సాక్షి, హైదరాబాద్: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. దివంగత డైరెక్టర్ ‘కళాతపస్వి’ కె.విశ్వనాథ్ సతీమణి కాశీనాథుని జయలక్ష్మి(88) ఇకలేరు. ఆదివారం సాయంత్రం 5:45 గంటలపైన ఆమె తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మంచానికే పరిమితమయ్యారు. భర్త విశ్వనాథ్ మరణం తర్వాత మరింత అనారోగ్యానికి గురయ్యారు జయలక్ష్మి. ఈ క్రమంలోనే ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. అక్కడే ఆమె తుదిశ్వాస విడిచారు.
ఆంధ్రప్రదేశ్‌లోని కైకలూరు జయలక్ష్మి స్వస్థలం. 1935లో వినాయక చవితి రోజున జన్మించారామె. ఆమె అన్నయ్య చదువు కోసం వారి కుటుంబం బందరుకి మారింది. అక్కడి లేడీ యాంథల్ మిషనరీ స్కూల్లో చదివారు జయలక్ష్మి. ఆమె పదో తరగతి చదువుతున్నప్పుడే పద్నాలుగేళ్లకే కె.విశ్వనాథ్‌తో 1948 అక్టోబర్ 2న వివాహం జరిగింది. ఆ తర్వాత మద్రాసులో కాపురం పెట్టారు విశ్వనాథ్–జయలక్ష్మి దంపతులు. వారికి ముగ్గురు సంతానం. పద్మావతి దేవి, కాశీనాథుని నాగేంద్ర నాథ్,
కాశీనాథుని రవీంద్రనాథ్.
ఈ నెల 2న కె.విశ్వనాథ్ కన్నుమూశారు. ఆయనతో 75 ఏళ్ల వైవాహిక జీవితం గడిపారు జయలక్ష్మి. కె.విశ్వనాథ్ మరణించినప్పటి నుంచి ఆయన మీద ఉన్న ప్రేమతో ఆమె తీవ్ర మనో వేదనకు గురై, ఆరోగ్యం మరింత క్షీణించటంతో తుదిశ్వాస విడిచారు. ఆమె పార్థివ దేహాన్ని ఆస్పత్రి నుంచి ఫిలింనగర్‌లోని ఇంటికి తరలించారు. విశ్వనాథ్ చనిపోయిన 24 రోజులకే జయలక్ష్మి కూడా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. జయలక్ష్మి మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. కె.విశ్వనాథ్ తుదిశ్వాస విడిచిన వార్డులోనే జయలక్ష్మి కూడా కన్నుమూయటం దురదృష్టకరమని కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం పంజాగుట్ట స్మశానవాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు.
వైఎస్ జగన్ సంతాపం
జయలక్ష్మి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment