపడం వల్ల ఆ సినిమా ప్రజల ఆనందబాష్పాలతో తడిసి ముద్దయింది. అవుతూనే ఉంది. దర్శకుడు కె.విశ్వనాథ్ మలినం లేని ఉద్దేశ్యంతో తెరకెక్కించడం వల్ల ఆ స్వచ్ఛత సినిమా అంతా కనిపిస్తుంది. ఈ సినిమా సంగీతాన్ని సంస్కరించడం మాత్రమే కాదు మన సంస్కారాన్ని సంస్కరించే పని చేయడం వల్ల కూడా ఆకట్టుకుంది. శంకరశాస్త్రిగా జె.వి.సోమయాజులు, తులసిగా మంజుభార్గవి జన్మలు ధన్యమయ్యాయి. సంగీతం అందించిన కె.వి.మహదేవన్, పాటలు రాసిన వేటూరి సుందరరామమూర్తి, పాడిన ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం చరితార్థులయ్యారు. ‘అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమే సోపానమూ’ అంటూ ఈ సినిమా రిలీజైన రోజుల్లో రిక్షావాళ్లు కూడా గొంతు కలిపారు. నాటుసారా తాగి ‘శంకరా’ అని పాట ఎత్తుకున్నారు. చంద్రమోహన్, రాజ్యలక్ష్మి, నిర్మలమ్మ వీళ్లంతా ఒకెత్తయితే శంకరశాస్త్రి స్నేహితుడిగా నటించిన అల్లు రామలింగయ్య ఒక్కడే ఒకెత్తు. కథను సూత్రధారిలా నడిపిస్తాడు. పొంగే శంకరరాస్త్రిపై చిలకరింపులా పడి అతడిని పాలుగా మిగులుస్తుంటాడు. అతడే శంకరశాస్త్రికి స్నేహితుడు, కొడుకు, కన్నతండ్రి. ఏ సంగీతం అయితే ఏమిటి? ఏ మతం అయితే ఏమిటి? ఏ సమూహం అయితే ఏమిటి? అది పాటిస్తున్న విలువలు, కొనసాగిస్తున్న సంప్రదాయం, అది నిలబెడుతున్న నాగరికత సమాజ హితంలో ఉంటే ఏ సమాజం కూడా దానిని వదలుకోదు. నిలబెట్టుకుంటుంది. వెంట నడిచి కాపాడుకుంటుంది. మాసిన తెల్లరంగు గోడల మీద తిరిగి తెల్లరంగు వేయడాన్ని ఎవరు వద్దంటారు. మాసిన గొప్ప సంగీతాన్ని తిరిగి నిలబెడతానని శంకరాభరణం అంటే అందుకే వెల్కమ్ చెప్పారు. శంకరాభరణం తీసినందుకు నిర్మాత ఏడిద నాగేశ్వరరావుకు, దర్శకుడు విశ్వనాథ్‌కు మాత్రమే శభాష్ అనకూడదు. సినిమా విడుదలయ్యాక పసిగట్టి పెరుగన్నం పాయసం తినిపించిన ప్రేక్షకులను కూడా శభాష్ అనాలి. అప్పుడే అందరూ గెలిచినట్టు. ఓంకార నాదాను సంధానమౌ గానమే... శంకరాభరణమూ. -
కె. విశ్వనాథ్ పేరుతో అవార్డులు
కళా తపస్వి కె. విశ్వనాథ్ తీసిన ‘శంకరాభరణం’లో చిన్న పిల్లాడి పాత్రలో నటించారు బాల నటి తులసి. ఆ తర్వాత బాల నటిగా పలు చిత్రాల్లోనూ, ఆ తర్వాత కథానాయికగా, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి పేరు సంపాదించుకున్నారామె. శంకరం పాత్రతో తనను తెరకు పరిచయం చేసిన గురువు విశ్వనాథ్ పట్ల ఆమెకు అపారమైన గౌరవాభిమానాలున్నాయి. అందుకే విశ్వనాథ్ పేరుతో ఆమె పురస్కారాల్ని ఇవ్వబోతున్నారు. తులసి మాట్లాడుతూ– ‘‘తెలుగు చిత్ర పరిశ్రమలోని ఉత్తమ నటీనటులు, సాంకేతిక నిపుణులకు ప్రతి ఏటా గురువు విశ్వనాథ్‌గారి పేరిట ‘కాశీనాథుని విశ్వనాథ్’ పురస్కారాలు ఇవ్వనున్నా. ఈ ఏడాది పురస్కారాల ప్రదానోత్సవం ఈ నెల 20న హైదరాబాద్ శిల్ప కళా వేదికలో జరగనుంది. ఈ వేడుకకి గవర్నర్ ఈ.ఎస్.ఎల్. నరసింహన్, దక్షిణ, ఉత్తరాది సినీ ప్రముఖులు హాజరవుతారు’’ అన్నారు. -
శంకరాభరణం ఓ ఆభరణం
‘‘ఈ రోజుల్లో సినిమాలు సమాజంపై మంచి ప్రభావం చూపుతున్నాయి. ఈ సమయంలో ‘శంకరాభరణం’ లాంటి సినిమాలు రావాలి. భారతీయ సినిమా స్థాయిని శంకరాభరణం పెంచింది. ‘శంకరాభరణం’ చిత్రపరిశ్రమలో అత్యద్భుత చిత్రం. ఇప్పుడు ‘బాహుబలి’లాంటి సినిమాలు వచ్చాయి. వాటి గొప్పదనం వాటికి ఉంటుంది. అయితే ‘శంకరాభరణం’ శంకరాభరణమే. సినీప్రపంచానికి ఆభరణం లాంటి సినిమా. విశ్యనాథ్గారు ఓ ఆభరణమే’’ అని తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ అన్నారు. కళాతపస్వి కె. విశ్వనాథ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చినందుకు తెలుగు దర్శకుల సంఘం ఆయన్ను సన్మానించింది. సన్మాన పత్రాన్ని నటుడు తనికెళ్ళ భరణి చదివి, వినిపించారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన తెలుగు రాష్ట్రాల గవర్నర్ఇ.ఎస్.ఎల్. నరసింహన్ చేతుల మీదగా కె. విశ్వనాథ్‌కు సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జాతీయ అవార్డు గ్రహీతలను సన్మానించారు. సీనియర్ నటుడు కృష్ణంరాజు, దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, కళాబంధు టి. సుబ్బరామిరెడ్డితో పాటు పలువురు సినీ ప్రముఖులు హజరయ్యారు. ఇంకా జాతీయ అవార్డు గ్రహీతలు ‘శతమానం భవతి’ నిర్మాత ‘దిల్’ రాజు, దర్శకుడు సతీష్ వేగేశ్న, ‘పెళ్లిచూపులు’ దర్శకుడు తరుణ్‌భాస్కర్, నిర్మాతలు యష్ రంగినేని తదితరులను సన్మానించారు. -
నాకు నటన రాదు – పవన్ కల్యాణ్
‘‘సినిమాల్లో రాకముందు విశ్వనాథ్‌గారిని కలిశా. వచ్చిన తర్వాత కలిసే సందర్భం రాలేదు. విశ్వనాథ్‌గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం, ఆయన్ను కలుసుకోవడం ఆనందంగా ఉంది’’ అన్నారు పవన్ కల్యాణ్. బుధవారం ఉదయం హీరో పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌లు హైదరాబాద్ లోని విశ్వనాథ్ స్వగృహానికి వెళ్లి పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించారు. పవన్ మాట్లాడుతూ – ‘‘మన సంస్కృతి, కళల పట్ల నాకు అవగాహన ఉన్నప్పటికీ స్కూల్‌కి వెళ్లే టైమ్‌లో వెస్ట్రన్ మ్యూజిక్ పట్ల ఎక్కువ అవగాహన ఉండేది. మన సంప్రదాయం, కర్ణాటక సంగీతం వంటివన్నీ తెలిసేవి కావు. కానీ, చిన్న వయసులో ‘శంకరాభరణం’ చూసి ఎడిక్ట్ అయ్యాను. విశ్వనాథ్‌గారి గురించి మాట్లాడేంత అనుభవం, స్థాయి నాకు లేదు. అన్నయ్య (చిరంజీవి)తో అప్పుడప్పుడూ ‘స్వయంకృషి’ షూటింగ్‌కి వెళ్లేవాణ్ణి. ‘శంకరాభరణం’ తర్వాత ‘శుభలేఖ’, ‘సాగర సంగమం, సప్తపది’ ఇలా ఆయన అన్ని సినిమాలూ ఇష్టమే. ముఖ్యంగా ఆయన కథలను నడిపిన విధానం, దర్శకత్వం నాకిష్టం’’ అన్నారు. విశ్వనాథ్ దర్శకత్వంలో నటించాలనుకున్నారా? అని పవన్‌ను ప్రశ్నించగా, ‘‘నాకు నటనే రాదు కాబట్టి ఆయన దర్శకత్వంలో నటించాలనే ఆలోచన ఎప్పుడూ రాలేదు’’ అన్నారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ – ‘‘కొన్ని అవార్డులు కొందరికి ఇచ్చినప్పుడు అవార్డులకే గౌరవం వస్తుంది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు విశ్వనాథ్‌గారికి వచ్చిన తర్వాత వీటిపై నమ్మకం పెరిగింది. ఆయన గురించి మాట్లాడే స్థాయి, అర్హత, అనుభవం మాకు లేవు. విశ్వనాథ్‌గారు తీసిన సినిమాల్లోంచి 12 సినిమాలను ఒక డిస్క్ సెట్‌గా చేసి, లిమిటెడ్ ఎడిషన్‌గా కొన్ని కాపీలు ప్రింట్ చేసి ఆయన పట్ల మాకున్న ఇష్టాన్నీ, అభిమానాన్నీ, గౌరవాన్నీ చాటుకోవా లనుకుంటున్నాం. ఈ ఐడియా ఇచ్చింది కల్యాణ్‌గారే. ఆయా సినిమాల నిర్మాతలు, వీడియో హక్కులున్న వ్యక్తులతో మాట్లాడి ఈ ఏడాదే డిస్క్ సెట్ విడుదల చేయాలని మా ఆలోచన’’ అన్నారు. విశ్వనాథ్‌గారు క్లాసిక్స్ తీశారు: బన్నీ బుధవారం సాయంత్రం అల్లు అర్జున్ కూడా కె. విశ్వనాథ్‌ని కలిశారు. ‘‘విశ్వనాథ్‌గారు తీసినవన్నీ క్లాసిక్స్. ఆయన టచ్ చేసిన పాయింట్స్‌ను హిస్టరీలో ఎవరూ టచ్ చేయలేదు’’ అని బన్నీ అన్నారు. -
కళాతపస్వికి ‘ఫాల్కే’ అవార్డు
-
రాగం... తానం... ఫాల్కే...
రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి నవరస మురళి ఆనందన మురళి ఇదేనా ఆ మురళి మోహన మురళి... గుంటూరు జిల్లా రేపల్లె ప్రాంతం నుంచి వచ్చిన కె.విశ్వనాథ్ రాగాన్ని, నాదాన్ని నమ్ముకుని– తెలుగును నమ్ముకుని– ఈ మట్టి సంస్కృతిని నమ్ముకుని– ప్రేక్షకుడిని నమ్ముకుని చేసిన సుదీర్ఘ సినీ ప్రస్థానం ‘దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు’ ప్రకటనతో పరిపూర్ణం అయ్యింది. ఎవరెస్ట్ ఎక్కకుండా హిమాయాలన్నీ కల తిరిగి రావచ్చు. కాని ఎవరెస్ట్ ఎక్కినప్పుడే ఆ పర్వతాలకు గౌరవం, పర్వతారోహకుడికి అతిశయం. ఇవాళ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో కె.విశ్వనాథ్ గౌరవంతో పాటు తెలుగు ప్రేక్షకుడి గౌరవం కూడా అతిశయించింది. ఎందుకంటే కె.విశ్వనాథ్ ‘టేస్ట్’ను తెలుగు ప్రేక్షకుడు అందుకున్నాడు. లేదా తెలుగు ప్రేక్షకుడి టేస్ట్‌ను కె.విశ్వనాథ్ సమున్నతం చేయగలిగారు. ఇది వీరిరువురూ పరస్పరం అభినందించుకోవాల్సిన ఘట్టం. ఆకుచాటు పిందె తడిసె.. తెలుగు ప్రేక్షకుడికి వినోదం కావాలి. కాయకష్టం చేసుకునేవాడు కాసేపు కష్టమంతా మరచి ఊహాలోకంలో విహరించి రావాలి. కె.రాఘవేంద్రరావు అటువంటి వినోద మాంత్రికుడు. నేల టికెట్టు ప్రేక్షకుడైనా బాల్కనీ విద్యాధికుడైనా కాసేపు తమను తాము మరచిపోయేలా చేయగల సెల్యులాయిడ్ మేజిక్ రాఘవేంద్రరావు సొంతం. 1979 ఆయన చేసిన ‘వేటగాడు’ వచ్చింది. ‘ఆకుచాటు పిందె’ను తెచ్చింది. కలెక్షన్ల ‘బంగారు బాతుగుడ్డు’ను తొక్కుడు లడ్డూలకు మల్లే మార్కెట్ చేసుకుంది. ఒక కమర్షియల్ ఊపు సెటిలైన సమయం. దీనిని వీలైతే ముందుకు తీసుకెళ్లాలి. సవాల్ చేయగలగాలి. కాని దీనిని మెప్పించిన ప్రేక్షకుడే ఒక రాగానికి స్పందించగలడని, ఒక కీర్తనకు కంట తడి పెట్టగలడని, ఒక శాస్త్రీయ నృత్య భంగిమకు ఉద్వేగానికి లోనవగలడని కె.విశ్వనాథ్ నమ్మగలిగారు. 1980– శంకరాభరణం తీసి రిలీజ్ చేశారు. ఒకడు సోమయాజులు అట. ‘ముసలాడు’. ఒకామె తల నిండుగా కప్పుకుని నిలబడే మంజుభార్గవి అట. ఇంతకు ముందు సినిమాల్లో వేంప్. ఒక బాలనటి– తులసి. నిర్మలమ్మ, రాజ్యలక్ష్మి, చంద్రమోహన్. వీళ్లా తారాగణం? కాదు. తెలుగు సంస్కృతి తారాగణం. భారతీయ సంప్రదాయమే టెక్నీషియన్స్. విశ్వనాథ్‌కు తెలుసు తను తీయబోతున్న సినిమాకు వందల సంవత్సరాల వారసత్వమే పెద్ద ఇన్వెస్ట్మెంట్ అని. అదే బడ్జెట్. సినిమా కోసం ఖర్చు పెట్టబోయేది కాదు. సినిమా విడుదలైంది. ప్రేక్షకుల రక్తంలో సుప్తావస్థలో ఉన్న సంప్రదాయం ఉలిక్కిపడి తుళ్లింతలు పోయింది. కమర్షియల్ గంతలను వదిలించుకుంది. స్వేచ్చగా ఈ సంగీత సాహిత్యాల మైదానంలో దౌడు తీసింది. తెలుగు వారికి చెప్పుకోవడానికి ఒక సినిమా– శంకరాభరణం– కె.విశ్వనాథ్ ఇచ్చారు. ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు... శివుడులో సగం స్త్రీ. ఏ కళాకారుడిలోనైనా సగం స్త్రీ ఉండాలి. అప్పుడే ఆ కళాకారుడు పరిపూర్ణం అవుతాడు. కాశీనాథుని విశ్వనాథ్‌లో కూడా సగం స్త్రీ అంశ ఉంది. అందుకే ఆయన ‘చెల్లెలి కాపురం’ (1971) తీయగలిగాడు.‘శారద’ (1973) తీయగలిగారు. ‘ఓ సీత కథ’ (1974) తీయగలిగారు. ‘జీవనజ్యోతి’ (1975) తీయగలిగారు. ‘ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు’.... వాణిశ్రీ పాడుతుంటే థియెటర్‌కు వచ్చిన ప్రేక్షకులు చిటికెలు వేస్తూ తలలు ఊపుతూ పరవశించారు. కె.విశ్వనాథ్‌కు సంగీతం ఎక్కడ మెరుస్తుందో తెలుసు. ప్రేక్షకుడి మనసులో ఎక్కడ కురుస్తుందో తెలుసు. బాల్యంలో, యవ్వనంలో ఆయన సంగీతం పట్ల మక్కువ పెంచుకున్నారు. శాస్త్రీయ సంగీతం నేర్చుకుందామనుకున్నారు. కాని ఇంట్లో వాళ్లు ఆయనను ఇంజనీరుగా చూడదలిస్తే ఆ మాట దాచిపెట్టి పెద్దలు కోరినట్టుగా చదువుకుని వాహిని స్టూడియోలో సౌండ్ ఇంజనీర్ అయ్యారు. సంగీతంలో ఉండేది నాదం. సౌండ్ ఇంజనీరింగ్‌లో చేసేది ధ్వని ముద్రణ. అభిరుచికి తగిన పని. ఆ పనే ఆయనను దర్శకుడిని చేసింది. ఝమ్మంది నాదం సై అంది పాదం ... కె.విశ్వనాథ్ తన ‘ఫోర్టె’ను వెతుకులాడుకోవడం ‘చెల్లెలి\ కాపురం’లోనే కనిపిస్తుంది. అప్పటికింకా ఆయనకేమి కావాలో ఆయనకే స్పష్టం కాలేదు. కాని వాణిశ్రీ, శోభన్‌బాబులతో ‘చరణకింకిణులు ఘల్లుఘల్లుమన’ పాటను తీయగలిగారు. గమనించి చూస్తే ఆ తర్వాత ఆయన సినీ ప్రయాణమంతా ఈ పాటే. అంటే మంచి గీతం, మంచి నృత్యమే. ‘సిరిసిరిమువ్వ’ (1976) సినిమాతో విశ్వనాథ్ స్పష్టత తెచ్చుకున్నారు. శాస్త్రీయ సంగీతం, నాట్యానికి మించిన కథల మణుగులు లేవని గ్రహించారు. అంతవరకూ ‘నోరు మెదపక’ పడి ఉన్న వాటిని ‘మూగపిల్ల’ (జయప్రద)ను సంకేతంగా చేసి సినిమాలో వేదిక ఎక్కించారు. గజ్జె ఘల్లుమంటుంటే... గుండె ఝల్లుమంటుంది... ప్రేక్షకులకు భలేగా అనిపించింది. కాసులు గల్గల్మన్నాయి. విజయం. ప్రజల ఫోకస్ నాట్యం మీద పడింది. ఇప్పుడు గానం మీద పడాలి. శాస్త్రీయ సంగీతం ‘సనాతనం’ అట. ‘ముసలి’దైపోయిందట. ‘చాదస్తం’ అట. వీటన్నింటికీ ప్రతీక శంకరశాస్త్రి. ఈ అన్ని లక్షణాలతో కూడా శాస్త్రీయ సంగీతం హీరో. బంగారం పాతదైనంత మాత్రాన బంగారం కాకుండా పోతుందా. చూద్దాం... ఎందుకు నచ్చదో అని ‘శంకరాభరణం’ తీశారు. అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమే సోపానమూ.... రాజమండ్రి వీధులో నాటుసారా ఒక్క గుక్క పుచ్చుకున్న రిక్షావాడు కూడా ఈ పాటే పాడుకున్నాడు. శిశుర్వేత్తి పశుర్వేత్తి... అందరూ పాము అనుకుని దూరం పెట్టిన శాస్త్రీయ సంగీతాన్ని శంకరుని మెడలో సగౌరవంగా ప్రతిష్ఠించారు విశ్వనాథ్. దానిని ‘శంకరాభరణం’ చేశారు. తకిట తధిమి తకిట తధిమి తందాన... ఏటితో పాటు కొట్టుకెళ్లినవాడికి చరిత్ర ఉండదు. ఏటికి ఎదురీదినవాడికే ఫాల్కే ఉంటుంది. చూడండి 1982లో ‘డిస్కో డాన్సర్’ వచ్చింది. దేశమంతా మేనియా. డిస్కో లైట్ల చీకటి వెలుగుల్లో మిథున్ చక్రవర్తి ‘ఐ యామ్ ఏ డిస్కో డాన్సర్’ అని డాన్స్ చేస్తుంటే అందరూ ఊగారు. అలాంటి టైములో మాసిన గడ్డం, ముతక బట్టలు, తూలే నడకతో ఉన్న ఒక ఫెయిల్యూర్ క్లాసికల్ డాన్సర్ హీరోగా ‘సాగర సంగమం’ (1983) తీయడం సామాన్యం కాదు. ‘బాల కనకమయ చేల’... కల్యాణమండపంలో వంటల దగ్గర డాన్స్ అట. జనం చూశారు. ‘తకిట తథిమి తకిట తథిమి తందానా’... వానలో బావి గట్టు మీద డాన్స్ అట. జనం చూశారు. ‘వాగర్ధావివ సంపృక్తౌ...’ పచ్చటి మైదానాల్లో డాన్స్ అట. జనం చూశారు. మనోశుద్ధితో ఏ పని చేసినా జనం చూస్తారు. కళ– మనసును కడిగేలా ఉంటే ఎందుకు చూడరు? అలా తపస్సుతో తీశాడు కనుకనే కె.విశ్వనాథ్ సినిమాలు చూశారు. ‘సిరివెన్నెల’(1986), ‘శృతిలయలు’ (1987), ‘స్వర్ణకమలం’ (1988)... సంగీతం– నాట్యం ఇవి కేవలం కళలు మాత్రమే కాదు... మానవజాతి భావోద్వేగాలు... మానవ సంవేదనలు ఈ కళల్లో ఉన్నాయి... కళల్లో మానవ సంవేదనలు ఉన్నాయి అని విశ్వనాథ్ చెప్పగలగడం వల్లే ప్రేక్షకులు వీటన్నింటినీ హృదయపూర్వకంగా స్వీకరించారు. ఆదరించారు. ‘ఆకాశంలో ఆశల హరివిల్లు’ అని పగటి కలలు కనే అమ్మాయి ‘అందెల రవమిది పదములదా’ అని పొందిన సాక్షాత్కారం ప్రేక్షకులు కూడా పొందారు. అది విశ్వనాథ్ ఘనత. సిన్నీ సిన్నీ కోరికలడగా శీనీవాసుడు నన్నడగా... కె.విశ్వనాథ్‌కు వేరే కథలు తీయడం కూడా తెలుసు. కట్నం సమస్యను చీదరించుకుంటూ ఆయన ‘శుభలేఖ’ (1982) తీశారు. ప్రేమకు, పెళ్లికి జాతి– కులం– మతం– సంప్రదాయాల అడ్డంకి అక్కర్లేదని ‘సప్తపది’ (1981) తీశారు. స్వచ్ఛమైన మనసుకు కూడా ఈ ప్రకృతిలో చోటు, ఆదరణ ఉంటాయని ‘స్వాతిముత్యం’ (1986) తీశారు. కష్టపడి పైకి వచ్చిన మనిషి జీవికలోని కష్టాన్నే కాదు జీవితంలోని కష్టాన్ని కూడా తట్టుకుని నిలబడతాడని ‘స్వయం కృషి’ (1987) తీశారు. అలగా జనాలని చెప్పి చిన్న చూపు చూస్తే వారే చీమలై, చలిచీమల ఉప్పెనై పెత్తందారి పడగని నమిలి మింగేస్తాయని ‘సూత్రధారులు’ (1989) తీశారు. ధన సంపద, పశు సంపద కంటే ఆపదలో ఆదుకోవడానికి ఒక మనిషిని కలిగి ఉండటమే అసలైన సంపద అని చెప్పడానికి ‘ఆపద్బాంధవుడు’ తీశారు. అయితే ఆయన తీసిన సినిమాలలో కొన్ని– ‘జననీ జన్మభూమి’ (1982), ‘చిన్నబ్బాయి’ (1997) వంటివి పరాజయం పొందాయి. ఆయన తీసిన ‘సిరిమువ్వల సింహనాదం’ అసలు విడుదలకే నోచుకోలేకపోయింది. ఆనతినీయరా హరా... విశ్వనాథ్ తీసిన సినిమాలన్నీ ఒకెత్తు ‘స్వాతి కిరణం’ (1992) ఒక్కటీ ఒకెత్తు. దీని కథాంశమే భిన్నమైనది. తీయాలంటే ధైర్యం కావాలి. తీసి మెప్పించగలగాలి. తీశాక ఈ యాంటీ సెంటిమెంట్‌ను ప్రేక్షకుల చేత జీర్ణింప చేయగలగాలి. శిష్యుణ్ణి చూసి అసూయ చెందే గురువు... ఆ అసూయ వల్ల శిష్యుడి మరణానికి కూడా కారణమయ్యే గురువు... అబ్బ... తలుచుకోవడమే చాలా కష్టం. కళాకారులలో ఉండే ఈ చీకటి కోణాన్ని విశ్వనాథ్ సమర్థంగా చూపించగలిగారు. మలయాళనటుడు మమ్ముట్టి మన కోసం నటించడం ఈ సినిమా విశేషం. ‘మాల్గుడి డేస్’ మంజునాథ్ నటించడం కూడా. దర్శకులు... విశ్వనాథ్.... కె. బాలచందర్ మిడిల్ క్లాస్‌లోని డ్రామాని అద్భుతంగా చూపించగలరు. విశ్వనాథ్‌ది ఆ కోవ కాదు. దాసరి మిడిల్ క్లాస్‌ని మాత్రమే కాదు డౌన్ ట్రాడన్ ఫోర్స్‌ని కూడా చూపగలరు. విశ్వనాథ్‌ది ఆ కోవ కూడా కాదు. భారతీరాజా రూరల్ కమ్యూనిటీస్ మధ్య ఫ్రిక్షన్‌ను చూపగలరు. విశ్వనాథ్ అలా కాదు. పోనీ ముందే చెప్పుకున్నట్టు కె.రాఘవేంద్రరావులా కమర్షియల్ డైరెక్టర్ కూడా కాదు. విశ్వనాథ్ తన జీవితంలో తన నేపథ్యంలో ఉన్న కథలనే గొప్పగా తీయగలరు అని దానినొక ‘పరిమితి’గా చెప్పే వారున్నారు. వీటన్నింటినీ గమనిస్తూనే ఆయన సున్నితమైన భావోద్వేగాలనూ సామరస్యపు కథాధోరణిని స్వీకరించి గొప్ప సినిమాలు తీయగలిగినవాడుగా మనం గుర్తించాల్సి ఉంటుంది. సినిమా తీసేటప్పుడు ‘ఖాకీ డ్రస్’ను తప్పనిసరిగా ధరించే విశ్వనాథ్ సినిమా కళను ఒక మెరుగైన కార్మికుడిగా సాధన చేసినవాడు. ఆయన తీసుకున్నది ఒకే బావి... ఒకే చేద కావచ్చు... కాని తీసిన జల మాత్రం జలధితో సమానం. ఆ ఊట తీయనిది. ఆ దప్పిక తీర్చినది. దొరకునా ఇటువంటి సేవ... విశ్వనాథ్ సినిమా తీయడాన్ని ‘దొరకునా ఇటువంటి సేవ’ అనుకున్నారు. మంచి సంగీతాన్ని, సాహిత్యాన్ని ప్రేక్షకులకు చేరువ చేసి వారి చేత కూడా అదే మాట అనిపించగలిగారు. ఆ గొప్ప సేవకూ, అంకితభావానికి, నైపుణ్యానికి, సృజనాత్మకతకు, తెలుగువాడిగా వీటన్నింటినీ చేయగలిగన ఒక సమన్వయానికి ‘దాదాసాహెబ్ ఫాల్కే’ ఒక సిసలైన నజరానా. కె.విశ్వనాథ్ కాలికి భారత ప్రభుత్వం తొడిగిన గండ పెండేరం. కంగ్రాట్స్ సర్. ‘‘ఆ కాశీనాథుడు తన ముందున్న నందిని నాకు ఇచ్చినంత ఆనందంగా ఉంది. సృజనకారులు ఎవరూ సంతృప్తిగా ఉండలేరు. నేనూ అంతే. నా నిర్మాతలెవరూ నన్ను ఇబ్బంది పెట్టలేదు. అందుకే, మంచి సినిమాలు, పాటలు వచ్చాయి. కానీ, నన్ను బాగా ఇబ్బంది పెట్టిన సినిమా ‘సిరివెన్నెల’. నా సినిమాల్లో క్యారెక్టర్ల కంటే నా వ్యక్తిత్వం అంటేనే నాకు ఇష్టం. తెలుగు సాహిత్యం, సంస్కృతి, తెలుగుదనంపై సినిమాలు తీశాను. అలాగని అన్ని సినిమాలు తీసేశానని అనుకోవడం లేదు. అనుకోను కూడా. నేను ఇప్పటివరకు విలువలకు లోబడి సినిమాలు చేశా. అలా విలువలకు కట్టుబడి సినిమాలు తీశాను కాబట్టే ఈ అవార్డు నాకు వచ్చింది. ఇప్పుటికీ నాకు నటించడానికి ఏ ఇబ్బందీ లేదు. కథలను బట్టి నటిస్తున్నాను. కోట్లు ఖర్చుపెట్టే నిర్మాతలు ఊరికే దర్శకుడికి ఛాన్స్ ఇవ్వరు. ద్రౌపదికి ఐదుగురు భర్తలు. కానీ, ఓ దర్శకుడికి 50 మంది ఉంటారు. ఓ దర్శకుడు ఎన్నో ఒత్తిళ్ల మధ్య సినిమాలు చేస్తాడు. వాళ్లకు నా సలహా ఏమీ ఉండదు’’ – దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం వచ్చిన సందర్భంగా కె. విశ్వనాథ్ మన అదృష్టం మా కె. విశ్వనాథ్‌గారిని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించడం చాలా ఆనందంగా ఉంది. ఆయన ఎంతో వినయంగా ‘అవార్డు రావడం నా అదృష్టం’ అంటారు. నిజం ఏంటంటే భారతీయులే నిజమైన అదృష్టవంతులు. ఆ విధంగా భారతీయుడనైన నేను అదృష్టవంతుణ్ణే. మీకు పేరు వస్తే నాకు వచ్చినట్లే. – నటుడు కమల్‌హాసన్ గజ్జెలు ఘల్లుమనేలా.. హృదయాలు ఝల్లుమనేలా... కళా తపస్వి విశ్వనాథ్‌గారికి భారత ప్రభుత్వం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును కాస్త ఆలస్యంగానైనా ప్రకటించినందుకు సంతోషం. మన తెలుగువారందరూ గర్వించదగ్గ విషయం ఇది. నటనలో నేను ఓనమాలు నేర్చుకుంటున్న దశలో నాతో ఒక మూగ పిల్ల వేషం వేయించి, నా కాలికి ‘సిరిసిరి మువ్వలు’ కట్టి, పాదం సయ్యనేలా నాదాన్ని ఝుమ్మనిపించారు. గజ్జెలు ఘల్లుమనేలా, హృదయాలు ఝల్లుమనేలా నర్తించేలా చేసి నా నటనా జీవితంలో మొదటి మైలురాయిని పాతారు. నటిగా నేను ఒక స్థానాన్ని అందుకున్న తర్వాత వారు నాకు ‘సాగరసంగమం’లో ఇచ్చిన మాధవి పాత్ర న భూతో న భవిష్యతి. ఒక విఫల ప్రేమికురాలిగా, ఒక తండ్రి చాటు బిడ్డగా, ఒక భర్త చాటు భార్యగా, కూతురు భవిష్యత్‌కోసం ఆరాటపడే తల్లిగా, ఒక కళారాధకురాలిగా ఆ పాత్రలో లెక్కలేనన్ని పార్శా్వలు. ‘మౌనమేలనోయి...’ అంటూ బోలెడు ఊసులు. నా యాక్టింగ్ కెరీర్‌ను దిద్దిన అనేకులలో విశ్వనాథ్ గారిది ప్రథమ శ్రేణి. వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలనీ, ఆయన మనకు ఇంకా అనేక కళాఖండాలను అందించాలని కోరుతున్నాను. – నటి జయప్రద గర్వకారణం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కె. విశ్వ నాథ్గారిని వరించడం మాకెంతో సంతోషంగా ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమకే విశ్వనాథ్‌గారు గర్వకారణం. – చిరంజీవి, రామ్‌చరణ్ చాలా ఆనందం కళా తపస్వి కె.విశ్వనాథ్‌గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. తెలుగు సినీ పరిశ్రమకు ఇది గర్వకారణం. – జూనియర్ ఎన్టీఆర్ అసాధారణ దర్శకులు అసాధరణ దర్శకులు, కళా తపస్వి కె.విశ్వనాథ్ గారిని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించడం ఆనందంగా ఉంది. తెలుగు సినిమాకి గర్వకారణం. – రాజమౌళి మరొక గొప్ప గౌరవం ప్రఖ్యాత దర్శకులు కె.విశ్వనాథ్‌గారికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడం ఆనందంగా ఉంది. తెలుగు ఇండస్ట్రీకి మరొక గొప్ప గౌరవం లభించింది. – అల్లు అర్జున్ హృదయపూర్వక శుభాకాంక్షలు విశ్వనాథ్‌గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. ఆయనకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. – శ్రీకాంత్ దాదా కంటే గొప్పవారు నా ఉద్దేశ్యంలో దాదాసాహెబ్కి మీ (విశ్వనాథ్) పేరు మీద అవార్డు ఇవ్వాలి. మీకు దాదా సాహెబ్ అవార్డు రావడం పట్ల నాకు ఆనందం ఏమీ లేదు. ఎందుకంటే మీరు ఆయనకంటే గొప్ప దర్శకులని నా అభిప్రాయం. – రామ్‌గోపాల్ వర్మ తెలుగువారందరికి గర్వకారణం కె.విశ్వనాథ్‌గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం తెలుగువారందరికి గర్వకారణం. ఆయన ఈ అవార్డు సాధించి తెలుగు చిత్ర పరిశ్రమ గౌరవాన్ని జాతీయ స్థాయి చర్చల్లో నిలిపారు. – అల్లరి నరేష్ చాలా ఆనందంగా ఉంది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కె.విశ్వనాథ్‌గారిని వరించడం చాలా సంతోషంగా ఉంది. కమల్‌గారి అభిప్రాయాలు నాకు రెట్టింపు ఆనందాన్ని కలిగించాయి. – నాని శుభ సమయం విశ్వనాథ్ గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం సంతోషంగా ఉంది. ఆయన ఈ అవార్డుకు అర్హత గలవారు. తెలుగు చిత్ర పరిశ్రమ గౌరవం మరో మెట్టు పైకెక్కిన శుభ సమయమిది. – అల్లు శిరీష్ దేశం గర్వించదగ్గ దర్శకుడు ఈ విషయం తెలియగానే విశ్వనాథ్‌గారిని స్వయంగా వెళ్లి, కలవాలనిపించింది. సాంగ్ సిట్టింగ్స్‌లో ఉన్నాను. అవి పూర్తయ్యాక తప్పకుండా వెళతాను. అర్హుడికి దక్కిన పురస్కారం ఇది. ఈ వార్త వినగానే మనసు పులకరించిపోయింది. దేశం మొత్తం గర్వించదగ్గ దర్శకుడు. భారతీయులందరూ గర్వించదగ్గ తరుణం ఇది. – రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి అవార్డు ఘనత పెరిగింది కాశీనాథుని విశ్వనాథ్‌గారిని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించడం సంతోషంగా ఉంది. ఆయనకు అవార్డు రావడం మా అందరికీ గర్వంగా ఉంది. ఆయనకు ఆ పురస్కారం లభించడం వల్ల ఆ అవార్డు ఘనత మరింత పెరిగింది. – గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎప్పుడో రావాల్సిన పురస్కారం ఇది ఈ పురస్కారం ఇప్పుడు కాదు.. ఎప్పుడో రావాల్సింది. విశ్వనాథ్‌గారిని నా సోదరుడిలా భావిస్తాను. నా కెరీర్లో మైల్స్టోన్స్గా నిలిచిన ‘ఓ సీత కథ’, ‘సిరి సిరి మువ్వ’, ‘శంకరాభరణం’ వంటి సినిమాలన్నీ ఆయన దర్శకత్వంలో చేసినవే. సినిమాల్లో శృంగారం, ఫైట్స్ వంటి ఒక మూస ధోరణి సాగుతున్న తరుణంలో సంగీతానికి పెద్ద పీట వేస్తూ సినిమాలు తీసిన ఘనత విశ్వనాథ్‌గారిది. అలాంటి సినిమాలు ఆడొచ్చూ.. ఆడకపోవచ్చు. అందుకే నిర్మాతలు వెనక్కి తగ్గే అవకాశమే ఎక్కువ. అయినప్పటికీ విశ్వనాథ్‌గారు రాజీపడలేదు. కుటుంబ సమేతంగా చూసేలా ఆహ్లాదకరమైన సినిమాలు ఇవ్వాలనుకున్నారు. తన ఆశయానికి తగ్గట్టుగానే సినిమాలు తీశారు. అలాంటి గొప్ప దర్శకుడికి ఈ పురస్కారం రావడం చాలా గర్వంగా ఉంది. – నటుడు చంద్రమోహన్ స్నేహం మీద అంత గొప్ప సినిమా రాలేదేమో! విశ్వనాథ్‌గారికి ఈ పురస్కారం వచ్చిందని వినగానే నాకు ముందు కలిగిన ఫీలింగ్ ‘ఎప్పుడో రావాల్సింది’ అని. ఆ తర్వాత కలిగిన ఫీలింగ్.. ఆలస్యంగా అయినా అర్హత ఉన్న వ్యక్తికే ఇచ్చారని. నిజంగా ఎంత గొప్ప దర్శకుడండి. పాత తరం దర్శకులను వదిలేస్తే.. ఇప్పుడు తెలుగులో పది మంచి సినిమాల గురించి చెప్పమంటే, సగానికి పైగా విశ్వనాథ్‌గారి సినిమాలనే చెబుతారు. అదీ ఆయన గొప్పతనం. స్నేహం మీద నాకు తెలిసి ‘సాగర సంగమం’ తర్వాత అంత గొప్ప సినిమా రాలేదేమో. స్నేహితుడు చనిపోతే, ఆ భౌతికకాయం వర్షంలో తడవకుండా తన శరీరాన్ని అడ్డుపెడతాడు ప్రాణస్నేహితుడు. ‘సాగర సంగమం’లోని ఈ సీన్ ఎంత గొప్పగా ఉంటుంది. ఆ సీన్లో యుద్ధాలు ఉండవు. గ్రాఫిక్స్ లేవు. అయినా ప్రేక్షకులను ఆకట్టుకుంది. గుండెల్ని పిండేసింది. భారతీయ సినిమాలో ఉన్న గొప్ప దర్శకుల్లో విశ్వనాథ్‌గారు ఒకరు. ఆయన మన తెలుగువాడు కావడం మన అదృష్టం – నటుడు శరత్ బాబు శాంతారామ్ సరసన... వావ్... ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు నేనో ఫంక్షన్లో ఉన్నాను. నాకు ఈ వార్త చెప్పిన ‘సాక్షి’కి థ్యాంక్స్. ‘శంకరాభరణం’... 37 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా అందులో నటించిన వారందరికీ కేరాఫ్ అడ్రస్ అయ్యింది. ‘శంకరాభరణం’లో చిన్న ఆర్టిస్టులు, పెద్ద ఆర్టిస్టులందరికీ ఆ సినిమా ఓ గుర్తింపు ఇచ్చింది. కె. విశ్వనాథ్‌గారు ఆయనకు ఆయనే సాటి. అంత గొప్ప వ్యక్తి దర్శకత్వంలో నటించడం నా అదృష్టం. ఈ అవార్డు (దాదాసాహెబ్ ఫాల్కే) గతంలోనూ గొప్ప వ్యక్తులను వరించింది. శాంతారామ్ వంటి వాళ్ల సరసన విశ్వనాథ్‌గారు చేరడం నాకెంతో సంతోషంగా ఉంది. – నటి మంజు భార్గవి కొత్తవాళ్లకు ఇలాంటి దర్శకుడు అవసరం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో నటించగలుగుతున్నానంటే దానికి కారణం విశ్వనాథ్గారే. నటిగా నాకు ‘శంకరాభరణం’ మొదటి సినిమా. ఆ సినిమాలో వేషం కోసం నేను విశ్వనాథ్‌గారిని కలిశాను. అంతకుముందు ఆయన చాలామందిని చూశారు. కానీ, ‘శారద’ పాత్రకు తగ్గట్టుగా లేరనిపించిందట. నేను కలసిన తర్వాత క్యారెక్టర్ గురించి చెప్పి, ‘చేయగలవా’ అనడిగితే, చేస్తానన్నాను. ‘పెళ్లి చూపులు’ సీన్ ముందు తీశారు. ఆ సీన్, ‘సామజ వరగమన..’ పాటలో కొంచెం టెన్షన్ పడుతూనే నటించాను. విశ్వనాథ్గారిలాంటి డైరెక్టర్‌తో చేయడం అంటే మాటలా? ఆ సినిమాతో నా ఇంటి పేరు ‘శంకరాభరణం’ అయిపోయింది. ఆ సినిమా చేసినప్పుడు నాకు పదిహేనేళ్లు. నాలాంటి కొత్తవాళ్లకు విశ్వనాథ్గారిలాంటి దర్శకులు అవసరం. మంచి పాత్రలిచ్చి ప్రోత్సహించేవారు. ఆయన డైరెక్షన్ మానేయడంవల్ల ఆ అదృష్టం నేటి తరానికి లేదు. విశేషం ఏంటంటే.. విశ్వనాథ్‌గారి కాంబినేషన్లో నేను యాక్ట్ చేశాను కూడా. ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ సినిమాలో మేమిద్దరం మామా–కోడళ్లలా చేశాం. ‘మామయ్యా’ అని పిలుస్తూ, నటించడం నాకు గమ్మత్తుగా అనిపించింది. మా గురువుగారికి ప్రతిష్టాత్మక పురస్కారం రావడం ఆనందంగా ఉంది. – నటి ‘శంకరాభరణం’ రాజ్యలక్ష్మి వజ్రంలా సానబట్టారు భారతదేశం మొత్తం గర్వించదగ్గ విషయమిది. ఆయన కాకుండా ఈ అవార్డుకు అర్హత కలిగినవాళ్లు ఇంకెవరున్నారు? ఆయన నాకు గురువు. ‘శుభలేఖ, శృతిలయలు, జననీ జన్మభూమి, స్వయంకృషి’... విశ్వనాథ్‌గారి దర్శకత్వంలో నాలుగు సినిమాల్లో నటించాను. ఆయనతో పనిచేయడం ఓ అందమైన జ్ఞాపకం. వేరే ఏ కథానాయికకూ ఆయన దర్శకత్వంలో నాలుగు సినిమాలు చేసే అవకాశం వచ్చిందని నేను అనుకోవడం లేదు. నేను ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా... ప్రేక్షకులందరూ పైన చెప్పిన నాలుగు సినిమాల్లో నా నటన గురించి గొప్పగా చెబుతారు. చిత్రపరిశ్రమకు ఓ ముడిసరకు (రా మెటీరియల్)గా వచ్చిన నన్ను వజ్రంగా తీర్చిదిద్దింది ఆయనే. విశ్వనాథ్‌గారికి ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డు రావడమనేది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ అంశం. అలాగే, తెలుగు చిత్రపరిశ్రమ సభ్యులు, ఆయనతో పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ విషయం. విశ్వనాథ్‌గారు జీవితమంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. ఆయనతో పాటు మనందరికీ వచ్చినట్లు భావించాలి. నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. – నటి సుమలత ఆయన డైరెక్షన్లో చేయడం నా అదృష్టం మొన్నీ మధ్యే విశ్వనాథ్‌గారిని కలిశాను. ఆయన డైరెక్షన్లో నేను చేసిన ‘స్వర్ణ కమలం’ గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఆ సినిమాకి నా మనసులో స్పెషల్ ప్లేస్ ఉంటుంది. నిజానికి ఆ సినిమాతోనే నేను యాక్ట్ చేయడం కాకుండా క్యారెక్టర్ని న్యాచురల్‌గా బిహేవ్ చేయడం మొదలుపెట్టాను. అది విశ్వనాథ్‌గారు నేర్పించినదే. ఇంకా ఆయన్నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయన డైరెక్షన్లో సినిమా చేసే అవకాశం రావడం నా అదృష్టం. ఒక దర్శకుడు–హీరోగానే కాకుండా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్–హీరో అనే అనుబంధం కూడా మా మధ్య ఉంది. నా ‘కలిసుందాం రా’ సినిమాలో ఆయన నాకు తాతగా నటించారు. నటుడిగా ఆయన కాంబినేషన్లో సినిమా చేయడం మరో మంచి అనుభూతి. – హీరో వెంకటేశ్ ‘సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డు’ల వేడుకలో జీవన సాఫల్య పురస్కారం అందుకుంటున్న కళాతపస్వి కె. విశ్వనాథ్. చిత్రంలో దర్శకుడు దాసరి నారాయణరావు, రచయిత ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రి, ‘సాక్షి’ ఈడి రామచంద్రమూర్తి, ఛైర్పర్సన్ వై.యస్. భారతి – ఖదీర్ -
కులాంతర వివాహం వైపు నడిచిన సప్తపది
నాటి సినిమా బ్రహ్మ శిరస్సు నుంచి బ్రాహ్మణులు, వక్షం నుంచి క్షత్రియులు, ఊరువుల నుంచి వైశ్యులు, పాదాల నుంచి శూద్రులు జన్మించారని వర్ణ వ్యవస్థ చెబుతుంది. ఎవరు ఎక్కడి నుంచి జన్మించినా వీరందరికీ హృదయం ఒక్కచోటనే ఉంటుంది. గుండెలకు సమీపంగానే ఉంటుంది. దాని స్పందనలకు కులం లేదు. దాని సంవేదనలకు వర్ణం లేదు. స్త్రీ... పురుషుడు... ఉన్నవి ఈ రెండే వర్ణాలు. వీటి మధ్య ఆకర్షణే ప్రకృతి. దీనిని ఎదిరించడం వికృతి. కులాలు, వర్ణాలు మనిషి ఎదుగుదలకు ఉపయోగపడితే మంచిదే. తిరోగమనానికి హేతువుగా మారితే మాత్రం మనం మారాల్సి ఉంది... మార్చాల్సింది చాలా ఉంది. ఆ మాటను చెప్పడానికి దాదాపు 36 ఏళ్ల క్రితం కె.విశ్వనాథ్ తీసిన సినిమాయే ‘సప్తపది’. కృష్ణానది ఒడ్డున అందమైన ఊరు. ఆ ఊరి నడిబొడ్డున అమ్మవారి ఆలయం. దాని ప్రధాన అర్చకుడు యాజులు (సోమయాజులు). అతడి కొడుకు అవధాని (జె.వి.రమణమూర్తి). తోడుగా మనవడు (రవికాంత్). యాజులు కుమార్తె ఒక నాట్యకారుణ్ణి ప్రేమించి వివాహం చేసుకున్నది కనుక ఆమెను మానసికంగా బహిష్కరించి ఉంటాడు యాజులు. కాని ఆమెకు జన్మించిన హేమ (సబిత) పెరిగి పెద్దదై నృత్యకారిణిగా మారి ఊరికి వస్తే ఆమెను మనవరాలిగా స్వీకరిస్తాడు. అంతే కాదు, తన మనవడికి ఇచ్చి వివాహం జరిపించడానికి నిశ్చయిస్తాడు. ఇది హేమ మనసుకు విఘాతంగా మారుతుంది. ఎందుకంటే అప్పటికే ఆమె మనసు హరిబాబు (గిరిష్) వశమై ఉంటుంది. అతడు ఆమెనూ ఆమె నాట్యాన్నీ ఆరాధించిన భావుకుడు. వేణువుతో ఆమె నాట్యానికి బాసటగా నిలువగల కళాకారుడు. కాని ఈ అలంకారాలన్నీ అతడితో వివాహానికి ఏమాత్రం పనికి రావు. ఎందుకంటే అతడు దళితుడు. ఒక బ్రాహ్మణుల అమ్మాయి హరిజనుడితో వివాహం చేసుకోవడం అసంభవం. వర్ణవ్యవస్థకు విరుద్ధం. ఈ సంగతి తెలుసు కనుకనే హరిబాబు ఆమెను మనసులోనే వేలుపు చేసుకుని దూరంగా ఉండిపోతాడు. ఆమె పెళ్లి బావతో జరిగిపోతుంది. మనసు చెక్కలయినా మాంగల్యానికి విలువ ఇచ్చి భర్తను స్వీకరించి వచ్చిన హేమ ఆ భర్తకు శోభనం గదిలో అమ్మవారిలా కనిపిస్తుంది. అతడు హతాశుడై ఆమెకు పూజాదికాలు నిర్వహించి వెనుదిరుగుతాడు. ఎప్పుడు అతడు గదిలోకి వచ్చినా భార్య అతనికి అమ్మవారి రూపులోనే కనిపిస్తుంటుంది. ఇలా ఎందుకు? అటు ప్రియునికి దూరమై ఇటు భర్తకు చేరువ కాలేక హేమ నలిగిపోతుంది. భర్త ఆ పరిస్థితి గమనించి కారణం తెలుసుకుంటాడు. ఆమె మనసులో మరొకరు ఉండటం వల్లే ఆమె తనకు అమ్మవారిలా ఉందని గ్రహించి ఎవరిౖ¯ð తే ఆమె కోరుకుంటున్నదో అతడికే అప్పజెప్పడానికి నిశ్చయించుకుంటాడు. అతడి నిర్ణయానికి ఇంటి పెద్ద అయిన యాజులు అంగీకారం కావాల్సి ఉంటుంది. సమాజం ఏమనుకుంటుందోనని ముందు ఆందోళన చెందినా కులం, వర్ణం అనేవి ఒక మనిషి సంస్కారాన్ని బట్టి ఏర్పడేవే తప్ప జన్మను బట్టి కాదని గ్రహించి మనవరాలిని దళితుడితో పంపడానికి నిశ్చయించుకుంటాడు. ఊరు, బ్రాహ్మణ వర్గం దీనికి అడ్డుగా నిలిస్తే వారితో వాదించి గెలుస్తాడు. చివరకు తనే తోడుగా కులం, వర్ణం అనే అంతరాల చీకట్లు నిండిన ఈ రేవు నుంచి వికాసం, అభ్యుదయం వంటి వెలుతురులు నిండిన ఆ రేవు వైపుకు కదిలిపోతాడు. సినిమా ముగుస్తుంది. 1981లో ఈ సినిమా రావడం, తీయడం, దానిని ప్రేక్షకుల చేత మెప్పించడం సామాన్య విషయం కాదు. ఇందులో దర్శకుడు రెండు విషయాలను ధ్వంసం చేశాడు. ఒకటి మనసులు కలవని పెళ్లిని, రెండు ప్రేమకు అడ్డుగా నిలిచే కులాన్ని. ప్రేమించిన అమ్మాయిని దళితుడికి ఇచ్చి పెళ్లి చేయడం అనేది మామూలు వస్తువే అయి ఉండేది. కాని ఇక్కడ మరొకరి భార్య అయిన అమ్మాయికి ఆ పెళ్లిని రద్దు చేసి మరో పెళ్లి చేయడం చాలా పెద్ద విషయంగా చెప్పక తప్పదు. ‘కులాంతర వివాహాల వల్లే ఈ దేశంలో కులం అంతరిస్తుంది’ అని చెప్పాడు అంబేద్కర్. ఇది శూద్ర కులాల మధ్య సంభవించడం విశేషం కాదు. ఉన్నత కులాలకు, నిమ్నకులాలకు మధ్య ఎన్ని కులాంతర వివాహాలు జరిగితే అంత మంచిది అని ఆయన పేర్కొన్నాడు. ఆ విధంగా చూసినప్పుడు ఇది అంబేద్కర్ భావజాలం వైపు నడిచిన సినిమాగా చెప్పుకోవాలి. సొంతకూతురు సొంత కులంలోని నాట్యాచారుడిని వివాహం చేసుకుంటేనే అదో అప్రదిష్టగా భావించిన యాజులు కాలక్రమంలో తన ఇంటి ఆడపిల్ల ఒక దళితుడిని వివాహం చేసుకోవడానికి సమ్మతించడం వెనుక ఉన్న పరివర్తన, ఎదుగుదల ప్రేక్షకుణ్ణి ఆలోచనల్లో పడేస్తుంది. క్లయిమాక్స్‌లో పడవ సాగిపోతూ ఉండగా ఒక బ్రాహ్మణ పిల్లవాడు ప్రశంసగా చప్పట్లు కొడతాడు. భావితరాలు ఈ ఎదుగుదలను కొనసాగించాలనే సంకేతం అందులో ఉంది. అంతా ఔట్‌డోర్‌లో అమరావతి ప్రాంతంలో కృష్ణానది ఒడ్డున తీసిన సినిమా నాడే కాదు నేడు కూడా ఎంతో కొత్తగా తాజాగా ఉంటుంది. ‘మేము రాజులు... మీరు యాజులు... మీరు మా మాట వినాలి’ అని ఊరి పెద్దగా నటించిన అల్లు రామలింగయ్య ఆకట్టుకుంటాడు. చేసింది ఒక్క సినిమాయే అయినా ప్రేక్షకులకు హీరోయిన్ సబిత శాశ్వతంగా గుర్తుండిపోయింది. ఇక సాంకేతికంగా చూసినప్పుడు ఈ సినిమాకు అన్నీ ఎలా కుదరాలో అలా కుదిరాయి. కె.వి.మహదేవన్ సంగీతం, వేటూరి సాహిత్యం ‘శంకరాభరణం’ తర్వాత మళ్లీ మేజిక్ చేశాయి. ఇందులోని ‘అఖిలాండేశ్వరి చాముండేశ్వరి’... ‘నెమలికి నేర్పిన నడకలివీ’ పాటలు నేటికీ నృత్యం నేర్చుకునే ఆడపిల్లల ఆరంగేట్రంకు ఉపయోగ పడుతున్నాయి. ‘రేపల్లియ యద ఝల్లున పొంగిన రవళి’ డ్యూయెట్ హృద్యంగా ఉంటుంది. ఇక కులాల మధ్య ఉన్న బోలుతనాన్ని జానపద శైలిలో పెట్టి వేటూరి రాసిన సులభ పదాలు హిట్. ‘గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన’... ‘ఏ కులము నీదంటే గోకులము నవ్వింది’... ఇవి పండిత పామరులను అలరించాయి. ‘పిల్లనగ్రోవికి నిలువెల్ల గాయాలు’... అని అనడం వేటూరికే సాధ్యం. జంధ్యాల సంభాషణలు సరేసరి. అన్నట్టు ఇందులో హీరో హరిష్కి కె.విశ్వనాథే డబ్బింగ్ చెప్పారు. నిమ్నకులాలు ఉన్నత కులాలతో ఘర్షణ పడటం ఎప్పుడూ ఉండేదే. కాని అసలైన ఫలితం ఉన్నత కులాలు తమలో తాము అంతర్గత సంఘర్షణ పడినప్పుడే దక్కుతుంది. మార్పు కోసం శూద్రకులాలు ఒక అడుగు వేస్తే పెద్ద కులాలు ఏడడుగులు వేయాల్సిన అవసరాన్ని చెప్పిన సినిమా ‘సప్తపది’. -
సభ్యత్వ రుసుము తగ్గించాలి - నాగబాబు
‘‘గత ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల వాతావరణాన్ని తలపించాయి. ఈసారి సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషంగా ఉంది. కృష్ణ, చిరంజీవి వంటి పెద్దల ఆధ్వర్యంలో ‘మా’కు బీజం పడింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ‘మా’కు సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటాం’’ అని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. నటుడు శివాజీరాజా అధ్యక్షతన ఏకగ్రీవంగా ఎన్నికైన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) నూతన కార్యవర్గం చేత ఆదివారం తలసాని ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ‘మా’ తరఫున దర్శకుడు కె. విశ్వనాథ్, నటి శారదలను కృష్ణ, విజయనిర్మల దంపతులు సన్మానించారు. ‘‘ఈ వేదికపై దాసరిగారు లేకపోవడం ఏదో వెలితిగా ఉంది’’ అన్నారు కె. విశ్వనాథ్. ‘‘వృద్ధ కళాకారులకు ప్రభుత్వం తరఫున రూ. 1000 పెన్షన్ అందిస్తాం. పేద కళాకారులకు రేషన్ కార్డులు అందించే ఆలోచన ఉంది’’ అన్నారు తలసాని. ‘‘లక్ష రూపాయలుగా ఉన్న ‘మా’ సభ్యత్వ రుసుమును తగ్గించాలని కోరుతున్నా’’ అన్నారు నటుడు నాగబాబు. ‘‘ఈ నెల నుంచి పెన్షన్‌ను 25 శాతం పెంచుతున్నాం’’ అని ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా అన్నారు. ఈ వేదికపై కొందరు ‘మా’ సభ్యులు, సీనియర్ పాత్రికేయులు పసుపులేటి రామారావుకు ద్విచక్ర వాహనాలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో ‘మా’ నూతన కార్యవర్గం, సభ్యులు పాల్గొన్నారు. -
సంప్రదాయ దుస్తులపై మక్కువ
కంటోన్మెంట్: సంప్రదాయ, శ్వేత వర్ణ దుస్తులనే తాను ఎక్కువగా ఇష్టపడతానని ప్రముఖ దర్శకుడు, ‘కళాతపస్వి’ కె.విశ్వనాథ్ అన్నారు. తిరుమలగిరిలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘రామరాజ్ కాటన్’ షోరూమ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామరాజ్ కాటన్ కంపెనీ ఉత్పత్తులు నాణ్యత, మన్నికైనవి కావడంతోతాను బ్రాండ్ అంబాసిడర్‌గా మారానన్నారు. ప్రముఖ నిర్మాత డీవీఎస్ రాజుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన మనవడు శ్రవంత్ రాజు, మనవరాలు దివ్య రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన షోరూం విజయవంతంగా నడవాలని ఆకాంక్షించారు. రామరాజ్ కాటన్ కంపెనీ మేనేజింగ్ డెరైక్టర్ కె.ఆర్.నాగరాజన్ మాట్లాడుతూ... తెలంగాణ, ఆంధ్రప్రదేశలలో తమ ఉత్పత్తులకు మంచి ఆదరణ లభిస్తోందన్నారు. తమ కంపెనీ 2015 ‘ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ అండ్ అట్రాక్టివ్ బ్రాండ్’ జాబితాలో స్థానం దక్కించుకుందన్నారు. కళాతపస్వి కె.విశ్వనాథ్ వచ్చారని తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో షోరూముకు చేరుకొని... ఆయనతో ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు. -
సింగపూర్‌లో ఉన్నట్టుంది
‘1980లో హైదరాబాద్ చిన్న పట్టణంలా అనిపించేది. ఇప్పుడు సింగపూర్ స్థాయికి ఎదిగిందేమో అనిపిస్తుంది. తెలుగు సినీ పరిశ్రమ మొత్తం చెన్నైలో స్థిరపడటంతో హైదరాబాద్‌కు చుట్టపుచూపుగా వచ్చేవాడిని. అప్పట్లో ఇన్ని కార్లు, బిల్డింగ్స్ లేవు. ఏదైనా షూటింగ్ పనిమీద వస్తే ఏ లాడ్జిలోనో దిగేవాళ్లం. రెండేళ్ల క్రితం నుంచి పూర్తిగా సిటీలోనే ఉంటున్నాను. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ వైపు వెళ్లినప్పుడు ఫారిన్లో ఉన్నట్టు అనిపిస్తుంది. అభివృద్ధిలో అందనంత దూరం నగరం ఎదిగిపోయింది. హైదరాబాద్‌ను చూస్తుంటే గర్వంగా అనిపిస్తుంది. ఎంత అభివృద్ధి చెందినా.. కాంక్రీట్ జంగిల్‌గా అనిపిస్తోంది. అక్కినేని నాగేశ్వరరావు గారు ధైర్యం చేసి చె న్నై నుంచి హైదరాబాద్ రావడంతో పరిశ్రమ మొత్తం షిఫ్ట్ అయ్యింది. అప్పట్లో సారధి స్టూడియో ఒక్కటే ఉండేది. ఇప్పుడు హైదరాబాద్‌లోనే ప్రపంచస్థాయి టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఇక్కడి వంటకాలంటే చాలా ఇష్టం. ఈ నగరంలో ఎంతోమంది స్నేహితులు దొరికారు. జీవితంలో ఎక్కువభాగం చెన్నైలోనే గడిపినా ఇప్పుడు హైదరాబాద్ పై మమకారం పెరిగింది.’ - కె. విశ్వనాథ్, ప్రముఖ చిత్ర దర్శకుడు -
శంకరాభరణానికి చాగంటి ప్రవచన గౌరవం
ఎనభై మూడేళ్ళ తెలుగు సినిమా చరిత్రలో ‘శంకరాభరణం’ ఒక ప్రత్యేక చరిత్ర. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, పద్మా సుబ్రహ్మణ్యం లాంటి సుప్రసిద్ధ సంగీత, నృత్య విద్వన్మణుల మొదలు రాజ్‌కపూర్ లాంటి సినీ దిగ్గజాల దాకా అందరినీ ఆకట్టుకున్న ఆ కళాఖండం విడుదలై (1980 ఫిబ్రవరి 4) ఇది 36వ సంవత్సరం. ఈ వెండితెర కావ్యంలోని సంగీత, సాహిత్య అంతరార్థాలు నిజంగానే కావ్యగౌరవాన్ని సంతరించు కొంటున్న ప్రత్యేక సందర్భం ఇప్పుడు ఎదురవుతోంది. ఒక సినిమాపై ఒక సరస్వతీపుత్రుడు మొట్టమెదటిసారిగా ప్రవచన రూపంలో విశ్లేషణ చేయనున్నారు. కాకినాడకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ఆగస్టు 8 నుంచి 10 వరకు మూడు రోజుల పాటు హైదరాబాద్‌లోని శ్రీసత్య సాయి నిగమాగమంలో సాయంత్రం 6 గంటలకు ఈ విశ్లేషణ ప్రవచనం సాగనుంది. ‘మూడు పుష్కరాల (36 ఏళ్ళ) సామ గాన సౌరభం - శంకరాభరణం’ శీర్షికన జరగనున్న ఈ కార్యక్రమ వివరాలను ‘శంకరాభరణం’ దర్శకులు కె. విశ్వనాథ్, కార్యక్రమ నిర్వాహకులైన శ్రీనివాస్, శ్రీధర్‌లు మంగళవారం వివరించారు. మంగళంపల్లికి గురుపూజ ‘‘సుందరకాండ, రామాయణ, భారతాల లాగా గురుశిష్య సంబంధమైన ‘శంకరాభరణం’ గురించి ఒక సప్తాహం చేయగలనని పదేళ్ళ క్రితమే చాగంటి గారు నాతో అన్నారు. ఆ ప్రశంస నాకు ‘భారత రత్న’, ‘పద్మవిభూ షణ్’లను మించినది. అప్పటి ఆ మాటను ఆయనిప్పుడు నిజం చేస్తున్నారు. ఈ ప్రవచన రూప విశ్లేషణతో ఒక సినిమాకు అచ్చమైన కావ్యగౌరవం ప్రసాదిస్తున్నారు’’ అని విశ్వనాథ్ పేర్కొన్నారు. కార్యక్రమం చివరి రోజున చాగంటి గారు తన గురువులైన మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్‌ను సత్కరిస్తే, గాయకులు డి.వి. మోహనకృష్ణ తన గురువైన మంగళంపల్లి బాలమురళీకృష్ణను సభక్తికంగా గౌరవించనున్నారు. త్రిపుష్కరోత్సవ ప్రత్యేక గీతం... నృత్యం... ఈ సందర్భంగా ‘శంకరాభరణం త్రిపుష్కరోత్సవ గీతం’ పేరిట రచయిత రాంభట్ల నృసింహశర్మ ప్రత్యేకంగా పాట రాయడం విశేషం. సినీ గాయకుడు ఎన్.వి. పార్థసారథి సంగీతం అందించి, శ్రీమతి తేజస్వినితో కలసి పాడారు. కాకినాడకు చెందిన నర్తకి వీణ ఆ గీతానికి నృత్యం చేయ నున్నారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, ఇప్పటికే ప్రపంచమంతటా అందరూ గౌరవించడం ‘శంకరాభరణం’కు దక్కిన అమ్మ ఆశీర్వాదం లాంటిదైతే, ఇప్పుడీ చాగంటి వారి ప్రవచనం పండితుల ఆశీర్వాదం లాంటిదని విశ్వనాథ్ అన్నారు. మొదటి ఆశీర్వాదం ఈ సినిమాకు ఎప్పుడో దక్కినా, ఇప్పుడీ రెండో ఆశీర్వాదం అంతకు మించినదని అభిప్రాయ పడ్డారు. ‘సాగరసంగమం’, ‘స్వర్ణ కమలం’ లాంటి ఇతర సినీ కావ్యాలపై కూడా సమగ్రమైన విశ్లేషణ జరిగితే, మరింత మందికి వాటిలోని అంతరార్థాలు తెలియవచ్చని ఆయన వ్యాఖ్యా నించారు. -
తమిళంలో శంకరాభరణం
తమిళసినిమా: భారతీయ అద్భుత సినీ కళా ఖండాల్లో శంకరాభరణం ఒకటని ఘంటాపథంగా చెప్పేయవచ్చు. ఇంకా చెప్పాలంటే కర్ణాటక్ సంగీతాన్ని అతి సామాన్యుడి వద్దకు చేసిన చిత్రాల్లో మొదటి వరసలో ఉండే చిత్రం ఇది. అలాంటి అద్భుత దృశ్య కావ్యానికి దర్శకుడు కె.విశ్వనాథ్, నిర్మాత ఏడిద నాగేశ్వరరావు, సంగీత దర్శకుడు కె.వి.మహదేవన్ సృష్టికర్తలు. సంగీతంతో సామాజిక అంశాలను ముడిపెట్టి ఆచారాలన్నవి ఆచరణలో పెడితే చాలు మనుష్యులందరూ ఒక్కటే అంటూ జాతి, మతం లాంటి అంటరానితనానికి పాతరేసిన గొప్ప సందేశాత్మక సంగీత భరిత చిత్రం శంకరాభరణం. ఈ చిత్రంతోనే గాన గంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రమణ్యంలో ఉన్న నిజమైన గాయకుడు లోకానికి పరిచయం అయ్యారంటే అతిశయోక్తి కాదేమో. 1980లో తెరపైకి వచ్చి చరిత్ర సృష్టించిన శంకరాభరణం దివంగత నటుడు సోమయాజులకు నటి మంజుభార్గవి, రాజాలక్ష్మికి ఇంటి పేరుగా మారిందంటే ఈ చిత్ర చరిత్ర ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. చంద్రమోహన్, అల్లురామలింగయ్య లాంటి ప్రతిభావంతుల నటన శంకరాభరణంకు అదనపు అలంకారం. అప్పట్లో జాతీయ రాష్ట్ర నంది అవార్డులతో పాటు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడి విశేష కీర్తిని సంపాదించి పెట్టిన ఈ తెలుగు చిత్రం తమిళనాడుతో పాటు కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోను విడుదలైన ఘన విజయాన్ని సాధించింది. ఇదంతా ఎందుకు గుర్తు చేయాల్సి వచ్చిందంటే శంకరాభరణం 35 ఏళ్ల తరువాత తమిళ మాటలతో మరోసారి తమిళనాట శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రానికి గాయకుడు ఎస్పి బాలసుబ్రమణ్యం, తెలుగులో పాడిన పాటల్ని తమిళంలోనూ ఆలపించడం విశేషం. ఈ తరం కూడా చూడాల్సిన గొప్ప చిత్రం శంకరాభరణం. -
మరో గౌరవం
కళాతపస్వి కె. విశ్వనాథ్‌కు మరో జీవన సాఫల్య పురస్కార గౌరవం దక్కింది. ‘గామా’ అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా ఫిబ్రవరి 6న దుబాయ్‌లో ఈ పురస్కారం అందించనున్నారు. పలువురు ప్రముఖ నటీనటులు, గాయనీ గాయకులు, సంగీత దర్శకుల పాటల రచయితలు ఈ వేడుకలో పాల్గొననున్నట్లు ‘గామా’ (గల్ఫ్ ఆంధ్ర మ్యూజిక్ అవార్డు) వేడుకల చైర్మన్ కేసరి త్రిమూర్తులు తెలిపారు. నిరుడు ప్రసిద్ధ దర్శకుడు బాపును ఈ జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించారు.