సభ్యత్వ రుసుము తగ్గించాలి - నాగబాబు
‘‘గత ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల వాతావరణాన్ని తలపించాయి. ఈసారి సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషంగా ఉంది. కృష్ణ, చిరంజీవి వంటి పెద్దల ఆధ్వర్యంలో ‘మా’కు బీజం పడింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ‘మా’కు సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటాం’’ అని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. నటుడు శివాజీరాజా అధ్యక్షతన ఏకగ్రీవంగా ఎన్నికైన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) నూతన కార్యవర్గం చేత ఆదివారం తలసాని ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా ‘మా’ తరఫున దర్శకుడు కె. విశ్వనాథ్, నటి శారదలను కృష్ణ, విజయనిర్మల దంపతులు సన్మానించారు. ‘‘ఈ వేదికపై దాసరిగారు లేకపోవడం ఏదో వెలితిగా ఉంది’’ అన్నారు కె. విశ్వనాథ్. ‘‘వృద్ధ కళాకారులకు ప్రభుత్వం తరఫున రూ. 1000 పెన్షన్ అందిస్తాం. పేద కళాకారులకు రేషన్ కార్డులు అందించే ఆలోచన ఉంది’’ అన్నారు తలసాని. ‘‘లక్ష రూపాయలుగా ఉన్న ‘మా’ సభ్యత్వ రుసుమును తగ్గించాలని కోరుతున్నా’’ అన్నారు నటుడు నాగబాబు.
‘‘ఈ నెల నుంచి పెన్షన్‌ను 25 శాతం పెంచుతున్నాం’’ అని ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా అన్నారు. ఈ వేదికపై కొందరు ‘మా’ సభ్యులు, సీనియర్ పాత్రికేయులు పసుపులేటి రామారావుకు ద్విచక్ర వాహనాలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో ‘మా’ నూతన కార్యవర్గం, సభ్యులు పాల్గొన్నారు.