
రాగం... తానం... ఫాల్కే...
రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి
నవరస మురళి ఆనందన మురళి
ఇదేనా ఆ మురళి మోహన మురళి...
గుంటూరు జిల్లా రేపల్లె ప్రాంతం నుంచి వచ్చిన కె.విశ్వనాథ్ రాగాన్ని, నాదాన్ని నమ్ముకుని– తెలుగును నమ్ముకుని– ఈ మట్టి సంస్కృతిని నమ్ముకుని– ప్రేక్షకుడిని నమ్ముకుని చేసిన సుదీర్ఘ సినీ ప్రస్థానం ‘దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు’ ప్రకటనతో పరిపూర్ణం అయ్యింది. ఎవరెస్ట్ ఎక్కకుండా హిమాయాలన్నీ కల తిరిగి రావచ్చు. కాని ఎవరెస్ట్ ఎక్కినప్పుడే ఆ పర్వతాలకు గౌరవం, పర్వతారోహకుడికి అతిశయం. ఇవాళ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో కె.విశ్వనాథ్ గౌరవంతో పాటు తెలుగు ప్రేక్షకుడి గౌరవం కూడా అతిశయించింది. ఎందుకంటే కె.విశ్వనాథ్ ‘టేస్ట్’ను తెలుగు ప్రేక్షకుడు అందుకున్నాడు. లేదా తెలుగు ప్రేక్షకుడి టేస్ట్‌ను కె.విశ్వనాథ్ సమున్నతం చేయగలిగారు. ఇది వీరిరువురూ పరస్పరం అభినందించుకోవాల్సిన ఘట్టం.
ఆకుచాటు పిందె తడిసె..
తెలుగు ప్రేక్షకుడికి వినోదం కావాలి. కాయకష్టం చేసుకునేవాడు కాసేపు కష్టమంతా మరచి ఊహాలోకంలో విహరించి రావాలి. కె.రాఘవేంద్రరావు అటువంటి వినోద మాంత్రికుడు. నేల టికెట్టు ప్రేక్షకుడైనా బాల్కనీ విద్యాధికుడైనా కాసేపు తమను తాము మరచిపోయేలా చేయగల సెల్యులాయిడ్ మేజిక్ రాఘవేంద్రరావు సొంతం. 1979 ఆయన చేసిన ‘వేటగాడు’ వచ్చింది. ‘ఆకుచాటు పిందె’ను తెచ్చింది. కలెక్షన్ల ‘బంగారు బాతుగుడ్డు’ను తొక్కుడు లడ్డూలకు మల్లే మార్కెట్ చేసుకుంది. ఒక కమర్షియల్ ఊపు సెటిలైన సమయం. దీనిని వీలైతే ముందుకు తీసుకెళ్లాలి. సవాల్ చేయగలగాలి. కాని దీనిని మెప్పించిన ప్రేక్షకుడే ఒక రాగానికి స్పందించగలడని, ఒక కీర్తనకు కంట తడి పెట్టగలడని, ఒక శాస్త్రీయ నృత్య భంగిమకు ఉద్వేగానికి లోనవగలడని కె.విశ్వనాథ్ నమ్మగలిగారు. 1980– శంకరాభరణం తీసి రిలీజ్ చేశారు. ఒకడు సోమయాజులు అట. ‘ముసలాడు’.
ఒకామె తల నిండుగా కప్పుకుని నిలబడే మంజుభార్గవి అట. ఇంతకు ముందు సినిమాల్లో వేంప్. ఒక బాలనటి– తులసి. నిర్మలమ్మ, రాజ్యలక్ష్మి, చంద్రమోహన్. వీళ్లా తారాగణం? కాదు. తెలుగు సంస్కృతి తారాగణం. భారతీయ సంప్రదాయమే టెక్నీషియన్స్. విశ్వనాథ్‌కు తెలుసు తను తీయబోతున్న సినిమాకు వందల సంవత్సరాల వారసత్వమే పెద్ద ఇన్వెస్ట్‌మెంట్ అని. అదే బడ్జెట్. సినిమా కోసం ఖర్చు పెట్టబోయేది కాదు. సినిమా విడుదలైంది. ప్రేక్షకుల రక్తంలో సుప్తావస్థలో ఉన్న సంప్రదాయం ఉలిక్కిపడి తుళ్లింతలు పోయింది. కమర్షియల్ గంతలను వదిలించుకుంది. స్వేచ్చగా ఈ సంగీత సాహిత్యాల మైదానంలో దౌడు తీసింది. తెలుగు వారికి చెప్పుకోవడానికి ఒక సినిమా– శంకరాభరణం– కె.విశ్వనాథ్ ఇచ్చారు.
ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు...
శివుడులో సగం స్త్రీ. ఏ కళాకారుడిలోనైనా సగం స్త్రీ ఉండాలి. అప్పుడే ఆ కళాకారుడు పరిపూర్ణం అవుతాడు. కాశీనాథుని విశ్వనాథ్‌లో కూడా సగం స్త్రీ అంశ ఉంది. అందుకే ఆయన ‘చెల్లెలి కాపురం’ (1971) తీయగలిగాడు.‘శారద’ (1973) తీయగలిగారు. ‘ఓ సీత కథ’ (1974) తీయగలిగారు. ‘జీవనజ్యోతి’ (1975) తీయగలిగారు. ‘ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు’.... వాణిశ్రీ పాడుతుంటే థియెటర్‌కు వచ్చిన ప్రేక్షకులు చిటికెలు వేస్తూ తలలు ఊపుతూ పరవశించారు. కె.విశ్వనాథ్‌కు సంగీతం ఎక్కడ మెరుస్తుందో తెలుసు. ప్రేక్షకుడి మనసులో ఎక్కడ కురుస్తుందో తెలుసు. బాల్యంలో, యవ్వనంలో ఆయన సంగీతం పట్ల మక్కువ పెంచుకున్నారు. శాస్త్రీయ సంగీతం నేర్చుకుందామనుకున్నారు. కాని ఇంట్లో వాళ్లు ఆయనను ఇంజనీరుగా చూడదలిస్తే ఆ మాట దాచిపెట్టి పెద్దలు కోరినట్టుగా చదువుకుని వాహిని స్టూడియోలో సౌండ్ ఇంజనీర్ అయ్యారు. సంగీతంలో ఉండేది నాదం. సౌండ్ ఇంజనీరింగ్‌లో చేసేది ధ్వని ముద్రణ. అభిరుచికి తగిన పని. ఆ పనే ఆయనను దర్శకుడిని చేసింది.
ఝమ్మంది నాదం సై అంది పాదం ... కె.విశ్వనాథ్ తన ‘ఫోర్టె’ను వెతుకులాడుకోవడం ‘చెల్లెలి\ కాపురం’లోనే కనిపిస్తుంది. అప్పటికింకా ఆయనకేమి కావాలో ఆయనకే స్పష్టం కాలేదు. కాని వాణిశ్రీ, శోభన్‌బాబులతో ‘చరణకింకిణులు ఘల్లుఘల్లుమన’ పాటను తీయగలిగారు. గమనించి చూస్తే ఆ తర్వాత ఆయన సినీ ప్రయాణమంతా ఈ పాటే. అంటే మంచి గీతం, మంచి నృత్యమే. ‘సిరిసిరిమువ్వ’ (1976) సినిమాతో విశ్వనాథ్ స్పష్టత తెచ్చుకున్నారు. శాస్త్రీయ సంగీతం, నాట్యానికి మించిన కథల మణుగులు లేవని గ్రహించారు. అంతవరకూ ‘నోరు మెదపక’ పడి ఉన్న వాటిని ‘మూగపిల్ల’ (జయప్రద)ను సంకేతంగా చేసి సినిమాలో వేదిక ఎక్కించారు. గజ్జె ఘల్లుమంటుంటే... గుండె ఝల్లుమంటుంది... ప్రేక్షకులకు భలేగా అనిపించింది. కాసులు గల్‌గల్‌మన్నాయి. విజయం. ప్రజల ఫోకస్ నాట్యం మీద పడింది. ఇప్పుడు గానం మీద పడాలి. శాస్త్రీయ సంగీతం ‘సనాతనం’ అట.
‘ముసలి’దైపోయిందట. ‘చాదస్తం’ అట. వీటన్నింటికీ ప్రతీక శంకరశాస్త్రి. ఈ అన్ని లక్షణాలతో కూడా శాస్త్రీయ సంగీతం హీరో. బంగారం పాతదైనంత మాత్రాన బంగారం కాకుండా పోతుందా. చూద్దాం... ఎందుకు నచ్చదో అని ‘శంకరాభరణం’ తీశారు. అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమే సోపానమూ.... రాజమండ్రి వీధులో నాటుసారా ఒక్క గుక్క పుచ్చుకున్న రిక్షావాడు కూడా ఈ పాటే పాడుకున్నాడు.
శిశుర్వేత్తి పశుర్వేత్తి... అందరూ పాము అనుకుని దూరం పెట్టిన శాస్త్రీయ సంగీతాన్ని శంకరుని మెడలో సగౌరవంగా ప్రతిష్ఠించారు విశ్వనాథ్. దానిని ‘శంకరాభరణం’ చేశారు.
తకిట తధిమి తకిట తధిమి తందాన...
ఏటితో పాటు కొట్టుకెళ్లినవాడికి చరిత్ర ఉండదు. ఏటికి ఎదురీదినవాడికే ఫాల్కే ఉంటుంది. చూడండి 1982లో ‘డిస్కో డాన్సర్’ వచ్చింది. దేశమంతా మేనియా. డిస్కో లైట్ల చీకటి వెలుగుల్లో మిథున్ చక్రవర్తి ‘ఐ యామ్ ఏ డిస్కో డాన్సర్’ అని డాన్స్ చేస్తుంటే అందరూ ఊగారు. అలాంటి టైములో మాసిన గడ్డం, ముతక బట్టలు, తూలే నడకతో ఉన్న ఒక ఫెయిల్యూర్ క్లాసికల్ డాన్సర్ హీరోగా ‘సాగర సంగమం’ (1983) తీయడం సామాన్యం కాదు. ‘బాల కనకమయ చేల’... కల్యాణమండపంలో వంటల దగ్గర డాన్స్ అట. జనం చూశారు. ‘తకిట తథిమి తకిట తథిమి తందానా’... వానలో బావి గట్టు మీద డాన్స్ అట. జనం చూశారు. ‘వాగర్ధావివ సంపృక్తౌ...’ పచ్చటి మైదానాల్లో డాన్స్ అట. జనం చూశారు. మనోశుద్ధితో ఏ పని చేసినా జనం చూస్తారు. కళ– మనసును కడిగేలా ఉంటే ఎందుకు చూడరు? అలా తపస్సుతో తీశాడు కనుకనే కె.విశ్వనాథ్ సినిమాలు చూశారు. ‘సిరివెన్నెల’(1986), ‘శృతిలయలు’ (1987), ‘స్వర్ణకమలం’ (1988)... సంగీతం– నాట్యం ఇవి కేవలం కళలు మాత్రమే కాదు... మానవజాతి భావోద్వేగాలు... మానవ సంవేదనలు ఈ కళల్లో ఉన్నాయి... కళల్లో మానవ సంవేదనలు ఉన్నాయి అని విశ్వనాథ్ చెప్పగలగడం వల్లే ప్రేక్షకులు వీటన్నింటినీ హృదయపూర్వకంగా స్వీకరించారు.
ఆదరించారు. ‘ఆకాశంలో ఆశల హరివిల్లు’ అని పగటి కలలు కనే అమ్మాయి ‘అందెల రవమిది పదములదా’ అని పొందిన సాక్షాత్కారం ప్రేక్షకులు కూడా పొందారు. అది విశ్వనాథ్ ఘనత.
సిన్నీ సిన్నీ కోరికలడగా శీనీవాసుడు నన్నడగా...
కె.విశ్వనాథ్‌కు వేరే కథలు తీయడం కూడా తెలుసు. కట్నం సమస్యను చీదరించుకుంటూ ఆయన ‘శుభలేఖ’ (1982) తీశారు. ప్రేమకు, పెళ్లికి జాతి– కులం– మతం– సంప్రదాయాల అడ్డంకి అక్కర్లేదని ‘సప్తపది’ (1981) తీశారు. స్వచ్ఛమైన మనసుకు కూడా ఈ ప్రకృతిలో చోటు, ఆదరణ ఉంటాయని ‘స్వాతిముత్యం’ (1986) తీశారు. కష్టపడి పైకి వచ్చిన మనిషి జీవికలోని కష్టాన్నే కాదు జీవితంలోని కష్టాన్ని కూడా తట్టుకుని నిలబడతాడని ‘స్వయం కృషి’ (1987) తీశారు. అలగా జనాలని చెప్పి చిన్న చూపు చూస్తే వారే చీమలై, చలిచీమల ఉప్పెనై పెత్తందారి పడగని నమిలి మింగేస్తాయని ‘సూత్రధారులు’ (1989) తీశారు. ధన సంపద, పశు సంపద కంటే ఆపదలో ఆదుకోవడానికి ఒక మనిషిని కలిగి ఉండటమే అసలైన సంపద అని చెప్పడానికి ‘ఆపద్బాంధవుడు’ తీశారు. అయితే ఆయన తీసిన సినిమాలలో కొన్ని– ‘జననీ జన్మభూమి’ (1982), ‘చిన్నబ్బాయి’ (1997) వంటివి పరాజయం పొందాయి. ఆయన తీసిన ‘సిరిమువ్వల సింహనాదం’ అసలు విడుదలకే నోచుకోలేకపోయింది.
ఆనతినీయరా హరా...
విశ్వనాథ్ తీసిన సినిమాలన్నీ ఒకెత్తు ‘స్వాతి కిరణం’ (1992) ఒక్కటీ ఒకెత్తు. దీని కథాంశమే భిన్నమైనది. తీయాలంటే ధైర్యం కావాలి. తీసి మెప్పించగలగాలి. తీశాక ఈ యాంటీ సెంటిమెంట్‌ను ప్రేక్షకుల చేత జీర్ణింప చేయగలగాలి. శిష్యుణ్ణి చూసి అసూయ చెందే గురువు... ఆ అసూయ వల్ల శిష్యుడి మరణానికి కూడా కారణమయ్యే గురువు... అబ్బ... తలుచుకోవడమే చాలా కష్టం. కళాకారులలో ఉండే ఈ చీకటి కోణాన్ని విశ్వనాథ్ సమర్థంగా చూపించగలిగారు. మలయాళనటుడు మమ్ముట్టి మన కోసం నటించడం ఈ సినిమా విశేషం. ‘మాల్గుడి డేస్’ మంజునాథ్ నటించడం కూడా.
దర్శకులు... విశ్వనాథ్....
కె. బాలచందర్ మిడిల్ క్లాస్‌లోని డ్రామాని అద్భుతంగా చూపించగలరు. విశ్వనాథ్‌ది ఆ కోవ కాదు. దాసరి మిడిల్ క్లాస్‌ని మాత్రమే కాదు డౌన్ ట్రాడన్ ఫోర్స్‌ని కూడా చూపగలరు. విశ్వనాథ్‌ది ఆ కోవ కూడా కాదు. భారతీరాజా రూరల్ కమ్యూనిటీస్ మధ్య ఫ్రిక్షన్‌ను చూపగలరు. విశ్వనాథ్ అలా కాదు. పోనీ ముందే చెప్పుకున్నట్టు కె.రాఘవేంద్రరావులా కమర్షియల్ డైరెక్టర్ కూడా కాదు. విశ్వనాథ్ తన జీవితంలో తన నేపథ్యంలో ఉన్న కథలనే గొప్పగా తీయగలరు అని దానినొక ‘పరిమితి’గా చెప్పే వారున్నారు.
వీటన్నింటినీ గమనిస్తూనే ఆయన సున్నితమైన భావోద్వేగాలనూ సామరస్యపు కథాధోరణిని స్వీకరించి గొప్ప సినిమాలు తీయగలిగినవాడుగా మనం గుర్తించాల్సి ఉంటుంది. సినిమా తీసేటప్పుడు ‘ఖాకీ డ్రస్’ను తప్పనిసరిగా ధరించే విశ్వనాథ్ సినిమా కళను ఒక మెరుగైన కార్మికుడిగా సాధన చేసినవాడు. ఆయన తీసుకున్నది ఒకే బావి... ఒకే చేద కావచ్చు... కాని తీసిన జల మాత్రం జలధితో సమానం. ఆ ఊట తీయనిది. ఆ దప్పిక తీర్చినది.
దొరకునా ఇటువంటి సేవ...
విశ్వనాథ్ సినిమా తీయడాన్ని ‘దొరకునా ఇటువంటి సేవ’ అనుకున్నారు. మంచి సంగీతాన్ని, సాహిత్యాన్ని ప్రేక్షకులకు చేరువ చేసి వారి చేత కూడా అదే మాట అనిపించగలిగారు. ఆ గొప్ప సేవకూ, అంకితభావానికి, నైపుణ్యానికి, సృజనాత్మకతకు, తెలుగువాడిగా వీటన్నింటినీ చేయగలిగన ఒక సమన్వయానికి ‘దాదాసాహెబ్ ఫాల్కే’ ఒక సిసలైన నజరానా. కె.విశ్వనాథ్ కాలికి భారత ప్రభుత్వం తొడిగిన గండ పెండేరం. కంగ్రాట్స్ సర్.
‘‘ఆ కాశీనాథుడు తన ముందున్న నందిని నాకు ఇచ్చినంత ఆనందంగా ఉంది. సృజనకారులు ఎవరూ సంతృప్తిగా ఉండలేరు. నేనూ అంతే. నా నిర్మాతలెవరూ నన్ను ఇబ్బంది పెట్టలేదు. అందుకే, మంచి సినిమాలు, పాటలు వచ్చాయి. కానీ, నన్ను బాగా ఇబ్బంది పెట్టిన సినిమా ‘సిరివెన్నెల’. నా సినిమాల్లో క్యారెక్టర్ల కంటే నా వ్యక్తిత్వం అంటేనే నాకు ఇష్టం. తెలుగు సాహిత్యం, సంస్కృతి, తెలుగుదనంపై సినిమాలు తీశాను. అలాగని అన్ని సినిమాలు తీసేశానని అనుకోవడం లేదు. అనుకోను కూడా. నేను ఇప్పటివరకు విలువలకు లోబడి సినిమాలు చేశా. అలా విలువలకు కట్టుబడి సినిమాలు తీశాను కాబట్టే ఈ అవార్డు నాకు వచ్చింది. ఇప్పుటికీ నాకు నటించడానికి ఏ ఇబ్బందీ లేదు. కథలను బట్టి నటిస్తున్నాను. కోట్లు ఖర్చుపెట్టే నిర్మాతలు ఊరికే దర్శకుడికి ఛాన్స్ ఇవ్వరు. ద్రౌపదికి ఐదుగురు భర్తలు. కానీ, ఓ దర్శకుడికి 50 మంది ఉంటారు. ఓ దర్శకుడు ఎన్నో ఒత్తిళ్ల మధ్య సినిమాలు చేస్తాడు. వాళ్లకు నా సలహా ఏమీ ఉండదు’’
– దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం వచ్చిన సందర్భంగా కె. విశ్వనాథ్
మన అదృష్టం మా కె. విశ్వనాథ్‌గారిని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించడం చాలా ఆనందంగా ఉంది. ఆయన ఎంతో వినయంగా ‘అవార్డు రావడం నా అదృష్టం’ అంటారు. నిజం ఏంటంటే భారతీయులే నిజమైన అదృష్టవంతులు. ఆ విధంగా భారతీయుడనైన నేను అదృష్టవంతుణ్ణే. మీకు పేరు వస్తే నాకు వచ్చినట్లే.
– నటుడు కమల్‌హాసన్
గజ్జెలు ఘల్లుమనేలా.. హృదయాలు ఝల్లుమనేలా...
కళా తపస్వి విశ్వనాథ్‌గారికి భారత ప్రభుత్వం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును కాస్త ఆలస్యంగానైనా ప్రకటించినందుకు సంతోషం. మన తెలుగువారందరూ గర్వించదగ్గ విషయం ఇది. నటనలో నేను ఓనమాలు నేర్చుకుంటున్న దశలో నాతో ఒక మూగ పిల్ల వేషం వేయించి, నా కాలికి ‘సిరిసిరి మువ్వలు’ కట్టి, పాదం సయ్యనేలా నాదాన్ని ఝుమ్మనిపించారు. గజ్జెలు ఘల్లుమనేలా, హృదయాలు ఝల్లుమనేలా నర్తించేలా చేసి నా నటనా జీవితంలో మొదటి మైలురాయిని పాతారు. నటిగా నేను ఒక స్థానాన్ని అందుకున్న తర్వాత వారు నాకు ‘సాగరసంగమం’లో ఇచ్చిన మాధవి పాత్ర న భూతో న భవిష్యతి. ఒక విఫల ప్రేమికురాలిగా, ఒక తండ్రి చాటు బిడ్డగా, ఒక భర్త చాటు భార్యగా, కూతురు భవిష్యత్‌కోసం ఆరాటపడే తల్లిగా, ఒక కళారాధకురాలిగా ఆ పాత్రలో లెక్కలేనన్ని పార్శా్వలు. ‘మౌనమేలనోయి...’ అంటూ బోలెడు ఊసులు. నా యాక్టింగ్ కెరీర్‌ను దిద్దిన అనేకులలో విశ్వనాథ్ గారిది ప్రథమ శ్రేణి. వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలనీ, ఆయన మనకు ఇంకా అనేక కళాఖండాలను అందించాలని కోరుతున్నాను.
– నటి జయప్రద
గర్వకారణం
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కె. విశ్వ నాథ్‌గారిని వరించడం మాకెంతో సంతోషంగా ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమకే విశ్వనాథ్‌గారు గర్వకారణం.
– చిరంజీవి, రామ్‌చరణ్
చాలా ఆనందం
కళా తపస్వి కె.విశ్వనాథ్‌గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. తెలుగు సినీ పరిశ్రమకు ఇది గర్వకారణం.
– జూనియర్ ఎన్టీఆర్
అసాధారణ దర్శకులు
అసాధరణ దర్శకులు, కళా తపస్వి కె.విశ్వనాథ్ గారిని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించడం ఆనందంగా ఉంది. తెలుగు సినిమాకి గర్వకారణం.
– రాజమౌళి
మరొక గొప్ప గౌరవం
ప్రఖ్యాత దర్శకులు కె.విశ్వనాథ్‌గారికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడం ఆనందంగా ఉంది. తెలుగు ఇండస్ట్రీకి మరొక గొప్ప గౌరవం లభించింది.
– అల్లు అర్జున్
హృదయపూర్వక శుభాకాంక్షలు
విశ్వనాథ్‌గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. ఆయనకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
– శ్రీకాంత్
దాదా కంటే గొప్పవారు
నా ఉద్దేశ్యంలో దాదాసాహెబ్‌కి మీ (విశ్వనాథ్) పేరు మీద అవార్డు ఇవ్వాలి. మీకు దాదా సాహెబ్ అవార్డు రావడం పట్ల నాకు ఆనందం ఏమీ లేదు. ఎందుకంటే మీరు ఆయనకంటే గొప్ప దర్శకులని నా అభిప్రాయం.
– రామ్‌గోపాల్ వర్మ
తెలుగువారందరికి గర్వకారణం
కె.విశ్వనాథ్‌గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం తెలుగువారందరికి గర్వకారణం. ఆయన ఈ అవార్డు సాధించి తెలుగు చిత్ర పరిశ్రమ గౌరవాన్ని జాతీయ స్థాయి చర్చల్లో నిలిపారు.
– అల్లరి నరేష్
చాలా ఆనందంగా ఉంది
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కె.విశ్వనాథ్‌గారిని వరించడం చాలా సంతోషంగా ఉంది. కమల్‌గారి అభిప్రాయాలు నాకు రెట్టింపు ఆనందాన్ని కలిగించాయి.
– నాని
శుభ సమయం
విశ్వనాథ్ గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం సంతోషంగా ఉంది. ఆయన ఈ అవార్డుకు అర్హత గలవారు. తెలుగు చిత్ర పరిశ్రమ గౌరవం మరో మెట్టు పైకెక్కిన శుభ సమయమిది.
– అల్లు శిరీష్
దేశం గర్వించదగ్గ దర్శకుడు
ఈ విషయం తెలియగానే విశ్వనాథ్‌గారిని స్వయంగా వెళ్లి, కలవాలనిపించింది. సాంగ్ సిట్టింగ్స్‌లో ఉన్నాను. అవి పూర్తయ్యాక తప్పకుండా వెళతాను. అర్హుడికి దక్కిన పురస్కారం ఇది. ఈ వార్త వినగానే మనసు పులకరించిపోయింది. దేశం మొత్తం గర్వించదగ్గ దర్శకుడు. భారతీయులందరూ గర్వించదగ్గ తరుణం ఇది.
– రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి
అవార్డు ఘనత పెరిగింది
కాశీనాథుని విశ్వనాథ్‌గారిని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించడం సంతోషంగా ఉంది. ఆయనకు అవార్డు రావడం మా అందరికీ గర్వంగా ఉంది. ఆయనకు ఆ పురస్కారం లభించడం వల్ల ఆ అవార్డు ఘనత మరింత పెరిగింది.
– గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
ఎప్పుడో రావాల్సిన పురస్కారం ఇది
ఈ పురస్కారం ఇప్పుడు కాదు.. ఎప్పుడో రావాల్సింది. విశ్వనాథ్‌గారిని నా సోదరుడిలా భావిస్తాను. నా కెరీర్‌లో మైల్‌స్టోన్స్‌గా నిలిచిన ‘ఓ సీత కథ’, ‘సిరి సిరి మువ్వ’, ‘శంకరాభరణం’ వంటి సినిమాలన్నీ ఆయన దర్శకత్వంలో చేసినవే. సినిమాల్లో శృంగారం, ఫైట్స్ వంటి ఒక మూస ధోరణి సాగుతున్న తరుణంలో సంగీతానికి పెద్ద పీట వేస్తూ సినిమాలు తీసిన ఘనత విశ్వనాథ్‌గారిది. అలాంటి సినిమాలు ఆడొచ్చూ.. ఆడకపోవచ్చు. అందుకే నిర్మాతలు వెనక్కి తగ్గే అవకాశమే ఎక్కువ. అయినప్పటికీ విశ్వనాథ్‌గారు రాజీపడలేదు. కుటుంబ సమేతంగా చూసేలా ఆహ్లాదకరమైన సినిమాలు ఇవ్వాలనుకున్నారు. తన ఆశయానికి తగ్గట్టుగానే సినిమాలు తీశారు. అలాంటి గొప్ప దర్శకుడికి ఈ పురస్కారం రావడం చాలా గర్వంగా ఉంది.
– నటుడు చంద్రమోహన్
స్నేహం మీద అంత గొప్ప సినిమా రాలేదేమో!
విశ్వనాథ్‌గారికి ఈ పురస్కారం వచ్చిందని వినగానే నాకు ముందు కలిగిన ఫీలింగ్ ‘ఎప్పుడో రావాల్సింది’ అని. ఆ తర్వాత కలిగిన ఫీలింగ్.. ఆలస్యంగా అయినా అర్హత ఉన్న వ్యక్తికే ఇచ్చారని. నిజంగా ఎంత గొప్ప దర్శకుడండి. పాత తరం దర్శకులను వదిలేస్తే.. ఇప్పుడు తెలుగులో పది మంచి సినిమాల గురించి చెప్పమంటే, సగానికి పైగా విశ్వనాథ్‌గారి సినిమాలనే చెబుతారు. అదీ ఆయన గొప్పతనం. స్నేహం మీద నాకు తెలిసి ‘సాగర సంగమం’ తర్వాత అంత గొప్ప సినిమా రాలేదేమో. స్నేహితుడు చనిపోతే, ఆ భౌతికకాయం వర్షంలో తడవకుండా తన శరీరాన్ని అడ్డుపెడతాడు ప్రాణస్నేహితుడు. ‘సాగర సంగమం’లోని ఈ సీన్ ఎంత గొప్పగా ఉంటుంది. ఆ సీన్‌లో యుద్ధాలు ఉండవు. గ్రాఫిక్స్ లేవు. అయినా ప్రేక్షకులను ఆకట్టుకుంది. గుండెల్ని పిండేసింది. భారతీయ సినిమాలో ఉన్న గొప్ప దర్శకుల్లో విశ్వనాథ్‌గారు ఒకరు. ఆయన మన తెలుగువాడు కావడం మన అదృష్టం
– నటుడు శరత్ బాబు
శాంతారామ్ సరసన...
వావ్... ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు నేనో ఫంక్షన్‌లో ఉన్నాను. నాకు ఈ వార్త చెప్పిన ‘సాక్షి’కి థ్యాంక్స్. ‘శంకరాభరణం’... 37 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా అందులో నటించిన వారందరికీ కేరాఫ్ అడ్రస్ అయ్యింది. ‘శంకరాభరణం’లో చిన్న ఆర్టిస్టులు, పెద్ద ఆర్టిస్టులందరికీ ఆ సినిమా ఓ గుర్తింపు ఇచ్చింది. కె. విశ్వనాథ్‌గారు ఆయనకు ఆయనే సాటి. అంత గొప్ప వ్యక్తి దర్శకత్వంలో నటించడం నా అదృష్టం. ఈ అవార్డు (దాదాసాహెబ్ ఫాల్కే) గతంలోనూ గొప్ప వ్యక్తులను వరించింది. శాంతారామ్ వంటి వాళ్ల సరసన విశ్వనాథ్‌గారు చేరడం నాకెంతో సంతోషంగా ఉంది.
– నటి మంజు భార్గవి
కొత్తవాళ్లకు ఇలాంటి దర్శకుడు అవసరం
తెలుగులో మాత్రమే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో నటించగలుగుతున్నానంటే దానికి కారణం విశ్వనాథ్‌గారే. నటిగా నాకు ‘శంకరాభరణం’ మొదటి సినిమా. ఆ సినిమాలో వేషం కోసం నేను విశ్వనాథ్‌గారిని కలిశాను. అంతకుముందు ఆయన చాలామందిని చూశారు. కానీ, ‘శారద’ పాత్రకు తగ్గట్టుగా లేరనిపించిందట. నేను కలసిన తర్వాత క్యారెక్టర్ గురించి చెప్పి, ‘చేయగలవా’ అనడిగితే, చేస్తానన్నాను. ‘పెళ్లి చూపులు’ సీన్ ముందు తీశారు. ఆ సీన్, ‘సామజ వరగమన..’ పాటలో కొంచెం టెన్షన్ పడుతూనే నటించాను. విశ్వనాథ్‌గారిలాంటి డైరెక్టర్‌తో చేయడం అంటే మాటలా? ఆ సినిమాతో నా ఇంటి పేరు ‘శంకరాభరణం’ అయిపోయింది. ఆ సినిమా చేసినప్పుడు నాకు పదిహేనేళ్లు. నాలాంటి కొత్తవాళ్లకు విశ్వనాథ్‌గారిలాంటి దర్శకులు అవసరం. మంచి పాత్రలిచ్చి ప్రోత్సహించేవారు. ఆయన డైరెక్షన్ మానేయడంవల్ల ఆ అదృష్టం నేటి తరానికి లేదు. విశేషం ఏంటంటే.. విశ్వనాథ్‌గారి కాంబినేషన్‌లో నేను యాక్ట్ చేశాను కూడా. ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ సినిమాలో మేమిద్దరం మామా–కోడళ్లలా చేశాం. ‘మామయ్యా’ అని పిలుస్తూ, నటించడం నాకు గమ్మత్తుగా అనిపించింది. మా గురువుగారికి ప్రతిష్టాత్మక పురస్కారం రావడం ఆనందంగా ఉంది.
– నటి ‘శంకరాభరణం’ రాజ్యలక్ష్మి
వజ్రంలా సానబట్టారు
భారతదేశం మొత్తం గర్వించదగ్గ విషయమిది. ఆయన కాకుండా ఈ అవార్డుకు అర్హత కలిగినవాళ్లు ఇంకెవరున్నారు? ఆయన నాకు గురువు. ‘శుభలేఖ, శృతిలయలు, జననీ జన్మభూమి, స్వయంకృషి’... విశ్వనాథ్‌గారి దర్శకత్వంలో నాలుగు సినిమాల్లో నటించాను. ఆయనతో పనిచేయడం ఓ అందమైన జ్ఞాపకం. వేరే ఏ కథానాయికకూ ఆయన దర్శకత్వంలో నాలుగు సినిమాలు చేసే అవకాశం వచ్చిందని నేను అనుకోవడం లేదు. నేను ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా... ప్రేక్షకులందరూ పైన చెప్పిన నాలుగు సినిమాల్లో నా నటన గురించి గొప్పగా చెబుతారు. చిత్రపరిశ్రమకు ఓ ముడిసరకు (రా మెటీరియల్)గా వచ్చిన నన్ను వజ్రంగా తీర్చిదిద్దింది ఆయనే. విశ్వనాథ్‌గారికి ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డు రావడమనేది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ అంశం. అలాగే, తెలుగు చిత్రపరిశ్రమ సభ్యులు, ఆయనతో పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ విషయం. విశ్వనాథ్‌గారు జీవితమంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. ఆయనతో పాటు మనందరికీ వచ్చినట్లు భావించాలి. నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను.
– నటి సుమలత
ఆయన డైరెక్షన్‌లో చేయడం నా అదృష్టం
మొన్నీ మధ్యే విశ్వనాథ్‌గారిని కలిశాను. ఆయన డైరెక్షన్‌లో నేను చేసిన ‘స్వర్ణ కమలం’ గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఆ సినిమాకి నా మనసులో స్పెషల్ ప్లేస్ ఉంటుంది. నిజానికి ఆ సినిమాతోనే నేను యాక్ట్ చేయడం కాకుండా క్యారెక్టర్‌ని న్యాచురల్‌గా బిహేవ్ చేయడం మొదలుపెట్టాను. అది విశ్వనాథ్‌గారు నేర్పించినదే. ఇంకా ఆయన్నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయన డైరెక్షన్‌లో సినిమా చేసే అవకాశం రావడం నా అదృష్టం. ఒక దర్శకుడు–హీరోగానే కాకుండా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్–హీరో అనే అనుబంధం కూడా మా మధ్య ఉంది. నా ‘కలిసుందాం రా’ సినిమాలో ఆయన నాకు తాతగా నటించారు. నటుడిగా ఆయన కాంబినేషన్‌లో సినిమా చేయడం మరో మంచి అనుభూతి.
– హీరో వెంకటేశ్
‘సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డు’ల వేడుకలో జీవన సాఫల్య పురస్కారం అందుకుంటున్న కళాతపస్వి కె. విశ్వనాథ్. చిత్రంలో దర్శకుడు దాసరి నారాయణరావు, రచయిత ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రి, ‘సాక్షి’ ఈడి రామచంద్రమూర్తి, ఛైర్‌పర్సన్ వై.యస్. భారతి
– ఖదీర్